సాక్షి, అమరావతి: దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు అనగానే గుర్తుకు వచ్చేది టాటా–బిర్లా గ్రూపులు. ఈ గ్రూపు గడచిన అయిదేళ్లలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రోత్సాహంతో ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమారమంగళం బిర్లా స్వయంగా వచ్చి పెట్టుబడుల కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఈ రాష్ట్రంపై ప్రత్యేక ఆసక్తిని తెలియజేస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో ఆదిత్య బిర్లా గ్రూపు మూడు భారీ ప్రాజెక్టులకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. విశాఖలో గతేడాది మార్చిలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో రూ.9,300 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో ఇప్పటికే రూ.4,510 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి.
బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్
ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో రూ.2,700 కోట్ల పెట్టుబడితో ఏటా రూ.1.50 లక్షల టన్నుల కాస్టిక్ సోడాను ఉత్పత్తి చేస్తే క్లోర్ ఆల్కాలి యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ను గ్రూపు చైర్మన్ కుమారమంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2022 ఏప్రిల్ 21న ప్రారంభించారు.
ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం 1,300 మందికి ఉద్యోగ అవకాశాలు రాగా పూర్తిస్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య 2,400కు చేరుతుంది. ఆదిత్య బిర్లా గ్రూపునకు దేశవ్యాప్తంగా క్లోర్ ఆల్కాలికి సంబంధించి ఏడు యూనిట్లు ఉండగా, తూర్పు తీర ప్రాంతంలో తొలి యూనిట్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. కోవిడ్ లాక్‌డౌన్‌లో కూడా పనులు వేగంగా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇవ్వడంతో రికార్డు సమయంలోనే ఈ యూనిట్ ఉత్పత్తిని ప్రారంభించింది.
పులివెందుల్లో గార్మెంట్స్ యూనిట్
ఆదిత్య బిర్లా గార్మెంట్స్ వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో రెడిమేడ్ దుస్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. 2021 డిసెంబర్ 24న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ యూనిట్ రెండేళ్లల్లోనే అందుబాటులోకి వచ్చింది. రూ.110.38 కోట్ల వ్యయంతో 2112 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ యూనిట్ ఏర్పాటైంది. మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో ఉత్పతైన దుస్తులు ఆదిత్య బిర్లా రిటైల్ షోరూంలతో పాటు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గతేడాది నవంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన సందర్భంగా ఈ యూనిట్‌ను పరిశీలించి అక్కడ పనిచేస్తున్న మహిళలతో ముచ్చటించారు. త్వరలోనే పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువవుతున్న యూనిట్‌లో ప్రస్తుతం 500 మందికి పైగా పనిచేస్తున్నారు.
నాయుడుపేటలో కార్బన్ బ్లాక్
ఆదిత్య బిర్లా గ్రూపు చిత్తూరు జిల్లా నాయుడు పేటలో రంగులు, ఇంకు, టోనర్లు వంటి వాటిలో కీలకంగా వినియోగించే కార్బన్ బ్లాక్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.1,700 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా 250 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ నెల 14న పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ యూనిట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. 24 నెలల్లో అందుబాటులోకి రానుంది.
పదివేల మందికి ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భారీ పెట్టుబడులను ఆహా్వనిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్‌ఆర్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పుగోదావరి బలభద్రపురంలో కాస్టిక్‌సోడా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైనది. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది.
బలభద్రపురంలో 21–04–22న క్లోర్ అల్కాలి (కాస్టిక్ సోడా) యూనిట్ ప్రారంబోత్సవం సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా
Comments
Please login to add a commentAdd a comment