నిదానమే ప్రధానం అంటారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతీ సెకను ఎంతో విలువైనది. సమయాన్ని వీలైనంత ఆదా చేసి.. త్వరగా గమ్యాన్ని చేరుకోవడానికే అందరూ ప్రాధాన్యమిస్తున్నారు. సమయాన్ని ఆదా చేయడంలో ప్రయాణ సాధనాలు ప్రముఖమైనవి. ఇప్పటివరకున్న మన ప్రయాణ సాధనాలైన బస్సు గంటకు 100–120 కి.మీ., అయస్కాంతాలపై నడిచే రైళ్లు 400–500 కి.మీ., విమానం 1,000–1,300 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయి. ప్రస్తుతం పరిశోధన దశల్లో ఉన్న హైపర్‌లూప్ స్పీడూ కొంచెం అటు ఇటుగా విమానంతో సమానం..! మరీ ఇంతకంటే వేగంగా వెళ్లాలని మనం ఎంతగా అనుకున్నా మార్గం మాత్రం లేదు! అయితే ఇది ఇప్పటి పరిస్థితి.. భవిష్యత్‌లో గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సరికొత్త విమానాలు వచ్చేస్తాయి!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
అంత వేగం..సాధ్యమేనా?
గంటకు 6 వేల కిలోమీటర్ల వేగమంటే.. హైదరాబాద్ నుంచి న్యూయార్క్ చేరేందుకు 2 గంటల సమయం. తూర్పు వైపున ఉన్న మెల్‌బోర్న్ వెళ్లాలంటే గంటన్నర. అబ్బో.. అంతవేగం సాధ్యమేనా? భేషుగ్గా సాధ్యమే అంటోంది యూకే అంతరిక్ష పరిశోధన సంస్థ. కాకపోతే విమానాల్లో సినర్జిటిక్ ఎయిర్ బ్రీతింగ్ రాకెట్ ఇంజిన్.. క్లుప్తంగా సేబర్ ఇంజిన్ వాడాల్సి ఉంటుంది. వీటిని ఆక్స్‌ఫర్డ్ షైర్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ‘రియాక్షన్ ఇంజిన్స్’ తయారు చేస్తోంది. ఈ ఇంజిన్లు అమర్చిన విమానాలు ధ్వనికి సుమారు 5.5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి. కచి్చతంగా చెప్పాలంటే గంటకు 4,143 మైళ్లు లేదా.. గంటకు 6,667.512 కి.మీ.ల వేగమన్నమాట!
ఉపగ్రహాల ప్రయోగానికీ..
సేబర్ ఇంజిన్‌తో కూడిన విమానాలు ప్రయాణికుల కోసమే కాకుండా.. ఉపగ్రహ ప్రయోగాలకూ వాడుకోవచ్చని ‘రియాక్షన్’కు చెందిన షాన్ డ్రిస్కాల్ చెబుతున్నారు. రన్ వేపై టేకాఫ్ తీసుకోవడం.. నేరుగా అంతరిక్షంలోకి వెళ్లి.. ఉపగ్రహాన్ని విడుదల చేసి వెనక్కు వచ్చేయొచ్చని వివరించారు. సేబర్ ఇంజిన్ అభివృద్ధి కోసం యూకే ప్రభుత్వం ఇప్పటికే సుమారు 6 కోట్ల పౌండ్ల నిధులు అందించిందని, బోయింగ్, రోల్స్ రాయిస్, బీఏఈ సిస్టమ్స్ వంటి ప్రైవేట్ కంపెనీలూ పెట్టుబడులు పెట్టాయని షాన్ తెలిపారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్‌పోర్ట్ కార్న్‌వాల్ నుంచి ఈ సేబర్ ఇంజిన్ ఆధారిత విమానాలు టేకాఫ్ తీసుకోవచ్చునని అంచనా. 2021లో ఈ హైటెక్ విమానాశ్రయం సిద్ధం కానుండగా.. సేబర్ విమానాలు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో పదేళ్లు పట్టే అవకాశముంది.
సేబర్ ఇంజిన్ల ప్రత్యేకత?
విమానం వేగం పెరిగే కొద్దీ ఇం జిన్ వేడెక్కిపోతూ ఉంటుంది. గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు ఇంజిన్ లోపలి భాగాలు కరిగిపోయేంత వేడి పుడుతుంది. ఈ సమస్యను రియా క్షన్ శాస్త్రవేత్తలు అధిగమించగలిగారు. ద్రవ హీలియంను వాడటం ద్వారా ఇంజిన్‌లోకి వచ్చే గాలి వేడిని 1,000 డిగ్రీల సెల్సియస్ నుంచి –150 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిం చగలిగారు. గాల్లోని తేమ మంచు ముక్కలుగా మారకుండా సెకనులో వం దో వంతులోనే చల్లబరచడం విశేషం. కొన్ని రోజులు మాత్రమే పనిచేసి మళ్లీ మూలనపడ్డ కాన్‌క్రోడ్ విమాన సర్వీసు గుర్తుందా? అది కూడా వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేదే.
ఇంజిన్ వేడిని తగ్గించేందుకు నేరుగా గాలిని వాడే వారు. సేబర్ ఇంజిన్లలో హైడ్రోజన్‌ను కూడా ఇంధనంగా వాడవచ్చు. ఫలితం గా విమానం ద్వారా కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. ప్రస్తుత విమానాలను సేబర్ ఇంజిన్లతో నడపవచ్చని, అవి కాన్‌క్రోడ్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలవని యూకే స్పేస్ ఏజెన్సీకి చెందిన గ్రాహం టర్నాక్ అంటున్నారు. సాధారణ విమానాలు 35 వేల అడుగుల ఎత్తులో ఎగిరితే కొత్త రకం ఇంజిన్ల విమానాలు 92 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment