Aero Space
-
ఖర్గే ట్రస్ట్‌కు ఏరో స్పేస్ పార్కు భూమి కేటాయింపు.. బీజేపీ విమర్శలు
బెంగళూరు: బెంగళూరు సమీపంలోని డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించడంపై కర్ణాటక రాజకీయాల్లో వివాదం రాజుకుంది. సిద్దార్థ విహార ట్రస్టుకు కర్ణాటక ఇండస్ట్రీయల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు స్థలాన్ని మంజూరు చేయడాన్ని బీజేపీ ఖండించింది.ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని బీజేపీ ఐటీసెల్ అధ్యక్షుడు అమిత్ మాల్వియా మండిపడ్డారు. కేవలం బంధుప్రీతి వల్లే భూమి కేటాయించారని దీనిపై ఖర్గే సమాధానం చెప్పాలని మాల్వియా డిమాండ్ చేశారు.After Chief Minister Siddaramaiah, now Congress President Mallikarjun Kharge and family are embroiled in a land scam in Karnataka…It has come to light from a news report, backed by documents that a trust (Siddhartha Vihara Trust) run by Mallikarjun Kharge's family, has been… https://t.co/SbhMjcQ8pC— Amit Malviya (@amitmalviya) August 27, 2024 మరోవైపు కేఐఏడీబీ భూమిని పొందేందుకు ఖర్గే కుటుంబికులు ఏరోస్పేస్ రంగంలో ఎప్పుడు పారిశ్రామికవేత్తలు అయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లెహర్‌సింగ్ సిరోయ ప్రశ్నించారు. హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఐదు ఎకరాలను ఎస్సీ కోటాలో ఈ ట్రస్టుకు ఎలా కేటాయించారని విమర్శించారు. ఈ అక్రమ భూముల కేటాయింపుల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.When did the Kharge family become aerospace entrepreneurs to be eligible for KIADB land? Is this about misuse of power, nepotism, and conflict of interest? My statement. 1/6@PMOIndia @AmitShah @JPNadda @BJP4India @BJP4Karnataka @INCIndia @INCKarnataka @RahulGandhi @kharge pic.twitter.com/7lwitXtzuP— Lahar Singh Siroya (@LaharSingh_MP) August 25, 2024 కాగా ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు 5 ఎకరాల భూమిని షెడ్యూల్ కులం (ఎస్సీ) కోటా కింద మంజూరు చేశారు. దీనికి ఖర్గే, ఆయన అల్లుడు, కలబురగి ఎంపీ రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే, ఇతర కుటుంబ సభ్యులు ట్రస్టీలుగా ఉన్నారు.అయితే.. భూముల కేటాయింపును రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ సమర్థించుకున్నారు. సిద్దార్థ విహార ట్రస్టుకు నిబంధనలకు అనుగుణంగానే స్థలం కేటాయించామని అన్నారు. అక్కడ పరిశోధనలు, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి కేటాయించామని తెలిపారు. రాహుల్ ఖర్గే ఐఐటీ చదివారని, వారి కుటుంబం విద్యారంగంలో ఉందన్నారు. పరిశోధనా కేంద్రాలకు అనుకూలంగా ఉండాలనే ఆ భూమిని కేటాయించామని తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వం చాణక్య యూనివర్సిటీకి పారిశ్రామికవాడలో కేవలం రూ.50 కోట్లకు 116 ఎకరాల భూమిని కేటాయించిందని, దీనిని ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు. -
నిజంగానే ఆకాశానికి నిచ్చెన!
ఆకాశానికి నిచ్చెన వేయటం అనే మాటను మనం చాలా సార్లు యాథాలాపంగా వాడుతూంటాం. ఇప్పుడు జపాన్ దేశం అదే అంశంపై దృష్టి పెట్టింది. అంతరిక్షానికి ఎలివేటర్ నిర్మించే సన్నాహాల్లో ఉంది. అదీ అక్షరాలా వంద బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో. ఈ ఎలివేటర్ ఎలా నిర్మిస్తారు? అసలు అది ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానం మీకక్కరలేదు. ఎయిరో స్పేస్ అన్వేషణలో జపాన్ అగ్రగామిగా ఉంది. అలాగే రోబొటిక్స్, బయోమెడికల్ రీసెర్చి, నేచురల్ సైన్స్ విభాగంలో గ్లోబల్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. ఆ దేశానికి చెందిన ఒబాయషీ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థ ఎలివేటర్ నిర్మాణ బాధ్యతను స్వీకరించింది. దానివల్ల ఒనగూడే ప్రయోజనాలను ఆ సంస్థ ప్రకటించింది. ‘భూవాతావరణం నుంచి రికార్డు వేగంతో మనుషులను అంతరిక్షంలోకి పంపవచ్చు. అంగారక గ్రహం మీదకు వెళ్లటానికి ఇప్పటి మాదిరిగా ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం అక్కరలేదు. కేవలం 40 రోజుల్లోనే అక్కడకు చేరగలుగుతామని సంస్థ చెబుతోంది. ఇంత పెద్ద భారీ నిర్మాణం చేపట్టటానికి తగినంత స్టీల్ అందుబాటులో లేదు. పైగా వాతావరణంలో ఒత్తిళ్లను తట్టుకోగలిగినంత దృఢత్వం ఉన్న మెటీరియల్ అవసరం అవుతుంది. అందుకే ఒబాయాషీ కార్పొరేషన్ ‘కార్బన్ నానో ట్యూబ్’ లను ఎంచుకుంది. అవి చుట్టచుట్టిన గ్రాఫైట్ లేయర్లు. స్టీలు కంటే గ్రాఫైట్ లేయర్లు తక్కువ బరువు ఉంటాయి. అవి విరిగిపోయే అవకాశాలు తక్కువ. కార్బన్ నానో ట్యూబ్‌ల వ్యాసం మీటరులో బిలియన్ వంతు ఉంటుంది. ఇంత వరకూ ఎవరూ కూడా రెండడుగుల కంటే పెద్ద నానో ట్యూబ్‌ను రూపొందించలేదు. ఇప్పుడు నానో ట్యూబ్‌ల ఆధారంగానే ఎలివేటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.ఎలివేటర్లో నానో ట్యూబ్ 60 వేల మైళ్ల పొడవున ఉంటుంది. వీల్ లిఫ్ట్‌ల ద్వారా అది మనుషులను, సామగ్రిని రవాణా చేయగలుగుతుంది. వాటిని ‘క్లైంబర్స్’గా పిలుస్తారు. భూమి నుంచి 22 వేల మైళ్ల ఎత్తులో స్పేస్ షిప్‌కు కార్బో నానో ట్యూబ్‌ను అమరుస్తారు. థ్రస్టర్ దాని కొసకు జోడించబడుతుంది. అదే సమయంలో స్పేస్ షిప్ భూమికి దూరంగా జరుగుతుంది. సంస్థ వేస్తున్న అంచనాల ప్రకారం ఎనిమిది నెలల తర్వాత కార్బన్ నానోట్యూబ్ భూమి ఉపరితలానికి చేరుతుంది. అదే సమయంలో స్పేస్ షిప్ తన తుది గమ్యం 60 వేల మైళ్లకు చేరుకుంటుంది. అది ట్యూబ్‌కి కౌంటర్ వైట్‌గా ఉపయోగపడుతుంది. ఈ ట్యూబ్ ద్వారా పైకి వెళ్లి కేబుళ్లతో బలోపేతం చేస్తారు. ఇందుకోసం ముందుగా ‘లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్ఈఓ)లో స్పేస్ షిప్ నిర్మిస్తారు. ఇందుకోసం రాకెట్ల ద్వారా నిర్మాణ సామగ్రి పంపుతారు. అక్కడ నుంచి స్పేస్ షిప్ ఎలక్ట్రికల్ ప్రొపల్షన్లను ఉపయోగించుకుని కదులుతుంది. జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (జీఈఓ)కు చేరే వరకూ అది కొనసాగుతుంది.భూమి మీద ఎర్త్ పోర్టును రెండు భాగాలుగా నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకటి ఈక్వేటర్ దగ్గర, మరొకటి సముద్రం దగ్గర. ఈ రెండూ సముద్రం దిగువన టన్నెల్‌తో అనుసంధానమయి ఉంటాయి. ఎర్త్ పోర్ట్ నుంచి పైకి పాకేవాళ్లు సుమారు గంటకు 93 మైళ్ల వేగంతో కార్బో నానో ట్యూబ్ అధిరోహిస్తారు. వాళ్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని రెండున్నర గంటల్లో చేరతారని సంస్థ ప్రకటించింది.జపాన్ సంస్థ చెబుతున్న దాని ప్రకారం, ఇప్పుడు అంతరిక్షంలో ప్రయోగాలకు పెడుతున్న ఖర్చులతో పోలిస్తే, దీనివల్ల తక్కువ ఖర్చవుతుంది. అలాగే ఇందులో ఇంధన వినియోగం లేదు. ఇదంతా సౌరశక్తి ఆధారంగా సాగుతుంది. భారీగా సోలార్ ప్యానళ్లతో జియో స్టేషన్ నిర్మిస్తారు. మానవుల పరంగా కానీ, వాతావారణ పరంగా కానీ ఎలివేటర్లకు ఉండే ముప్పుల గురించి సంస్థ ఇంకా అధ్యయనం చేపట్టలేదు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది అంటే 2025లో ప్రారంభం కావాలి. ప్రస్తుతం ఆర్ అండ్ బీ పైనా, పార్ట్నర్షిప్ బిల్డింగ్, ప్రమోషన్లపైనా దృష్టి పెట్టారు. ఇందుకు మరికొంత జాప్యమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక రోజున మానవాళి ఈ ఎలివేటర్ ద్వారా అంతరిక్షంలోకి అడుగు పెడుతుంది. అందుకు జపాన్ను మనం తప్పకుండా అభినందించి తీరాలి. డా‘‘ పార్థసారథి చిరువోలు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం!
ఏరో స్పేస్ టెక్నాలజీ అనగానే విదేశాల వైపు చూసే ఎంతోమందికి మన సత్తా చూపించిన స్టార్టప్‌లలో ‘అగ్నికుల్ కాస్మోస్’ ఒకటి. ఆకాశమంత కలతో బయలుదేరిన ‘అగ్నికుల్’ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం అగ్నిబాణ్.. ‘అగ్నికుల్’ అంటే భారత అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భర్ విజయగాథ. ఐఐటీ–మద్రాస్ కేంద్రంగా పని చేస్తున్న ‘అగ్నికుల్ కాస్మోస్’ త్రీడీ ప్రింటెట్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రశంసలు అందుకుంది. స్నేహితుడు మోహిన్, ప్రొఫెసర్ చక్రవర్తిలతో కలిసి 2017లో ‘అగ్నికుల్’ను లాంచ్ చేశాడు శ్రీనాథ్ రవిచంద్రన్. మన దేశంలోని ఫస్ట్ ప్రైవేట్ స్మాల్ శాటిలైట్ రాకెట్ ‘అగ్నిబాణ్’ను నిర్మించింది అగ్నికుల్. 30 కిలోల నుండి 300 కిలోల బరువు ఉన్న పేలోడ్‌ను తక్కువ భూకక్ష్యలోకి (సుమారు ఏడువందల కిలోమీటర్ల ఎత్తు) తీసుకువెళ్లే సామర్థ్యం దీని సొంతం. 2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో ఒప్పందం కుదర్చుకున్న తొలి భారతీయ కంపెనీగా ప్రత్యేకత సాధించింది అగ్నికుల్. ఒప్పందం ద్వారా ‘అగ్నిబాణ్’ నిర్మాణంలో ‘ఇస్రో’ సహాయ, సహకారాలను తీసుకుంది. ప్లగ్–అండ్–ప్లే ఇంజిన్ కాన్ఫిగరేషన్ సామర్థ్యం ఉన్న అగ్నిబాణ్, మిషన్ అవసరాలకు ఖచ్చితంగా సరిపోయేలా కాన్ఫిగర్ చేయగలదు. ప్రతి క్లయింట్‌కు సంబంధించిన ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగర్ చేయవచ్చు. 3డీ సాంకేతికతతో రూపొందించిన ఈ రాకెట్ ఉపగ్రహ ప్రయోగాల ఖర్చును తగ్గిస్తుంది. మొదట్లో వారానికి కనీసం రెండు రాకెట్ ఇంజిన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ తరువాత నాలుగు ఇంజిన్లకు విస్తరించింది అగ్నికుల్. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లింది. ‘మోర్ యాక్సెసబుల్ అండ్ అఫర్డబుల్’ లక్ష్యంతో బయలు దేరిన శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్‌లు మరిన్ని లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి రెడీ అవుతున్నారు. "శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈరోజు లాంచ్ చేయాల్సిన ‘అగ్నిబాణ్’ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది." ఆత్మవిశ్వాసమే అద్భుత శక్తి.. 2017లో ‘అగ్నికుల్’తో శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్‌లు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఇన్వెస్టర్ల నుంచి విశ్లేషకుల వరకు ‘మన దేశంలో ఇది సాధ్యమా? ఈ కుర్రాళ్ల వల్ల అవుతుందా’ అనే అనుమాన నీడ ఉండేది. అయితే శ్రీనాథ్, మోహిన్లు ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం అనే అద్భుతశక్తితో ముందుకు కదిలారు. నాలుగు వందల వరకు పిచ్ మీటింగ్‌లు నిర్వహించిన తరువాతే ఫస్ట్ రౌండ్ ఫండింగ్ 2018లో వచ్చింది. అనుమాన నీడ వెనక్కి వెళ్లి ‘అగ్నికుల్’ పేరు ప్రపంచానికి పరిచయం కావడానికి ఎంతోకాలం పట్టలేదు. మన దేశంలో స్పేస్ టెక్ స్టార్టప్‌ల విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఏరోస్పేస్ డిగ్రీలు చేయడానికి చాలామంది విదేశాలకు వెళ్లాలనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నారు’ అంటున్నాడు ‘అగ్నికుల్’ కో–ఫౌండర్, సీయివో శ్రీనాథ్ రవిచంద్రన్. — శ్రీనాథ్ రవిచంద్రన్, ‘అగ్నికుల్ కో–ఫౌండర్, సీయివో. -
Sudheera Valluri: మన వృత్తే మన గుర్తింపు
విమానం నడిపిన అమ్మాయిలను చూస్తున్నాం. విమానంలో యుద్ధం చేసే అమ్మాయిలనూ చూశాం. ఇప్పుడు... విమానాలు తయారు చేస్తున్న అమ్మాయిని చూద్దాం. వల్లూరి సుధీర ఏరో స్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్. జర్మనీలోని లిలియుమ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీలో మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్‌కి హెడ్. ఆ కంపెనీ స్థాపించిన తర్వాత ఉద్యోగంలో చేరిన వంద మంది ఇంజనీర్లలో ఒకే ఒక యువతి ఆమె. సెలవు మీద హైదరాబాద్‌కి వచ్చిన సుధీర ఈ రంగంలో అడుగుపెట్టడానికి స్ఫూర్తినిచ్చిన సందర్భాన్ని, ఏరోస్పేస్ మ్యాన్యుఫాక్చరింగ్ విభాగంలో తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ఆ ఉద్యోగ ప్రకటన! ‘‘మా తాతయ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సైంటిస్ట్‌గా పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో ఉద్యోగం చేశారు. అమ్మమ్మ అదే డిపార్ట్మెంట్లో క్లర్క్‌గా భువనేశ్వర్‌లో రిటైర్ అయ్యారు. నేను ఏరోస్పేస్ ఇంజనీర్ కావడానికి డైరెక్ట్‌గా ప్రభావితం చేయలేదు, కానీ పరోక్షంగా వారి నేపథ్యం నాకు మంచి భరోసానిచ్చింది. నిజానికి మా అమ్మానాన్నలిద్దరి మూలాలూ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులోనే ఉన్నాయి. అమ్మానాన్న హైదరాబాద్‌లో సెటిల్ కావడంతో నా బాల్యం భాగ్యనగరంలోనే. విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాను. ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇంగ్లిష్ పేపర్లో ఒక ప్రకటన చూశాను. పైలట్ల కోసం ప్రకటన అది. అయితే మగవాళ్లకు మాత్రమే. అప్పుడు ‘అమ్మాయిలెందుకు వద్దు’ అనిపించింది. అమ్మాయిలు విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదవరా అని కూడా అనుకున్నాను. నేను ఏరోస్పేస్ లేదా ఏరోనాటికల్ కోర్సులు చేయాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మానాన్న పెద్దరికపు సవరణలేమీ చేయకుండా నన్ను నేను కోరుకున్న కోర్సులో చేర్చారు. బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దుండిగల్‌లోని ఎమ్ఎల్ఆర్ ఇన్స్టిట్యూట్లో చేశాను. అప్పట్లో నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి ఆర్మీలో పని చేయాలని ఉండేది. పరీక్షలు రాశాను, కానీ సెలెక్ట్ కాలేదు. అప్పుడు ఆదిభట్లలో ఉన్న ‘టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ కంపెనీ మా క్యాంపస్‌కి ప్లేస్మెంట్ గురించి వచ్చింది, అలా 2012లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ప్రొడక్షన్ ప్లానింగ్, కంట్రోల్ విభాగాల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా చేయడంతో పని మీద మంచి పట్టు వచ్చింది. రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత మాస్టర్స్ చేయాలని, అది కూడా మాన్యుఫాక్చరింగ్లోనే చేయాలనుకుని యూఎస్‌లోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి వెళ్లాను. కోర్స్ పూర్తయిన తర్వాత గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ కార్పొరేషన్లో ఉద్యోగం చేశాను. అది బిజినెస్ జెట్లు తయారు చేసే కంపెనీ. ఇప్పటి వరకు నాది చాలా మామూలు జర్నీనే. 2017లో పెళ్లి, అబ్బాయి నాకు బీటెక్ క్లాస్మేటే. ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఏవియేషన్ ఆఫీసర్. పెళ్లి తర్వాత ఇండియాలో ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు జర్మనీలో మంచి అవకాశం వచ్చింది. నాలుగేళ్ల కిందట నేను మాత్రమే జర్మనీలో ‘లిలియుమ్ ఎయిర్ క్రాఫ్ట్’ కంపెనీలో ఎయిర్ క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీలో అప్పుడు... అంటే 2018లో వందమంది ఇంజనీర్లలో అమ్మాయిని నేను మాత్రమే. అయితే ఆ గుర్తింపు నాకు పెద్దగా సంతోషాన్నివ్వదు. అమ్మాయిలు కోరుకోవాల్సింది జెండర్ సెపరేషన్తో కూడిన గుర్తింపు కాదు. వందమందిలో యాభై మంది అమ్మాయిలు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించుకోవాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనేది నా ఆకాంక్ష. ఇప్పుడు మా కంపెనీలో ఎనిమిది వందల మంది ఇంజనీర్లున్నారు, వారిలో వందమంది వరకు అమ్మాయిలున్నారు. ఈ నాలుగేళ్లలో వచ్చిన పురోగతి. ఈ ఫీల్డ్‌లో అమ్మాయిలు నెగ్గుకురావడం కష్టమనేది అపోహ మాత్రమే. నేనిప్పుడు మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్‌కి హెడ్‌ని. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగంలోకి సెలెక్ట్ చేసుకోగలిగాను. మా టీమ్‌లో పోలండ్, బ్రెజిల్, యూకే, యూరప్ దేశాల వాళ్లు ఉన్నారు. వాళ్లతో కలిసి పని చేయడం, వాళ్ల నుంచి పని తీసుకోవడంలో ఎక్కడా ఇబ్బందులేవీ రాలేదు. అయితే ఒక టాస్క్ ఇచ్చే ముందు వాళ్ల బేసిక్ అండర్స్టాండింగ్ లెవెల్స్‌ని అర్థం చేసుకోగలిగితే టీమ్‌తో పని చేయించుకోవడం ఏ మాత్రం కష్టంకాదనేది నా అభిప్రాయం. నేను టీమ్ లీడర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో మంది మహిళలను చూశాను, వారితో పనిచేశాను కూడా. మిగిలిన అన్ని రంగాల్లోలాగానే ఈ రంగంలో కూడా మహిళలు బాగా రాణిస్తున్నారు’’ అన్నారు ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ వల్లూరి సుధీర. సబ్జెక్ట్‌ని నిరూపించుకోవాల్సిందే! ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్ వంటి సాంకేతికత ఎక్కువగా ఉంటే రంగాల్లో టెక్నికల్ పీపుల్‌తో పని చేసేటప్పుడు వాళ్లు ఆడవాళ్ల మాటను పట్టించుకోరనే అభిప్రాయం కూడా ఉంటుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే... యంగ్ ఇంజనీర్కంటే సీనియర్ టెక్నీషియన్‌కి ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయనడంలో సందేహం లేదు. కొత్త మార్పును తెచ్చేటప్పుడు టెక్నికల్ పీపుల్‌కి మనం విషయమంతా వివరించేటప్పుడు సబ్జెక్ట్ పరంగా మనం ఒక అడుగు ముందున్నామనే విషయాన్ని నిరూపించుకోవాలి. ఈ నిరూపణ మగవాళ్లకైనా ఉంటుంది, ఆడవాళ్లకూ ఉంటుంది. నేను మహిళలకు చెప్పే మాట ఒక్కటే... మనల్ని మనం ‘ఇంజనీర్, సైంటిస్ట్, పైలట్’ అని ప్రొఫెషన్పరంగా మాత్రమే గుర్తించుకోవాలి, ‘ఉమన్ ఇంజనీర్, ఉమన్ పైలట్, ఉమన్ సైంటిస్ట్’ అని జెండర్‌పరంగా కాదు. అన్ని పరీక్షలనూ మగవాళ్లతోపాటు పూర్తి చేసి ఈ స్థాయికి వచ్చాం. రిజర్వేషన్లలో రాలేదు. ఇక ఉమన్ అని జెండర్‌తో ఐడింటిఫై అవడం ఎందుకు? – వల్లూరి సుధీర, ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్ – వాకా మంజులారెడ్డి -
ఇండియా చేతికి ఇజ్రాయెల్ డ్రోన్‌గార్డ్ వ్యవస్థ?!
దక్షిణాసియాకు చెందిన ఒక దేశానికి తమ ఈఎల్ఐ–4030 డ్రోన్ గార్డ్ వ్యవస్థను(సీ–యూఏఎస్)ను విక్రయించినట్లు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(ఐఏఐ) చేసిన ప్రకటన సంచలనం కలిగిస్తోంది. సదరు దేశం పేరును సంస్థ వెల్లడించకున్నా, అది భారతేనని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల భారత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ల వద్ద డ్రోన్లు కలకలం సృష్టించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ సంస్థ ప్రకటన ప్రాముఖ్యం సంతరించుకుంది. కొన్ని కోట్ల డాలర్లకు డ్రోన్ గార్డ్ విక్రయాన్ని పూర్తి చేశామని మాత్రమే ఈనెల 2న ఐఏఐ ప్రకటించినట్లు డిఫెన్స్ వార్తల ప్లాట్‌ఫామ్ జానెస్ తెలిపింది. ఎప్పటికల్లా సదరు దేశానికి ఈ వ్యవస్థను డెలివరీ చేసేది వెల్లడించలేదు. తమ డోమ్ వ్యవస్థపై భారత్ ఆసక్తి చూపుతోందని గతేడాది ఇజ్రాయెల్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే! దీన్ని దృష్టిలో ఉంచుకొనే, తాజాగా ఐఏఐ చేసిన ప్రకటనలోని దేశం ఇండియా అని పలువురు అంచనా వేస్తున్నారు. భారత్ వద్ద ప్రస్తుతం ఎలాంటి యాంటీ డ్రోన్ వ్యవస్థ లేదని రక్షణ నిపుణుడు అభిజిత్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. జమ్మూ ఘటనల నేపథ్యంలో ఈ డోమ్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరగడం, భారత్‌కు ఇజ్రాయెల్ నమ్మకమైన రక్షణ భాగస్వామి కావడం వల్ల సీ–యూఏఎస్‌ను భారత్ కొనుగోలు చేసేందుకు అభ్యంతరాలు ఉండవని భావిస్తున్నట్లు చెప్పారు. ఇలా పనిచేస్తుంది ఒకవైపు నుంచి వచ్చే దాడులనే కాకుండా పలువైపుల నుంచి వచ్చే దాడులను సైతం డ్రోన్ గార్డ్ అడ్డుకోగలదు. ఇందులో షార్ట్, మీడియం, లాంగ్ రేంజ్ (3, 4.5, 6కిలోమీటర్ల రేంజ్)వేరియంట్లుంటాయి. ఇందులో వివిధ విభాగాలుంటాయి. ఒక్కో విభాగంలో సెన్సర్లు ఒక్కో పని నిర్వహిస్తాయి. ఏఈఎస్ఏ, మల్టి మిషన్ 3డీ ఎక్స్ బాండ్ రాడార్, కామిన్ట్ జామర్, ఈఓ మరియు ఐఆర్ సెన్సర్ అనే విభాగాలు డ్రోన్ గార్డ్‌లో ఉంటాయని ఐఏఐ తెలిపింది. వచ్చిన డ్రోన్లను అడ్డుకొని వెనక్కు పంపడాన్ని సాఫ్ట్ కిల్ అని, డీకేడీ(డ్రోన్ కిల్ డ్రోన్) వ్యవస్థను ఉపయోగించి వచ్చిన డ్రోన్లను పేల్చేయడాన్ని హార్డ్ కిల్ అని అంటారు. తమ సీ– యూఏఎస్ చిన్న, సూక్ష్మ డ్రోన్ల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, ఒక రక్షణ వలయాన్ని కల్పిస్తుందని ఐఏఐ అధికారి ఎలి అల్ఫాసి వివరించారు. తమ వ్యవస్థలోని జామింగ్ ఫీచర్ దాడికి వచ్చిన డ్రోన్స్ వెనక్కు వెళ్లేలా లేదా క్రాష్ అయ్యేలా చేస్తుందన్నారు. ఇప్పటికే పలువురు కస్టమర్లకు దీన్ని విక్రయించామని, భారత్ కూడా దీనిపై ఆసక్తి చూపిందని గతంలో ఆయన చెప్పారు. తాజా దాడుల ప్రభావం? జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పై ఇటీవల డ్రోన్ దాడి జరిగింది. దాని తర్వాత పాక్‌లోని భారత రాయబారి కార్యాలయ సమీపంలో డ్రోన్లు తచ్చాడాయి. జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై దాడికి వచ్చిన డ్రోన్‌లో జీపీఎస్ అడ్రస్‌ను లాక్ చేశారు. అంతేకాకుండా పేలుడు పదార్థాలను సైతం డ్రోన్ జారవిడిచింది. ఫలితంగా ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దేశ మిలటరీ చరిత్రలో ఇది తొలి డ్రోన్ అటాక్‌గా భావిస్తున్నారు. దాడిలో పాక్ టెర్రరిస్టుల పాత్ర ఉంటుందని జాతీయ భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది ఉగ్రదాడిగా జమ్మూ పోలీసు చీఫ్ ప్రకటించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో మరిన్ని డ్రోన్ దాడులు జరగకుండా నివారించేందుకు సిద్ధమైంది. ఇటీవలే ప్రధాని హోం, రక్షణ మంత్రులతో పాటు భద్రతా సంస్థలు, మిలటరీ అధికారులతో సమావేశమయ్యారు. అత్యున్నత రక్షణ విధానాన్ని రూపొందించాలని çనిర్ణయించారు. దీన్లో భాగంగానే డ్రోన్ గార్డ్‌ను భారత్ కొనుగోలు చేసి ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. -
రేపు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల
సాక్షి, అమరావతి : 2020-23 పారిశ్రామిక విధానానికి సంబంధించి రేపు కొత్త ఇండస్ట్రియల్ పాలసీని పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విడుదల చేయనున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఉ.11 గంటలకు పాలసీ విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) పెద్ద సాయంగా నిలవనుంది. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా పథకాలు..ఉపాధి కల్పించే పరిశ్రమలను బట్టే ప్రోత్సాహం అందనుంది. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులిచ్చే చర్యలు తీసుకుంటారు. భూముల కేటాయింపు, స్టాంప్ డ్యూటీ, రాష్ట్ర జీఎస్టీ, నాలా ఛార్జీలు, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ అంశాలపై స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేయనున్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడం కోసం 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రెండు స్కిల్ వర్సిటీలు, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ల సమ్మిళితం కానున్నాయి. -
పరిశ్రమల ఖిల్లా.. రంగారెడ్డి జిల్లా
పరిశ్రమల స్థాపనకు మన జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సూక్ష్మ నుంచి మెగా వరకు ఏ కేటగిరీని తీసుకున్నా పరిశ్రమల ఏర్పాటులో జిల్లా ప్రత్యేకతను చాటుతోంది. అదేవిధంగా బహుళజాతి కంపెనీలు విస్తృతంగా వెలుస్తుండటం శుభపరిణామం. హైదరాబాద్ మహానగరం శివారు చుట్టూ మన జిల్లా విస్తరించి ఉండటం, అనువైన రవాణా వ్యవస్థ కలిగి ఉండటంతో పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ‘టీఎస్–ఐపాస్’ పేరిట 2014లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ.. పరిశ్రమలకు స్థాపనకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాలసీ అమల్లోకి వచ్చి ఐదేళ్లు గడవగా.. విజయవంతంగా అమలు చేసిన జాబితాలో మన జిల్లా అగ్రభాగాన ఉండటం విశేషం. పరిశ్రమల ఏర్పాటులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో జిల్లాకు అవార్డు వచ్చింది. బుధవారం నగరంలోని శిల్పకళావేదికలో నిర్వహించే టీఎస్–ఐపాస్ ఐదేళ్ల సంబరాల్లో భాగంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీష్, డీఐసీ జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్‌రెడ్డి అవార్డు అందుకోనున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో పరిశ్రమల స్థాపన.. పెట్టుబడులు.. ఉపాధి కల్పనపై ప్రత్యేక కథనం.. సాక్షి, రంగారెడ్డి: పరిశ్రమల స్థాపనలో మన జిల్లా వేగంగా దూసుకెళ్తోంది. 2014 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ చట్టం (టీఎస్–ఐపాస్) అమల్లోకి తీసుకురావడంతో మహర్దశ పట్టింది. త్వరితగతిన అనుమతులు జారీ చేయడం, నెల రోజుల నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు, ఆన్లైన్లో విధానంలో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఈ పాలసీతో కలిగింది. దీంతో పారిశ్రామికవేత్తలు.. ఎన్నో అనుకూల అంశాలు ఉన్న మన జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు అమితమైన ఆసక్తి చూపారు. టీఎస్–ఐపాస్ పాలసీ అమల్లోకి వచ్చాక ఆయా కేటగిరీల్లో మొత్తం రూ.46 వేల కోట్ల వ్యయంతో 935 పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. వీటిద్వారా 7.64 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. ఇందులో ఇప్పటివరకు 690 పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.13,385 కోట్ల పెట్టుబడులు జిల్లాకు వచ్చాయి. ఇప్పటివరకు 1.95 లక్షల మందికి ఉపాధి లభించడం విశేషం. పరోక్షంగా మరో 50 వేల మంది వరకు జీవనోపాధి అవకాశాలు లభించాయి. రూ.వేల కోట్ల పెట్టుబడులు జాతీయ, బహుళ జాతీయ కంపెనీలు కూడా మన జిల్లాలో ఏర్పాటయ్యాయి. మహానగరం చుట్టూ జిల్లా విస్తరించడం, రవాణామార్గాలు అనువుగా ఉండటం.. తదితర సానుకూలతలు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయి. ఒక్కో మెగా కంపెనీలు రూ.వేల కోట్లు పెట్టుబడులు పెడుతుండగా.. మరికొన్ని విస్తరణకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టైల్స్ తయారీ చేసేందుకు వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల 500 మందికి ఉపాధి లభించనుంది. అలాగే నందిగామలో ఎంఎస్ఎన్ ఫార్మా విస్తరణకు వెళ్తోంది. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తుండగా.. సుమారు 1,200 మందికి ఉపాధి దొరకనుంది. ఇక ఆదిబట్లలో ఏరోసిటీలో టాటా ఏరో స్పేస్ ఆరు విభాగాల్లో తమ ఉత్పత్తులను మొదలు పెడుతోంది. ఇందుకోసం రూ.1,200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. దీంతోపాటు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సేవలను మొదలుపెట్టింది. వీటికంటే ముందు జిల్లాలో ఐటీ కారిడార్, హార్డవేర్ పార్క్‌లు, ఐడీఏ కాటేదాన్ , ఐడీఏ కొత్తూరు తదితర సెజ్‌లు, పార్క్‌లు కూడా విస్తరించడం తో పారిశ్రామికరంగంలో జిల్లా దూసుకెళ్తోంది. పరిశ్రమల స్థాపనకు అనుకూలతలు ఇవీ.. జిల్లా శివారు ప్రాంతాలన్నీ మహానగరం చుట్టూ ఉండటం నైపుణ్యం ఉన్న మానవ వనరులు పుష్కలంగా లభిస్తుండటం టీఎస్–ఐపాస్ ద్వారా సరళంగా, సులభతరంగా అనుమతులు లభించడం కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండటం రవాణా వ్యవస్థ బాగా విస్తరించడం ఇన్చార్జి కలెక్టర్ హర్షం టీఎస్–ఐపాస్ అవార్డు లభించడంపై ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయడంతోనే ఉత్తమ ప్రతిభ చూపేందుకు సాధ్యమైందని పేర్కొన్నారు. అవార్డు మరింత బాధ్యతలను పెంచిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు జిల్లా అన్ని విధాల అనుకూలమని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. టీఎస్–ఐపాస్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకుపైగా పెట్టుబడులు జిల్లాకు వచ్చాయని తెలిపారు. -
దూరమెంతైనా..దూసుకెళ్లడమే..!
నిదానమే ప్రధానం అంటారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతీ సెకను ఎంతో విలువైనది. సమయాన్ని వీలైనంత ఆదా చేసి.. త్వరగా గమ్యాన్ని చేరుకోవడానికే అందరూ ప్రాధాన్యమిస్తున్నారు. సమయాన్ని ఆదా చేయడంలో ప్రయాణ సాధనాలు ప్రముఖమైనవి. ఇప్పటివరకున్న మన ప్రయాణ సాధనాలైన బస్సు గంటకు 100–120 కి.మీ., అయస్కాంతాలపై నడిచే రైళ్లు 400–500 కి.మీ., విమానం 1,000–1,300 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయి. ప్రస్తుతం పరిశోధన దశల్లో ఉన్న హైపర్‌లూప్ స్పీడూ కొంచెం అటు ఇటుగా విమానంతో సమానం..! మరీ ఇంతకంటే వేగంగా వెళ్లాలని మనం ఎంతగా అనుకున్నా మార్గం మాత్రం లేదు! అయితే ఇది ఇప్పటి పరిస్థితి.. భవిష్యత్‌లో గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సరికొత్త విమానాలు వచ్చేస్తాయి! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ అంత వేగం..సాధ్యమేనా? గంటకు 6 వేల కిలోమీటర్ల వేగమంటే.. హైదరాబాద్ నుంచి న్యూయార్క్ చేరేందుకు 2 గంటల సమయం. తూర్పు వైపున ఉన్న మెల్బోర్న్ వెళ్లాలంటే గంటన్నర. అబ్బో.. అంతవేగం సాధ్యమేనా? భేషుగ్గా సాధ్యమే అంటోంది యూకే అంతరిక్ష పరిశోధన సంస్థ. కాకపోతే విమానాల్లో సినర్జిటిక్ ఎయిర్ బ్రీతింగ్ రాకెట్ ఇంజిన్.. క్లుప్తంగా సేబర్ ఇంజిన్ వాడాల్సి ఉంటుంది. వీటిని ఆక్స్ఫర్డ్ షైర్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ‘రియాక్షన్ ఇంజిన్స్’ తయారు చేస్తోంది. ఈ ఇంజిన్లు అమర్చిన విమానాలు ధ్వనికి సుమారు 5.5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి. కచి్చతంగా చెప్పాలంటే గంటకు 4,143 మైళ్లు లేదా.. గంటకు 6,667.512 కి.మీ.ల వేగమన్నమాట! ఉపగ్రహాల ప్రయోగానికీ.. సేబర్ ఇంజిన్‌తో కూడిన విమానాలు ప్రయాణికుల కోసమే కాకుండా.. ఉపగ్రహ ప్రయోగాలకూ వాడుకోవచ్చని ‘రియాక్షన్’కు చెందిన షాన్ డ్రిస్కాల్ చెబుతున్నారు. రన్ వేపై టేకాఫ్ తీసుకోవడం.. నేరుగా అంతరిక్షంలోకి వెళ్లి.. ఉపగ్రహాన్ని విడుదల చేసి వెనక్కు వచ్చేయొచ్చని వివరించారు. సేబర్ ఇంజిన్ అభివృద్ధి కోసం యూకే ప్రభుత్వం ఇప్పటికే సుమారు 6 కోట్ల పౌండ్ల నిధులు అందించిందని, బోయింగ్, రోల్స్ రాయిస్, బీఏఈ సిస్టమ్స్ వంటి ప్రైవేట్ కంపెనీలూ పెట్టుబడులు పెట్టాయని షాన్ తెలిపారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్‌పోర్ట్ కార్న్‌వాల్ నుంచి ఈ సేబర్ ఇంజిన్ ఆధారిత విమానాలు టేకాఫ్ తీసుకోవచ్చునని అంచనా. 2021లో ఈ హైటెక్ విమానాశ్రయం సిద్ధం కానుండగా.. సేబర్ విమానాలు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో పదేళ్లు పట్టే అవకాశముంది. సేబర్ ఇంజిన్ల ప్రత్యేకత? విమానం వేగం పెరిగే కొద్దీ ఇం జిన్ వేడెక్కిపోతూ ఉంటుంది. గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు ఇంజిన్ లోపలి భాగాలు కరిగిపోయేంత వేడి పుడుతుంది. ఈ సమస్యను రియా క్షన్ శాస్త్రవేత్తలు అధిగమించగలిగారు. ద్రవ హీలియంను వాడటం ద్వారా ఇంజిన్లోకి వచ్చే గాలి వేడిని 1,000 డిగ్రీల సెల్సియస్ నుంచి –150 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిం చగలిగారు. గాల్లోని తేమ మంచు ముక్కలుగా మారకుండా సెకనులో వం దో వంతులోనే చల్లబరచడం విశేషం. కొన్ని రోజులు మాత్రమే పనిచేసి మళ్లీ మూలనపడ్డ కాన్క్రోడ్ విమాన సర్వీసు గుర్తుందా? అది కూడా వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేదే. ఇంజిన్ వేడిని తగ్గించేందుకు నేరుగా గాలిని వాడే వారు. సేబర్ ఇంజిన్లలో హైడ్రోజన్‌ను కూడా ఇంధనంగా వాడవచ్చు. ఫలితం గా విమానం ద్వారా కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. ప్రస్తుత విమానాలను సేబర్ ఇంజిన్లతో నడపవచ్చని, అవి కాన్క్రోడ్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలవని యూకే స్పేస్ ఏజెన్సీకి చెందిన గ్రాహం టర్నాక్ అంటున్నారు. సాధారణ విమానాలు 35 వేల అడుగుల ఎత్తులో ఎగిరితే కొత్త రకం ఇంజిన్ల విమానాలు 92 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. -
రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్
ఇస్రో చీఫ్ కె. శివన్.. చంద్రయాన్–2కు ముందు ఈ పేరు ఎవరూ పెద్దగా వినలేదు. గత కొన్నేళ్లుగా అంతరిక్ష రంగంలో సేవలు చేస్తున్నా ఆయన పెద్దగా తెరపైకి రాలేదు. కానీ చంద్రయాన్–2 ల్యాండర్ విక్రమ్ నుంచి సంకేతాలు ఆగిపోయిన వెంటనే ఆయన పడ్డ బాధ, పసి బిడ్డలా కన్నీళ్లపర్యంతమైన తీరు చూసి యావత్ భారతావని చలించిపోయింది. చంద్రయాన్ వంటి అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుని నడిపించిన శివన్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. కాళ్లకి చెప్పులు కూడా లేని పేదరికం తమిళనాడులోని కన్యాకుమారిలో సాధారణ రైతు కుటుంబంలో శివన్ జన్మించారు. కాళ్లకి చెప్పులు ఉండేవి కావు. ప్యాంటు, షర్టులేక ధోవతి ధరించిన రోజులున్నాయి. మామిడి తోటల్లో తండ్రికి సాయంగా ఉండేవారు. ఎన్నో ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో స్కాలర్‌షిప్‌లతో విద్యాభ్యాసం చేశారు. 1980లో మద్రాస్ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. బెంగుళూరు ఐఐఎస్సీలో ఎంఈ చేశారు. ఐఐటీ బొంబాయిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేశారు. భారత్ రాకెట్ మ్యాన్ పోఖ్రాన్ –1 అణుపరీక్షల తర్వాత సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో అమెరికా భారత్‌పై ఆంక్షలు విధించింది. దీంతో శీతల ఇంధనాల్ని వాడే క్రయోజెనిక్ ఇంజిన్లను స్వయంగా అభివృద్ధి చేసుకోవడం భారత్‌కు అనివార్యమైంది. అంతరిక్ష ప్రయోగాలకు అవసరమయ్యే క్రయోజినిక్ ఇంజిన్లను అభివృద్ధి చేసే బృందాన్ని ముందుండి నడిపించిన శివన్ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు. ► ఈ మధ్య ఇస్రో సాధించిన ఘన విజయాల వెనుక శివన్ చేసిన పరిశోధనలు, డిజైన్ చేసిన ఉపగ్రహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ► శివన్ డిజైన్ చేసిన సితార అన్న సాఫ్ట్వేర్ సహకారంతోనే ఇస్రో రాకెట్లను కక్ష్యలోకి పంపుతోంది. ► మంగళ్యాన్ వంటి ప్రాజెక్ట్‌లకు సైతం శివన్ వెన్నెముకలా ఉన్నారు. ► ఇటీవల కాలంలో ఇస్రో పరీక్షిస్తున్న మళ్లీ మళ్లీ వాడుకోవడానికి వీలయ్యే లాంచ్ వెహికల్స్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకి శివన్దే సారథ్యం. ► లక్ష్య సాధనలో ఈ రాకెట్ మ్యాన్ ఇప్పుడు కాస్త నిరాశకు లోనవచ్చు కానీ దేశ ప్రజలిచ్చే మద్దతే ఆయనకు కొండంత బలం. చీర్ అప్ శివన్.. సక్సెస్ రేటు 60 శాతమే! చంద్రుడిని తొలి ప్రయత్నంలో అందుకోవడానికి ప్రయత్నించిన అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాలకు గతంలో భంగపాటు తప్పలేదు. గత 60 ఏళ్లలో చంద్రుడిని ముద్దాడేందుకు జరిగిన ప్రయోగాల్లో కేవలం 60 శాతం మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఇప్పటివరకూ చందమామ లక్ష్యంగా 109 ప్రయోగాలు జరగగా, అందులో 61 మాత్రమే విజయవంతమయ్యాయని నాసా తెలిపింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన బర్షీట్ ల్యాండర్ 2018 ఏప్రిల్‌లో చంద్రుడిని సమీపించి నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. రష్యా (యూఎస్ఎస్ఆర్) 1958–59 కాలంలో చాలా ప్రయోగాలు చేయగా కేవలం మూడు రోవర్లే చంద్రుడిపై దిగాయి. -
మేక్ ఇన్ ఇండియాకు సాక్ష్యమిది
సాక్షి, బిజినెస్ బ్యూరో : రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక పరిశ్రమ వేళ్లూనుకుంది. ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ బోయింగ్, దేశీ దిగ్గజం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉమ్మడిగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ బాడీ తయారీ కేంద్రం గురువారం ప్రారంభమైంది. భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్, రతన్ టాటా, బోయింగ్ సీఈవో లీన్ కారెట్, మంత్రి కేటీఆర్‌లతో కలసి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రారంభించారు. బోయింగ్‌కు చెందిన ఏహెచ్ 64 అపాచీ హెలికాప్టర్ల తయారీకి కీలకమైన ‘ఫ్యూజ్ లీజ్ (ప్రధాన ఫ్రేమ్)’ను, కొన్ని ఏరోస్ట్రక్చర్లను ఈ కేంద్రంలో తయారు చేస్తారు. ఈ భాగాలు అంతర్జాతీయంగా 15 దేశాలకు ఎగుమతి కానున్నాయి. అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిద్దాం ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. శంకుస్థాపన చేశాక అతి తక్కువ వ్యవధిలోనే ఉత్పత్తి మొదలయ్యే స్థాయికి తెచ్చారంటూ బోయింగ్, టాటా యాజమాన్యాలను ఆమె ప్రశంసించారు. ఇన్నాళ్లుగా దిగుమతులపైనే ఆధారపడ్డామని, ఇకపై అంతర్జాతీయ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించి.. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు మనవైపు చూసేలా చేయాలని చెప్పారు. స్వాతంత్య్రానికి ముందు కూడా అభివృద్ధి జరిగినా, స్వాతంత్య్రం తర్వాత వేగవంతమైందని.. అప్పుడూ, ఇప్పుడూ దేశాభివృద్ధిలో టాటాలు తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారని ప్రశంసించారు. ‘‘2014లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచాక ప్రధాని మోదీ.. తయారీ రంగాన్ని తిరిగి భారత్‌కు తీసుకురావాలని మేకిన్ ఇండియాను చేపట్టారు. అందులో రక్షణ రంగ తయారీ కూడా ఒకటి. హెలికాప్టర్ బాడీ తయారీ కేంద్రం అతితక్కువ కాలంలోనే ఉత్పత్తికి సిద్ధం కావటం వెనక టాటా, బోయింగ్ సంస్థల కృషి అమోఘం. ఈ ప్రాజెక్టుకు ఉద్యోగులందరినీ స్థానికంగానే తీసుకుని శిక్షణనిచ్చారట. మీరు తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినా.. ఇంత త్వరగా శిక్షణ పొంది, అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తిని తేవటానికి చేస్తున్న కృషి అమోఘం..’’అని పేర్కొన్నారు. నంబర్‌వన్‌గా నిలుస్తున్నాం: కేటీఆర్ వైమానిక, రక్షణ రంగ ఉత్పత్తుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌కు రావడానికి ఎంతో కృషి చేశామని చెప్పారు. ‘‘ఇప్పటికే హైదరాబాద్‌లో ఎయిర్‌బస్, సికోర్స్కీ, లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, యూటీసీ, ఓఈఎస్, సీఎఫ్ఎం, శాబ్ వంటి వైమానిక రంగ తయారీ సంస్థలు తమ కేంద్రాల్ని ఏర్పాటు చేశాయి. వీటివల్ల వైమానిక విడి భాగాల తయారీకి హైదరాబాద్ హబ్‌గా మారింది. హైదరాబాద్‌లో మూడు వేర్వేరు ఏరోస్పేస్ పార్కులున్నాయి. ఆదిభట్ల, నాదర్గుల్ పార్కులతో పాటు శంషాబాద్‌లో జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది...’’అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో వ్యాపారం చేయడం చాలా సులభమని, సులభతర పారిశ్రామిక విధానంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. హైదరాబాద్‌ను ఎప్పటికీ నంబర్‌వన్ స్థానంలో ఉంచడానికి కృషి చేస్తామన్నారు. ఇక్కడ రక్షణ రంగ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేయటానికి సహకరించాలని రక్షణ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌ను నెలకొల్పాలని గతంలోనే ప్రతిపాదించామని, దానిపై సానుకూలంగా స్పందించాలని కోరారు. చిన్న చిన్న ఉత్పత్తులే కాకుండా విమానాలు తయారు చేసే కేంద్రంగా టాటా సెజ్ అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో నాలుగు రెట్లు! దేశంలో తాము మరిన్ని పెట్టుబడులు పెడుతున్నామని బోయింగ్ డిఫెన్స్, స్పేస్, సెక్యూరిటీ సంస్థ అధ్యక్షురాలు, సీఈవో లీన్ కారెట్ చెప్పారు. తమ ఉత్పత్తుల్లో భారత్ నుంచి తీసుకునే పరికరాల విలువ రెండేళ్ల కింద 250 మిలియన్ డాల ర్లుగా ఉండేదని, ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగి బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. కార్మికుల కోసం నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై కూడా పెట్టుబడి పెడుతున్నామని.. దాంతో అత్యాధునిక ఉత్పత్తుల్ని ప్రపంచానికి ఎగుమతి చేసే సాంకేతిక నిపుణులు తయారవుతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా బోయింగ్‌కు ఫ్యూజ్ లీజ్‌ను తయారు చేసే కేంద్రం ఇదొక్కటేనని తెలిపారు. కార్యక్రమం లో రక్షణ శాఖ సలహాదారు సతీశ్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, బోయింగ్ ఏరోస్పేస్ ఇండియా అధ్యక్షుడు ప్రత్యూష్‌కుమార్, టాటా సన్స్ ప్రెసిడెంట్ బన్వాలీ అగర్వాల్, టీఏఎస్ఎల్ సీఈవో సుక్రాన్సింగ్, ఎం పీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి తదితరులు తయారీ కేంద్రం విశేషాలివీ.. ∙ఆదిభట్లలోని టీఎస్ఐఐసీ ఏరోస్పేస్ సెజ్‌లో 14,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ తయారీ కేంద్రం ఏర్పాటైంది. ∙దీనిపై ఇప్పటిదాకా రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టారు. ∙350 మంది నిపుణులు ఫ్యూజ్లీజ్, ఇతర ఏరో స్ట్రక్చర్ల తయారీలో భాగమవుతారు. ∙అమెరికా ఆర్మీతోపాటు బోయింగ్‌కు చెందిన అంతర్జాతీయ వినియోగదారులకు ఇక్కడి నుంచే విడిభాగాలు సరఫరా చేస్తారు. ∙ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2,300కు పైగా అపాచీ హెలికాప్టర్లు సేవలందిస్తున్నాయి. భార త్ సహా 16 దేశాల సైన్యం వాటిని వాడుతోంది. ∙ఏహెచ్–64ఈ రకం 22 హెలికాప్టర్ల కోసం భారత ప్రభుత్వం 2015 సెప్టెంబర్‌లో బోయింగ్ సంస్థకు ఆర్డరిచ్చింది. అవి 2019లో అందుతాయి. రికార్డు సమయంలో పూర్తి: ఆర్క్ బిల్డర్స్ హెలికాప్టర్ విడిభాగాల తయారీ కేంద్రం నిర్మాణాన్ని కేవలం 10 నెలల్లో పూర్తిచేశామని హైదరాబాద్‌కు చెందిన రియల్టీ, నిర్మాణ సంస్థ ఆర్క్ బిల్డర్స్ అధినేత రాంరెడ్డి చెప్పారు. ‘‘అతి తక్కువ సమయంలో పూర్తిచేశారంటూ రతన్ టాటా వంటి దిగ్గజాల సమక్షంలో మమ్మల్ని ప్రశంసించటం చాలా సంతోషకరం. నిర్మాణంతో సహా మాకు అప్పగించిన సివిల్ వర్క్‌లన్నీ వేగంగా 10 నెలల్లో పూర్తి చేశాం. సెజ్‌లో పలు సంస్థల నిర్మాణాల్ని మేమే చేపట్టిన అనుభవం కలసి వచ్చింది..’’అని రాంరెడ్డి చెప్పారు. -
ఆదిభట్లలో శ్రీ శ్రీ గృహాలు!
• 6 ఎకరాల్లో ఏరో సిటీ ప్రాజెక్ట్ • ఏరో లైట్, ఏరో పార్క్ వెంచర్లు కూడా.. సాక్షి, హైదరాబాద్: ‘‘పనిచేస్తున్న ఆఫీసుకు దగ్గర్లో ఇళ్లుండాలి. అన్ని రకాల వసతులతో అందుబాటు ధరల్లో లభించాలి’’ స్థిరాస్తి కొనుగోలుదారులెవరైనా కోరుకునేదిదే. అచ్చం ఇలాంటి ప్రాజెక్ట్‌ల నిర్మాణమే మా లక్ష్యమంటోంది శ్రీ శ్రీ గృహ నిర్మాణ్ ఇండియా ప్రై.లి. అందుకే టీసీఎస్, ఏరో స్పేస్, బెల్, బీడీఎల్, ఆక్టోపస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలతో పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిభట్ల ప్రాంతాన్ని ఎంచుకున్నామని సంస్థ ఎండీ కె భూపతి రాజు ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఈ ప్రాంతంలో ఏరో సిటీ ప్రాజెక్ట్‌తో పాటూ ఏరో లైట్, ఏరో పార్క్ వెంచర్లను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలివిగో.. ⇔ టీసీఎస్, ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్యలో 6 ఎకరాల్లో శ్రీ శ్రీ ఏరో సిటీ నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో 674 ఫ్లాట్లొస్తాయి. మొత్తం 11 బ్లాకులకు గాను ప్రస్తుతం 6వ బ్లాక్ నిర్మాణంలో ఉంది. 1, 2, 3 బీహెచ్‌కె ఫ్లాట్లుంటాయి. 750 నుంచి 1,600 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ధర చ.అ.కు రూ.3 వేలుగా నిర్ణయించాం. ఇప్పటికే 50 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి కూడా. బ్యాంక్ రుణాలను కూడా ఇప్పిస్తున్నాం. వసతుల విషయానికొస్తే.. 2,500 చ.అ.ల్లో క్లబ్ హౌస్‌తో పాటూ రెస్టారెంట్, సూపర్ మార్కెట్, జిమ్, మినీ థియేటర్, యోగా హాల్ వంటివన్నీ ఉన్నాయి. 2018 మార్చి నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. ⇔ 18 ఎకరాల్లో ఏరో లైట్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 370 ఓపెన్ ప్లాట్లుంటాయి. విస్తీర్ణాలు 200 గజాల నుంచి 600 గజాల్లో ఉంటాయి. ఇప్పటికే 75 శాతం ప్లాట్లు అమ్ముడుపోయాయి కూడా. 42 ఎకరాల్లో ఏరో పార్క్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో మొత్తం 1,100 ప్లాట్లుంటాయి. ఇందులోనూ 200 నుంచి 600 గజాల్లో ప్లాట్లుంటాయి. ఇప్పటికే 60 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. వీటిల్లో ధరలు రూ.12–20 వేల మధ్య ఉంటాయి. ఈ వెంచర్లలో కన్స్ట్రక్షన్ కావాలంటే చేసిస్తాం కూడా. ⇔ పెద్ద నోట్ల రద్దుతో స్థిరాస్తి కొనుగోలుదారులు సందిగ్ధంలో పడ్డారు. ఇప్పుడే కొనుగోలు చేయాలా? ధరలు తగ్గుతాయా? అనే సందేహాలున్నాయి. నన్నడిగితే మాత్రం పెద్ద నోట్ల రద్దుతో ప్రతి స్థిరాస్తి లావాదేవీ పారదర్శకంగా సాగుతుంది. డెవలపర్లు పన్నులు కట్టే ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారు కాబట్టి ధరలను పెంచే అవకాశముంది. కాబట్టి స్థిరాస్తి కొనుగోళ్లకు ఇదే సరైన సమయం.