భూ ప్రళయం వస్తుందా?
ఏనాటికై నా భూగోళంపై ప్రళయం సంభవిస్తుందని, సముద్రాలు ముంచెత్తి, దావానలం దహించివేసి భూమిపై మానవుల మనుగడ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని దాదాపు 200 ప్రాచీన సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ సిద్ధాంతాల్లో వాస్తవం లేకపోలేదని, భూప్రళయం సంభవించే రోజులు మరెంతో దూరంలో లేవని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ గ్రాహం హాంకాక్ తెలియజేస్తున్నారు.
12,800 ఏళ్ల క్రితం భూమిపై జీవజాలం సర్వనాశనమైన తీరులోనే మరో 20 ఏళ్లలో భారీ తోక చుక్కొకటి భూమిని ఢీకొనడం వల్ల మానవ జాతి సమస్తం నశించిపోతుందని గ్రాహం హెచ్చరిస్తున్నారు. 12,800 ఏళ్ల ప్రాంతంలో ‘యంగర్ డ్రయాస్’ అనే భారీ తోకచుక్క భూమిని ఢీకొనడం వల్ల మంచు పర్వతాలు కరగిపోయి సముద్రాలు పొంగి పొర్లాయని, మరోపక్క అడవులు దావానలంతో దగ్ధమయ్యాయని శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు. ఫలితంగానే జడల ఏనుగులు, రాక్షస బల్లులు నశించిపోయాయనే వాదనకు శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి.
నాడు కోటి మెగాటన్నుల బరువు గల తోకచుక్క గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి భూగోళాన్ని ఢీకొట్టిందని, అణ్వాయుధ శక్తికి 20 లక్షల ఎక్కువ రెట్ల శక్తి వెలువడిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పుడు కూడా అలాంటి తోక చుక్కొకటి సూర్య కుటుంబం నుంచి భూమివైపు దూసుకొస్తోందని ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు విక్టర్ క్లూబ్, ఖగోళ శాస్త్రవేత్త బిల్ నాపియర్ చెబుతున్నారు. అయితే ఆ ప్రళయం ఎప్పుడూ సంభవిస్తుందో చెప్పలేమని వారు అంటున్నారు.
కచ్చితంగా ఈ ప్రళయం 20 ఏళ్లలో సంభవిస్తుందని, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయని ‘మెజీషియన్స్ ఆఫ్ ది గాడ్స్’ అనే తన తాజా పుస్తకంలో హాంకాక్ వెల్లడించారు. భూమి పుట్టుపూర్వోత్తరాలు, ప్రళయాలు, తరతరాల నాగరికత చరిత్రను అవగాహన చేసుకున్న కొంతమంది మానవులు మాత్రం ప్రళయం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 2012లోనే భూ ప్రళయం వస్తుందనే ‘డూమ్స్ డే’ లాంటి ప్రచారాలు గతంలో జరిగిన విషయం తెల్సిందే.