comet
-
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
ఉల్కాపాతం.. ఈ పేరు చాలామందికి తెలియంది కాదు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ.. భూమ్మీద మీద పడే సమయంలో అవి మెరుస్తూ అద్భుతాన్ని తలపిస్తుంటాయి. అయితే.. తాజాగా శనివారం రాత్రి అలాంటి అనుభూతిని పొందారు స్పెయిన్, పోర్చుగల్ ప్రజలు. స్పెయిన్, పొరుగు దేశం పొర్చుగల్ ప్రజలు శనివారం రాత్రి ఆకాశంలో అరుదైన కాంతిని వీక్షించారు. నీలి రంగులో మెరుస్తూ ఉల్క ఒకటి భూమ్మీదకు రయ్‌మని దూసుకొచ్చింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాహనాల్లో వెళ్లే వాళ్లు, పార్టీలు చేసుకునేవాళ్లు.. అనుకోకుండా ఆ దృశ్యాలను బంధించారు. Tires, Cascais, Portugal. ☄️#Tires #Cascais#Portugal #Fireball #Meteor #meteoro #meteorito #España#Spainpic.twitter.com/HDtnhQEYG7— Mr. Shaz (@Wh_So_Serious) May 19, 2024అవి చూసి భూమ్మీదకు సూపర్ పవర్ ఏదైనా దూసుకొచ్చిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు పలువురు. తోక చుక్కలు, ఉల్కాపాతంను కనివినీ ఎరుగని ఒక జనరేషన్ అయితే.. ఈ దృశ్యాల్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఇది ఏలియన్ల పనేనా?.. సూపర్ పవర్ ఏదైనా భూమ్మీదకు వచ్చిందా? అంటూ తమదైన ఎగ్జయిట్‌మెంట్‌ను ప్రదర్శిస్తోంది. A meteor lit up the sky with bright light during the night in Portugal and Spain.Source: X#Meteor #Spain #Portugal #Fireball #Sky #DTNext #DTnextNews pic.twitter.com/09Ma6GO0sg— DT Next (@dt_next) May 19, 2024అయితే ఆ ఉల్క ఎక్కడ పడిందనేదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కొందరు మాత్రం కాస్ట్రో డెయిర్లో పడిందని, మరికొందరేమో పిన్హెయిరోలో పడిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. JUST IN: Meteor spotted in the skies over Spain and Portugal.This is insane.Early reports claim that the blue flash could be seen darting through the night sky for hundreds of kilometers.At the moment, it has not been confirmed if it hit the Earth’s surface however some… pic.twitter.com/PNMs2CDkW9— Collin Rugg (@CollinRugg) May 19, 2024 రెండు వారాల కిందటే.. అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడొచ్చని అంచనా వేశారు. హెలీ తోకచుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా రాబోయే రోజుల్లో ఉల్కాపాతం ఎక్కువే ఉండొచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు. -
రూ.8 లక్షలకే ఎంజీ ఎలక్ట్రిక్ కారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లో చౌకైన ఎలక్ట్రిక్ వెహికిల్ కామెట్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.7.98 లక్షలు. ఒకసారి చార్జింగ్‌తో 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 17.3 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుపరిచారు. ఏడు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. రెండు డోర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, రెండు ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ విభాగంలో ఎంజీ ఇప్పటికే భారత్‌లో జడ్ఎస్ ఈవీ మోడల్‌ను విక్రయిస్తోంది. గుజరాత్‌లోని హలోల్ ప్లాంటులో కామెట్ కార్లను తయారు చేస్తున్నారు. -
భూమికి బై బై.. నిష్క్రమించిన ఆకుపచ్చ తోకచుక్క
న్యూయార్క్: జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి తొలి వారం దాకా దాదాపు నెల రోజుల పాటు ఆకాశంలో కనువిందు చేసిన ఆకుపచ్చని తోకచుక్క ఇక సెలవంటూ వెళ్లిపోతోంది. సి2022ఈ3గా పిలుస్తున్న ఈ తోకచుక్క మన నుంచి అత్యంత దూరంగా సౌరమండలపు వెలుపలి తీరాల కేసి పయనమవుతోంది. ఇది మళ్లీ భూమికి సమీపంగా వచ్చి మనకు కనిపించేది మరో 50 వేల సంవత్సరాల తర్వాతే! సరిగ్గా చెప్పాలంటే, 52023వ సంవత్సరంలో అన్నమాట!! అయితే సూర్యుడు, ఇతర గ్రహాల ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల దాని కక్ష్యలో బాగా మార్పుచేర్పులు జరిగే క్రమంలో అది అంతకంటే చాలా ముందే మరోసారి భూమికి సమీపానికి వచ్చే అవకాశాలనూ కొట్టిపారేయలేమంటున్నారు సైంటిస్టులు. అదే సమయంలో కక్ష్యలో వ్యతిరేక మార్పులు జరిగితే 50 వేల ఏళ్ల కంటే ఎక్కువ సమయమూ పట్టవచ్చని కూడా వారు చెబుతున్నారు. భూమికి అతి సమీపానికి వచ్చినప్పుడు భూ ఉపరితలం నుంచి ఈ తోకచుక్క 4.2 కోట్ల కిలోమీటర్ల దూరంలో కనువిందు చేసింది. అది చివరిసారి మనకు కన్పించినప్పటికి భూమిపై ఆధునిక మానవుని ఆవిర్భావమే జరగలేదు! అప్పటికింకా నియాండర్తల్ మానవుల హవాయే నడుస్తోంది. -
ఆకుపచ్చ తోకచుక్క.. రాతియుగం తర్వాత మళ్లీ ఇప్పుడే!
విశ్వంలో సుదూర ప్రాంతం నుంచి ఓ తోకచుక్క.. భూమికి అతి చేరువగా వస్తోంది. గ్రీన్ కామెట్ అని పిలిచే ఈ తోకచుక్క.. 50 వేల ఏళ్ల క్రితం నియండర్తల్ పీరియడ్‌లో(రాతియుగం సమయంలో!) భూమికి దగ్గరగా వచ్చి దర్శనమిచ్చింది. మళ్లీ ఇప్పుడు.. ఇవాళ (బుధవారం) ఈ ఆకుపచ్చ తోకచుక్క భూమికి అతి సమీపంగా రాబోతోంది. ఆకాశంలో ఆవిష్కృతం కాబోయే ఈ అద్భుతాన్ని నేరుగా వీక్షించొచ్చని నాసా వెల్లడించింది. వేల ఏళ్ల క్రితం కనిపించిన ‘గ్రీన్ కామెట్’ అనే తోకచుక్క మళ్లీ కనువిందు చేయబోతోంది. ఫిబ్రవరి 1-2 తేదీల మధ్య రాత్రి సమయంలో ఈ తోకచుక్క ఆకాశంలో సందడి చేయనుందట. చివరిసారిగా.. ఈ తోకచుక్క 50 వేల ఏళ్ల క్రితం కనిపించినట్టు అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో ఇది కనిపిస్తుందని అంటున్నారు. ఈ 'గ్రీన్ కామెట్'ను కిందటి ఏడాది మార్చిలో కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఈ తోకచుక్కకు C/2022 E3 (ZTF)గా నామకరణం చేశారు. ఈ నెలలో అది భూమికి చేరువగా రావడం మొదలైంది. కాగా, బుధవారం అంటే ఈ తోకచుక్క భూమికి 42 మిలియన్ కిలోమీటర్ల సమీపానికి రానున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. అయితే ఈ ఆకుపచ్చ తోకచుక్కను నేరుగా కంటితో చూడడం కాస్త కష్టమేనని కోల్‌కతా బిర్లా ప్లానిటోరియం సైంటిఫిక్ అధికారి శిల్పి గుప్తా చెప్తున్నారు. కాంతి వెలుగులో ఇది మసకగానే కనిపిస్తుందని, స్పష్టమైన చీకట్లో.. బైనాక్యులర్ ద్వారా వీక్షించొచ్చని ఆమె సూచిస్తున్నారు. ఈ తోకచుక్క బుధవారం రాత్రి 9:30 తర్వాత ఆకాశంలో కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని చూడలేకపోతే జీవితంలో మళ్లీ చూడడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే ఇది మళ్లీ మిలియన్ల సంవత్సరాల తర్వాత భూమి సమీపానికి వస్తుంది. దీన్ని బృహస్పతి కక్ష్యలో ఉండగా గతేడాది మార్చిలో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటి నుంచి అది వెలుగులు విరజిమ్ముతూనే ఉంది. తోకచుక్కలు అంటే.. వాయువులతో నిండిన అంతరిక్ష మంచు గోళాలు. ఇవి దాదాపు ఒక నగరం అంత వ్యాసంతో ఉంటాయి. సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేడెక్కి ధూళిని, వాయువులను అమితమైన వెలుగుతో బయటకు వెదజల్లుతాయి. భూమిపై జీవం ఎలా ఏర్పడిందో తెలుసుకునేందుకు అంతరిక్ష పరిశోధకులు.. తోక చుక్కల సాయం తీసుకుంటుంటారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...!
ఎప్పుడో 50 వేల ఏళ్ల క్రితం కన్పించిన ఓ తోకచుక్క త్వరలో మళ్లీ మనల్ని పలకరించనుంది. ఫిబ్రవరి 1న భూమికి అత్యంత సమీపంగా, అంటే 2.6 కోట్ల మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది. జనవరి 26 నుంచి వారం పాటు మామూలు కంటికి కూడా కన్పిస్తుందని నాసా చెబుతోంది. అది ప్రస్తుతం మనకు 11.7 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. సి2022 ఈ3గా పిలుస్తున్న ఈ తోకచుక్కను నాసా సైంటిస్టులు కెమెరాలో బంధించారు. అన్నట్టూ, భూమి మాదిరిగానే ఇది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుందట. 50 వేల ఏళ్లకు ఒక పరిభ్రమణం పూర్తి చేస్తుందట! 2020 జూలైలోనూ ఇలాగే ఒక తోకచుక్క మనకు కన్పించేంత సమీపంగా వచ్చింది. -
తోకచుక్కగా భ్రమించారు.. చివరకు అగ్ని-5గా తేల్చారు!
న్యూఢిల్లీ: భారత్‌లో పలు ప్రాంతాల్లో గురువారం ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతి దర్శనమిచ్చింది. వేగంగా కదులుతున్న ఈ వెలుగు రేఖను చూసి తోకచుక్క కావొచ్చని జనం భావించారు. కొందరు అంతరిక్షం నుంచి జారిపడిన గ్రహశిలగా భ్రమించారు. మరికొందరు ఫ్లయింగ్ సాసరని బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. చివరికి అది మన ఖండాంతర అణు క్షిపణి అగ్ని–5 అని అధికారులు స్పష్టం చేసి ఊహాగానాలకు తెర దించారు! దాన్ని ఒడిశా తీరం నుంచి గురువారం విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. ఈ క్షిపణి పొడవు 17 మీటర్లు. 1.5 టన్నుల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. అగ్ని–1, అగ్ని–2, అగ్ని–3, అగ్ని–4 మిస్సైళ్ల పరిధి 700 కిలోమీటర్ల నుంచి 3,5000 కిలోమీటర్లు కాగా, మూడు దశల సాలిడ్ రాకెట్ ఇంజన్‌తో కూడిన అగ్ని–5 పరిధి ఏకంగా 5,000 కిలోమీటర్లు కావడం గమనార్హం. 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదని సైనిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇప్పటిదాకా ఇదే అత్యధిక లాంగ్–రేంజ్ మిస్సైల్ కావడం విశేషం. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు. చైనా ఉత్తర ప్రాంతంతో సహా మొత్తం ఆసియా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది. ఐరోపా ఖండంలోని కొన్ని ప్రాంతాలు సైతం అగ్ని–5 స్ట్రైకింగ్ రేంజ్లో ఉన్నాయి. క్షిపణి ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైందని అధికార వర్గాలు తెలియజేశాయి. అగ్ని–5 త్వరలోనే భారత సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు. -
దూసుకువస్తోన్న భారీ తోక చుక్క..! భూమిని ఢీకొట్టనుందా?
తోకచుక్క అనగానే మనకు ఠక్కున గుర్తుకువచ్చేది హేలీ తోకచుక్కనే. ఈ తోక చుక్క 1682లో కన్పించిన తోకచుక్కగా ఖగోళ శాస్త్రవేత్త హేలీ పేర్కొన్నారు. ఇది ప్రతి 75-76 ఏళ్లకొక సారి కన్పిస్తుంది. ఈ తోకచుక్క 1986లో కన్పించగా..మరలా 2061లో కన్పించనుంది. హేలీ తోక చుక్క కంటే భారీ తోక చుక్కను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.మన సౌరవ్యవస్థకు దగ్గరగా వస్తోన్న భారీ తోకచుక్కగా (కామెట్) ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. మెగాకామెట్ను మొదట పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు పెడ్రో బెర్నార్డినెల్లి , గ్యారీ బెర్న్‌స్టెయిన్ కనుగొన్నారు ఈ భారీ తోకచుక్కకు C/2014 UN271 అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ తోకచుక్క పరిమాణంలో అత్యంత భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిమాణంలో మార్స్ మూన్ పోబోస్, డిమోస్ కంటే పెద్గగా ఈ కామెట్ ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాస్త్రవేత్తలు గుర్తించిన తోకచుక్కల్లో అతిపెద్ద తోకచుక్కగా నిలిచింది. సెర్రో టోలోలో ఇంటర్-అమెరికన్ అబ్జర్వేటరీలో కొనసాగుతున్న డార్క్ ఎనర్జీ సర్వే (DES) ద్వారా ఈ మెగా కామెట్ డేటాను పరీశిలిస్తున్నారు. తొలుత ఈ తోక చుక్కను ఒక ఆస్ట్రరాయిడ్గా గుర్తించగా..అబ్జర్వేటరీ అందించిన డేటా ప్రకారం అది తోకచుక్కఅని శాస్త్రవేత్తలు నిర్థారించారు.కామెట్ బెర్నార్డినెల్లి-బెర్న్‌స్టెయిన్ మెగా కామెట్ పరిమాణం తొలుత 200 కిలోమీటర్ల వెడల్పుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ తోకచుక్క మనకు ఎప్పుడు దగ్గరగా వస్తుందంటే..? ఈ తోకచుక్క మన సౌర వ్యవస్థ గుండా ప్రయాణిస్తుంది.2031 సంవత్సరంలో మన సూర్యుడికి, భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమిని ఢీకొట్టనుందా? ఈ తోకచుక్క అత్యంత పెద్దదిగా పరిగణించినప్పటికీ.. శాస్త్రవేత్తలు ఈ తోకచుక్క గమనాన్ని ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, భూమికి ఈ తోకచుక్క నుంచి ఎటువంటి ముప్పు లేదని వెల్లడించారు. చదవండి: న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మరో నలుగురు! -
చందమామకు తోక ఉంది తెలుసా?
తోకచుక్కలు మనందరికీ తెలుసు. సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండే తోకచుక్కలు.. సూర్యుడి దగ్గరికి వచ్చే కొద్దీ తోక పెరు గుతూ ఉండటం తెలిసిందే. కానీ, మనం రోజూ చూసే చందమామకు కూడా తోక ఉంది తెలుసా? చిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజమే.. చంద్రుడికి కూడా తోక ఉందని, భూమిచుట్టూ తిరుగుతున్న సమయంలో సూర్యుడివైపు వెళ్లినప్పుడల్లా ఆ తోక ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. బోస్టన్ వర్సిటీ విడుదల చేసిన చిత్రం సాధారణంగా తోకచుక్కలపై ఉండే మంచు, చిన్న చిన్న రాళ్లు, దుమ్ము, వంటివి సౌర వికిరణాలకు చెదిరిపోయి వెనుక తోకగా ఏర్పడుతాయి. వాటిపై సూర్య కాంతి పడి పరావర్తనం చెందడంతో పొడుగ్గా తోకలాగా మనకు కనిపిస్తాయి. కానీ చంద్రుడికి ఏర్పడుతున్న తోక మాత్రం అలాంటి దుమ్ము, మంచుతో కాకుండా.. సోడియం అణువులతో తయారవుతోందని ఈ అంశంపై పరిశోధన చేస్తున్న బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త జెఫరీ తెలిపారు. అందుకే అది మన సాధారణ కంటికి కనిపించడం లేదని.. ప్రత్యేక కెమెరాలు, టెలిస్కోపులతో చూడవచ్చని చెప్పారు. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం వల్ల.. సౌర కాంతి రేడియేషన్ నేరుగా ఎఫెక్ట్ చూపిస్తుందని, దానికితోడు నిత్యం ఢీకొట్టే ఉల్కతో చంద్రుడి ఉపరితలంపై సోడియం అణువులు పైకి ఎగుస్తున్నాయని వివరించారు. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ తోక చిన్న చిన్నగా ఏమీ లేదట. ఏకంగా ఐదారు లక్షల కిలోమీటర్ల పొడవునా ఏర్పడుతోందని గుర్తించారు. సూర్యుడికి, భూమికి మధ్య ప్రాంతంలోకి చంద్రుడు వచి్చనప్పుడు.. ఈ తోకలోని సోడియం అణువులు భూమివైపు కూడా వస్తాయని, కానీ మన వాతావరణం వాటిని అడ్డుకుంటోందని తేల్చారు. -
వినీలాకాశంలో నియో వైస్ కనువిందు
అల్లిపురం (విశాఖ దక్షిణం): వినీలాకాశంలో కొత్త అతిథి సందడి చేస్తోంది. దాదాపు 460 కోట్ల ఏళ్ల క్రితం నాటి దుమ్ము, ధూళితో నిండిన “కామెట్ నియోవైస్’ తోకచుక్క భూమి ఉత్తర ధృవప్రాంతంలో ఆకాశంలో కనువిందు చేస్తోంది. ఈ తోకచుక్కను మార్చిలో నాసాకు చెందిన నియోవైస్ ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది. అత్యంత అరుదైన ఈ తోకచుక్కను నగరానికి చెందిన హెచ్‌బీ కాలనీ భానునగర్‌కు చెందిన మొదిలి వైష్ణవి భవ్య తన కెమెరాలో ఇటీవల బంధించారు. రోజూ సూర్యాస్తమయం వేళ దర్శనమిచ్చే ఈ తోకచుక్కను తన కెమెరా(కెనాన్ ఈవోఎస్ 600 డీ)లో బంధించేందుకు సింహాచలం కొండకు ఉత్తరం వైపున ఉన్న భైరవస్వామి ఆలయం వద్దకు ఆమె వెళ్లేవారు. రోజూ గంటల కొద్ది వేచి ఉన్నా వాతావరణంలో ధూళి కణాల వల్ల తోకచుక్క కెమెరాకు చిక్కేది కాదు. రెండు రోజులుగా ఎండలు బాగా కాయడంతో శొంఠ్యాం రోడ్డులోని భైరవవాక వద్ద ఈ నెల 26వ తేదీ సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో తోటచుక్క భూమిని రాసుకుని వెళ్తుండగా భవ్య తన కెమెరాతో బంధించింది. క్షణాల్లో ఇలా కనిపించి మాయమైన తోకచుక్కను తన కెమెరాలో బంధించినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. -
తళుకులీనే తోకచుక్క!
కేప్ కనావరెల్: అంతరిక్ష పరిశోధకులు, ఔత్సాహికులను పలకరించేందుకు వినీలాకాశంలో కొత్త అతిథి వచ్చింది. దాదాపు 460 కోట్ల ఏళ్లక్రితంనాటి దుమ్ము, ధూళితో నిండినఈ ‘నియోవైస్’ తోకచుక్క భూమి ఉత్తరధృవప్రాంతంలో ఆకాశంలో కనువిందుచేస్తోంది. ఈ తోకచుక్కను మార్చి నెలలో నాసాకు చెందిన నియోవైస్ ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది. దాదాపు ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ తోకచుక్క ఆగస్ట్ 15వ తేదీదాకా మనకు కనిపించి ఆ తర్వాత మన సౌరకుటుంబం నుంచి సుదూరతీరాలకు వెళ్లనుంది. 1990ల తర్వాత ఉత్తరధృవంలో ఇంతటి కాంతివంతమైన తోకచుక్క కనిపించడం ఇదే తొలిసారికావడం విశేషం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు ఇప్పటికే దీని అందమైన ఫొటోలను కెమెరాల్లో బంధించారు. -
అమ్మకానికి మూన్‌రాక్.. ధర ఎంతంటే..
లండన్: దాదాపు 13.5 కిలోల బరువు ఉన్న చంద్ర ఉల్క గురువారం అమ్మకానికి వచ్చింది. క్రిస్టీస్‌లో అమ్మకానికి పెట్టిన ఈ మూన్‌రాక్ 2 మిలియన్ పౌండ్లు(2.49 మిలియన్ డాలర్ల) విలువ చేస్తుందని(ప్రాథమిక ధర) అంచనా. భూమి మీద పడిన అతి పెద్ద చంద్ర ఉల్కల పరిమాణంలో ఇది ఐదో స్థానంలో నిలిచింది. ఎన్డబ్ల్యూఏ 12691గా పేరొందిన ఈ ఉల్క.. ఆస్టరాయిడ్ లేదా తోకచుక్కను ఢీకొట్టి సహారా ఎడారి ప్రాంతంలో పడినట్లుగా భావిస్తున్నారు. దీనిని సేకరించిన క్రిస్టీ సంస్థ ప్రైవేటు ప్లాట్‌ఫాంలో అమ్మకానికి పెట్టింది. ఈ విషయం గురించి క్రిస్టీస్ సైన్స్ అండ్ నేచురల్ హిస్టరీ విభాగాధిపతి మాట్లాడుతూ.. ‘‘బాహ్య ప్రపంచానికి చెందిన ఓ వస్తువును చేతుల్లోకి తీసుకున్న అనుభవాన్ని ఎవరూ ఎన్నటికీ మరచిపోలేరు. ఇది చంద్రుడికి సంబంధించినది. ఫుట్‌బాల్ లేదా ఓ మనిషి తల కంటే పెద్ద పరిమాణంలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఈ ఉల్క 2,40,000 మైళ్ల ప్రయాణం చేసిన తర్వాత భూమిని చేరినట్లు వెల్లడించారు. చంద్రుడిపై పరిశోధనలు జరిపిన సమయంలో అమెరికా అపోలో స్సేస్ మిషన్ సేకరించిన నమూనాలతో ఈ ఉల్కను పోల్చి చూసి.. అది చంద్రుడి ఏ భాగం నుంచి ఊడిపడిందో తెలుసుకునే ప్రయత్నాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘‘1960, 70ల్లో అపోలో ప్రోగ్రామ్ ద్వారా 400 కిలోల మూన్రాక్ను తీసుకువచ్చారు. తద్వారా దానిలోని రసాయన, ఐసోటోపిక్ మిశ్రమాలను విశ్లేషించి.. ప్రస్తుత ఉల్కను పోల్చి చూస్తారు’’అని హైస్లోప్ పేర్కొన్నారు. -
తోకచుక్కా.. ఏలియనా..!!
-
తోకచుక్కా.. ఏలియనా..!!
వాషింగ్టన్ : మన సౌర కుటుంబంలో తోకచుక్కలు తిరుగుతుండటం సర్వసాధారణం. ఇవి ఎక్కువగా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. భూమికి చేరువలో తిరుగడం మాత్రం తక్కువ సార్లు మాత్రమే జరుగుతుంటుంది. కానీ, మరో సౌర వ్యవస్థ నుంచి వచ్చి భూమి చుట్టూ తిరిగిన ఓ తోకచుక్క శాస్త్రవేత్తలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఈ ఘటన గత నెల 18వ తేదీన చోటు చేసుకుంది. ఆ తర్వాత వారం రోజుల్లో మరో 34 సార్లు అలా మన సౌర కుటుంబంలో తిరుగాడిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హవాయిలోని టెలిస్కోప్ ఆ తోకచుక్కను గుర్తించినట్లు చెప్పారు. దానికి తోకచుక్క సీ/2017 అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఇలా ఓ తోకచుక్క ఇతర సౌర వ్యవస్థ నుంచి మన సౌర వ్యవస్థలోకి రావడం ఇదే తొలిసారని సైంటిస్టులు చెప్పారు. ఈ తోకచుక్కకు సంబంధించిన విషయాలను ‘ఇంటర్నేషనల్ యూనియన్స్ మైనర్ ప్లానెట్ సెంటర్’ ప్రచురించింది. ఇలాంటి సంఘటనల వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదాలేవీ లేవని అభిప్రాయపడింది. వేరే నక్షత్ర మండలం నుంచి వచ్చిన తోకచుక్క అని కొందరు అభిప్రాయపడుతున్నా.. మరికొందరు మాత్రం అది తోకచుక్క కాదని.. ఏలియన్ కావొచ్చని భావిస్తున్నారని చెప్పింది. వేరే నక్షత్ర విను వీధుల నుంచి వచ్చిన ఈ తోకచుక్క మధ్యలో జుపిటర్, మార్స్ల మీదుగా ప్రయాణించి ఉండొచ్చని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లారిడాకు చెందిన ప్లానెటరీ సైంటిస్ట్ డా. మారియా వొమాక్ తెలిపారు. -
కొత్తేడాది రోజున ఆకాశంలోకి చూడండి!
-
కొత్తేడాది రోజున ఆకాశంలోకి చూడండి!
న్యూయార్క్: కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా స్వీట్లు పంచుకోవడంతోపాటు బాణాసంచా మెరుపుల అందాలను తిలకించడం కోసం ఆకాశంలోకి చూస్తుంటాం. బాణాసంచా వల్ల కాలుష్యం పెరుగుతుందనే చైతన్యం పెరగడం వల్ల బాణాసంచాను కాల్చడాన్ని చాలా మంది ఇష్టపడడం లేదు. అలా ఇష్టపడని వారు సైతం కొత్త సంవత్సరం శుభోదయానికి ముందు, అంటే డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆకాశంలోకి చూడమని నాసా పిలుపునిచ్చింది. ఆ రోజున చంద్రుడికి సమీపాన కుడివైపున దీదీప్యమానంగా కాకపోయినా ఓ మోస్తారు వెలుతురుతో 45పీ హోండా–మార్కోస్–పజ్దూసకోవా తోక చుక్క కనిపిస్తుందట. అయితే ఇక్కడ ఓ తిరకాసు కూడా ఉంది. నేరుగా కళ్లతో చూస్తే కనిపించదని, బైనాకులర్స్‌తో చూస్తేనే కనిపిస్తుందని నాసా శాస్జ్రజ్ఞులు తెలిపారు. 1948లో హోండా, మార్కోస్, సకోవా అనే ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ తోక చుక్కను కనిపెట్టడం వల్ల వారి పేర్లు వచ్చేలాగానే ఈ తోకచుక్కకు పేరు పెట్టారు. ఈ తోక చుక్క తాను సూర్యుడు చుట్టూ తిరిగే గమనాన్ని 5.25 ఏళ్లకోసారి పూర్తి చేసుకుంటుందని, సూర్యుడి సమీపానికి వచ్చినప్పుడే ఇది భూమిపై నుంచి కనిపిస్తుందని, సూర్యుడికి దూరమవుతున్నాకొద్ది కనుమరుగవుతుందని నాసా వివరించింది. ఇది తొలిసారిగా డిసెంబర్ 15వ తేదీన కనిపించిందని, రోజురోజుకు కొంత వెలుతురూ పెరుగుతూ జనవరి 1వ తేదీ వరకు కనిపిస్తుందని నాసా పేర్కొంది. -
గురు ప్రదక్షిణ!
అయిదేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఫలించింది. గురు గ్రహం ‘అంతు’ కనుక్కోవడమే లక్ష్యంగా అంతరిక్షంలో గంటకు 1,30,000 కిలోమీటర్ల వేగంతో అవిచ్ఛిన్నంగా దూసుకుపోయిన వ్యోమ నౌక ‘జునో’ మంగళవారం గురుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ కక్ష్యలో అనుకున్న క్షణానికి, అనుకున్న చోట ఒడుపుగా ప్రవేశపెట్టగలగడ మన్నది అత్యంత సంక్లిష్టమైన పని. దీన్ని జయప్రదంగా పరిపూర్తి చేయడం నాసా శాస్త్రవేత్తల దీక్షాదక్షతలకు నిదర్శనం. దానిచుట్టూ ఒకటీ, రెండూ కాదు... ఏకంగా 63 చంద్రులు తిరుగాడుతుంటారు. వీటిలో కొన్ని వ్యతిరేక కక్ష్యలో తిరుగుతాయి. ఇవిగాక అసంఖ్యాకంగా తోకచుక్కలు, ఉల్కలు దానిపై నిత్యమూ పతనమవుతుం టాయి. ఇన్నిటినుంచి జునోను తప్పించి సురక్షితమైన ప్రాంతంలో పెట్టడం వారి కొక సవాలు. గురుడికున్న పెద్ద చంద్రులు కేలిస్టో, గానిమీడ్ల కక్ష్యను దాటి... యూరోపా, అయోలను తప్పించుకుని ముందుగానే నిర్ణయించిన కక్ష్యను జునో అందుకుంది. దానికి అమర్చిన ప్రధాన ఇంజిన్‌ను మండించడం వల్లనే అది సాధ్యమైంది. ఇన్ని కోట్ల కిలోమీటర్ల పయనం తర్వాత అది అసలు మండు తుందా... మండినా కావలసిన స్థాయిలో జునో వేగాన్ని నియంత్రించేలా చేయ గలమా అన్నది అయిదేళ్లుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న. ఒక సంకేతం పంపాక దాని ఫలితాన్ని తెలుకోవడానికి కొంత సమయం పడుతుంది. దాన్నిబట్టి మళ్లీ మరో సంకేతాన్ని అందించాల్సి ఉంటుంది. ఎంతో ఏకాగ్రత, ఖచ్చితత్వం ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యంకాదు. అనుకున్నట్టే ఇదంతా 35 నిమిషాల వ్యవధిలో పూర్త యింది. అందులో క్షణమాత్రం ఆలస్యమైనా జునో జాడ తెలియకుండా మాయ మయ్యేది. 101 కోట్ల డాలర్ల(సుమారు రూ. 6,812 కోట్లు)ప్రాజెక్టు వృథా అయ్యేది. ఇన్ని సంక్లిష్టతలుండబట్టే ఇది అత్యంత కఠోరమైన ప్రాజెక్టుగా నాసా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. 2011 ఆగస్టు 5న నాసా జునోను ప్రయోగించింది. ఇప్పటివరకూ మొత్తంగా ఇది 170 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. బృహస్పతిగా నామాంతరమున్న గురుగ్రహం ఆదినుంచీ మానవాళికి అంతు చిక్కని మిస్టరీగానే ఉంది. మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం గురుడే. దాన్ని గురించి మానవాళికి తెలిసింది గోరంతయితే...తెలియాల్సింది కొండంత. ఇదంత సులభమేమీ కాదు. అందుకు కారణం దాన్ని దట్టంగా కమ్ముకునే వాయు మేఘాలే. అందులో హైడ్రోజన్ వాటా 90 శాతమైతే మిగిలిందంతా హీలియం. ఇంకా మీథేన్, గంథకం, అమోనియా, నీరు వంటివి కూడా ఉన్నాయి. ఈ వాయువుల్లో ఘన పదార్థంగా మారినవెన్నో, ఇంకా వాయురూపంలో ఉన్నవెన్నో తెలియదు. భూమికి 318 రెట్లు పెద్దగా ఉండే గురుగ్రహం ఇంద్రధనస్సులా అనేక రంగులతో మెరుస్తూ కనడటానికి కారణం ఈ పదార్థాలూ, వాయువులే అంటారు. అంతేకాదు... నుదుట సిందూరంలా ఈ గురుగ్రహంపై ఎర్రగా మెరిసే బింబం కూడా ఉంది. దాని పరిమాణమే భూమికి మూడింతలుంటుంది. పైగా అది స్థిరంగా కాక కదులుతూ ఉంటుంది. ఆరురోజులకొకసారి వేగంగా తిరుగాడుతూ కనబడుతుంది. గురు గ్రహంపై నిత్యం రేగే పెను అలజడే ఇందుకు కారణమని శాస్త్రవేత్తల అంచనా. ఈ ఎర్రబొట్టును తొలిసారి 1831లో పసిగట్టారు. అప్పటినుంచీ దీన్ని ఆశ్చర్యంగా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు జునో అదేమిటో చెప్పగలుగుతుందా అన్నది చూడాలి. అంతేకాదు...జునో నెరవేర్చాల్సిన గురుతర బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి. దాని గురుత్వాకర్షణ శక్తిని, దాన్లోని అయస్కాంత క్షేత్ర విస్తృతిని అది చెప్పాలి. అక్కడి నీరు ఏ పరిమాణంలో ఉన్నదో వెల్లడించాలి. ఆక్సిజన్, హైడ్రోజన్ల నిష్పత్తి ఎలా ఉందో లెక్కగట్టాలి. గురుగ్రహ అంతర్భాగంనుంచి నుంచి నిరంతరాయంగా వెలువడే సూక్ష్మ తరంగాల ధగధగలనూ, వాటి ఉష్ణ తీవ్రతనూ కొలవాలి. వాటి ఆనుపానులను పసిగట్టాలి. అసలు గురుగ్రహం కేవలం వాయు వుల సమూహంగానే ఉన్నదా... లేక వాటిల్లో కొంత భాగమైనా చిక్కబడి కఠిన శిలగా రూపాంతరం చెందిందా అన్నదీ తేల్చాలి. ఇవన్నీ పరిశోధించడానికి జునోలో 9 ఉపకరణాలున్నాయి. ఎప్పటికప్పుడు ఛాయాచిత్రాలు తీసి పంపడానికి అత్యంత శక్తిమంతమైన కెమెరా ఉంది. గురుణ్ణి 3,000 మైళ్ల దూరంనుంచి గమనిస్తూ జునో ఈ పనులన్నీ చేస్తుంది. చంద్రుడు భూమికి 2,38,800 మైళ్ల దూరంలో పరిభ్రమిస్తున్నాడని గుర్తుంచుకుంటే జునో గురుడికి ఎంత సమీపంగా వెళ్లిందో అర్ధమవుతుంది. గురుణ్ణి పలకరించడానికి వ్యోమ నౌక వెళ్లడం ఇదే తొలిసారేమీ కాదు. 1972 మార్చిలో ప్రయోగించిన పయొనీర్-10 అక్కడి వరకూ వెళ్లింది. 2003 వరకూ సంకేతాలు పంపుతూనే ఉంది. ఆ తర్వాత ఏమైందో పత్తాలేదు. 1977లో మన సౌర వ్యవస్థ ఆవలికి ప్రయాణం కట్టిన వాయేజర్ వ్యోమనౌక గురుగ్రహాన్ని దాటే వెళ్లింది. 1995లో పంపిన గెలీలియో 2003 వరకూ గురువు చుట్టూ చక్కర్లు కొట్టింది. గురుడిపై ఒక పరికరాన్ని జారవిడిచింది. 2000లో కసినీ అనే వ్యోమ నౌక దాన్ని ఫొటోలు తీసింది. అయితే జునోలో అమర్చిన వివిధ పరికరాలు వీటన్నిటికీ లేని విశిష్టతను దానికి చేకూర్చాయి. విజ్ఞానశాస్త్ర రంగంలో చేకూరే విజయాలు మన విశ్వంపైనా, దాని పుట్టుకపైనా మన అవగాహనను విస్తృతం చేస్తాయి. ఇప్పుడు జునో చేరేసే సమాచారం సౌర వ్యవస్థ ఎలా ఆవిర్భవించిందో, ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందో తెలి యడంతోపాటు మన భూమి పుట్టుకను అర్ధం చేసుకోవడానికి కూడా తోడ్ప డుతుంది. జునో తన పని పూర్తి చేయడానికి 2018 ఫిబ్రవరి వరకూ సమ యముంది. ఈలోగా గురుగ్రహంలోని అత్యుష్ణోగ్రతలు, ఇతరేతర పరిణామాలూ దాని శక్తిసామర్థ్యాలను కొంచెం కొంచెం దెబ్బతీస్తుంటాయి. దాని పరికరాల పని తీరును క్రమేపీ నిర్వీర్యం చేస్తుంటాయి. ఇన్ని ఒడిదుడుకుల మధ్య నిర్దేశించిన లక్ష్యాన్ని జునో విజయవంతంగా పరిపూర్తి చేయగలదని, విశ్వరహఃపేటికను తెరుస్తుందని ఆశిద్దాం. -
భూ ప్రళయం వస్తుందా?
ఏనాటికై నా భూగోళంపై ప్రళయం సంభవిస్తుందని, సముద్రాలు ముంచెత్తి, దావానలం దహించివేసి భూమిపై మానవుల మనుగడ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని దాదాపు 200 ప్రాచీన సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ సిద్ధాంతాల్లో వాస్తవం లేకపోలేదని, భూప్రళయం సంభవించే రోజులు మరెంతో దూరంలో లేవని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ గ్రాహం హాంకాక్ తెలియజేస్తున్నారు. 12,800 ఏళ్ల క్రితం భూమిపై జీవజాలం సర్వనాశనమైన తీరులోనే మరో 20 ఏళ్లలో భారీ తోక చుక్కొకటి భూమిని ఢీకొనడం వల్ల మానవ జాతి సమస్తం నశించిపోతుందని గ్రాహం హెచ్చరిస్తున్నారు. 12,800 ఏళ్ల ప్రాంతంలో ‘యంగర్ డ్రయాస్’ అనే భారీ తోకచుక్క భూమిని ఢీకొనడం వల్ల మంచు పర్వతాలు కరగిపోయి సముద్రాలు పొంగి పొర్లాయని, మరోపక్క అడవులు దావానలంతో దగ్ధమయ్యాయని శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు. ఫలితంగానే జడల ఏనుగులు, రాక్షస బల్లులు నశించిపోయాయనే వాదనకు శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. నాడు కోటి మెగాటన్నుల బరువు గల తోకచుక్క గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి భూగోళాన్ని ఢీకొట్టిందని, అణ్వాయుధ శక్తికి 20 లక్షల ఎక్కువ రెట్ల శక్తి వెలువడిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పుడు కూడా అలాంటి తోక చుక్కొకటి సూర్య కుటుంబం నుంచి భూమివైపు దూసుకొస్తోందని ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు విక్టర్ క్లూబ్, ఖగోళ శాస్త్రవేత్త బిల్ నాపియర్ చెబుతున్నారు. అయితే ఆ ప్రళయం ఎప్పుడూ సంభవిస్తుందో చెప్పలేమని వారు అంటున్నారు. కచ్చితంగా ఈ ప్రళయం 20 ఏళ్లలో సంభవిస్తుందని, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయని ‘మెజీషియన్స్ ఆఫ్ ది గాడ్స్’ అనే తన తాజా పుస్తకంలో హాంకాక్ వెల్లడించారు. భూమి పుట్టుపూర్వోత్తరాలు, ప్రళయాలు, తరతరాల నాగరికత చరిత్రను అవగాహన చేసుకున్న కొంతమంది మానవులు మాత్రం ప్రళయం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 2012లోనే భూ ప్రళయం వస్తుందనే ‘డూమ్స్ డే’ లాంటి ప్రచారాలు గతంలో జరిగిన విషయం తెల్సిందే. -
తోకచుక్కపై స్థిరంగా ఫీలే ల్యాండర్
లండన్: తోకచుక్క‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’పై రోసెట్టా వ్యోమనౌక నుంచి జారవిడిచిన ఫీలే ల్యాండర్ స్థిరంగా ఉందని ఐరోపా అంతరిక్ష సంస్థ గురువారం వెల్లడించింది. ల్యాండర్ తొలుత ఇబ్బందులను ఎదుర్కొన్నా.. తర్వాత స్థిరంగా పనిచేస్తోందని తెలిపింది. తోకచుక్క ఉపరితలంపై ల్యాండర్ కొక్కేలు మొదట సరిగ్గా దిగబడకపోవటంతో ల్యాండర్ కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లిందని, చివరకు ఒక చోట అది తన కొక్కేలను తోకచుక్క ఉపరితలంపై దిగేలా చేసిందని పేర్కొంది. ల్యాండర్ తాను తీసిన చిత్రాలను పంపుతోందని, ఇది తోకచుక్కపై ఎక్కడ ఉందనే విషయంపై పరిశీలన జరుపుతున్నామంది. -
రోసెట్టా అపూర్వ విజయం
మనిషి విజ్ఞాన శాస్త్ర ప్రయాణం మరో కీలక మలుపు తీసుకుంది. ఖగోళంలో మనకు అనంత దూరంలో తిరుగాడుతున్న తోకచుక్కను వెంటాడుతూ వెళ్లిన అంతరిక్ష నౌక రోసెట్టా... తనతో తీసుకెళ్లిన ప్రయోగ పరికరం ఫీలే ల్యాండర్‌ను దానిపై నిలపగలగడం మానవాళి సాధించిన ఒక అసాధారణ విజయం. యూరోప్ అంతరిక్ష సంస్థ (ఈసా) ప్రయోగించిన రోసెట్టాకు రాత్రీ లేదు...పగలూ లేదు. విరామమూ, విశ్రాంతీ లేనేలేదు. దశాబ్దకాలంనుంచి నిరంతర ప్రయాణం. 650 కోట్ల కిలోమీటర్ల దూరమే లక్ష్యం. గంటకు 54,718 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రోసెట్టా... అంతరిక్ష కేంద్రంలోని శాస్త్రవేత్తలు చెప్పినట్టల్లా విని ఈ లక్ష్యాన్ని సాధించింది. మధ్యలో 957 రోజులపాటు నిద్రాణ స్థితిలో ఉంచితే అలా ఉంటూ కూడా మునుముందుకు సాగింది. 2004లో దీన్ని ప్రయోగించినప్పుడు శాస్త్రవేత్తల్లో పెద్ద ఆశలేమీ లేవు. తెలియని తీరాల అంచులకు సాగనంపుతున్నామనీ, మధ్యలో అనుకోనిదేదైనా సంభవిస్తే ఈ ప్రయాణం అర్ధంతరంగా నిలిచిపోతుందన్న ఎరుక వారిలో ఉన్నది. అన్నీ సక్రమంగా పూర్తయ్యాక ఫీలే ల్యాండర్ తోకచుక్కపై దిగే అవకాశాలు సైతం 75 శాతంమాత్రమే ఉంటాయని లెక్కేశారు. కనుకనే ఈసా శాస్త్రవేత్తలు రెప్పవాల్చకుండా దాన్ని వీక్షించారు. ఎప్పటికప్పుడు తోకచుక్క గమనాన్ని చూసుకుంటూ, రోసెట్టా ఎంత వేగంతో వెళ్తే దాన్ని అందుకోగలదో అంచనా వేసుకుంటూ అవసరమైన ఆదేశాలు పంపారు. రోసెట్టాకు కాంతివేగంతో ఒక సందేశం పంపితే అది దానికి చేరడానికి 30 నిమిషాలు పడుతుంది. వెనువెంటనే తనకు అమర్చిన రాకెట్లను మండించుకుంటూ తన వేగాన్ని, దిశను నియంత్రించుకుంటుంది. 30 నిమిషాల తర్వాత అది ఏంచేయాలో నిర్దేశించడమనే సంక్లిష్ట ప్రక్రియను శాస్త్రవేత్తలు సజావుగా పూర్తిచేయగలగడం గొప్ప విషయమే. పదేళ్ల ఈ యజ్ఞం ఫలించింది. బుధవారం రోసెట్టా తనతో తీసుకెళ్లిన ఫీలే ల్యాండర్‌ను తోకచుక్కపైకి జారవిడిచింది. మరో ఏడుగంటల తర్వాత ఫీలే ల్యాండర్ తోకచుక్కను ముద్దాడి భూమ్మీది అంతరిక్ష కేంద్రానికి సచిత్ర సందేశాలను పంపింది. 1,400 కోట్ల సంవత్సరాలక్రితం అణువుల మహా విస్ఫోటం సంభవించి ఆవిర్భవించిన ఈ విశ్వంలో గ్రహాలు...వాటికి మళ్లీ ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు ఎన్నెన్నో! నిత్యం తిరుగాడే లక్షలాది గ్రహాలు, నక్షత్రాల్లోనుంచి వెలువడే ధూళి...కాలక్రమంలో మేఘాలుగా పరివర్తనం చెంది, అవి క్రమేపీ గడ్డకట్టుకుపోయి తోకచుక్కలుగా, శకలాలుగా మారి ఉంటాయన్నది శాస్త్రవేత్తల భావన. 450 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన భూమిపైకి ఇలా దారితప్పి దూసుకొచ్చిన తోకచుక్కేదో జీవరాశి ఆవిర్భావానికి పనికొచ్చే కర్బన మిశ్రమాలనూ, నీటినీ మోసుకొచ్చి ఉంటుందని వారి అంచనా. మన సౌర వ్యవస్థను పోలిన వ్యవస్థలు విశ్వంలో ఎన్నో ఉన్నాయని... వాటిల్లో ఎక్కడో ఇవే తరహా మార్పులు జరిగి జీవరాశితో అలరారే గ్రహం ఉండే అవకాశం లేకపోలేదని చెబుతారు. ఈ తోకచుక్కలూ, గ్రహశకలాలూ విశ్వావిర్భావంనుంచీ ఎక్కడికో, ఎటో తెలియకుండా పరిభ్రమిస్తూనే ఉన్నాయి. అంతేకాదు... ఇవి తమలో ఆనాటి జ్ఞాపకాలను మూలకాల రూపంలో అత్యంత జాగ్రత్తగా పదిలపరుచుకున్నాయి. నిర్దిష్టమైన కక్ష్యలో ఇవి తిరుగాడుతున్నట్టే కనబడుతున్నా ఎప్పుడో హఠాత్తుగా ఇవి దారితప్పడమూ, ఉపద్రవాలు తీసుకురావడమూ తథ్యం. ఇలాంటి ఉపద్రవాలను నివారించాలంటే వీటికి సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం అవసరమని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఒక్క తోకచుక్కను పట్టుకున్నా, అందులోని పదార్థాలేమిటో, దాని పోకడలేమిటో తెలుసుకోగలిగినా ఈ విశ్వానికి సంబంధించి మన అవగాహన మరింత విస్తృతమవుతుందని...అదే సమయంలో భూమికి ఎదురుకాగల ఉపద్రవాలను నిరోధించడంలో పనికొస్తుందని శాస్త్రవేత్తలు ఆశించారు. శక్తిమంతమైన టెలిస్కోపులతో తోకచుక్కలూ, గ్రహశకలాల ఆచూకీని రాబట్టడం...వాటి వేగాన్ని, కక్ష్యను లెక్కేసి తెలుసుకోవడం నిత్యం సాగే పనే. ఇందులో కొత్తగా తారసపడినవేమైనా ఉన్నాయా అని ఎప్పటికప్పుడు కూపీ లాగుతారు. అలా తొలిసారి 1969లో అప్పటి సోవియెట్ యూనియన్‌కు చెందిన ఇద్దరు ఔత్సాహికులు 67పీ తోకచుక్కను కనుక్కున్నారు. ఆ ఇద్దరి పేర్లే ఈ తోకచుక్కకు పెట్టారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రోసెట్టా ఎన్నిటినో దాటింది. మధ్యలో అంగారకుడి పక్కనుంచి దూసుకెళ్లింది. స్టీన్స్, టుటేషియా వంటి భారీ గ్రహశకలాల బారిన పడకుండా ఒడుపుగా తప్పించుకున్నది. మొన్న సెప్టెంబర్‌లో తోకచుక్కకు 50 కిలోమీటర్ల దూరంలో ఉండగా తన సెల్ఫీని సైతం తీసుకుని పంపింది. మినీ బస్సు సైజులో ఉండే రోసెట్టా మరో ఏడాదిపాటు తోకచుక్క కక్ష్యలోనే తిరుగుతూ తనకు అమర్చిన 21 పరికరాల సాయంతో దాన్ని జల్లెడపడుతుంది. సూర్యుడికి సమీపంగా వెళ్తున్నప్పుడు తోకచుక్కలో స్పందనలెలా ఉన్నాయో చూసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది. ఫీలే ల్యాండర్‌లోని ఏడు కెమెరాలు 360 డిగ్రీల్లో తోకచుక్క ఛాయాచిత్రాలు తీసి పంపుతాయి. తోకచుక్కలో ఉండగలదనుకుంటున్న నీరు, మంచులో నిక్షిప్తమై ఉన్న సేంద్రీయ పదార్థాలేమిటో విశ్లేషించి సమాచారం అందిస్తుంది. సృష్టి, స్థితులకు కారణమైన తోకచుక్కలు, గ్రహశకలాలే ఎప్పుడో ఒకప్పుడు లయ కారకాలు కూడా కావొచ్చు. అందుకు అంగారక, గురుగ్రహాలను తరచు ఢీకొట్టే తోకచుక్కలు, గ్రహశకలాలే రుజువు. విజ్ఞానశాస్త్ర సాయంతో దీన్ని సులభంగా ఎదుర్కొనగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు రోసెట్టా సాధించిన విజయం ఆ దిశగా వేసిన తొలి అడుగు. అంతరిక్షంనుంచి పొంచివున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఇలాంటి అడుగులు మరిన్ని పడవలసి ఉంటుంది. ఈ క్రమానికి శ్రీకారం చుట్టిన ఈసా శాస్త్రవేత్తలు అభినందనీయులు. -
తోకచుక్కపై తొలి అడుగు!
* దిగ్విజయంగా తోకచుక్కపై దిగిన ఫీలే ల్యాండర్ * పదేళ్లు ప్రయాణించి ల్యాండర్‌ను జారవిడిచిన రోసెట్టా వ్యోమనౌక * ఖగోళ చరిత్రలో అద్భుత ఘట్టం * ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) అరుదైన విజయం * చైనాకు మోదీ పరోక్ష చురక * దక్షిణ చైనా సముద్రంలో శాంతి నెలకొనాలని ఆకాంక్ష లండన్: ఖగోళ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. తొలిసారిగా ఓ తోకచుక్క చేతికి చిక్కింది. ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను వెంటాడుతూ పదేళ్లుగా అంతరిక్షంలో ప్రయాణించిన ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా)కు చెందిన రోసెట్టా వ్యోమనౌక ఎట్టకేలకు ఫీలే ల్యాండర్‌ను తోకచుక్కపైకి జారవిడిచింది. తోకచుక్కపై తమ ఫీలే ల్యాండర్ విజయవంతంగా దిగిందని బుధవారం ఈసా ప్రకటించింది. దీంతో ఓ తోకచుక్కపై తొలిసారిగా వ్యోమనౌకను దింపిన ఘనతను ఈసా సొంతం చేసుకుంది. తోకచుక్కలపై అధ్యయనం ద్వారా 450 కోట్ల ఏళ్ల క్రితం సౌరకుటుంబం ఏర్పడినప్పటి పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు. అందుకే సుమారు 160 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈసా ఈ ప్రయోగం చేపట్టింది. ఉత్కంఠగా ఆ ఏడుగంటలు... ప్రతి ఆరున్నరేళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తున్న ‘67పీ’ తోకచుక్క సెకను 18 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ 12 గంటలకోసారి తనచుట్టూ తాను తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ తోకచుక్క సమీపంలోకి వెళ్లి, దాని చుట్టూ తిరుగుతూనే ల్యాండర్ దానిపై పడేలా జారవిడవటం అనేది అతిక్లిష్టమైన ప్రక్రియ కావడంతో ఈసా శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ నెలకొంది. 2004లో నింగిలోకి వెళ్లిన రోసెట్టా పదేళ్లుగా తోకచుక్క వెంటాడుతూ ఈ ఏడాది సెప్టెంబరులో దాని సమీపంలోకి చేరి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ల్యాండర్‌ను జారవిడిచింది. సుమారు ఏడు గంటల పాటు 20 కి.మీ. దూరం కిందికి దిగిన ఫీలే ఎట్టకేలకు తోకచుక్కపై దిగిపోయి కొక్కేలను గుచ్చి దిగబడిపోయింది. -
తోకచుక్క ప్రభావంతో మార్స్‌పై ఉల్కాపాతం!
వాషింగ్టన్: అంగారకుడి సమీపం నుంచి అక్టోబరు 19న సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క దూసుకుపోయిన సందర్భంగా మార్స్ గగనతలం అంతా పసుపువర్ణపు వెలుగులతో నిండిపోయిందట. గంటకు వేలాది తారలు నేల రాలినట్లుగా ఉల్కాపాతం సంభవించిందట. వీటితో పాటు అంగారకుడి వాతావరణంలోని అయనోస్పియర్లోకి ప్రవేశించిన తోకచుక్క అవశేషాల వల్ల విద్యుదావేశ కణాలతో కూడిన కొత్త అయాన్ల పొర కూడా ఏర్పడిందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శుక్రవారం వెల్లడించింది. ఒక గ్రహంపై వాతావరణంలో తోకచుక్కల వల్ల ఏర్పడిన ఇలాంటి అయాన్ల పొరను గుర్తించడం ఇదే తొలిసారని తెలిపింది. అలాగే సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క కేంద్రభాగం, అయాన్ల పొరల సమాచారాన్ని నాసా మావెన్ ఉపగ్రహం, ఈసా ఉపగ్రహాలు సేకరించాయని నాసా పేర్కొంది. ఈ తోకచుక్క కేంద్ర భాగం ఇంతకుముందు ఊహించిన కంటే చిన్నగా 2 కి.మీ. సైజు మాత్రమే ఉందని, ఈ తోకచుక్క నుంచి టన్నుల కొద్దీ ధూళి అంగారకుడి వాతావరణంలోకి విడుదలైందనీ నాసా వెల్లడించింది. -
మార్స్‌ను దాటిన తోకచుక్క.. మామ్ క్షేమం!
వాషింగ్టన్: ఖగోళ శాస్త్రవేత్తలను ఉత్కంఠకు గురిచేస్తూ.. ఆదివారం మధ్యాహ్నం సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క అంగారకుడిని సురక్షితంగా దాటిపోయింది. సౌరకుటుంబం వెలుపల నుంచి వచ్చిన ఈ తోకచుక్క సెకనుకు 56 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు అరుణగ్రహానికి 1,39,500 కి.మీ. సమీపం నుంచి దూసుకుపోయింది. అంగారకుడి చుట్టూ తిరుగుతున్న మన మామ్(మంగళ్యాన్), అమెరికాకు చెందిన మూడు ఉపగ్రహాలు, ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన మరో ఉపగ్రహానికి ఈ తోకచుక్క నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో శాస్త్రవేత్తలు ఉత్కంఠగా ఎదురుచూశారు. సైడింగ్ స్ప్రింగ్ నుంచి ధూళికణాలు మార్స్‌వైపు వచ్చే సమయానికి ఉపగ్రహాలన్నీ మార్స్ వెనకవైపు ఉండేలా శాస్త్రవేత్తలు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో తోకచుక్కను ఫొటోలు తీయడంతో పాటు ఉపగ్రహాలన్నీ అనుకున్న సమయానికి మార్స్ వెనకకు చేరడంతో సురక్షితంగా ఉన్నాయని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. -
తోకచుక్క... 14 గంటల్లో స్విమ్మింగ్‌పూల్ నింపేస్తుంది!
అంగారకుడి సమీపం నుంచి వచ్చే అక్టోబరులో దూసుకుపోనున్న సైడింగ్ స్ప్రింగ్ అనే తోకచుక్క ప్రతి సెకనుకూ 50 లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తోందట! కేవలం 14 గంటల్లోనే ఒలింపిక్ స్విమ్మింగ్‌పూల్‌ను నింపేంత నీరు ఆ తోకచుక్క నుంచి విడుదలవుతోందట. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ‘స్విఫ్ట్’ ఉపగ్రహం మే నెలలో తీసిన చిత్రాలను పరిశీలించగా ఈ సంగతి తెలిసిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒక తోకచుక్క ఎంత వేగంగా నీటిని ఉత్పత్తి చేస్తుందన్న విషయం వెల్లడి కావడం ఇదే తొలిసారని, తాజా వివరాలతో ఆ తోకచుక్క సైజును కూడా కచ్చితంగా తెలుసుకోవచ్చని వారు తెలిపారు. అయితే ప్రస్తుతం మార్స్ చుట్టూ తిరుగుతున్న వ్యోమనౌకలకు ఈ తోకచుక్క నుంచి ఏమైనా ప్రమాదం ఉంటుందేమోనని గతంలో ఆందోళనలు వ్యక్తం అయినా.. ప్రస్తుతం దీనితో ఎలాంటి ముప్పూ లేదని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. కాగా, తోకచుక్కలు తమ కేంద్రభాగంలో భారీ ఎత్తున మంచు, ధూళికణాలతోపాటు పురాతన పదార్థాన్ని కలిగి ఉంటాయి. అవి సూర్యుడి చుట్టూ తిరుగుతూ సూర్యుడికి కాస్త దగ్గరగా వచ్చినప్పుడు వేడెక్కి వాయువులు, ధూళికణాలను విడుదల చేస్తుంటాయి. దీంతో వాయువులు, ధూళికణాలు సూర్యకాంతికి భారీ ప్రకాశంతో ప్రతిఫలిస్తూ.. తోకచుక్కకు మెరుస్తున్న పొడవాటి తోకలాగా కనిపిస్తాయి.