అయిదేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఫలించింది. గురు గ్రహం ‘అంతు’ కనుక్కోవడమే లక్ష్యంగా అంతరిక్షంలో గంటకు 1,30,000 కిలోమీటర్ల వేగంతో అవిచ్ఛిన్నంగా దూసుకుపోయిన వ్యోమ నౌక ‘జునో’ మంగళవారం గురుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ కక్ష్యలో అనుకున్న క్షణానికి, అనుకున్న చోట ఒడుపుగా ప్రవేశపెట్టగలగడ మన్నది అత్యంత సంక్లిష్టమైన పని. దీన్ని జయప్రదంగా పరిపూర్తి చేయడం నాసా శాస్త్రవేత్తల దీక్షాదక్షతలకు నిదర్శనం. దానిచుట్టూ ఒకటీ, రెండూ కాదు... ఏకంగా 63 చంద్రులు తిరుగాడుతుంటారు. వీటిలో కొన్ని వ్యతిరేక కక్ష్యలో తిరుగుతాయి. ఇవిగాక అసంఖ్యాకంగా తోకచుక్కలు, ఉల్కలు దానిపై నిత్యమూ పతనమవుతుం టాయి. ఇన్నిటినుంచి జునోను తప్పించి సురక్షితమైన ప్రాంతంలో పెట్టడం వారి కొక సవాలు.
గురుడికున్న పెద్ద చంద్రులు కేలిస్టో, గానిమీడ్‌ల కక్ష్యను దాటి... యూరోపా, అయోలను తప్పించుకుని ముందుగానే నిర్ణయించిన కక్ష్యను జునో అందుకుంది. దానికి అమర్చిన ప్రధాన ఇంజిన్‌ను మండించడం వల్లనే అది సాధ్యమైంది. ఇన్ని కోట్ల కిలోమీటర్ల పయనం తర్వాత అది అసలు మండు తుందా... మండినా కావలసిన స్థాయిలో జునో వేగాన్ని నియంత్రించేలా చేయ గలమా అన్నది అయిదేళ్లుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న.
ఒక సంకేతం పంపాక దాని ఫలితాన్ని తెలుకోవడానికి కొంత సమయం పడుతుంది. దాన్నిబట్టి మళ్లీ మరో సంకేతాన్ని అందించాల్సి ఉంటుంది. ఎంతో ఏకాగ్రత, ఖచ్చితత్వం ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యంకాదు. అనుకున్నట్టే ఇదంతా 35 నిమిషాల వ్యవధిలో పూర్త యింది. అందులో క్షణమాత్రం ఆలస్యమైనా జునో జాడ తెలియకుండా మాయ మయ్యేది. 101 కోట్ల డాలర్ల(సుమారు రూ. 6,812 కోట్లు)ప్రాజెక్టు వృథా అయ్యేది. ఇన్ని సంక్లిష్టతలుండబట్టే ఇది అత్యంత కఠోరమైన ప్రాజెక్టుగా నాసా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. 2011 ఆగస్టు 5న నాసా జునోను ప్రయోగించింది. ఇప్పటివరకూ మొత్తంగా ఇది 170 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది.
బృహస్పతిగా నామాంతరమున్న గురుగ్రహం ఆదినుంచీ మానవాళికి అంతు చిక్కని మిస్టరీగానే ఉంది. మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం గురుడే. దాన్ని గురించి మానవాళికి తెలిసింది గోరంతయితే...తెలియాల్సింది కొండంత. ఇదంత సులభమేమీ కాదు. అందుకు కారణం దాన్ని దట్టంగా కమ్ముకునే వాయు మేఘాలే. అందులో హైడ్రోజన్ వాటా 90 శాతమైతే మిగిలిందంతా హీలియం. ఇంకా మీథేన్, గంథకం, అమోనియా, నీరు వంటివి కూడా ఉన్నాయి. ఈ వాయువుల్లో ఘన పదార్థంగా మారినవెన్నో, ఇంకా వాయురూపంలో ఉన్నవెన్నో తెలియదు. భూమికి 318 రెట్లు పెద్దగా ఉండే గురుగ్రహం ఇంద్రధనస్సులా అనేక రంగులతో మెరుస్తూ కనడటానికి కారణం ఈ పదార్థాలూ, వాయువులే అంటారు. అంతేకాదు... నుదుట సిందూరంలా ఈ గురుగ్రహంపై ఎర్రగా మెరిసే బింబం కూడా ఉంది. దాని పరిమాణమే భూమికి మూడింతలుంటుంది. పైగా అది స్థిరంగా కాక కదులుతూ ఉంటుంది.
ఆరురోజులకొకసారి వేగంగా తిరుగాడుతూ కనబడుతుంది. గురు గ్రహంపై నిత్యం రేగే పెను అలజడే ఇందుకు కారణమని శాస్త్రవేత్తల అంచనా. ఈ ఎర్రబొట్టును తొలిసారి 1831లో పసిగట్టారు. అప్పటినుంచీ దీన్ని ఆశ్చర్యంగా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు జునో అదేమిటో చెప్పగలుగుతుందా అన్నది చూడాలి. అంతేకాదు...జునో నెరవేర్చాల్సిన గురుతర బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి. దాని గురుత్వాకర్షణ శక్తిని, దాన్లోని అయస్కాంత క్షేత్ర విస్తృతిని అది చెప్పాలి. అక్కడి నీరు ఏ పరిమాణంలో ఉన్నదో వెల్లడించాలి.
ఆక్సిజన్, హైడ్రోజన్‌ల నిష్పత్తి ఎలా ఉందో లెక్కగట్టాలి. గురుగ్రహ అంతర్భాగంనుంచి నుంచి నిరంతరాయంగా వెలువడే సూక్ష్మ తరంగాల ధగధగలనూ, వాటి ఉష్ణ తీవ్రతనూ కొలవాలి. వాటి ఆనుపానులను పసిగట్టాలి. అసలు గురుగ్రహం కేవలం వాయు వుల సమూహంగానే ఉన్నదా... లేక వాటిల్లో కొంత భాగమైనా చిక్కబడి కఠిన శిలగా రూపాంతరం చెందిందా అన్నదీ తేల్చాలి. ఇవన్నీ పరిశోధించడానికి జునోలో 9 ఉపకరణాలున్నాయి. ఎప్పటికప్పుడు ఛాయాచిత్రాలు తీసి పంపడానికి అత్యంత శక్తిమంతమైన కెమెరా ఉంది. గురుణ్ణి 3,000 మైళ్ల దూరంనుంచి గమనిస్తూ జునో ఈ పనులన్నీ చేస్తుంది. చంద్రుడు భూమికి 2,38,800 మైళ్ల దూరంలో పరిభ్రమిస్తున్నాడని గుర్తుంచుకుంటే జునో గురుడికి ఎంత సమీపంగా వెళ్లిందో అర్ధమవుతుంది.
గురుణ్ణి పలకరించడానికి వ్యోమ నౌక వెళ్లడం ఇదే తొలిసారేమీ కాదు. 1972 మార్చిలో ప్రయోగించిన పయొనీర్-10 అక్కడి వరకూ వెళ్లింది. 2003 వరకూ సంకేతాలు పంపుతూనే ఉంది. ఆ తర్వాత ఏమైందో పత్తాలేదు. 1977లో మన సౌర వ్యవస్థ ఆవలికి ప్రయాణం కట్టిన వాయేజర్ వ్యోమనౌక గురుగ్రహాన్ని దాటే వెళ్లింది. 1995లో పంపిన గెలీలియో 2003 వరకూ గురువు చుట్టూ చక్కర్లు కొట్టింది. గురుడిపై ఒక పరికరాన్ని జారవిడిచింది. 2000లో కసినీ అనే వ్యోమ నౌక దాన్ని ఫొటోలు తీసింది. అయితే జునోలో అమర్చిన వివిధ పరికరాలు వీటన్నిటికీ లేని విశిష్టతను దానికి చేకూర్చాయి.
విజ్ఞానశాస్త్ర రంగంలో చేకూరే విజయాలు మన విశ్వంపైనా, దాని పుట్టుకపైనా మన అవగాహనను విస్తృతం చేస్తాయి. ఇప్పుడు జునో చేరేసే సమాచారం సౌర వ్యవస్థ ఎలా ఆవిర్భవించిందో, ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందో తెలి యడంతోపాటు మన భూమి పుట్టుకను అర్ధం చేసుకోవడానికి కూడా తోడ్ప డుతుంది. జునో తన పని పూర్తి చేయడానికి 2018 ఫిబ్రవరి వరకూ సమ యముంది. ఈలోగా గురుగ్రహంలోని అత్యుష్ణోగ్రతలు, ఇతరేతర పరిణామాలూ దాని శక్తిసామర్థ్యాలను కొంచెం కొంచెం దెబ్బతీస్తుంటాయి. దాని పరికరాల పని తీరును క్రమేపీ నిర్వీర్యం చేస్తుంటాయి. ఇన్ని ఒడిదుడుకుల మధ్య నిర్దేశించిన లక్ష్యాన్ని జునో విజయవంతంగా పరిపూర్తి చేయగలదని, విశ్వరహఃపేటికను తెరుస్తుందని ఆశిద్దాం.
గురు ప్రదక్షిణ!
Published Thu, Jul 7 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM
Advertisement