కొత్తేడాది రోజున ఆకాశంలోకి చూడండి!
న్యూయార్క్: కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా స్వీట్లు పంచుకోవడంతోపాటు బాణాసంచా మెరుపుల అందాలను తిలకించడం కోసం ఆకాశంలోకి చూస్తుంటాం. బాణాసంచా వల్ల కాలుష్యం పెరుగుతుందనే చైతన్యం పెరగడం వల్ల బాణాసంచాను కాల్చడాన్ని చాలా మంది ఇష్టపడడం లేదు. అలా ఇష్టపడని వారు సైతం కొత్త సంవత్సరం శుభోదయానికి ముందు, అంటే డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆకాశంలోకి చూడమని నాసా పిలుపునిచ్చింది.
ఆ రోజున చంద్రుడికి సమీపాన కుడివైపున దీదీప్యమానంగా కాకపోయినా ఓ మోస్తారు వెలుతురుతో 45పీ హోండా–మార్కోస్–పజ్దూసకోవా తోక చుక్క కనిపిస్తుందట. అయితే ఇక్కడ ఓ తిరకాసు కూడా ఉంది. నేరుగా కళ్లతో చూస్తే కనిపించదని, బైనాకులర్స్‌తో చూస్తేనే కనిపిస్తుందని నాసా శాస్జ్రజ్ఞులు తెలిపారు. 1948లో హోండా, మార్కోస్, సకోవా అనే ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ తోక చుక్కను కనిపెట్టడం వల్ల వారి పేర్లు వచ్చేలాగానే ఈ తోకచుక్కకు పేరు పెట్టారు.
ఈ తోక చుక్క తాను సూర్యుడు చుట్టూ తిరిగే గమనాన్ని 5.25 ఏళ్లకోసారి పూర్తి చేసుకుంటుందని, సూర్యుడి సమీపానికి వచ్చినప్పుడే ఇది భూమిపై నుంచి కనిపిస్తుందని, సూర్యుడికి దూరమవుతున్నాకొద్ది కనుమరుగవుతుందని నాసా వివరించింది. ఇది తొలిసారిగా డిసెంబర్ 15వ తేదీన కనిపించిందని, రోజురోజుకు కొంత వెలుతురూ పెరుగుతూ జనవరి 1వ తేదీ వరకు కనిపిస్తుందని నాసా పేర్కొంది.