Space Experiment
-
Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం!
ఏరో స్పేస్ టెక్నాలజీ అనగానే విదేశాల వైపు చూసే ఎంతోమందికి మన సత్తా చూపించిన స్టార్టప్‌లలో ‘అగ్నికుల్ కాస్మోస్’ ఒకటి. ఆకాశమంత కలతో బయలుదేరిన ‘అగ్నికుల్’ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం అగ్నిబాణ్.. ‘అగ్నికుల్’ అంటే భారత అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భర్ విజయగాథ. ఐఐటీ–మద్రాస్ కేంద్రంగా పని చేస్తున్న ‘అగ్నికుల్ కాస్మోస్’ త్రీడీ ప్రింటెట్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రశంసలు అందుకుంది. స్నేహితుడు మోహిన్, ప్రొఫెసర్ చక్రవర్తిలతో కలిసి 2017లో ‘అగ్నికుల్’ను లాంచ్ చేశాడు శ్రీనాథ్ రవిచంద్రన్. మన దేశంలోని ఫస్ట్ ప్రైవేట్ స్మాల్ శాటిలైట్ రాకెట్ ‘అగ్నిబాణ్’ను నిర్మించింది అగ్నికుల్. 30 కిలోల నుండి 300 కిలోల బరువు ఉన్న పేలోడ్‌ను తక్కువ భూకక్ష్యలోకి (సుమారు ఏడువందల కిలోమీటర్ల ఎత్తు) తీసుకువెళ్లే సామర్థ్యం దీని సొంతం. 2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో ఒప్పందం కుదర్చుకున్న తొలి భారతీయ కంపెనీగా ప్రత్యేకత సాధించింది అగ్నికుల్. ఒప్పందం ద్వారా ‘అగ్నిబాణ్’ నిర్మాణంలో ‘ఇస్రో’ సహాయ, సహకారాలను తీసుకుంది. ప్లగ్–అండ్–ప్లే ఇంజిన్ కాన్ఫిగరేషన్ సామర్థ్యం ఉన్న అగ్నిబాణ్, మిషన్ అవసరాలకు ఖచ్చితంగా సరిపోయేలా కాన్ఫిగర్ చేయగలదు. ప్రతి క్లయింట్‌కు సంబంధించిన ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగర్ చేయవచ్చు. 3డీ సాంకేతికతతో రూపొందించిన ఈ రాకెట్ ఉపగ్రహ ప్రయోగాల ఖర్చును తగ్గిస్తుంది. మొదట్లో వారానికి కనీసం రెండు రాకెట్ ఇంజిన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ తరువాత నాలుగు ఇంజిన్లకు విస్తరించింది అగ్నికుల్. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లింది. ‘మోర్ యాక్సెసబుల్ అండ్ అఫర్డబుల్’ లక్ష్యంతో బయలు దేరిన శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్‌లు మరిన్ని లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి రెడీ అవుతున్నారు. "శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈరోజు లాంచ్ చేయాల్సిన ‘అగ్నిబాణ్’ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది." ఆత్మవిశ్వాసమే అద్భుత శక్తి.. 2017లో ‘అగ్నికుల్’తో శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్‌లు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఇన్వెస్టర్ల నుంచి విశ్లేషకుల వరకు ‘మన దేశంలో ఇది సాధ్యమా? ఈ కుర్రాళ్ల వల్ల అవుతుందా’ అనే అనుమాన నీడ ఉండేది. అయితే శ్రీనాథ్, మోహిన్లు ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం అనే అద్భుతశక్తితో ముందుకు కదిలారు. నాలుగు వందల వరకు పిచ్ మీటింగ్‌లు నిర్వహించిన తరువాతే ఫస్ట్ రౌండ్ ఫండింగ్ 2018లో వచ్చింది. అనుమాన నీడ వెనక్కి వెళ్లి ‘అగ్నికుల్’ పేరు ప్రపంచానికి పరిచయం కావడానికి ఎంతోకాలం పట్టలేదు. మన దేశంలో స్పేస్ టెక్ స్టార్టప్‌ల విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఏరోస్పేస్ డిగ్రీలు చేయడానికి చాలామంది విదేశాలకు వెళ్లాలనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నారు’ అంటున్నాడు ‘అగ్నికుల్’ కో–ఫౌండర్, సీయివో శ్రీనాథ్ రవిచంద్రన్. — శ్రీనాథ్ రవిచంద్రన్, ‘అగ్నికుల్ కో–ఫౌండర్, సీయివో. -
అంతరిక్ష ప్రయోగాల్లో నవశకం
ఆకాశం అంచులు దాటి అంతరిక్షానికి ఎగిరిపోవాలన్న మనిషి కలకు వందల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని గత 60 ఏళ్లలో దాదాపు 600 మంది ఈ ఘనతను సాధించగలిగారు. కోటీశ్వరులు ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా అమెరికా, యూరప్‌లలోని ప్రభుత్వరంగ సంస్థలు పంపిన వారే. ఇప్పటిదాకా సామాన్యులు అంతరిక్షానికి వెళ్లేందుకు రూ. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడం ప్రధాన అడ్డంకిగా నిలిచేది. ఈ ఏడాది జూలైలో వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాస్నన్, అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్‌లు పోటాపోటీగా అంతరిక్ష పర్యటనలు చేయగా తాజాగా స్పేస్–ఎక్స్ సిద్ధం చేసిన అంతరిక్ష ప్రయోగంలో మాత్రం సామాన్యులకూ చోటుదక్కింది. ప్రయోగం ఎప్పుడు? ఎక్కడ? అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కానెర్వాల్‌లో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 15న స్పేస్–ఎక్స్ అంతరిక్ష ప్రయోగం జరగనుంది. స్పేస్–ఎక్స్‌కు చెందిన ఫాల్కన్–9 హెవీ రాకెట్... వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్‌ను భూకక్ష్యలోకి తరలించనుంది. ‘‘ఇన్స్పిరేషన్ 4’పేరుతో చేపట్టనున్న ఈ ప్రయోగంలో భాగంగా నలుగురిని అంతరిక్ష విహారానికి తీసుకెళ్లనున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ప్రయోగ ఖర్చులన్నింటినీ అమెరికా కోటీశ్వరుడు, ‘షిఫ్ట్–4’పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈవో జేర్డ్ ఐసాక్‌మాన్ భరిస్తున్నారు. ఆయన ఎంత మొత్తం స్పేస్–ఎక్స్‌కు చెల్లించారన్న విషయం స్పష్టంగా తెలియకున్నా ఇది రూ. వందల కోట్లలో ఉండొచ్చని అంచనా. విమాన పైలట్‌గానూ పనిచేసిన అనుభవం ఐసాక్మాన్కు ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. అంతరిక్షంలోకి వెళ్తున్న క్రిస్, సియాన్, ఐసాక్‌మాన్, హేలీ (ఎడమ నుంచి వరుసగా) ఎంపిక, శిక్షణలు ఇలా... ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పేస్–ఎక్స్ వ్యోమగాముల ఎంపిక ప్రకటన చేసింది. ఆ తరువాత అత్యధిక గురుత్వాకర్షణ శక్తి ఉన్న ప్రాంతాల్లో వారికి శిక్షణ ఇచ్చింది. భారరహిత స్థితిని పరిచయం చేసేందుకు వ్యోమగాములను అర్ధచంద్రాకారం ఆకారంలో విమానంలో విప్పింది. ఇలా తిప్పినప్పుడు కొన్ని సెకన్లపాటు శరీరం బరువు మనకు తెలియదు. రోలర్ స్కేటర్లో ఎత్తు నుంచి కిందకు జారుతున్నప్పుడు కలిగే అనుభూతి అన్నమాట. ఇన్స్పిరేషన్–4ను భూకేంద్రం నుంచే నియంత్రిస్తూంటారు. మూడు రోజుల అంతరిక్ష ప్రయాణం మొత్తమ్మీద వ్యోమగాముల నిద్ర, గుండె కొట్టుకునే వేగం, రక్తంలో వచ్చే మార్పులు, మేధో సామర్థ్యం వంటి అనేక అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. భవిష్యత్తులో సాధారణ పౌరులతో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయని అంచనా. స్ఫూర్తి నింపే ప్రయోగం... ‘ఇన్స్పిరేషన్–4’ ప్రయోగం స్ఫూర్తివంతమైన దనీ చెప్పాలి. ఎందుకంటే ఈ అంతరిక్ష నౌకలో ప్రయాణించే వారిలో ఒకరు కేన్సర్ బారినపడి కోలుకున్న 29 ఏళ్ల హేలీ అర్సెనాక్స్ ఉన్నారు. మెంఫిస్(అమెరికా)లోని సెయింట్ జూడ్ పిల్లల ఆసుపత్రిలో హేలీ సహాయకురాలిగా పనిచేస్తున్నారు. ఇన్స్పిరేషన్–4లో భాగంగా ఐసాక్ మ్యాన్ ఈ ఆస్పత్రిని చారిటబుల్ బెనిఫిషరీ (లబ్ధిదారు)గా ఎంపిక చేశారు. హేలీ ఎంపిక ‘రేపటిపై ఆశ’లేదా ‘హోప్’కు ప్రతీకని ఐసాక్‌మ్యాన్ అంటున్నారు. ఈ ప్రయోగంతో సెయిం ట్ జూడ్ పిల్లల ఆస్పత్రిపై ప్రజల్లో అవగాహన కల్పనతోపాటు ఆస్పత్రికి 200 మిలియన్ డాలర్ల నిధులను సేకరించాలని భావిస్తున్నారు. హేలీతోపాటు అంతరిక్షానికి వెళుతున్న వారిలో 42ఏళ్ల క్రిస్ సెంబ్రోస్కీ ఉన్నారు. అమెరికా వాయుసేనలో సేవలం దించి పదవీవిరమణ చేసిన ఆయన... ప్రస్తు తం వైమానికరంగంలో పనిచేస్తున్నారు. ‘దాతృ త్వం’లేదా జెనరాసిటీకి ప్రతీకగా క్రిస్ ఎంపిక జరిగింది. చివరగా ‘సమృద్ధి’ అన్న భావనను గుర్తుచేసుకునేందుకు 51 ఏళ్ల భూగర్భ శాస్త్రవేత్త సియాన్ ప్రాక్టర్ను ఎంపిక చేశామని, 2009లో ‘నాసా’తరఫున వ్యోమగామి అవ్వాల్సిన చాన్స్ సియాన్‌కు తృటిలో తప్పిందని ఐసాక్‌మ్యాన్ వివరించారు. అంతరిక్షానికి వెళ్లిన నాలుగవ ఆఫ్రికన్ అమెరికన్ మహిళగానూ సియాన్ రికా ర్డు సృష్టించనున్నారు. ఇన్స్పిరేషన్–4 కమాండర్ ఇన్ చీఫ్‌గా ఐసాక్‌మ్యాన్ వ్యవహరించనున్నారు. ఐసాక్‌మ్యాన్ ఎవరు? 16 ఏళ్లకే బడి మానేసి.. రూ.18 వేల కోట్లకు అధిపతిగా.. జేర్డ్ ఐసాక్‌మ్యాన్.. వయసు 38 ఏళ్లే. కానీ ఘనతలు ఎన్నో. 1983లో అమెరికాలోని న్యూజెర్సీలో పుట్టాడు. చిన్నవయసులోనే కంప్యూటర్ రిపేరింగ్, సాఫ్ట్వేర్ సర్వీసులపై పట్టు సాధించాడు. తన 16వ ఏట స్కూల్ మానేసి.. ఉద్యోగంలో చేరిపోయాడు. 2005లో సొంతంగా ‘యునైటెడ్ బ్యాంక్ కార్డ్ (ప్రస్తుత పేరు: ఫిఫ్ట్4 పేమెంట్స్)’పేరిట రిటైల్ పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ స్థాపించాడు. దాన్ని అమెరికా వ్యాప్తంగా విస్తరించాడు. ఇదే సమయంలో తనకు బాగా ఇష్టమైన పైలట్ శిక్షణ తీసుకున్నాడు. 2009లో ఏకంగా భూమిని చుట్టేస్తూ.. 61 గంటలపాటు విమానం నడిపి రికార్డు సృష్టించాడు. ఆ ఫీట్‌తో సుమారు లక్ష డాలర్లు సేకరించి మేక్ ఏ విష్ ఫౌండేషన్‌కు అందజేశాడు. 2011లో ఏరోనాటిక్స్ డిగ్రీ పూర్తిచేసిన ఐసాక్‌మ్యాన్.. 2012లో ఏకంగా ‘డ్రాకెన్ ఇంటర్నేషనల్’ పేరిట యుద్ధ విమాన పైలట్ శిక్షణ సంస్థను స్థాపించాడు. ప్రపంచంలో సొంతంగా యుద్ధ విమానాలు ఉన్న పెద్ద ప్రైవేటు ఎయిర్‌ఫోర్స్ సంస్థ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం ఐసాక్‌మ్యాన్ ఆస్తులు సుమారు రూ.18 వేల కోట్లకుపైనే ఉంటాయని అంచనా. – సాక్షి, హైదరాబాద్ -
టెక్నాలజీల అభివృద్ధికి ఇస్రో పిలుపు
బెంగళూరు: భారత్ 2022లో చేపట్టనున్న గగన్‌యాన్ అంతరిక్ష ప్రయోగానికి అవసరమైన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రేడియోధార్మికత ప్రభావాలను గుర్తించడం, నివారించడంతోపాటు అంతరిక్షంలో వ్యోమగాముల ఆహారం తదితర 18 అంశాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతలను వాడేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. రెండేళ్ల తరువాత జరిగే గగన్‌యాన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములు ఇప్పటికే రష్యాలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జాతీయస్థాయి పరిశోధన, విద్యా సంస్థలు కొత్త టెక్నాలజీల తయారీకి దరఖాస్తు చేసుకోవచ్చునని బెంగళూరులోని ఇస్రో కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 15వ తేదీలోగా తమ దరఖాస్తులు పంపాలని కోరింది. అంతరిక్షంలో మనిషి మనగలిగేందుకు కీలకమైన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యమని ఆ ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తుల పరిశీలన కోసం ఇస్రో ఒక కమిటీ ఏర్పాటు చేస్తుందని, శాస్త్రీయ ప్రయోజనాలు, అవసరం, సాంకేతికత, సాధ్యాసాధ్యాల వంటి అంశాల ప్రాతిపదికన టెక్నాలజీల ఎంపిక ఉంటుందని తెలిపింది. -
భారత్‌ను సమర్థించిన అమెరికా
వాషింగ్టన్: ఉపగ్రహాలను కూల్చివేయగల క్షిపణి సామర్థ్యాన్ని భారత్ సమకూర్చుకోవడాన్ని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ పేర్కొంది. అంతరిక్షంలో ఎదురయ్యే ప్రమాదాలపై భారత్ అప్రమత్తంగా ఉందని కితాబునిచ్చింది. మార్చి 27వ తేదీన భారత్ శాస్త్రవేత్తలు తక్కువ ఎత్తు కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని భూమి నుంచి ప్రయోగించిన క్షిపణితో ఢీకొట్టి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ శక్తి కలిగి ఉన్న అమెరికా, రష్యా, చైనా సరసన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. భారత్ ప్రయోగంపై అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ కమాండర్ జనరల్ జాన్ ఈ.హైటెన్ సెనేట్ కమిటీ ఎదుట ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు. ‘అంతరిక్షం నుంచి తమ దేశానికి ముప్పు పొంచి ఉందని భావించిన భారత్ ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగంతో తనను తాను రక్షించుకోగల సామర్థ్యం ఉందని ఆ దేశం భావిస్తోంది. భారత్ మన మిత్ర దేశం అయినందున, ఇలాంటి వాటిపై వ్యతిరేకంగా మాట్లాడలేం’ అని పేర్కొన్నారు. ‘అంతరిక్షాన్ని సురక్షితంగా మార్చేందుకు అంతర్జాతీయ సమాజం కొన్ని నిబంధనలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, ఆ శకలాల్లో అధిక భాగం అమెరికా కారణంగా ఏర్పడినవే’ అని తెలిపారు. ఏశాట్ ప్రయోగం కారణంగా అంతరిక్షంలో 400 శకలాలు ఏర్పడ్డాయని, వీటిలో 24 శకలాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు ముప్పుగా మారాయంటూ ఇటీవల నాసా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు జరిగాయన్నారు. (చదవండి: ‘శక్తి’మాన్ భారత్) -
సూపర్‌పవర్‌గా.. ‘శక్తి’భారత్
సాక్షి, న్యూఢిల్లీ: అంతరిక్షంలో సూపర్‌పవర్‌గా ఎదిగే దిశగా భారత్ మరో ‘శక్తి’మంతమైన ముందడుగేసింది. ఒడిషాలోని బాలాసోర్‌లో బుధవారం ఉదయం 11.16 గంటలకు, భారత్ తన ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రయోగంలో భూమి నుంచి 300 కి.మీల ఎత్తులోని ఒక ఉపగ్రహాన్ని కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే ఏశాట్ (శాటిలైట్ విధ్వంసక క్షిపణి) కూల్చివేసింది. ప్రయోగం సఫలమవడంతో ఉపగ్రహాలను కూల్చివేసే సత్తా సాధించిన నాలుగో దేశంగా అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. మిషన్ శక్తి పేరుతో చేపట్టిన ఈ ప్రయోగ వివరాలను ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ వెల్లడించారు. ‘ఏశాట్ సక్సెస్ భారత్‌ను భూ, జల, వాయు మార్గాల్లోనే గాక అంతరిక్షంలోనూ మన ప్రయోజనాల్ని కాపాడుకునే సామర్థ్యాన్ని పెంచింది. శాస్త్రవేత్తల్ని చూసి ప్రజలందరూ గర్వపడుతున్నారు. ఏశాట్ ప్రయోగం సందర్భంగా భారత్ ఎటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు, చట్టాల అతిక్రమణలకు పాల్పడలేదు. మేం ఏ దేశానికీ వ్యతిరేకం కాద’ని మోదీ తన ప్రసంగంలో తెలిపారు. (చదవండి : ‘శక్తి’మాన్ భారత్) ఏశాట్ ప్రయోగ విశేషాలు: - ఏశాట్ క్షిపణి తయారీలో 300 మంది డీఆర్డీవో శాస్త్రవేత్తలు, సిబ్బంది రాత్రింబవళ్లు చెమటోడ్చారు. - శత్రు క్షిపణులను క్షణాల్లో మట్టుపెట్టగల సత్తా ఏశాట్ సొంతం. - సెకనుకు 7.8 కి.మీ వేగంతో, ధ్వని కంటే 20సార్లు మించిన స్పీడుతో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాన్ని అంతే కచ్చితత్వంతో కూల్చడం. - పృథ్వీ క్షిపణిలో వాడిన సాంకేతికతను ఏశాట్ నిర్మాణంలో కొంతమేర వినియోగించారు. మనకన్నా ముందెవరు? - మిషన శక్తి పేరుతో భారత్ ప్రయోగించిన ఉపగ్రహ విధ్వంస క్షిపణి వ్యవస్థను అమెరికా చాలా సంవత్సరాల కిందే అభివృద్ధి చేసుకుంది. తొలిసారి 1959, అక్టోబర్‌లో బోల్డ్ ఒరియన్ పేరుతో ఆ దేశం ప్రయోగాలకు తెరదీసింది. 1985లో ఏఎస్ఎమ్-135 పేరుతో అమెరికా మరోసారి ఈ తరహా ప్రయోగం చేసింది. - రష్యా 1950లోనే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి వ్యవస్థకు సంబంధించిన పరిశోధనను శ్రీకారం చుట్టింది. 1963లో పాలియట్ రాకెట్ సహాయంతో రష్యా ఏశాట్ ప్రయోగం చేసింది. - చైనా ఏశాట్ ప్రయోగాన్ని జనవరి, 2007లో నిర్వహించింది. 2005, జూలై 7.. 2006, ఫిబ్రవరి 6లో రెండు విఫల ప్రయోగాల తర్వాత చైనా 2007లో విజయం సాధించింది. -
గగన్‌యాన్ @ 10వేల కోట్లు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించిన ‘గగన్‌యాన్ ప్రాజెక్టు’కు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. రూ.10,000 కోట్ల బడ్జెట్‌తో చేపట్టనున్న ఈ ప్రయోగంలో భాగంగా ముగ్గురు వ్యోమగాముల బృందం అంతరిక్షంలో కనీసం వారంరోజుల పాటు గడపనుంది. ప్రాజెక్టులో భాగంగా తొలుత పూర్తి సన్నద్ధతతో ఉన్న రెండు మానవరహిత వాహకనౌకలను ప్రయోగిస్తారు. చివరగా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతారు. అన్నిరంగాల భాగస్వామ్యం ‘శక్తిమంతమైన జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా వ్యోమగాముల మాడ్యూల్‌ను అంతరిక్షంలోని భూదిగువ కక్ష్యలోకి ప్రయోగిస్తాం. ఈ మిషన్ సందర్భంగా ముగ్గురు వ్యోమగాములకు దాదాపు వారం పాటు కావాల్సిన అన్ని వస్తువులు ఈ మాడ్యుల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే సిబ్బంది శిక్షణ, ఫ్లైట్ సిస్టమ్‌తో పాటు మౌలిక వసతుల అభివృద్ధిని గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా చేపడతాం. ఇందుకోసం పలు జాతీయ సంస్థలతో పాటు ల్యాబొరేటరీలు, విద్యావేత్తలు, పారిశ్రామికవర్గాలతో కలిసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) పనిచేస్తుంది. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం కేటాయించిన రూ.10,000 కోట్లతో ఫ్లైట్ హార్డ్‌వేర్, అవసరమైన టెక్నాలజీ అభివృద్ధితో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రయోగం వల్ల అత్యాధునిక టెక్నాలజీ విభాగంలో ఉద్యోగ కల్పనతో పాటు సుశిక్షితులైన మానవవనరులను తయారుచేయడం వీలవుతుంది. గగన్‌యాన్ ద్వారా విద్యార్థులు స్ఫూర్తి పొంది సైన్స్, టెక్నాలజీ రంగాన్ని తమ వృత్తిగా ఎంపికచేసుకుంటే దేశ నిర్మాణంలో వాళ్లంతా భాగస్వాములు అవుతారు’ అని కేంద్రం తెలిపింది. ముచ్చటగా 3 ప్రయోగాలు ‘ఆమోదం పొందిన నాటి నుంచి 40 నెలల్లోగా మానవసహిత అంతరిక్ష యాత్రను చేపట్టాల్సి ఉంటుంది. అంతకంటే ముందు పూర్తిస్థాయిలో సిద్ధమైన రెండు మానవరహిత అంతరిక్ష వాహకనౌకలను ప్రయోగించి మిషన్ సన్నద్ధతను శాస్త్రవేత్తలు పరీక్షిస్తారు. తద్వారా మిషన్ ఏర్పాట్లు, సన్నద్ధత, టెక్నాలజీ పనితీరును అర్థం చేసుకుంటారు. చివరగా ముగ్గురు వ్యోమగాములను జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపుతారు. ఈ ప్రయోగం వల్ల భారత్‌లో వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక భద్రత, కాలుష్యం, వ్యర్థాల నియంత్రణ, నీరు–ఆహారభద్రత రంగాలకు ఊపు లభిస్తుంది’ అని కేంద్రం వెల్లడించింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ.. గగన్‌యాన్ ప్రయోగం వల్ల భారత్‌లో 15,000 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రయోగంలో వినియోగించే శక్తిమంతమైన జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌకను ఇస్రో ఇప్పటికే అభివృద్ధి చేసింది. అలాగే వ్యోమగాములు అంతరిక్షంలో విహరించేం దుకు అవసరమైన మాడ్యూల్‌ను, ప్రయోగం సందర్భంగా ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే ‘క్రూ ఎగ్జిట్ సిస్టమ్’ను శాస్త్రవేత్తలు ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. అంతేకాకుండా వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్‌ను, మాడ్యుల్లోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను కూడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి పరీక్షించారు. 2022 లేదా అంతకంటే ముందే ఓ భారతీయుడిని సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపుతామని 2018, ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే 2022 నాటికి లేదా అంతకంటే ముందే ఈ దేశపు యువతి లేదా యువకుడు అంతరిక్షంలోకి త్రివర్ణ పతాకంతో వెళతారని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్–1(2008), మంగళ్యాన్(2014) వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల తర్వాత ఇస్రో చేపడుతున్న కీలకమైన ప్రయోగం ఇదే కావడం గమనార్హం. శ్రీహరికోట నుంచి ప్రయోగం భారత్ రూ.10,000 కోట్ల వ్యయంతో 2022 నాటికల్లా మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ను చేపట్టనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనాల తర్వాత సొంత పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి మానవుడిని విజయవంతంగా పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ► నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ► ప్రయోగంలో సాంకేతిక సాయం కోసం రష్యా, ఫ్రాన్స్‌లతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ► సంస్కృత పదం వ్యోమ్(అంటే అంతరిక్షం అని అర్థం) ఆధారంగా అంతరిక్షంలోకి వెళ్లే భారతీయులను ‘వ్యోమ్‌నాట్స్’ అని వ్యవహరిస్తారు. ► గగన్‌యాన్ కోసం అవసరమైన కీలక సాంకేతికతల అభివృద్ధికి ఇస్రో ఇప్పటివరకూ రూ.173 కోట్లు ఖర్చుపెట్టింది. అంతరిక్ష యాత్రను చేపట్టాలని 2008లో ఆలోచన చేసినప్పటికీ ఆర్థిక కారణాలు, రాకెట్ ప్రయోగాల వైఫల్యంతో ఇస్రో వెనక్కితగ్గాల్సి వచ్చింది. ► 2007లో ఇస్రో ‘రీ ఎంట్రీ టెక్నాలజీ’ని పరీక్షించింది. ఇందులో భాగంగా అంతరిక్షంలో 550 కేజీల బరువున్న ఉపగ్రహాన్ని పంపి సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చింది. ఇందుకోసం భారీ ఉష్ణోగ్రతను సైతం తట్టుకునే తేలికపాటి, దృఢమైన సిలికాన్ పొరలను వాడారు. ► వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే మాడ్యుల్‌ను జీఎస్ఎల్వీ మార్క్–3 ద్వారా ఇస్రో 2014లో ప్రయోగించింది. దాదాపు 3,745 కేజీల బరువున్న ఈ మాడ్యూల్ అంతరిక్షంలోకి వెళ్లి బంగాళాఖాతంలో విజయవంతంగా దిగింది. -
నేడే సోలార్ మిషన్
టాంపా: భగభగ మండే సూర్యుడి ఆవరణం గుట్టువిప్పే తొలి అంతరిక్ష ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. పార్కర్ సోలార్ ప్రోబ్ అనే భారీ వాహక నౌకను నింగిలోకి పంపేందుకు నాసా పూర్తి ఏర్పాట్లు చేసింది. శనివారం వేకువజామున ఫ్లోరిడా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం ప్రారంభమైంది. సూర్యుడి చుట్టూ ఉండే కరోనా పొర రహస్యాలను ఛేదించడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని నాసా ప్రకటించింది. సౌర పవనాల్లో ఏర్పడే అలజడులు భూమిపై ఎప్పుడు, ఎలా ప్రభావం చూపుతాయో అంచనావేయడానికి ఈ ప్రయోగం దోహదపడుతుందని తెలిపింది. సూర్యుడికి సమీపంగా వెళ్లిన తరువాత పార్కర్ గంటకు 7 లక్షల కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. -
నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి
హూస్టన్: నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగా నికి ఎంపికైన 12 మంది వ్యోమగాముల్లో భారత్ సంతతికి చెందిన యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేస్తున్న రాజాచారి(39) చోటు దక్కించుకున్నారు. ఎర్త్ ఆర్బిట్ అండ్ డీప్ స్పేస్ మిషన్ల కోసం నాసా గతంలో దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికోసం రికార్డు స్థాయిలో 18,300 మంది దరఖాస్తు చేసుకోగా .. వీరిలో 12 మందిని నాసా ఎంపిక చేసింది. ప్రస్తుతం అయోవా రాష్ట్రంలోని వాటర్లూ నగరంలో నివసిస్తున్న రాజాచారీ మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్ డిగ్రీ, అమెరికాలోని నావెల్ టెస్ట్ పైలట్ స్కూల్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్రస్తు తం ఆయన 461 ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్‌లో కమాండర్‌గా, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఉన్న ఎఫ్–35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు.