న్యూఢిల్లీ: భారత్‌లో పలు ప్రాంతాల్లో గురువారం ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతి దర్శనమిచ్చింది. వేగంగా కదులుతున్న ఈ వెలుగు రేఖను చూసి తోకచుక్క కావొచ్చని జనం భావించారు. కొందరు అంతరిక్షం నుంచి జారిపడిన గ్రహశిలగా భ్రమించారు. మరికొందరు ఫ్లయింగ్ సాసరని బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. చివరికి అది మన ఖండాంతర అణు క్షిపణి అగ్ని–5 అని అధికారులు స్పష్టం చేసి ఊహాగానాలకు తెర దించారు! దాన్ని ఒడిశా తీరం నుంచి గురువారం విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే.
ఈ క్షిపణి పొడవు 17 మీటర్లు. 1.5 టన్నుల వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. అగ్ని–1, అగ్ని–2, అగ్ని–3, అగ్ని–4 మిస్సైళ్ల పరిధి 700 కిలోమీటర్ల నుంచి 3,5000 కిలోమీటర్లు కాగా, మూడు దశల సాలిడ్ రాకెట్ ఇంజన్‌తో కూడిన అగ్ని–5 పరిధి ఏకంగా 5,000 కిలోమీటర్లు కావడం గమనార్హం. 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదని సైనిక వర్గాలు వెల్లడించాయి.
దేశంలో ఇప్పటిదాకా ఇదే అత్యధిక లాంగ్–రేంజ్ మిస్సైల్ కావడం విశేషం. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు. చైనా ఉత్తర ప్రాంతంతో సహా మొత్తం ఆసియా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది. ఐరోపా ఖండంలోని కొన్ని ప్రాంతాలు సైతం అగ్ని–5 స్ట్రైకింగ్ రేంజ్‌లో ఉన్నాయి. క్షిపణి ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైందని అధికార వర్గాలు తెలియజేశాయి. అగ్ని–5 త్వరలోనే భారత సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment