తోకచుక్క... 14 గంటల్లో స్విమ్మింగ్‌పూల్ నింపేస్తుంది!
అంగారకుడి సమీపం నుంచి వచ్చే అక్టోబరులో దూసుకుపోనున్న సైడింగ్ స్ప్రింగ్ అనే తోకచుక్క ప్రతి సెకనుకూ 50 లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తోందట! కేవలం 14 గంటల్లోనే ఒలింపిక్ స్విమ్మింగ్‌పూల్‌ను నింపేంత నీరు ఆ తోకచుక్క నుంచి విడుదలవుతోందట. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ‘స్విఫ్ట్’ ఉపగ్రహం మే నెలలో తీసిన చిత్రాలను పరిశీలించగా ఈ సంగతి తెలిసిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒక తోకచుక్క ఎంత వేగంగా నీటిని ఉత్పత్తి చేస్తుందన్న విషయం వెల్లడి కావడం ఇదే తొలిసారని, తాజా వివరాలతో ఆ తోకచుక్క సైజును కూడా కచ్చితంగా తెలుసుకోవచ్చని వారు తెలిపారు.
అయితే ప్రస్తుతం మార్స్ చుట్టూ తిరుగుతున్న వ్యోమనౌకలకు ఈ తోకచుక్క నుంచి ఏమైనా ప్రమాదం ఉంటుందేమోనని గతంలో ఆందోళనలు వ్యక్తం అయినా.. ప్రస్తుతం దీనితో ఎలాంటి ముప్పూ లేదని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. కాగా, తోకచుక్కలు తమ కేంద్రభాగంలో భారీ ఎత్తున మంచు, ధూళికణాలతోపాటు పురాతన పదార్థాన్ని కలిగి ఉంటాయి. అవి సూర్యుడి చుట్టూ తిరుగుతూ సూర్యుడికి కాస్త దగ్గరగా వచ్చినప్పుడు వేడెక్కి వాయువులు, ధూళికణాలను విడుదల చేస్తుంటాయి. దీంతో వాయువులు, ధూళికణాలు సూర్యకాంతికి భారీ ప్రకాశంతో ప్రతిఫలిస్తూ.. తోకచుక్కకు మెరుస్తున్న పొడవాటి తోకలాగా కనిపిస్తాయి.