జాన్ ఈ.హైటెన్
వాషింగ్టన్: ఉపగ్రహాలను కూల్చివేయగల క్షిపణి సామర్థ్యాన్ని భారత్ సమకూర్చుకోవడాన్ని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ పేర్కొంది. అంతరిక్షంలో ఎదురయ్యే ప్రమాదాలపై భారత్ అప్రమత్తంగా ఉందని కితాబునిచ్చింది. మార్చి 27వ తేదీన భారత్ శాస్త్రవేత్తలు తక్కువ ఎత్తు కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని భూమి నుంచి ప్రయోగించిన క్షిపణితో ఢీకొట్టి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ శక్తి కలిగి ఉన్న అమెరికా, రష్యా, చైనా సరసన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. భారత్ ప్రయోగంపై అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ కమాండర్ జనరల్ జాన్ ఈ.హైటెన్ సెనేట్ కమిటీ ఎదుట ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు.
‘అంతరిక్షం నుంచి తమ దేశానికి ముప్పు పొంచి ఉందని భావించిన భారత్ ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగంతో తనను తాను రక్షించుకోగల సామర్థ్యం ఉందని ఆ దేశం భావిస్తోంది. భారత్ మన మిత్ర దేశం అయినందున, ఇలాంటి వాటిపై వ్యతిరేకంగా మాట్లాడలేం’ అని పేర్కొన్నారు. ‘అంతరిక్షాన్ని సురక్షితంగా మార్చేందుకు అంతర్జాతీయ సమాజం కొన్ని నిబంధనలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, ఆ శకలాల్లో అధిక భాగం అమెరికా కారణంగా ఏర్పడినవే’ అని తెలిపారు. ఏశాట్ ప్రయోగం కారణంగా అంతరిక్షంలో 400 శకలాలు ఏర్పడ్డాయని, వీటిలో 24 శకలాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు ముప్పుగా మారాయంటూ ఇటీవల నాసా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు జరిగాయన్నారు. (చదవండి: ‘శక్తి’మాన్ భారత్)
Comments
Please login to add a commentAdd a comment