
అభివృద్ధి చేసిన ఐఐటీ–చెన్నై బృందం
చెన్నై: ఇతర గ్రహాలపై సమీప భవిష్యత్తులో మానవ ఆవాసాలు నిర్మించడం సాధ్యమేనని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి ఆవల గ్రహాలపై ఆవాసాలు నిర్మించుకొనే దిశగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయా గ్రహాలపై లభించే వనరులతోనే ఇళ్లు రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ విషయంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–మద్రాసుకు చెందిన ఎక్స్‌ట్రాటెరెన్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్(ఎక్స్‌టెమ్) గణనీయమై పురోగతి సాధించింది.
నీటితో సంబంధం లేని కాంక్రీట్‌ను అభివృద్ధి చేసింది. అంగారక(మార్స్) గ్రహంపై ఇళ్ల నిర్మాణానికి ఈ కాంక్రీట్ చక్కగా సరిపోతుందని చెబుతున్నారు. సల్ఫర్ మిశ్రమంతో కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు ఎక్స్‌టెమ్ బృందం వెల్ల్లడించింది. అంగారకుడిపై సల్ఫర్ సమృద్ధిగా ఉంది.
అక్కడ ఇప్పటివరకైతే నీటి జాడ కనిపెట్టలేదు. ఇదిలా ఉండగా, ఎలాంటి వాతావరణం లేని శూన్య స్థితిలో నిర్మాణాలపై ఎక్స్‌టెమ్ బృందం పరిశోధనలు చేస్తోంది. మైక్రోగ్రావిటీ డ్రాప్‌టవర్‌ను రూపొందించింది. జీరో గ్రావిటీలో వస్తువుల లక్షణాలపై దీనిద్వారా అధ్యయనం చేయొచ్చు. భూమిపై నుంచి వస్తువులు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇతర గ్రహాలపై ఉన్న వస్తువులు, వసతులతోనే వ్యోమగాములు అక్కడ మనుగడ సాగించేలా చేయాలన్నదే తమ ఆశయమని ఎక్స్‌టెమ్ ప్రతినిధి ప్రొఫెసర్ సత్యన్ సుబ్బయ్య చెప్పారు.