సాక్షి, బిజినెస్ బ్యూరో : రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక పరిశ్రమ వేళ్లూనుకుంది. ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ బోయింగ్, దేశీ దిగ్గజం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఉమ్మడిగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ బాడీ తయారీ కేంద్రం గురువారం ప్రారంభమైంది. భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్, రతన్ టాటా, బోయింగ్ సీఈవో లీన్ కారెట్, మంత్రి కేటీఆర్‌లతో కలసి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రారంభించారు. బోయింగ్‌కు చెందిన ఏహెచ్ 64 అపాచీ హెలికాప్టర్ల తయారీకి కీలకమైన ‘ఫ్యూజ్ లీజ్ (ప్రధాన ఫ్రేమ్)’ను, కొన్ని ఏరోస్ట్రక్చర్లను ఈ కేంద్రంలో తయారు చేస్తారు. ఈ భాగాలు అంతర్జాతీయంగా 15 దేశాలకు ఎగుమతి కానున్నాయి.
అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిద్దాం
ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. శంకుస్థాపన చేశాక అతి తక్కువ వ్యవధిలోనే ఉత్పత్తి మొదలయ్యే స్థాయికి తెచ్చారంటూ బోయింగ్, టాటా యాజమాన్యాలను ఆమె ప్రశంసించారు. ఇన్నాళ్లుగా దిగుమతులపైనే ఆధారపడ్డామని, ఇకపై అంతర్జాతీయ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించి.. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.
పెట్టుబడిదారులు మనవైపు చూసేలా చేయాలని చెప్పారు. స్వాతంత్య్రానికి ముందు కూడా అభివృద్ధి జరిగినా, స్వాతంత్య్రం తర్వాత వేగవంతమైందని.. అప్పుడూ, ఇప్పుడూ దేశాభివృద్ధిలో టాటాలు తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారని ప్రశంసించారు. ‘‘2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం గెలిచాక ప్రధాని మోదీ.. తయారీ రంగాన్ని తిరిగి భారత్‌కు తీసుకురావాలని మేకిన్ ఇండియాను చేపట్టారు.
అందులో రక్షణ రంగ తయారీ కూడా ఒకటి. హెలికాప్టర్ బాడీ తయారీ కేంద్రం అతితక్కువ కాలంలోనే ఉత్పత్తికి సిద్ధం కావటం వెనక టాటా, బోయింగ్ సంస్థల కృషి అమోఘం. ఈ ప్రాజెక్టుకు ఉద్యోగులందరినీ స్థానికంగానే తీసుకుని శిక్షణనిచ్చారట. మీరు తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినా.. ఇంత త్వరగా శిక్షణ పొంది, అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తిని తేవటానికి చేస్తున్న కృషి అమోఘం..’’అని పేర్కొన్నారు.
నంబర్‌వన్‌గా నిలుస్తున్నాం: కేటీఆర్
వైమానిక, రక్షణ రంగ ఉత్పత్తుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌కు రావడానికి ఎంతో కృషి చేశామని చెప్పారు. ‘‘ఇప్పటికే హైదరాబాద్‌లో ఎయిర్‌బస్, సికోర్‌స్కీ, లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, యూటీసీ, ఓఈఎస్, సీఎఫ్‌ఎం, శాబ్ వంటి వైమానిక రంగ తయారీ సంస్థలు తమ కేంద్రాల్ని ఏర్పాటు చేశాయి. వీటివల్ల వైమానిక విడి భాగాల తయారీకి హైదరాబాద్ హబ్‌గా మారింది. హైదరాబాద్‌లో మూడు వేర్వేరు ఏరోస్పేస్ పార్కులున్నాయి.
ఆదిభట్ల, నాదర్‌గుల్ పార్కులతో పాటు శంషాబాద్‌లో జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది...’’అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో వ్యాపారం చేయడం చాలా సులభమని, సులభతర పారిశ్రామిక విధానంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. హైదరాబాద్‌ను ఎప్పటికీ నంబర్‌వన్ స్థానంలో ఉంచడానికి కృషి చేస్తామన్నారు. ఇక్కడ రక్షణ రంగ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేయటానికి సహకరించాలని రక్షణ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌ను నెలకొల్పాలని గతంలోనే ప్రతిపాదించామని, దానిపై సానుకూలంగా స్పందించాలని కోరారు. చిన్న చిన్న ఉత్పత్తులే కాకుండా విమానాలు తయారు చేసే కేంద్రంగా టాటా సెజ్ అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామని చెప్పారు.
రెండేళ్లలో నాలుగు రెట్లు!
దేశంలో తాము మరిన్ని పెట్టుబడులు పెడుతున్నామని బోయింగ్ డిఫెన్స్, స్పేస్, సెక్యూరిటీ సంస్థ అధ్యక్షురాలు, సీఈవో లీన్ కారెట్ చెప్పారు. తమ ఉత్పత్తుల్లో భారత్ నుంచి తీసుకునే పరికరాల విలువ రెండేళ్ల కింద 250 మిలియన్ డాల ర్లుగా ఉండేదని, ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగి బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. కార్మికుల కోసం నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై కూడా పెట్టుబడి పెడుతున్నామని.. దాంతో అత్యాధునిక ఉత్పత్తుల్ని ప్రపంచానికి ఎగుమతి చేసే సాంకేతిక నిపుణులు తయారవుతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా బోయింగ్‌కు ఫ్యూజ్ లీజ్‌ను తయారు చేసే కేంద్రం ఇదొక్కటేనని తెలిపారు. కార్యక్రమం లో రక్షణ శాఖ సలహాదారు సతీశ్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, బోయింగ్ ఏరోస్పేస్ ఇండియా అధ్యక్షుడు ప్రత్యూష్‌కుమార్, టాటా సన్స్ ప్రెసిడెంట్ బన్వాలీ అగర్వాల్, టీఏఎస్‌ఎల్ సీఈవో సుక్రాన్‌సింగ్, ఎం పీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి తదితరులు
తయారీ కేంద్రం విశేషాలివీ..
∙ఆదిభట్లలోని టీఎస్‌ఐఐసీ ఏరోస్పేస్ సెజ్‌లో 14,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ తయారీ కేంద్రం ఏర్పాటైంది.
∙దీనిపై ఇప్పటిదాకా రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టారు.
∙350 మంది నిపుణులు ఫ్యూజ్‌లీజ్, ఇతర ఏరో స్ట్రక్చర్ల తయారీలో భాగమవుతారు.
∙అమెరికా ఆర్మీతోపాటు బోయింగ్‌కు చెందిన అంతర్జాతీయ వినియోగదారులకు ఇక్కడి నుంచే విడిభాగాలు సరఫరా చేస్తారు.
∙ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2,300కు పైగా అపాచీ హెలికాప్టర్లు సేవలందిస్తున్నాయి. భార త్ సహా 16 దేశాల సైన్యం వాటిని వాడుతోంది.
∙ఏహెచ్–64ఈ రకం 22 హెలికాప్టర్ల కోసం భారత ప్రభుత్వం 2015 సెప్టెంబర్‌లో బోయింగ్ సంస్థకు ఆర్డరిచ్చింది. అవి 2019లో అందుతాయి.
రికార్డు సమయంలో పూర్తి: ఆర్క్ బిల్డర్స్
హెలికాప్టర్ విడిభాగాల తయారీ కేంద్రం నిర్మాణాన్ని కేవలం 10 నెలల్లో పూర్తిచేశామని హైదరాబాద్‌కు చెందిన రియల్టీ, నిర్మాణ సంస్థ ఆర్క్ బిల్డర్స్ అధినేత రాంరెడ్డి చెప్పారు. ‘‘అతి తక్కువ సమయంలో పూర్తిచేశారంటూ రతన్ టాటా వంటి దిగ్గజాల సమక్షంలో మమ్మల్ని ప్రశంసించటం చాలా సంతోషకరం. నిర్మాణంతో సహా మాకు అప్పగించిన సివిల్ వర్క్‌లన్నీ వేగంగా 10 నెలల్లో పూర్తి చేశాం. సెజ్‌లో పలు సంస్థల నిర్మాణాల్ని మేమే చేపట్టిన అనుభవం కలసి వచ్చింది..’’అని రాంరెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment