ఇక హైదరాబాద్‌లో అపాచీ హెలికాప్టర్ల తయారీ
ఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ విమాన రంగ సంస్థ బోయింగ్, భారతీయ సంస్థ టాటాతో కలిసి జాయింట్ వెంచర్ను ప్రారంభించబోతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రక్షణ, విమానయాన రంగంలో వాడే AH-64 రకానికి చెందిన అపాచి హెలికాఫ్టర్లను తయారు చేయనున్నారు. అది కూడా హైదరాబాద్‌లో తయారు చేస్తారట. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ట్విట్టర్ ద్వారా కూడా తెలిపారు. విమానయాన రంగంలో భవిష్యత్తులో టాటాతో కలిసి మరిన్ని ప్రాజెక్టులు చేపట్టే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు బోయింగ్ ప్రకటించింది.
ఎయిర్ క్రాఫ్ట్ల విభాగంలో కొత్త తరహాకు చెందిన అపాచీతో పాటు చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాఫ్టర్లను బోయింగ్ నుంచి కొనుగోలు చేయాలని భారత్ ఇటీవల నిర్ణయించింది. టాటాతో హెలికాఫ్టర్ ల తయారీ ఒప్పందం ద్వారా ఇండియాకు పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి అనుకూలంగా ఉంటుందని బోయింగ్ ఇండియా చైర్మన్ ప్రత్యూష్ కుమార్ అన్నారు. టాటాతో చేపడుతున్న ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు.
ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఈ ఒప్పందం పెద్ద వార్త అని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అపాచీ హెలికాఫ్టర్లు హైదరాబాద్లో తయారుకానున్నాయని ఆయన వెల్లడించారు.
Another big news for Telangana. Boeing & Tata Advanced System JV to manufacture Apache helicopters soon from Hyderabad #HappeningHyderabad
— K Taraka Rama Rao (@KTRTRS) November 9, 2015