అండర్ వాటర్ సిటీ
జనాభా పెరిగిపోతోంది.. ఇంకొన్నేళ్లలో నేలపై మనిషి మనుగడ కష్టమే. మరి మార్గోపాయమేమిటి? సముద్రమే అంటోంది సుప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్. వందేళ్ల తరువాత భూమిపై మానవ మనుగడ ఎలా ఉంటుందన్న అంశంపై శాంసంగ్ కొన్ని అంచనాలను సిద్ధం చేసింది. దీని ప్రకారం... పెరిగిపోతున్న జనాభాకు తగిన ఆవాసాన్ని కల్పించేందుకు సముద్రాలే మేలు. ఫొటోలో చూపినట్లు భారీ సైజు బుడగల్లో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఇళ్లు, కార్యాలయాలు ఏర్పాటవుతాయి. అవసరాన్నిబట్టి ఇంట్లోని గదుల సైజులు మారిపోతాయి. ఎవరైనా అతిథులు వస్తే లివింగ్ రూమ్ కాస్తా బెడ్రూమ్గా మారిపోతుందన్నమాట.
చుట్టూ ఉండే సముద్రపు నీటిని ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొడతారు. హైడ్రోజన్ ఇంధనంగా పనికొస్తే.. ఆక్సిజన్ మనిషి ఊపిరిపీల్చుకునేందుకు ఉపయోగిస్తారు. సముద్రపు అలల ద్వారా కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని వాడుకుంటారు. నేల అవసరం లేని వ్యవసాయం (హైడ్రోపోనిక్స్) ద్వారా ఎవరికి వారు ఇంటి పంటలు పండించుకుంటారు.