మారుతున్న టెక్నాలజీ పరంగా.. మానవ అవసరాలను, ఆరోగ్య సమస్యలను తీర్చే సరికొత్త టెక్నాలజీ పరికరాలు కూడా చాలానే వస్తున్నాయి. అందులో ఎన్నోరకాల పరికరాలను చూసుంటాం. మోకాళ్ల నొప్పులను, వినికడి లోపాలను సరిచేసేటువంటి వీటిని మీరెప్పుడైనా వాడటంగానీ, చూడటంగానీ చేశారా..! అవేంటో మరి చూద్దామా..
మోకాలి నొప్పులకు చెక్!
ఆటలాడేటప్పుడు గాయాలు కావడం వల్ల కొందరు మోకాలి నొప్పుల బారినపడుతుంటారు. ఇంకొందరు కీళ్ల అరుగుదల వల్ల మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. నొప్పులు తగ్గడానికి రకరకాల మందులు వాడుతుంటారు. కాపడాలు పెట్టించుకుంటుంటారు. వీటి వల్ల వచ్చే ఉపశమనం అంతంత మాత్రమే! మోకాలి నొప్పుల నుంచి సత్వర ఉపశమనం కలిగించేందుకు అమెరికన్ కంపెనీ ‘నీ ఫ్లో’ హెల్మెట్ ఆకారంలో ఉన్న ఈ మసాజర్‌ను రూపొందించింది.
ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. మోకాలికి దీనిని బిగించి కట్టుకుని, దీనికి ఉన్న స్విచ్‌ను ఆన్ చేసుకుంటే చాలు– దీని లోపలి వైపు నుంచి కాంతి, వేడి వెలువడటమే కాకుండా, లయబద్ధంగా వెలువడే ప్రకంపనలు మోకాలి కీళ్లకు కండరాలకు మర్దన చేస్తాయి. దీని వల్ల వాపు, నొప్పి ఉన్న భాగాల్లో రక్తప్రసరణ మెరుగుపడి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే కీళ్ల కదలికలు త్వరగా చురుకుదనాన్ని పుంజుకుంటాయి. ‘నీ ఫ్లో’ మసాజర్ మోకాలి ఉపరితలానికి మాత్రమే కాకుండా, లోపలి భాగాలకు కూడా ఫిజియో థెరపీ అందిస్తుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,775) మాత్రమే!
కళ్లకు జోడు.. చెవులకు తోడు..
ఇది కళ్లజోడులా కనిపిస్తుంది. అలాగని కేవలం కళ్లజోడు మాత్రమే కాదు, వినికిడి సమస్యలు ఉన్నవారి చెవులకు తోడు కూడా. అంటే, ఇది స్పెక్టకిల్ కమ్ హియరింగ్ ఎయిడ్ అన్నమాట! జర్మన్ కంపెనీ ‘ఆడియా అకాస్టిక్’ ఈ స్పెక్టకిల్ కమ్ హియరింగ్ ఎయిడ్‌ను ‘బ్రకాఫ్’ బ్రాండ్ పేరుతో ‘స్పెక్టకిల్ ఎయిడ్’గా రూపొందించింది.
దృష్టి లోపాలు, వినికిడి సమస్యలు రెండూ ఉన్నవారికి ఇదొక వరమనే చెప్పాలి. ఇందులోని కళ్లద్దాలు దృష్టిని స్పష్టం చేస్తాయి. కళ్లజోడు చెవులకు పెట్టుకునే భాగంలో చివరివైపు ఉన్న హియరింగ్ ఎయిడ్ శబ్దాలను స్పష్టంగా వినేందుకు దోహదపడుతుంది. మిగిలిన హియరింగ్ ఎయిడ్ పరికరాల మాదిరిగా దీనిని చెవి లోపల పెట్టుకోనవసరం లేదు. మామూలు కళ్లజోడు తొడుక్కున్నట్లే పెట్టుకుంటే సరిపోతుంది.
దృష్టి లోపాలు లేకుండా వినికిడి సమస్యలు మాత్రమే ఉన్నవారు జీరో పవర్ గ్లాసెస్‌తో తీసుకుని, దీనిని తొడుక్కుంటే చాలు. కోరుకున్నంత ధ్వనిలో శబ్దాన్ని వినేందుకు వీలుగా ఇందులో అడ్జస్ట్‌మెంట్స్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. దీని ధర 495 పౌండ్ల (రూ. 51,593) నుంచి ప్రారంభం. ఎంపిక చేసుకున్న ఫ్రేమ్ మోడల్స్ బట్టి కొంత ఎక్కువ కూడా ఉంటుంది.
ఇవి చదవండి: ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment