హాబీ
లతిక సుథాన్ ఇల్లు కలువల కొలను. కమలాల సరస్సు. ఇంటి చుట్టూ నీరు, నీటిలో తేలుతూ పూలు. ఒకటి కాదు, రెండు కాదు. వంద రకాల కమలాలు, ఎనభై రకాల కలువలు వికసించిన సుమనిలయం ఆమె ఇల్లు. వాటిలో ఒకటి అత్యంత అరుదైన వెయ్యి రేకుల కమలం. ఇవన్నీ ఆమెకు చక్కటి ఆదాయ వనరుగా కూడా మారాయి. నెలకు నలభై వేల రాబడినిస్తున్నాయి. లోటస్ ప్రెన్యూర్ అనే గుర్తింపును తెచ్చాయి. విశ్రాంత జీవితాన్ని ఇంత సుగంధ భరితం చేసుకున్న లతిక ఒక స్కూల్ టీచర్. ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమైన ఉన్నన్ని రోజులూ తనకిష్టమైన మొక్కల పెంపకం అభిరుచిని పక్కన పెట్టాల్సి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత ఆమె తన హాబీకి మొగ్గ తొడిగింది.
మొక్కలకు దూరంగా ఇరవై ఏళ్లు..
లతిక సుథాన్‌ది కేరళ రాష్ట్రం, త్రిశూర్. ‘చిన్నప్పుడు మొక్కలతోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. కమలం విచ్చుకోవడాన్ని ఆసక్తిగా చూసేదాన్ని. ఒక్కో రెక్క విచ్చుకుంటూ ఉంటే అబ్బురంగా అనిపించేది. చదువు, పెళ్లి, ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగంతో ఇరవై ఏళ్లపాటు మొక్కలకు దూరమయ్యాను. ఉద్యోగం నుంచి 2018లో రిటైరయ్యాను. అప్పటి నుంచి ఇక మొక్కల మధ్య సీతాకోక చిలుకనయ్యాను. ప్రపంచంలో ఉన్న కలువలు, కమలాల జాతుల మీద ఒక అధ్యయనమే చేశాను. దేశంలోని వివిధ ్రపాంతాల నుంచి మొక్కలు తెచ్చి పెంచాను. అలాగే థాయ్‌లాండ్, వియత్నాం, జపాన్ దేశాల నుంచి కూడా తెప్పించుకున్నాను. పెంపకంలో మెళకువలు నేర్చుకోవడానికి అనేక వర్క్‌షాపులకు హాజరయ్యాను. వ్యవసాయాభివృద్ధి శాఖ నిర్వహించే సదస్సులకు వెళ్లి నిపుణుల సూచనలను తెలుసుకున్నాను’ అన్నారు లతిక.
మొక్కల పాఠాలు..
కమలాలు, కలువల్లో అరుదైన జాతులను సేకరించడం, వాటి పెంపకం గురించి మెళకువలు తెలుసుకోవడంతో ఆ మొక్కల పెంపకం గురించి ఉపన్యసించగలిగినంత పట్టు సాధించారు లతిక. పిల్లలకు పాఠాలు చెప్పిన ఆమె అనుభవం ఇప్పుడు మొక్కల పాఠాలు చెప్పిస్తోంది. ఈ పూల గురించి ఒక్క సందేహం వ్యక్తం చేస్తే చాలు... అనర్గళంగా వివరిస్తుంది. కమలాలు, కలువల మొక్కలు, గింజల కోసం హాస్పిటల్, హోటల్, రిసార్టుల నుంచి భారీ మొత్తంలో ఆర్డర్లు వస్తుంటాయి. హాబీగా మొదలైన కమలాల పెంపకం మంచి లాభాలనిస్తూ ఆమెకు స్థానికంగా లోటస్ ప్రెన్యూర్ అనే గుర్తింపును కూడా ఇచ్చింది.
ఇవి చదవండి: iSmart హోమ్స్
Comments
Please login to add a commentAdd a comment