శ్రీనాథ్ రవిచంద్రన్, మోహిన్
ఏరో స్పేస్ టెక్నాలజీ అనగానే విదేశాల వైపు చూసే ఎంతోమందికి మన సత్తా చూపించిన స్టార్టప్‌లలో ‘అగ్నికుల్ కాస్మోస్’ ఒకటి. ఆకాశమంత కలతో బయలుదేరిన ‘అగ్నికుల్’ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం అగ్నిబాణ్.. ‘అగ్నికుల్’ అంటే భారత అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భర్ విజయగాథ.
ఐఐటీ–మద్రాస్ కేంద్రంగా పని చేస్తున్న ‘అగ్నికుల్ కాస్మోస్’ త్రీడీ ప్రింటెట్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రశంసలు అందుకుంది. స్నేహితుడు మోహిన్, ప్రొఫెసర్ చక్రవర్తిలతో కలిసి 2017లో ‘అగ్నికుల్’ను లాంచ్ చేశాడు శ్రీనాథ్ రవిచంద్రన్. మన దేశంలోని ఫస్ట్ ప్రైవేట్ స్మాల్ శాటిలైట్ రాకెట్ ‘అగ్నిబాణ్’ను నిర్మించింది అగ్నికుల్.
30 కిలోల నుండి 300 కిలోల బరువు ఉన్న పేలోడ్‌ను తక్కువ భూకక్ష్యలోకి (సుమారు ఏడువందల కిలోమీటర్ల ఎత్తు) తీసుకువెళ్లే సామర్థ్యం దీని సొంతం. 2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో ఒప్పందం కుదర్చుకున్న తొలి భారతీయ కంపెనీగా ప్రత్యేకత సాధించింది అగ్నికుల్. ఒప్పందం ద్వారా ‘అగ్నిబాణ్’ నిర్మాణంలో ‘ఇస్రో’ సహాయ, సహకారాలను తీసుకుంది.
ప్లగ్–అండ్–ప్లే ఇంజిన్ కాన్‌ఫిగరేషన్ సామర్థ్యం ఉన్న అగ్నిబాణ్, మిషన్ అవసరాలకు ఖచ్చితంగా సరిపోయేలా కాన్ఫిగర్ చేయగలదు. ప్రతి క్లయింట్‌కు సంబంధించిన ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగర్ చేయవచ్చు. 3డీ సాంకేతికతతో రూపొందించిన ఈ రాకెట్ ఉపగ్రహ ప్రయోగాల ఖర్చును తగ్గిస్తుంది.
మొదట్లో వారానికి కనీసం రెండు రాకెట్ ఇంజిన్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ తరువాత నాలుగు ఇంజిన్‌లకు విస్తరించింది అగ్నికుల్. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లింది. ‘మోర్ యాక్సెసబుల్ అండ్ అఫర్డబుల్’ లక్ష్యంతో బయలు దేరిన శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్‌లు మరిన్ని లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి రెడీ అవుతున్నారు.
"శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌లోని ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈరోజు లాంచ్ చేయాల్సిన ‘అగ్నిబాణ్’ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది."
ఆత్మవిశ్వాసమే అద్భుత శక్తి..
2017లో ‘అగ్నికుల్’తో శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్‌లు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఇన్వెస్టర్‌ల నుంచి విశ్లేషకుల వరకు ‘మన దేశంలో ఇది సాధ్యమా? ఈ కుర్రాళ్ల వల్ల అవుతుందా’ అనే అనుమాన నీడ ఉండేది.
అయితే శ్రీనాథ్, మోహిన్‌లు ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం అనే అద్భుతశక్తితో ముందుకు కదిలారు. నాలుగు వందల వరకు పిచ్ మీటింగ్‌లు నిర్వహించిన తరువాతే ఫస్ట్ రౌండ్ ఫండింగ్ 2018లో వచ్చింది. అనుమాన నీడ వెనక్కి వెళ్లి ‘అగ్నికుల్’ పేరు ప్రపంచానికి పరిచయం కావడానికి ఎంతోకాలం పట్టలేదు.
మన దేశంలో స్పేస్ టెక్ స్టార్టప్‌ల విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఏరోస్పేస్ డిగ్రీలు చేయడానికి చాలామంది విదేశాలకు వెళ్లాలనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నారు’ అంటున్నాడు ‘అగ్నికుల్’ కో–ఫౌండర్, సీయివో శ్రీనాథ్ రవిచంద్రన్.
— శ్రీనాథ్ రవిచంద్రన్, ‘అగ్నికుల్ కో–ఫౌండర్, సీయివో.
Comments
Please login to add a commentAdd a comment