రికవరీ థెర్మ్‌క్యూబ్, హైడ్రోజన్ కారు, ఈ–విమానం
నిత్య జీవితంలో.. టెక్నాలజీ పరంగా నూతన మార్పులు సంభవిస్తున్నాయి. మానవ అన్నీ అవసరాలను తీర్చిదిద్దేలాగా ఈ టెక్నాటజీ వృద్ధి చెందుతుంది. విద్య, వైద్య, ఉద్యోగాలలోనూ దీని అవసరం మరెంతగానో ఉండేలా కాలం మారుతుంది. అందుకు అనుగుణంగానే ఈ సరికొత్త పరికరాలు మీ ముందుకొచ్చాయి. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఇది కట్టుకుంటే నొప్పులు మాయం..
జిమ్‌లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్‌మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్‌క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్‌లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్‌ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ధర 149 డాలర్లు (రూ.12,350) మాత్రమే!
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కారు..
జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ ‘హోండా’ తాజాగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే కారును రూపొందించింది. హోండా మోడల్స్‌లోని ‘సీఆర్–వి’ మోడల్ ఎస్‌యూవీకి అవసరమైన మార్పులు చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచేలా ‘సీఆర్‌వీ: ఈఎఫ్‌సీఈవీ’ మోడల్‌కు రూపకల్పన చేసింది. ఇందులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్ తయారీకి మరో కార్ల తయారీ సంస్థ ‘జనరల్ మోటార్స్’ సహకారం తీసుకుంది.
ఇందులో అమర్చిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్‌లోని 110 వోల్టుల పవర్ ఔట్‌లెట్ ద్వారా ఇంజిన్‌కు దాదాపు 1500 వాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకున్నట్లయితే, ఇది ఏకంగా 435 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారును హోండా మోటార్స్ వచ్చే ఏడాది నాటికి మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.
బ్యాటరీతో నడిచే ఈ–విమానం
ఇది బ్యాటరీతో నడిచే ఈ–విమానం నమూనా. ఇది అందుబాటులోకి వస్తే, విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్లపైకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఈ విమానం కూడా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. డచ్ విమానాల తయారీ కంపెనీ ‘ఎలీసియన్’ ఈ బ్యాటరీ విమానం నమూనాకు ఇటీవల రూపకల్పన చేసింది.
‘ఎలీసియన్–ఈ9ఎక్స్’ పేరుతో రూపొందించిన ఈ విమానం 2033 నాటికి అందుబాటులోకి రానున్నట్లు ‘ఎలీసియన్’ కంపెనీ ప్రకటించింది. సాధారణ విమానాల కంటే చాలా తక్కువ బరువుతో రూపొందించిన ఈ విమానం వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 90 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది.
ఇవి చదవండి: వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు!
Comments
Please login to add a commentAdd a comment