మార్స్‌ను దాటిన తోకచుక్క.. మామ్ క్షేమం!
వాషింగ్టన్: ఖగోళ శాస్త్రవేత్తలను ఉత్కంఠకు గురిచేస్తూ.. ఆదివారం మధ్యాహ్నం సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క అంగారకుడిని సురక్షితంగా దాటిపోయింది. సౌరకుటుంబం వెలుపల నుంచి వచ్చిన ఈ తోకచుక్క సెకనుకు 56 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు అరుణగ్రహానికి 1,39,500 కి.మీ. సమీపం నుంచి దూసుకుపోయింది.
అంగారకుడి చుట్టూ తిరుగుతున్న మన మామ్(మంగళ్‌యాన్), అమెరికాకు చెందిన మూడు ఉపగ్రహాలు, ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన మరో ఉపగ్రహానికి ఈ తోకచుక్క నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో శాస్త్రవేత్తలు ఉత్కంఠగా ఎదురుచూశారు. సైడింగ్ స్ప్రింగ్ నుంచి ధూళికణాలు మార్స్‌వైపు వచ్చే సమయానికి ఉపగ్రహాలన్నీ మార్స్ వెనకవైపు ఉండేలా శాస్త్రవేత్తలు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో తోకచుక్కను ఫొటోలు తీయడంతో పాటు ఉపగ్రహాలన్నీ అనుకున్న సమయానికి మార్స్ వెనకకు చేరడంతో సురక్షితంగా ఉన్నాయని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది.