space ship
-
నిజంగానే ఆకాశానికి నిచ్చెన!
ఆకాశానికి నిచ్చెన వేయటం అనే మాటను మనం చాలా సార్లు యాథాలాపంగా వాడుతూంటాం. ఇప్పుడు జపాన్ దేశం అదే అంశంపై దృష్టి పెట్టింది. అంతరిక్షానికి ఎలివేటర్ నిర్మించే సన్నాహాల్లో ఉంది. అదీ అక్షరాలా వంద బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో. ఈ ఎలివేటర్ ఎలా నిర్మిస్తారు? అసలు అది ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానం మీకక్కరలేదు. ఎయిరో స్పేస్ అన్వేషణలో జపాన్ అగ్రగామిగా ఉంది. అలాగే రోబొటిక్స్, బయోమెడికల్ రీసెర్చి, నేచురల్ సైన్స్ విభాగంలో గ్లోబల్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. ఆ దేశానికి చెందిన ఒబాయషీ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థ ఎలివేటర్ నిర్మాణ బాధ్యతను స్వీకరించింది. దానివల్ల ఒనగూడే ప్రయోజనాలను ఆ సంస్థ ప్రకటించింది. ‘భూవాతావరణం నుంచి రికార్డు వేగంతో మనుషులను అంతరిక్షంలోకి పంపవచ్చు. అంగారక గ్రహం మీదకు వెళ్లటానికి ఇప్పటి మాదిరిగా ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం అక్కరలేదు. కేవలం 40 రోజుల్లోనే అక్కడకు చేరగలుగుతామని సంస్థ చెబుతోంది. ఇంత పెద్ద భారీ నిర్మాణం చేపట్టటానికి తగినంత స్టీల్ అందుబాటులో లేదు. పైగా వాతావరణంలో ఒత్తిళ్లను తట్టుకోగలిగినంత దృఢత్వం ఉన్న మెటీరియల్ అవసరం అవుతుంది. అందుకే ఒబాయాషీ కార్పొరేషన్ ‘కార్బన్ నానో ట్యూబ్’ లను ఎంచుకుంది. అవి చుట్టచుట్టిన గ్రాఫైట్ లేయర్లు. స్టీలు కంటే గ్రాఫైట్ లేయర్లు తక్కువ బరువు ఉంటాయి. అవి విరిగిపోయే అవకాశాలు తక్కువ. కార్బన్ నానో ట్యూబ్‌ల వ్యాసం మీటరులో బిలియన్ వంతు ఉంటుంది. ఇంత వరకూ ఎవరూ కూడా రెండడుగుల కంటే పెద్ద నానో ట్యూబ్‌ను రూపొందించలేదు. ఇప్పుడు నానో ట్యూబ్‌ల ఆధారంగానే ఎలివేటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.ఎలివేటర్లో నానో ట్యూబ్ 60 వేల మైళ్ల పొడవున ఉంటుంది. వీల్ లిఫ్ట్‌ల ద్వారా అది మనుషులను, సామగ్రిని రవాణా చేయగలుగుతుంది. వాటిని ‘క్లైంబర్స్’గా పిలుస్తారు. భూమి నుంచి 22 వేల మైళ్ల ఎత్తులో స్పేస్ షిప్‌కు కార్బో నానో ట్యూబ్‌ను అమరుస్తారు. థ్రస్టర్ దాని కొసకు జోడించబడుతుంది. అదే సమయంలో స్పేస్ షిప్ భూమికి దూరంగా జరుగుతుంది. సంస్థ వేస్తున్న అంచనాల ప్రకారం ఎనిమిది నెలల తర్వాత కార్బన్ నానోట్యూబ్ భూమి ఉపరితలానికి చేరుతుంది. అదే సమయంలో స్పేస్ షిప్ తన తుది గమ్యం 60 వేల మైళ్లకు చేరుకుంటుంది. అది ట్యూబ్‌కి కౌంటర్ వైట్‌గా ఉపయోగపడుతుంది. ఈ ట్యూబ్ ద్వారా పైకి వెళ్లి కేబుళ్లతో బలోపేతం చేస్తారు. ఇందుకోసం ముందుగా ‘లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్ఈఓ)లో స్పేస్ షిప్ నిర్మిస్తారు. ఇందుకోసం రాకెట్ల ద్వారా నిర్మాణ సామగ్రి పంపుతారు. అక్కడ నుంచి స్పేస్ షిప్ ఎలక్ట్రికల్ ప్రొపల్షన్లను ఉపయోగించుకుని కదులుతుంది. జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (జీఈఓ)కు చేరే వరకూ అది కొనసాగుతుంది.భూమి మీద ఎర్త్ పోర్టును రెండు భాగాలుగా నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకటి ఈక్వేటర్ దగ్గర, మరొకటి సముద్రం దగ్గర. ఈ రెండూ సముద్రం దిగువన టన్నెల్‌తో అనుసంధానమయి ఉంటాయి. ఎర్త్ పోర్ట్ నుంచి పైకి పాకేవాళ్లు సుమారు గంటకు 93 మైళ్ల వేగంతో కార్బో నానో ట్యూబ్ అధిరోహిస్తారు. వాళ్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని రెండున్నర గంటల్లో చేరతారని సంస్థ ప్రకటించింది.జపాన్ సంస్థ చెబుతున్న దాని ప్రకారం, ఇప్పుడు అంతరిక్షంలో ప్రయోగాలకు పెడుతున్న ఖర్చులతో పోలిస్తే, దీనివల్ల తక్కువ ఖర్చవుతుంది. అలాగే ఇందులో ఇంధన వినియోగం లేదు. ఇదంతా సౌరశక్తి ఆధారంగా సాగుతుంది. భారీగా సోలార్ ప్యానళ్లతో జియో స్టేషన్ నిర్మిస్తారు. మానవుల పరంగా కానీ, వాతావారణ పరంగా కానీ ఎలివేటర్లకు ఉండే ముప్పుల గురించి సంస్థ ఇంకా అధ్యయనం చేపట్టలేదు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది అంటే 2025లో ప్రారంభం కావాలి. ప్రస్తుతం ఆర్ అండ్ బీ పైనా, పార్ట్నర్షిప్ బిల్డింగ్, ప్రమోషన్లపైనా దృష్టి పెట్టారు. ఇందుకు మరికొంత జాప్యమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక రోజున మానవాళి ఈ ఎలివేటర్ ద్వారా అంతరిక్షంలోకి అడుగు పెడుతుంది. అందుకు జపాన్ను మనం తప్పకుండా అభినందించి తీరాలి. డా‘‘ పార్థసారథి చిరువోలు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
SpaceX: చీకటి పడటాన్ని ఆకాశం నుంచి చూశారా?
స్పేస్ టూరిజం టార్గెట్‌గా రంగంలోకి దిగిన స్పేస్ ఎక్స్ సంస్థ మరో అద్భుతానికి సాక్షిగా నిలిచింది. ఆ సంస్థ ప్రయోగించిన డ్రాగన్ క్యూపోలా భూమికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను కెమెరాలో బంధించింది. 585 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్ ఎక్స్ సంస్థ ఇన్సిపిరేషన్ 4 మిషన్‌లో భాగంగా గత బుధవారం డ్రాగన్ క్యూపోలాను అంతరిక్షంలోకి పంపించింది. మొత్తం నలుగురు వ్యక్తులు ఈ డ్రాగన్ స్పేస్ షిప్లో అంతరికక్షానికి చేరుకున్నారు. భూమి నుంచి 585 కిలోమీటర్ల ఎత్తులో ఇప్పుడా డ్రాగన్ చక్కర్లు కొడుతోంది. చూసేందుకు వీలుగా గతంలో నాసాతో పాటు పలు అంతరిక్ష సంస్థలు అంతరిక్షంలోకి స్పేస్షిప్లను పంపినప్పటికీ ఎందులో కూడా పై నుంచి భూమిని చూసేందుకు అనువైన ఏర్పాట్లు లేవు. కానీ స్పేస్ఎక్స్ ఇన్సిపిరేషన్ 4 మిషన్‌లో ప్రత్యేక పద్దతిలో ట్రాన్స్పరెంట్ మెటీరియల్‌తో అతి పెద్ద క్యూపోలాను రూపొందించారు. అక్కడి నుంచి భూమిని స్పష్టంగా చూసే వీలుంది. చీకటి పడుతుండగా డ్రాగన్ క్యూపోలా నుంచి శుక్రవారం సాయంత్రం భూమిపై చీకటి పడే దృశ్యాలను చిత్రీకరించారు. ఈ వీడియో ఫుటేజీని స్పేస్ ఎక్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఆకాశం నుంచి చూస్తుంటే సగం భూమిపై చీకటి ఉండగా సగం భూమిపై వెలుతురు ఉంది. క్రమంగా సగ భాగం చీకటిగా మారిపోయింది. ఆ తర్వాత స్పేస్ షిప్ ఉన్న వైపు భూమి మొత్తం చిమ్మ చీకటిలో కలిసిపోయింది. View of an orbital sunset from Dragon's cupola pic.twitter.com/Fl1fLrXD9o — SpaceX (@SpaceX) September 18, 2021 చదవండి: విజయవంతమైన స్పేస్ ఎక్స్ ప్రయోగం -
మామ.. ‘మంచు’మామ!
వాషింగ్టన్: అత్యంత చల్లగా, చీకటిగా ఉండే చంద్రుడి ధృవ ప్రాంతాల్లో ఘనీభవించిన నీటి నిల్వలు(మంచు) ఉన్నట్లు నాసా వెల్లడించింది. పదేళ్ల క్రితం భారత్ ప్రయోగించిన చంద్రయాన్–1 అంతరిక్ష నౌక పంపిన సమాచారాన్ని విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు నీటి నిల్వలున్న విషయాన్ని ధ్రువీకరించారు. చంద్రుడి ఉపరితలం కింద లోతైన భాగాల్లో నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ నీటిని వినియోగించుకోవడం చాలా కష్టతరమైందని అప్పట్లోనే వెల్లడించారు. కానీ ప్రస్తుతం కనుగొన్న ఘనీభవించిన నీటి జాడలు చంద్రుడి ఉపరితలానికి కొద్ది మిల్లిమీటర్ల లోతులోనే ఉన్నాయని తెలిపారు. దీంతో భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాలతోపాటు ఆవాసానికి అవసరమయ్యే నీటిని ఇక్కడి నుంచే పొందవచ్చని చెబుతున్నారు. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద లూనార్ క్రేటర్స్ (ఉల్కాపాతం వల్ల ఏర్పడిన గుంత లాంటి ప్రదేశం)లో మంచు మొత్తం ఒకేచోట నిక్షిప్తమై ఉండగా.. ఉత్తర ధృవ ప్రాంతంలో మాత్రం అక్కడక్కడా తక్కువ మొత్తంలో వ్యాపించి ఉందని వివరించారు. చంద్రయాన్–1 అంతరిక్ష నౌకలో మూన్ మినరాలజీ మ్యాపర్( M3) అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు అమర్చారు. ఈ పరికరం పంపిన సమాచారంతోనే చంద్రుడిపై ఉపరితలంపై నీటి ఆనవాళ్లను నాసా గుర్తించింది. -
గురు ప్రదక్షిణ!
అయిదేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఫలించింది. గురు గ్రహం ‘అంతు’ కనుక్కోవడమే లక్ష్యంగా అంతరిక్షంలో గంటకు 1,30,000 కిలోమీటర్ల వేగంతో అవిచ్ఛిన్నంగా దూసుకుపోయిన వ్యోమ నౌక ‘జునో’ మంగళవారం గురుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ కక్ష్యలో అనుకున్న క్షణానికి, అనుకున్న చోట ఒడుపుగా ప్రవేశపెట్టగలగడ మన్నది అత్యంత సంక్లిష్టమైన పని. దీన్ని జయప్రదంగా పరిపూర్తి చేయడం నాసా శాస్త్రవేత్తల దీక్షాదక్షతలకు నిదర్శనం. దానిచుట్టూ ఒకటీ, రెండూ కాదు... ఏకంగా 63 చంద్రులు తిరుగాడుతుంటారు. వీటిలో కొన్ని వ్యతిరేక కక్ష్యలో తిరుగుతాయి. ఇవిగాక అసంఖ్యాకంగా తోకచుక్కలు, ఉల్కలు దానిపై నిత్యమూ పతనమవుతుం టాయి. ఇన్నిటినుంచి జునోను తప్పించి సురక్షితమైన ప్రాంతంలో పెట్టడం వారి కొక సవాలు. గురుడికున్న పెద్ద చంద్రులు కేలిస్టో, గానిమీడ్ల కక్ష్యను దాటి... యూరోపా, అయోలను తప్పించుకుని ముందుగానే నిర్ణయించిన కక్ష్యను జునో అందుకుంది. దానికి అమర్చిన ప్రధాన ఇంజిన్‌ను మండించడం వల్లనే అది సాధ్యమైంది. ఇన్ని కోట్ల కిలోమీటర్ల పయనం తర్వాత అది అసలు మండు తుందా... మండినా కావలసిన స్థాయిలో జునో వేగాన్ని నియంత్రించేలా చేయ గలమా అన్నది అయిదేళ్లుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న. ఒక సంకేతం పంపాక దాని ఫలితాన్ని తెలుకోవడానికి కొంత సమయం పడుతుంది. దాన్నిబట్టి మళ్లీ మరో సంకేతాన్ని అందించాల్సి ఉంటుంది. ఎంతో ఏకాగ్రత, ఖచ్చితత్వం ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యంకాదు. అనుకున్నట్టే ఇదంతా 35 నిమిషాల వ్యవధిలో పూర్త యింది. అందులో క్షణమాత్రం ఆలస్యమైనా జునో జాడ తెలియకుండా మాయ మయ్యేది. 101 కోట్ల డాలర్ల(సుమారు రూ. 6,812 కోట్లు)ప్రాజెక్టు వృథా అయ్యేది. ఇన్ని సంక్లిష్టతలుండబట్టే ఇది అత్యంత కఠోరమైన ప్రాజెక్టుగా నాసా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. 2011 ఆగస్టు 5న నాసా జునోను ప్రయోగించింది. ఇప్పటివరకూ మొత్తంగా ఇది 170 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. బృహస్పతిగా నామాంతరమున్న గురుగ్రహం ఆదినుంచీ మానవాళికి అంతు చిక్కని మిస్టరీగానే ఉంది. మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం గురుడే. దాన్ని గురించి మానవాళికి తెలిసింది గోరంతయితే...తెలియాల్సింది కొండంత. ఇదంత సులభమేమీ కాదు. అందుకు కారణం దాన్ని దట్టంగా కమ్ముకునే వాయు మేఘాలే. అందులో హైడ్రోజన్ వాటా 90 శాతమైతే మిగిలిందంతా హీలియం. ఇంకా మీథేన్, గంథకం, అమోనియా, నీరు వంటివి కూడా ఉన్నాయి. ఈ వాయువుల్లో ఘన పదార్థంగా మారినవెన్నో, ఇంకా వాయురూపంలో ఉన్నవెన్నో తెలియదు. భూమికి 318 రెట్లు పెద్దగా ఉండే గురుగ్రహం ఇంద్రధనస్సులా అనేక రంగులతో మెరుస్తూ కనడటానికి కారణం ఈ పదార్థాలూ, వాయువులే అంటారు. అంతేకాదు... నుదుట సిందూరంలా ఈ గురుగ్రహంపై ఎర్రగా మెరిసే బింబం కూడా ఉంది. దాని పరిమాణమే భూమికి మూడింతలుంటుంది. పైగా అది స్థిరంగా కాక కదులుతూ ఉంటుంది. ఆరురోజులకొకసారి వేగంగా తిరుగాడుతూ కనబడుతుంది. గురు గ్రహంపై నిత్యం రేగే పెను అలజడే ఇందుకు కారణమని శాస్త్రవేత్తల అంచనా. ఈ ఎర్రబొట్టును తొలిసారి 1831లో పసిగట్టారు. అప్పటినుంచీ దీన్ని ఆశ్చర్యంగా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు జునో అదేమిటో చెప్పగలుగుతుందా అన్నది చూడాలి. అంతేకాదు...జునో నెరవేర్చాల్సిన గురుతర బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి. దాని గురుత్వాకర్షణ శక్తిని, దాన్లోని అయస్కాంత క్షేత్ర విస్తృతిని అది చెప్పాలి. అక్కడి నీరు ఏ పరిమాణంలో ఉన్నదో వెల్లడించాలి. ఆక్సిజన్, హైడ్రోజన్ల నిష్పత్తి ఎలా ఉందో లెక్కగట్టాలి. గురుగ్రహ అంతర్భాగంనుంచి నుంచి నిరంతరాయంగా వెలువడే సూక్ష్మ తరంగాల ధగధగలనూ, వాటి ఉష్ణ తీవ్రతనూ కొలవాలి. వాటి ఆనుపానులను పసిగట్టాలి. అసలు గురుగ్రహం కేవలం వాయు వుల సమూహంగానే ఉన్నదా... లేక వాటిల్లో కొంత భాగమైనా చిక్కబడి కఠిన శిలగా రూపాంతరం చెందిందా అన్నదీ తేల్చాలి. ఇవన్నీ పరిశోధించడానికి జునోలో 9 ఉపకరణాలున్నాయి. ఎప్పటికప్పుడు ఛాయాచిత్రాలు తీసి పంపడానికి అత్యంత శక్తిమంతమైన కెమెరా ఉంది. గురుణ్ణి 3,000 మైళ్ల దూరంనుంచి గమనిస్తూ జునో ఈ పనులన్నీ చేస్తుంది. చంద్రుడు భూమికి 2,38,800 మైళ్ల దూరంలో పరిభ్రమిస్తున్నాడని గుర్తుంచుకుంటే జునో గురుడికి ఎంత సమీపంగా వెళ్లిందో అర్ధమవుతుంది. గురుణ్ణి పలకరించడానికి వ్యోమ నౌక వెళ్లడం ఇదే తొలిసారేమీ కాదు. 1972 మార్చిలో ప్రయోగించిన పయొనీర్-10 అక్కడి వరకూ వెళ్లింది. 2003 వరకూ సంకేతాలు పంపుతూనే ఉంది. ఆ తర్వాత ఏమైందో పత్తాలేదు. 1977లో మన సౌర వ్యవస్థ ఆవలికి ప్రయాణం కట్టిన వాయేజర్ వ్యోమనౌక గురుగ్రహాన్ని దాటే వెళ్లింది. 1995లో పంపిన గెలీలియో 2003 వరకూ గురువు చుట్టూ చక్కర్లు కొట్టింది. గురుడిపై ఒక పరికరాన్ని జారవిడిచింది. 2000లో కసినీ అనే వ్యోమ నౌక దాన్ని ఫొటోలు తీసింది. అయితే జునోలో అమర్చిన వివిధ పరికరాలు వీటన్నిటికీ లేని విశిష్టతను దానికి చేకూర్చాయి. విజ్ఞానశాస్త్ర రంగంలో చేకూరే విజయాలు మన విశ్వంపైనా, దాని పుట్టుకపైనా మన అవగాహనను విస్తృతం చేస్తాయి. ఇప్పుడు జునో చేరేసే సమాచారం సౌర వ్యవస్థ ఎలా ఆవిర్భవించిందో, ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందో తెలి యడంతోపాటు మన భూమి పుట్టుకను అర్ధం చేసుకోవడానికి కూడా తోడ్ప డుతుంది. జునో తన పని పూర్తి చేయడానికి 2018 ఫిబ్రవరి వరకూ సమ యముంది. ఈలోగా గురుగ్రహంలోని అత్యుష్ణోగ్రతలు, ఇతరేతర పరిణామాలూ దాని శక్తిసామర్థ్యాలను కొంచెం కొంచెం దెబ్బతీస్తుంటాయి. దాని పరికరాల పని తీరును క్రమేపీ నిర్వీర్యం చేస్తుంటాయి. ఇన్ని ఒడిదుడుకుల మధ్య నిర్దేశించిన లక్ష్యాన్ని జునో విజయవంతంగా పరిపూర్తి చేయగలదని, విశ్వరహఃపేటికను తెరుస్తుందని ఆశిద్దాం. -
నెత్తి మీద పిడుగు..!
భూమి వైపు దూసుకొస్తున్న రష్యా వ్యోమనౌక మాస్కో: భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు సరుకులు మోసుకెళ్లిన రష్యా మానవ రహిత వ్యోమనౌక ‘ప్రోగ్రెస్ ఎం-27ఎం’ దారి తప్పింది. నియంత్రణ కోల్పోయి భూమి వైపే దూసుకొస్తోంది! సోయుజ్ రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌకను రష్యా మంగళవారం ప్రయోగించింది. అయితే, నిర్దేశిత కక్ష్యలోకి కాకుండా వేరే కక్ష్యలోకి చేరడంతో పాటు వ్యోమనౌక భూమితో సంబంధాలు కోల్పోయింది. దీంతో భూమి చుట్టూ తిరుగుతూ క్రమంగా కిందికి దిగుతోందని రష్యా అధికారులు వెల్లడించారు. అయితే, ప్రోగ్రెస్ వ్యోమనౌక బుధవారం 197 కి.మీ. ఎత్తులో తిరుగుతోందని, మే 5-7 తేదీల మధ్య వాతావరణంలోకి ప్రవేశించి అది మండిపోతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వ్యోమనౌక శకలాల్లో చాలావరకూ మండిపోతాయని, కానీ మిగిలిపోయే కొన్ని శకలాలు ఎక్కడ పడతాయో మాత్రం తెలియదన్నారు.