
ఫెర్రీహైడ్రైట్ ఖనిజం వల్లే అంగారకుడికి ఎరుపు రంగు
బ్రౌన్ యూనివర్సిటీ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: ఎర్రని రంగుతో మెరిసిపోతూ అందంగా కనిపించే అంగారక(మార్స్) గ్రహంపై గతంలో జీవజాలం మనుగడకు అనుకూలమైన వాతావరణం ఉందన్న వాదనకు ఆధారాలు లభించాయి. అరుణ గ్రహానికి ఆ రంగు రావడానికి కారణం ఏమిటన్నది శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇనుముతో కూడిన ఖనిజం సమృద్ధిగా ఉండడం వల్లే అంగారకుడు ఎరుపు రంగు సంతరించుకున్నట్లు తేల్చారు. ఇలాంటి ఖనిజం ఏర్పడాలంటే చల్లటి నీరు అవసరం. అంటే మార్స్‌పై వాతావరణం కోట్లాది సంవత్సరాల క్రితం జీవులకు ఆవాసయోగ్యంగా ఉండి ఉండొచ్చని తెలుస్తోంది.
మార్స్ ఉపరితలంపై ఎర్రటి దుమ్ము, రాళ్లు కనిపిస్తుంటాయి. ఐరన్ ఆక్సైడ్, ఫెర్రీహైడ్రైట్ వంటి ఖనిజాల అరుణగ్రహంపై ఉన్నట్లు ఇప్పటికే వెల్లడయ్యింది. ఈ ఖనిజాల కారణంగానే గ్రహం ఎరుపు రంగులోకి మారినట్లు అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ సైంటిస్టులు కనిపెట్టారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు. ఫెర్రీహైడ్రైట్ వల్ల మార్స్‌కు ఎరుపు రంగు వచ్చినట్లు చెప్పడం కొత్త విషయం కాకపోయినప్పటికీ దాన్ని తాము శాస్త్రీయంగా నిర్ధారించామని బ్రౌన్ యూనివర్సిటీ సైంటిస్టు ఆడమ్ వాలంటినాస్ స్పష్టంచేశారు. ఇందుకోసం మార్స్ ధూళిపై విస్తృతంగా పరిశోధనలు చేశామన్నారు.
అరుణగ్రహంపై ధూళి, రాళ్లలో ఫెర్రీహైడ్రైట్ పుష్కలంగా ఉందని చెప్పారు. అతి తక్కువ ఉష్ణోగ్రతలు, చల్లటి నీటి సమక్షంలోనే ఈ ఖనిజం ఏర్పడుతుందన్నారు. ద్రవరూపంలో నీరు ఉన్నట్లు తేలింది కాబట్టి అంగారకుడు ఒకప్పుడు ఆవాసయోగ్యంగా ఉండేదని కచ్చితంగా చెప్పొచ్చని వెల్లండిచారు. కోట్లాది సంవత్సరాల క్రితం బలమైన సౌర గాలులు వీచడం వల్ల మార్స్‌పై తడి వాతావరణం క్రమంగా పొడి వాతావరణంగా మారి పోయినట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అక్కడ అయస్కాంత క్షేత్రం బలహీనంగా ఉంది. అందుకే సౌర గాలుల ప్రభావాన్ని తట్టుకోలేకపోయింది. అందుకే వాతావరణం పొడిగా, అతిశీతలంగా మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment