నింగికి దూసుకెళ్తున్న ఉపగ్రహ విధ్వంసక క్షిపణి
సాక్షి, న్యూఢిల్లీ: అంతరిక్షంలో సూపర్‌పవర్‌గా ఎదిగే దిశగా భారత్ మరో ‘శక్తి’మంతమైన ముందడుగేసింది. ఒడిషాలోని బాలాసోర్‌లో బుధవారం ఉదయం 11.16 గంటలకు, భారత్ తన ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రయోగంలో భూమి నుంచి 300 కి.మీల ఎత్తులోని ఒక ఉపగ్రహాన్ని కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే ఏశాట్ (శాటిలైట్ విధ్వంసక క్షిపణి) కూల్చివేసింది. ప్రయోగం సఫలమవడంతో ఉపగ్రహాలను కూల్చివేసే సత్తా సాధించిన నాలుగో దేశంగా అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది.
మిషన్ శక్తి పేరుతో చేపట్టిన ఈ ప్రయోగ వివరాలను ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ వెల్లడించారు. ‘ఏశాట్ సక్సెస్ భారత్‌ను భూ, జల, వాయు మార్గాల్లోనే గాక అంతరిక్షంలోనూ మన ప్రయోజనాల్ని కాపాడుకునే సామర్థ్యాన్ని పెంచింది. శాస్త్రవేత్తల్ని చూసి ప్రజలందరూ గర్వపడుతున్నారు. ఏశాట్ ప్రయోగం సందర్భంగా భారత్ ఎటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు, చట్టాల అతిక్రమణలకు పాల్పడలేదు. మేం ఏ దేశానికీ వ్యతిరేకం కాద’ని మోదీ తన ప్రసంగంలో తెలిపారు.
(చదవండి : ‘శక్తి’మాన్ భారత్)
ఏశాట్ ప్రయోగ విశేషాలు:
- ఏశాట్ క్షిపణి తయారీలో 300 మంది డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, సిబ్బంది రాత్రింబవళ్లు చెమటోడ్చారు.
- శత్రు క్షిపణులను క్షణాల్లో మట్టుపెట్టగల సత్తా ఏశాట్ సొంతం.
- సెకనుకు 7.8 కి.మీ వేగంతో, ధ్వని కంటే 20సార్లు మించిన స్పీడుతో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాన్ని అంతే కచ్చితత్వంతో కూల్చడం.
- పృథ్వీ క్షిపణిలో వాడిన సాంకేతికతను ఏశాట్ నిర్మాణంలో కొంతమేర వినియోగించారు.
మనకన్నా ముందెవరు?
- మిషన శక్తి పేరుతో భారత్ ప్రయోగించిన ఉపగ్రహ విధ్వంస క్షిపణి వ్యవస్థను అమెరికా చాలా సంవత్సరాల కిందే అభివృద్ధి చేసుకుంది. తొలిసారి 1959, అక్టోబర్‌లో బోల్డ్ ఒరియన్ పేరుతో ఆ దేశం ప్రయోగాలకు తెరదీసింది. 1985లో ఏఎస్‌ఎమ్-135 పేరుతో అమెరికా మరోసారి ఈ తరహా ప్రయోగం చేసింది.
- రష్యా 1950లోనే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి వ్యవస్థకు సంబంధించిన పరిశోధనను శ్రీకారం చుట్టింది. 1963లో పాలియట్ రాకెట్ సహాయంతో రష్యా ఏశాట్ ప్రయోగం చేసింది.
- చైనా ఏశాట్ ప్రయోగాన్ని జనవరి, 2007లో నిర్వహించింది. 2005, జూలై 7.. 2006, ఫిబ్రవరి 6లో రెండు విఫల ప్రయోగాల తర్వాత చైనా 2007లో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment