ఆకాశానికి నిచ్చెన వేయటం అనే మాటను మనం చాలా సార్లు యాథాలాపంగా వాడుతూంటాం. ఇప్పుడు జపాన్ దేశం అదే అంశంపై దృష్టి పెట్టింది. అంతరిక్షానికి ఎలివేటర్ నిర్మించే సన్నాహాల్లో ఉంది. అదీ అక్షరాలా వంద బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో. ఈ ఎలివేటర్ ఎలా నిర్మిస్తారు? అసలు అది ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానం మీకక్కరలేదు. ఎయిరో స్పేస్ అన్వేషణలో జపాన్ అగ్రగామిగా ఉంది. అలాగే రోబొటిక్స్, బయోమెడికల్ రీసెర్చి, నేచురల్ సైన్స్ విభాగంలో గ్లోబల్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. ఆ దేశానికి చెందిన ఒబాయషీ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థ ఎలివేటర్ నిర్మాణ బాధ్యతను స్వీకరించింది. దానివల్ల ఒనగూడే ప్రయోజనాలను ఆ సంస్థ ప్రకటించింది.
‘భూవాతావరణం నుంచి రికార్డు వేగంతో మనుషులను అంతరిక్షంలోకి పంపవచ్చు. అంగారక గ్రహం మీదకు వెళ్లటానికి ఇప్పటి మాదిరిగా ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం అక్కరలేదు. కేవలం 40 రోజుల్లోనే అక్కడకు చేరగలుగుతామని సంస్థ చెబుతోంది. ఇంత పెద్ద భారీ నిర్మాణం చేపట్టటానికి తగినంత స్టీల్ అందుబాటులో లేదు. పైగా వాతావరణంలో ఒత్తిళ్లను తట్టుకోగలిగినంత దృఢత్వం ఉన్న మెటీరియల్ అవసరం అవుతుంది.
అందుకే ఒబాయాషీ కార్పొరేషన్ ‘కార్బన్ నానో ట్యూబ్’ లను ఎంచుకుంది. అవి చుట్టచుట్టిన గ్రాఫైట్ లేయర్లు. స్టీలు కంటే గ్రాఫైట్ లేయర్లు తక్కువ బరువు ఉంటాయి. అవి విరిగిపోయే అవకాశాలు తక్కువ. కార్బన్ నానో ట్యూబ్‌ల వ్యాసం మీటరులో బిలియన్ వంతు ఉంటుంది. ఇంత వరకూ ఎవరూ కూడా రెండడుగుల కంటే పెద్ద నానో ట్యూబ్‌ను రూపొందించలేదు. ఇప్పుడు నానో ట్యూబ్‌ల ఆధారంగానే ఎలివేటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.
ఎలివేటర్‌లో నానో ట్యూబ్ 60 వేల మైళ్ల పొడవున ఉంటుంది. వీల్ లిఫ్ట్‌ల ద్వారా అది మనుషులను, సామగ్రిని రవాణా చేయగలుగుతుంది. వాటిని ‘క్లైంబర్స్’గా పిలుస్తారు. భూమి నుంచి 22 వేల మైళ్ల ఎత్తులో స్పేస్ షిప్‌కు కార్బో నానో ట్యూబ్‌ను అమరుస్తారు. థ్రస్టర్ దాని కొసకు జోడించబడుతుంది. అదే సమయంలో స్పేస్ షిప్ భూమికి దూరంగా జరుగుతుంది. సంస్థ వేస్తున్న అంచనాల ప్రకారం ఎనిమిది నెలల తర్వాత కార్బన్ నానోట్యూబ్ భూమి ఉపరితలానికి చేరుతుంది.
అదే సమయంలో స్పేస్ షిప్ తన తుది గమ్యం 60 వేల మైళ్లకు చేరుకుంటుంది. అది ట్యూబ్‌కి కౌంటర్ వైట్‌గా ఉపయోగపడుతుంది. ఈ ట్యూబ్ ద్వారా పైకి వెళ్లి కేబుళ్లతో బలోపేతం చేస్తారు. ఇందుకోసం ముందుగా ‘లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్‌ఈఓ)లో స్పేస్ షిప్ నిర్మిస్తారు. ఇందుకోసం రాకెట్ల ద్వారా నిర్మాణ సామగ్రి పంపుతారు. అక్కడ నుంచి స్పేస్ షిప్ ఎలక్ట్రికల్ ప్రొపల్షన్లను ఉపయోగించుకుని కదులుతుంది. జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (జీఈఓ)కు చేరే వరకూ అది కొనసాగుతుంది.
భూమి మీద ఎర్త్ పోర్టును రెండు భాగాలుగా నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకటి ఈక్వేటర్ దగ్గర, మరొకటి సముద్రం దగ్గర. ఈ రెండూ సముద్రం దిగువన టన్నెల్‌తో అనుసంధానమయి ఉంటాయి. ఎర్త్ పోర్ట్ నుంచి పైకి పాకేవాళ్లు సుమారు గంటకు 93 మైళ్ల వేగంతో కార్బో నానో ట్యూబ్ అధిరోహిస్తారు. వాళ్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని రెండున్నర గంటల్లో చేరతారని సంస్థ ప్రకటించింది.
జపాన్ సంస్థ చెబుతున్న దాని ప్రకారం, ఇప్పుడు అంతరిక్షంలో ప్రయోగాలకు పెడుతున్న ఖర్చులతో పోలిస్తే, దీనివల్ల తక్కువ ఖర్చవుతుంది. అలాగే ఇందులో ఇంధన వినియోగం లేదు. ఇదంతా సౌరశక్తి ఆధారంగా సాగుతుంది. భారీగా సోలార్ ప్యానళ్లతో జియో స్టేషన్ నిర్మిస్తారు. మానవుల పరంగా కానీ, వాతావారణ పరంగా కానీ ఎలివేటర్లకు ఉండే ముప్పుల గురించి సంస్థ ఇంకా అధ్యయనం చేపట్టలేదు.
ముందుగా అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది అంటే 2025లో ప్రారంభం కావాలి. ప్రస్తుతం ఆర్ అండ్ బీ పైనా, పార్ట్‌నర్‌షిప్ బిల్డింగ్, ప్రమోషన్లపైనా దృష్టి పెట్టారు. ఇందుకు మరికొంత జాప్యమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక రోజున మానవాళి ఈ ఎలివేటర్ ద్వారా అంతరిక్షంలోకి అడుగు పెడుతుంది. అందుకు జపాన్‌ను మనం తప్పకుండా అభినందించి తీరాలి.
డా‘‘ పార్థసారథి చిరువోలు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
నిజంగానే ఆకాశానికి నిచ్చెన!
Published Fri, Jun 28 2024 12:14 AM | Last Updated on Fri, Jun 28 2024 6:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment