ఇస్రో చీఫ్ కె. శివన్.. చంద్రయాన్–2కు ముందు ఈ పేరు ఎవరూ పెద్దగా వినలేదు. గత కొన్నేళ్లుగా అంతరిక్ష రంగంలో సేవలు చేస్తున్నా ఆయన పెద్దగా తెరపైకి రాలేదు. కానీ చంద్రయాన్–2 ల్యాండర్ విక్రమ్ నుంచి సంకేతాలు ఆగిపోయిన వెంటనే ఆయన పడ్డ బాధ, పసి బిడ్డలా కన్నీళ్లపర్యంతమైన తీరు చూసి యావత్ భారతావని చలించిపోయింది. చంద్రయాన్ వంటి అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుని నడిపించిన శివన్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు.
కాళ్లకి చెప్పులు కూడా లేని పేదరికం
తమిళనాడులోని కన్యాకుమారిలో సాధారణ రైతు కుటుంబంలో శివన్ జన్మించారు. కాళ్లకి చెప్పులు ఉండేవి కావు. ప్యాంటు, షర్టులేక ధోవతి ధరించిన రోజులున్నాయి. మామిడి తోటల్లో తండ్రికి సాయంగా ఉండేవారు. ఎన్నో ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో స్కాలర్‌షిప్‌లతో విద్యాభ్యాసం చేశారు. 1980లో మద్రాస్ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. బెంగుళూరు ఐఐఎస్‌సీలో ఎంఈ చేశారు. ఐఐటీ బొంబాయిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు.
భారత్ రాకెట్ మ్యాన్
పోఖ్రాన్ –1 అణుపరీక్షల తర్వాత సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో అమెరికా భారత్‌పై ఆంక్షలు విధించింది. దీంతో శీతల ఇంధనాల్ని వాడే క్రయోజెనిక్ ఇంజిన్లను స్వయంగా అభివృద్ధి చేసుకోవడం భారత్‌కు అనివార్యమైంది. అంతరిక్ష ప్రయోగాలకు అవసరమయ్యే క్రయోజినిక్ ఇంజిన్లను అభివృద్ధి చేసే బృందాన్ని ముందుండి నడిపించిన శివన్ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు.
► ఈ మధ్య ఇస్రో సాధించిన ఘన విజయాల వెనుక శివన్ చేసిన పరిశోధనలు, డిజైన్ చేసిన ఉపగ్రహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
► శివన్ డిజైన్ చేసిన సితార అన్న సాఫ్ట్‌వేర్ సహకారంతోనే ఇస్రో రాకెట్లను కక్ష్యలోకి పంపుతోంది.
► మంగళ్‌యాన్ వంటి ప్రాజెక్ట్‌లకు సైతం శివన్ వెన్నెముకలా ఉన్నారు.
► ఇటీవల కాలంలో ఇస్రో పరీక్షిస్తున్న మళ్లీ మళ్లీ వాడుకోవడానికి వీలయ్యే లాంచ్ వెహికల్స్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకి శివన్‌దే సారథ్యం.
► లక్ష్య సాధనలో ఈ రాకెట్ మ్యాన్ ఇప్పుడు కాస్త నిరాశకు లోనవచ్చు కానీ దేశ ప్రజలిచ్చే మద్దతే ఆయనకు కొండంత బలం. చీర్ అప్ శివన్..
సక్సెస్ రేటు 60 శాతమే!
చంద్రుడిని తొలి ప్రయత్నంలో అందుకోవడానికి ప్రయత్నించిన అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాలకు గతంలో భంగపాటు తప్పలేదు. గత 60 ఏళ్లలో చంద్రుడిని ముద్దాడేందుకు జరిగిన ప్రయోగాల్లో కేవలం 60 శాతం మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఇప్పటివరకూ చందమామ లక్ష్యంగా 109 ప్రయోగాలు జరగగా, అందులో 61 మాత్రమే విజయవంతమయ్యాయని నాసా తెలిపింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన బర్‌షీట్ ల్యాండర్ 2018 ఏప్రిల్‌లో చంద్రుడిని సమీపించి నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. రష్యా (యూఎస్‌ఎస్‌ఆర్) 1958–59 కాలంలో చాలా ప్రయోగాలు చేయగా కేవలం మూడు రోవర్లే చంద్రుడిపై దిగాయి.
రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్
Published Sun, Sep 8 2019 4:36 AM | Last Updated on Sun, Sep 8 2019 11:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment