స్లాబే ముంచింది..!
- కాంక్రీట్ నిర్మాణం కూలడంతోనే ప్రమాదం
- రెండువారాల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక
- దిగువ జూరాలను సందర్శించిన నిపుణుల కమిటీ
ఆత్మకూర్: దిగువ జూరాల పవర్‌హౌస్‌ను ముంచెత్తిన సంఘటనలో అనుకున్నదే జరిగింది. నాలుగో యూనిట్‌లోని 7వ గేట్ కాంక్రీట్ స్లాబ్ కూలిపోవడంతోనే పవర్‌హౌస్‌ను వరదనీరు ముంచెత్తిందని నిపుణుల కమిటీ ఓ నిర్ధారణకు వచ్చింది. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రెండువారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు. వివరాల్లోకెళ్తే..రూ.1474కోట్ల భారీవ్యయంతో ఆత్మకూర్ మండలం జూరాల, మూలమళ్ల గ్రామాల శివారులో నిర్మిస్తున్న దిగువ జూరాల పవర్‌హౌస్‌ను జూలై 30న వరదనీరు ముంచెత్తిన విషయం తెలిసిందే.
ఈ ఘటన గల కారణాలను తెలుసుకునేందుకు ఆదివారం నీటిపారుదలశాఖ మెకానికల్ చీఫ్ ఇంజనీర్లు, గేట్, కాంక్రీట్ నిపుణులు, ప్రొఫెసర్లతో కూడిన ఐదుగురు కమిటీ సభ్యులు మురళీధర్, సత్యనారాయణ, రమేష్‌రెడ్డి, రమణారావు, రాంమ్మోహన్రావు దిగువ జూరాలను సందర్శించారు. వీయర్స్, పవర్‌హౌస్, ఎలక్ట్రికల్స్ తదితర ప్రదేశాలను సందర్శించిన అనంతరం నాలుగో యూనిట్లోకి దిగి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగో యూనిట్‌లోని 7వ గేట్ వద్ద కాంక్రీట్ స్లాబ్ కూలడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఇకముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలపై చర్చిస్తామన్నారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి వారం రోజుల్లో జెన్కోకు పూర్తినివేదికను సమర్పిస్తామన్నారు. సంఘటనకు గల కారణాలు, నష్టం వివరాలను ఇప్పుడే చెప్పలేమన్నారు. పవర్‌హౌస్‌ను పరిశీలించిన వారిలో జెన్కో డెరైక్టర్ వెంకటరాజం, సీఈ రత్నాకర్, ఎస్ఈలు శ్రీనివాస్, శ్రీనివాసా, ఈఈలు రమణమూర్తి, రాంభద్రరాజు, వీర్క్స్ కంపెనీ ఎండీ సుదర్శన్‌రెడ్డి, డెరైక్టర్ కౌషిక్కుమార్రెడ్డిలతో పాటు ఆల్‌స్ట్రాం కంపెనీ నిర్వాహకులు ఉన్నారు.
రెండువారాలు ఆగాల్సిందే..!
దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జూలై 30న రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా వరదనీరు పవర్హౌస్చేరింది. ఈ సంఘటనలో భారీగానే ఆస్తినష్టం జరిగింది. 39రోజులుగా అధికారులు రేయింబవళ్లు సహాయక చర్యలు చేపడుతున్నా నష్టం, సంఘటన వివరాలు వెల్లడించలేదు. నిపుణుల కమిటీ వచ్చి సందర్శించిన నేపథ్యంలో సంఘటన గల కారణాలు పూర్తిస్థాయిలో తెలియాలంటే మరో రెండువారాలు ఆగాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. అంతకుముందు దిగువ జూరాలను వరద ముంచెత్తిన ఘటనపై విచారణ కోసం వచ్చిన నిపుణుల కమిటీ సందర్శన కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులను జెన్కో అధికారులు అడ్డుకున్నారు. జర్నలిస్టులు నిరసన వ్యక్తంచేయడంతో మళ్లీ అనుమతిచ్చారు.