Astronomers
-
అక్కడ ఏడాదికి 21 గంటలే
అనగనగా అదో గ్రహం. నెఫ్ట్యూన్ సైజులో ఉంటుంది. దానిపై ఒక ఏడాదిలో కేవలం 21 గంటలే ఉంటాయి! అది మాతృ నక్షత్రానికి అతి సమీపంగా ఉండటమే ఇందుకు కారణమట. దాంతో నక్షత్రం చుట్టూ ఆ గ్రహం పరిభ్రమణం కేవలం 21 గంటల్లో పూర్తయిపోతోందని సైంటిస్టులు కనిపెట్టారు. టీఓఐ–3261గా పిలిచే ఈ గ్రహం, దాని తాలూకు నక్షత్రమండలం వయసు 650 కోట్ల ఏళ్లని అంచనా. తొలుత బృహస్పతి పరిమాణంలో ఉన్న ఈ గ్రహం నిరంతరం ద్రవ్యరాశిని కోల్పోతూ చిన్నదవుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. దాని మాతృనక్షత్రపు ఆకర్షణ శక్తే ఇందుకు ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పరిమాణంలో నెఫ్ట్యూన్‌కు సమానంగా ఉన్నా ద్రవ్యరాశి మాత్రం దానితో పోలిస్తే రెట్టింపుగా ఉందట! టీఓఐ–3261 ఉనికి గ్రహాల ఆవిర్భావానికి సంబంధించిన ప్రస్తుత సిద్ధాంతాలన్నింటినీ సవాలు చేస్తుండటం విశేషం. ఎందుకంటే మాతృ నక్షత్రానికి అంత దగ్గరగా ఉండే గ్రహాలపై దట్టమైన వాయువులతో కూడిన వాతావరణం నిలిచి ఉండటం దాదాపుగా అసాధ్యమన్నది శాస్త్ర ప్రపంచంలో ఇప్పటిదాకా ఉన్న భావన. దాంతో గ్రహాల పుట్టుకకు సంబంధించి మనకు తెలియని కొత్త కోణాలకు టీఓఐ–3261 దారి చూపుతుందని భావిస్తున్నారు. అందుకే దానిపై వాతావరణాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాలూకు పరారుణ కాంతి టెక్నాలజీ సాయంతో లోతుగా పరిశోధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త ఎమ్మా నబ్బీ ఆధ్వర్యంలోని సైంటిస్టుల బృందం అధ్యయనంలో వెల్లడైన ఈ విశేషాలను ఆస్ట్రానామికల్ జర్నల్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్ర‘పంచాంగం’
విశ్వంలో ఏదైనా చక్రగతిలోనే తప్ప సరళరేఖలో సాగదు; మానవజీవితమూ దీనికి మినహాయింపు కాదు. పగటిని రాత్రి అనుసరిస్తుంది; సూర్యుని చంద్రుడూ, నక్షత్రాలూ అనుసరిస్తాయి. మనిషి జీవితంలోనూ సుఖాల వెలుగును వెన్నంటే కష్టాల చీకట్లూ ఉంటాయి. జీవపరిణామక్రమంలో మనిషిలో మెదడు అభివృద్ధి చెంది ఆలోచన పదునెక్కినకొద్దీ అతణ్ణి అమితంగా తికమక పెట్టిన వాటిలో ఈ చక్రగమనం ఒకటి. మనుగడ పూర్తిగానూ, నేరుగానూ ప్రకృతివనరులపై ఆధారపడిన ఆదిమకాలంలో వేడి, వర్షం, చలి చక్రగతిని ఎందుకు అనుసరిస్తాయన్నది, కడుపు నిండిన తర్వాత కలిగే జిజ్ఞాస కాదు; కడుపు నింపుకోవడంతో ముడిపడిన చిక్కుప్రశ్న. ఈ ఋతుపరివర్తనలో అతని చుట్టూ ఉన్న పరిసరాలు మారిపోయి; తను ఆహారం కోసం ఆధారపడిన కొన్ని రకాల జంతువులు అదృశ్యమై, కొత్తవి అడుగుపెడుతున్నాయి! దీనిని అర్థంచేసుకోడానికీ, దీనికి ఎవరు కారణమో తెలుసుకోడానికీ సమయం పట్టింది. పెరిగి తరిగే చంద్రకళలే కారణమనుకుని వాటిని కాలానికి అన్వయించుకుని ఋతుచక్రానికి కాలచక్రాన్ని జోడించుకున్నాడు. అలా కాలగణనంలో చాంద్రమానం అడుగుపెట్టి ఇప్పటికీ ఒక సంప్రదాయంగా కొన సాగుతోంది. ఆ క్రమంలోనే రేపు, అంటే చైత్ర శుక్ల పాడ్యమి నాడు మనం జరుపుకొంటున్నది స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఉగాది. ఉగాదిని ఇప్పుడు మనం ఒక పండుగగానే భావిస్తాం; గడిచిన ఏడాది ఎదురైన కష్టనష్టాలూ, ఆశాభంగాల పాత దుస్తులు విడిచేసి కొత్త ఆశలూ, ఉత్సాహాల ఉడుపులు ధరించే సందర్భమను కుంటాం; ఆరు రుచుల సమ్మేళనంగా జీవితాన్ని సంకేతించేదిగా గుర్తుపెట్టుకుంటాం; పంచాంగ శ్రవణానికీ, కవితా శ్రవణానికీ కూడా చెవులు అప్పగిస్తాం. నూతనశోభకు, శుభానికి తలుపు తెరిచేలా తోచే ఏ సందర్భమైనా పండుగే. అయితే, ఉగాది పేరిట కొత్త సంవత్సర ప్రారంభాన్ని పండుగగా మలచడం వెనుక ఎంతో కథ ఉంది; అంతుబట్టని కాలచక్రపు తిప్పుళ్ళకు బిత్తరపోయి, తిరిగి నిలదొక్కుకోడానికి బతుకు చేసే పెనుగులాట ఉంది; కాలగమనాన్ని అర్థం చేసుకోవడానికి పడిన అంతులేని వైజ్ఞానిక ప్రయాస ఉంది; మనం అనాగరికునిగా పొరబడే ఆదిమానవుణ్ణే తొలి ఖగోళ వేత్తగా రూపించి నిరూపించే అద్భుత నేపథ్యం ఉంది. తప్పులు, సవరణల రూపంలో సాగిన ఆ కాలగణనం కసరత్తులోకి తొంగిచూసినప్పుడు నాటి మానవుల ఆరాటపోరాటాలతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలు మన కళ్లను మెరుపులా తాకి ఆశ్చర్యం గొలుపుతాయి. చంద్రుని వృద్ధిక్షయాల ఆధారంగా కాలాన్ని గణించడం, యాభైవేల సంవత్సరాల క్రితమే పాతరాతియుగంలో మొదలైనట్టు శాస్త్రవేత్తలు నిరూపించారు. అప్పటి గుహాచిత్రాలలో కనిపించిన పొడవాటి దండాన్ని చంద్రకళల ఆధారంగా కాలాన్ని కొలిచే సాధనంగా గుర్తించారు. ఇప్పటికీ పన్నెండు రాశులలో ఒకటిగా ఉన్న మేషరాశిని సూచించే పొట్టేలు బొమ్మతో సహా వివిధ జంతు వుల బొమ్మలు ఆ దండంపై ఉన్నాయి. అనంతరకాలంలో పురోహితులు, మాంత్రికులు, పాలకులు ధరించే దండాలకు అదే మాతృక అయినట్టు తేల్చారు. చంద్రునితో ఋతువుల మార్పును ముడి పెట్టి చాంద్రమానానికి అలా తెరదీయడం గొప్ప ముందడుగే కానీ; ఋతుచక్రానికి, చాంద్రమానంలోని మాసచక్రానికి పొంతన కుదరకపోవడంతో, ఋతుపరివర్తనకు సూర్యుడు కారణమన్న ఎరుక పుట్టి సౌరమానం అడుగుపెట్టింది. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ; ఇరవైమూడున్నర డిగ్రీల ఒంపుతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందన్న గ్రహింపు లేని ఆ కాలంలో కూడా సంవత్స రానికి 300 నుంచి 400 రోజులను లెక్కగట్టడాన్ని నేటి శాస్త్రవేత్తలు అబ్బురంగానే పరిగణిస్తారు. చాంద్రమానం సంవత్సరానికి 354 రోజులను లెక్కిస్తే, మరింత నిర్దుష్టమైన సౌరమానం 365 పైచిలుకు రోజులను లెక్కించింది. రెంటిమధ్యా ఉన్న 11 రోజుల పైచిలుకు తేడాను సరిపెట్టి రెండు మానాలనూ సమన్వయించడం ఖగోళ పండితులకు పెద్ద సవాలే అయింది. రోమన్, జూలి యన్, గ్రెగేరియన్ లాంటి ఎన్ని కాలగణన పద్ధతులు వచ్చినా ఇలాంటి సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని ‘కేలండర్ కథ’ అనే పుస్తకంలో డా. మహీధర నళినీమోహన్ అంటారు. మనదేశానికి చెందిన భాస్కరాచార్యులు సహా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఖగోళపండితులు సంవత్సరానికి 365 రోజుల పైచిలుకును సక్రమంగానే గుర్తించారు. కానీ అందులో ప్రకృతి సిద్ధంగా ఉన్న భిన్నాంకం వారి మేధకు లొంగేది కాదు. చాంద్రమానంలో భాగమైన నెలకు 29 రోజుల పైచిలుకు లెక్కా అలాంటిదే. భూభ్రమణంలో ఒంపు వల్ల కాలగణనంలో ఏర్పడే ఆ వైవిధ్యమే లేనప్పుడు ఋతుపరివర్తనే అంతరించి మరింత విషమసమస్య తలెత్తే మాటా నిజమే. మొత్తంమీద అప్పటినుంచీ ఇప్పటివరకూ కేవల చాంద్రమానం, కేవల సౌరమానం; చాంద్ర– సౌరమానాల సమన్వయం అనే మూడు పద్ధతులూ అమలులో ఉన్నాయి. విశేషమేమిటంటే, కాల గణనానికి అనుసరించిన పద్ధతుల్లోనూ, ఆ క్రమంలో ఎదురైన సమస్యల పరిష్కారంలో సాఫల్య, వైఫల్యాలలోనూ ప్రపంచానుభవం ఒక్కలాంటిదే. కనుక ‘పంచాంగం’ అనే మాటను ‘ప్రపంచాంగం’గానూ చెప్పుకోవడంలో తప్పులేదు. పైన చెప్పిన సౌర, చాంద్రమానాల సమన్వయాన్నే ‘యుగం’ అంటారని ‘జనకథ’ అనే పుస్తకంలో రాంభట్ల కృష్ణమూర్తిగారి వివరణ. అధికమాసాలను పాటించడం ఇందులో భాగమే. అప్పుడు కూడా రెండు మానాల సమన్వయం అయిదేళ్ళకోసారే సాధ్యమవుతుంది. అదే అసలైన ‘యుగాది’. ఇప్పుడు ‘ఉగాది’ పేరుతో ఏటా జరుపుకొంటున్నాం. -
పుస్తక హననం
నేను గనక కాలంలో వెనక్కి వెళ్లగలిగితే, అలెగ్జాండ్రియా లైబ్రరీని దర్శిస్తానంటాడు ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ . ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీకి ప్రపంచంలోనే అత్యంత గొప్ప గ్రంథాలయం అని పేరు. వేలాది గ్రీకు, హీబ్రూ, మెసొపొటేమియన్ సాహిత్య స్క్రోల్స్, ప్రాచీన ఈజిప్టుకు చెందిన కళోపకరణాలు ఇక్కడ ఉండేవి. ఎరాటోస్తనీస్, ఆర్కిమెడీస్, యూక్లిడ్ వంటి గ్రీకు శాస్త్రజ్ఞులు దీన్ని సందర్శించారు. రెండు వేల ఏళ్ల కిందట ఇది వైభవోపేతంగా వర్ధిల్లిందనీ, దీన్ని క్రీ.పూ. 48–47 ప్రాంతంలో సీజర్ తగలబెట్టేశాడనీ చెబుతుంటారు. అయితే, తగలబడిందని నిర్ధారించడానికి చారిత్రక ఆధారాలు లేవనీ, మానవ జాతి పోగేసుకున్న సమస్త వివేకసారం మట్టి పాలైందని అనుకోవడంలో ఉన్న ఉద్వేగంలోంచి ఈ కథ పుట్టివుంటుందనీ చెబుతాడు బ్రిటిష్ లైబ్రేరియన్, రచయిత రిచర్డ్ ఓవెండెన్ . ఇప్పటి ‘పుస్తకం’ ఉనికిలో లేని ఆ కాలంలో నునుపు చేసిన చెట్ల బెరడుల రోల్స్ కాలక్రమంలో నశించడమే ఈ కథగా మారివుంటుందని మరో కథ. ఏమైనా, సమస్త విజ్ఞానం ఒక చోట రాశిగా పోగయ్యే గ్రంథాలయం అనే భావనను ఊహించడమే మానవ నాగరికత సాధించిన విజయం. ఆ గ్రంథాలయాలనే నేలమట్టం చేయడం ద్వారా శత్రువు మీద పైచేయి సాధించే ప్రయత్నం చేయడం... అదే నాగరిక మానవుడి అనాగరికతకు తార్కాణం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటినుంచీ జరుగుతున్న ప్రాణనష్టం గురించి మీడియా మాట్లాడుతూనే ఉంది. కానీ గాజాలో కనీసం పదమూడు గ్రంథాలయాలకు ఇజ్రాయెల్ వల్ల నష్టం వాటిల్లింది. ఇందులో కొన్ని పూర్తిగా నాశనం కాగా, కొన్ని దారుణంగా దెబ్బతినడమో, అందులో ఉన్నవి దోచుకెళ్లడమో జరిగింది. నూటా యాభై ఏళ్ల గాజా చరిత్ర రికార్డులున్న సెంట్రల్ ఆర్కైవ్స్ ఆఫ్ గాజా, పాలస్తీనాలోని అరుదైన పుస్తకాల కలెక్షన్ కలిగివున్న గ్రేట్ ఒమారి మాస్క్, వేలాది పుస్తకాలకు నెలవైన డయానా తమారీ సబ్బాగ్ లైబ్రరీతో పాటు, గాజా యూనివర్సిటీ లైబ్రరీ, అల్–ఇస్రా యూనివర్సిటీ లైబ్రరీ కూడా దెబ్బతిన్నవాటిల్లో ఉన్నాయి. ‘‘ఆర్కైవ్ మీద ఆధిపత్యం లేకపోతే రాజకీయ అధికారం లేదు’’ అంటాడు ఫ్రెంచ్ విమర్శకుడు జాక్వెస్ డెరిడా. అందుకే గ్రంథాలయాలను దొంగదెబ్బ కొట్టడం అనేది చరిత్ర పొడవునా జరుగుతూనే ఉంది. ప్రపంచానికే జ్ఞానకాంతిగా వెలుగొందింది భారత్‌లోని నలందా విశ్వవిద్యాలయం. 5వ శతాబ్దంలో గుప్తులకాలంలో ఇది నిర్మితమైంది. రత్నదధి, రత్నసాగర, రత్నరంజక పేరుతో మూడు తొమ్మిదంతస్థుల భవనాలుండేవి. ఖగోళం, జ్యోతిషం, గణితం, రాజకీయం, ఆయుర్వేదం, వైద్యం, కళలు, సాహిత్యం, వ్యాకరణం, తర్కం సంబంధిత అంశాలన్నింటికీ నెలవు ఇది. జైన తీర్థంకరుడు మహావీరుడు 14 వర్షాకాలాలు ఇక్కడ గడిపాడట! క్రీ.శ.1193లో భక్తియార్ ఖిల్జీ దీన్ని తగలబెట్టించాడు. దేశంలో బౌద్ధ ప్రాభవం క్షీణించడానికి ఇదీ ఓ కారణమని చెబుతారు. ‘‘గ్రంథాలయాల ద్వారా సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంది. కొన్నిసార్లు గ్రంథాలయాలను సాంస్కృతిక హనన పథకంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారు. ఎన్నో ప్రజా, ప్రైవేటు లైబ్రరీలు మూర్ఖ దురాక్రమణదారుల వల్ల నాశనం అయ్యాయి’’ అంటారు పాత్రికేయుడు జానీ డైమండ్. బీజింగ్‌లో ఎనిమిదో శతాబ్దంలో నెలకొల్పిన హాన్లిన్ లైబ్రరీ ఒక విజ్ఞాన భాండాగారం. ఇందులో ఒక ముఖ్యమైన సోర్సు మింగ్ వంశపు చక్రవర్తి ఝూ డీ 1403లో ‘జాంగ్లే దాదియన్ ’ పేరుతో సిద్ధం చేయించిన ఎన్ సైక్లోపీడియా. వ్యవసాయం, నాటకం, భూగర్భశాస్త్రం, వైద్యం, కళ, చరిత్ర, సాహిత్యం లాంటి వాటితో కూడిన 22,000 విభాగాలు అందులో ఉన్నాయి. 1900వ సంవత్సరంలో మంటల్లో లైబ్రరీ తగలబడినప్పుడు ఆ ఎన్ సైక్లోపీడియా కూడా మసైపోయింది. వలసవాదులు, తిరుగుబాటుదారుల రూపంలో ఉన్న బ్రిటిష్ వాళ్లు, చైనీయులు దీనికి కారణం మీరంటే మీరేనని పరస్పరం నిందించుకున్నారు. అమెరికా జాతీయ గ్రంథాలయాన్ని 1814లో బ్రిటిష్‌వాళ్లు నాశనం చేశారు. అప్పటికి దాన్ని నెలకొల్పి నాలుగేళ్లే అయింది. సెనేటర్ల ఉపయోగార్థం 3000 వాల్యూములు అందులో ఉన్నాయి. అయినప్పటికీ ఆ దెబ్బ తమ జాతి ఆత్మను గాయపరిచిందంటాడు అమెరికా చరిత్రకారుడు రాబర్ట్ డార్న్‌టన్ . అదే బ్రిటనీయులు 2003లో ఇరాక్ జాతీయ గ్రంథాలయాన్ని నాశనం చేశారు. పనామ్ పెన్ ్హ నగరంలోని జాతీయ గ్రంథాలయాన్ని 1967లో సర్వనాశనం చేయడం ద్వారా కంబోడియా నాగరికత మొత్తాన్నీ ‘ఖ్మేర్ రూజ్’ తుడిచిపెట్టింది. దేశ చరిత్రను మళ్లీ ‘ఇయర్ జీరో’ నుంచి మొదలుపెట్టించాలన్న మూర్ఖత్వంలో భాగంగా కమ్యూనిస్టు నాయకుడు పోల్ పాట్ సైన్యం నరమేధానికీ, సాంస్కృతిక హననానికీ పాల్పడింది. సుమారు లక్ష పుస్తకాలున్న, అప్పటికి యాభై ఏళ్ల పాతదైన శ్రీలంకలోని జాఫ్నా పబ్లిక్ లైబ్రరీని 1981లో సింహళ మూక కూడా అలాగే తగలబెట్టింది. ఒక గ్రంథాలయం ధ్వంసమైతే మనం ఏం కోల్పోయామో కూడా మనకు తెలియకపోవడం అతి పెద్ద విషాదం. ఒక గ్రంథాలయాన్ని నిర్మూలించడమంటే ఒక దేశ, ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం; గతపు ఘనతను పూర్తిగా నేలమట్టం గావించడం; అన్నీ కోల్పోయినా మళ్లీ మొదలెట్టగలిగే శక్తియుక్తులను నిర్వీర్యం చేయడం; చెప్పాలంటే ఇంకేమీ లేకుండా చేయడం, సున్నా దగ్గరికి తెచ్చి నిలబెట్టడం! అయినా గోడలు కూలితేనే, పుస్తకాలు కాలితేనే గ్రంథాలయం నాశనం కావడమా? వాటిపట్ల నిర్లక్ష్యం వహించడం మాత్రం నెమ్మదిగా నాశనం చేయడం కాదా? -
సుదూర విశ్వంలో అఖండ జలనిధి! భూమి కంటే 140 లక్షల కోట్ల రెట్లు
ఖగోళ శాస్త్రవేత్తలు సంచలన విషయాన్ని కనుగొన్నారు. మనకు తెలిసిన విశ్వంలో ఇప్పటివరకు ఎవరూ కనుక్కోని ఊహకే అందనంత అతిపెద్ద, అత్యంత సుదూర నీటి మేఘాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై ఉన్న నీటి కంటే 140 లక్షల కోట్ల రెట్ల భారీ జలనిధిని బహిర్గతం చేశారు. యూనిలాడ్ (UNILAD) అనే బ్రిటిష్ ఇంటర్నెట్ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. క్వేసార్ (quasar) అని పిలిచే ఒక భారీ ఫీడింగ్ బ్లాక్ హోల్ చుట్టూ ఇది నీటి ఆవిరి రూపంలో విస్తరించింది. ఈ విస్తారమైన కాస్మిక్ నీటి వనరు వేల కోట్ల కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉంది. అంతరిక్షంలో ఉన్న నీటితో పోలిస్తే ఈ నీటి ఆవిరి మేఘం వెచ్చగా ఉంటుంది. భూమిపై ఉండే వాతావరణం కంటే 300 లక్షల రెట్లు తక్కువ సాంద్రత ఉంటుంది. పరిమాణానికి తగ్గట్టే అంతరిక్షంలోని ఈ నీటి మేఘం వందల కాంతి సంవత్సరాల విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన మ్యాట్ బ్రాఫోర్డ్ ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యతను తెలియజేశారు. అత్యంత ప్రారంభ సమయాల్లోనే నీరు విశ్వం అంతటా వ్యాపించి ఉందనటానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. -
ఖగోళ రహస్యాలను చేధించిన ఎడ్విన్ హబుల్.. టెలిస్కోప్‌తో ఎన్నో ఆవిష్కరణలు
ఖగోళ వింతలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? టెలిస్కోప్ ఆవిష్కణలతో ఆకాశ వింతల్ని దగ్గరన్నుంచి చూసి విశ్వం రసహ్యాలను తెలుసుకోవచన్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే చాలా టెలిస్కోప్‌లు ఉన్నాయి. కానీ చరిత్రలో కొన్ని టెలిస్కోపులకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. అందులో ఒకటి హబుల్ టెలిస్కోప్. విశ్వ రహస్యాలను మన కళ్లముందు ఉంచడంతో పాటు అంతరిక్షంలో బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. . ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ గౌరవార్థం హబుల్ స్పేస్ టెలిస్కోప్‌కు ఆ పేరు పెట్టారు. ఇవాళ(సోమవారం)ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ. అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త అయిన ఎడ్విన్ హబుల్ నవంబర్ 20, 1889లో మిస్సౌరీలోని మార్ష్‌ఫీల్డ్‌లో జన్మించాడు. 1910లో అతను చికాగో విశ్వవిద్యాలయం నుంచి చదువు పూర్తిచేశాడు.ఖగోళ శాస్త్రంలో అనేక అధ్యయనాలు చేసి విశేష గుర్తింపు పొందాడు. గెలాక్సీలను అధ్యయనం చేయడంలో హబుల్ ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడ్డాయి. 1923లో నెబ్యులాలో సెఫీడ్ వేరియబుల్స్ అని పిలువబడే ఒక రకమైన నక్షత్రాన్ని కనుగొన్నాడు, నెబ్యులా అనేక వందల వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని (పాలపుంత గెలాక్సీ వెలుపల) ఇది మరొక గెలాక్సీ అని హబుల్ నిర్ధారించాడు. విశ్వంలో అనేక గెలాక్సీలు ఉన్నాయని తన పరిశోధనల ద్వారా కనుగొన్నాడు. గెలాక్సీల రెడ్‌షిఫ్ట్, దూరం మధ్య స్థిరమైన సంబంధాన్ని కనుగొనడం ద్వారా విశ్వం విస్తరిస్తోంది అని నిరూపించాడు. ఇక హబుల్ పేరుమీద హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని పేరు పెట్టారు. ఇది హబుల్ స్పేస్ టెలిస్కోప్..ఇది అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ప్రధాన ఆప్టికల్ టెలిస్కోప్. 1990లో దీన్ని ప్రయోగించారు. ఎడ్విన్ హబుల్ గౌరవార్థం టెలిస్కోప్‌కు ఆ పేరు పెట్టారు. విశ్వం పరిమాణమెంతో అంచనా కట్టేందుకు మొదలుకొని,నక్షత్రాలు, గ్రహాల పుట్టుక వంటివెన్నో విషయాలను అంచనా వేయడానికి హబుల్ టెలిస్కోపు పరిశోధనలు కీలకపాత్ర వహించాయి. సౌరకుటుంబం అవతల ఉన్న గ్రహాల రూపురేఖలు, వాటిల్లో ఉండే రసాయనాల వివరాలు తెలిసింది కూడా హబుల్ తీసిన ఫొటోల ఆధారంగానే. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం వరకూ చూడగల సామర్థ్యమున్న హబుల్ టెలిస్కోపు నక్షత్రాలు ఎంత వేగంగా కదులుతున్నాయో కూడా ఫోటోలు తీసి పంపించింది. వీటి ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విశ్వం వయసు 1300 నుంచి 1400 కోట్ల సంవత్సరాల వరకూ ఉంటుందని అంచనా కట్టగలిగారు.ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని తొలిసారి నేరుగా ఫొటో తీయగలిగింది కూడా ఈ టెలిస్కోప్ ద్వారానే. -
అయ్యో పాపం నెప్ట్యూన్...మేఘాలన్నీ మటుమాయం
అవున్నిజమే! నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఎవరో మంత్రం వేసినట్టు ఉన్నట్టుండి మటుమాయం అయిపోయాయి. ఈ వింతేమిటి? అందుకు కారణమేమిటి...? నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఉన్నట్టుండి అమాంతంగా తుడిచిపెట్టుకుపోయాయి. సూర్యుని 11 ఏళ్ల ఆవర్తన చక్రం ప్రభావమే ఇందుకు కారణం కావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. సాధారణంగా సూర్యుని చురుకుదనం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాల పరిమాణమూ చాలా ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువగా ఉన్నప్పుడు అవి దాదాపుగా లుప్తమైపోతాయి. ఇది సాధారణ దృగి్వషయమే. అయితే గత కొన్నేళ్లుగా ఆ గ్రహం మీద మేఘాలన్నవే లేకుండా పోవడం ఆశ్చర్యంగా ఉందని వారు చెబుతున్నారు. ఏమిటి కారణం? ► సూర్యరశ్మి నెప్ట్యూన్ వాతావరణపు పై పొరను తాకినప్పుడు అక్కడ మేఘాల సంఖ్యలో హెచ్చుతగ్గుల క్రమం వేగం పుంజుకుంటూ ఉంటుంది. ► సౌర శక్తి వల్ల అక్కడ మీథేన్ మేఘాలు ఏర్పడటంతో పాటు పలు రసాయనాలు కూడా పుడతాయి. ► 11 ఏళ్ల సౌర ఆవర్తన క్రమమే ఇందుకు కారణం కావచ్చన్నది సైంటిస్టుల అంచనా. ► కానీ సౌర కుటుంబంలో సూర్యునికి సుదూరంగా ఉండే గ్రహాల్లో నెప్ట్యూన్ ఒకటి. దానికంటే దూరంగా ఉండేది ప్లూటో మాత్రమే! ► దాంతో నెప్ట్యూన్‌కు అందే సూర్యరశ్మి భూమికి అందే దానిలో ఒక్కటంటే ఒక్క వంతు మాత్రమే! ► నెప్ట్యూన్ నుంచి చూస్తే సూర్యుడు మిలమిల మెరిసే ఒక చిన్న నక్షత్రంలా కనిపిస్తాడు తప్ప మనకు కనిపించేంత భారీ పరిమాణంలో కాదు. ► అలాంటప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాలు సమూలంగా మాయం కావడానికి సౌర ఆవర్తన చక్రమే ఏకైక కారణమా, ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అన్నది తెలుసుకునే ప్రయత్నంలో నాసా సైంటిస్టులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. వేడెక్కాల్సింది పోయి... చల్లబడుతోంది నెప్ట్యూన్ దక్షిణార్ధ భాగం గత 15 ఏళ్లుగా క్రమంగా చల్లబడుతోందట. అందులో ఆశ్చర్యం ఏముందంటారా? ఉంది... ► ఎందుకంటే... ఈ సమయంలో ఆ ప్రాంతం నిజానికి క్రమంగా వేడెక్కాలి. ► 2003 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆ బుల్లి గ్రహం మీద వేసవి నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ► గత 15 ఏళ్లలో అక్కడి ఉష్ణోగ్రత కనీసం 8 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గిందట. ► హబుల్‌తో పాటు ప్రపంచంలోని పలు అతిపెద్ద టెలిస్కోప్‌లు అందించిన డేటాను విశ్లేíÙంచిన మీదట ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచి్చంది. ► అదే సమయంలో నెప్ట్యూన్ దక్షిణ ధ్రువం మాత్రం ఉష్ణోగ్రతలు 2018–2020 మధ్య కాలంలో ఏకంగా 11 డిగ్రీలు పెరిగిపోవడం విశేషం ► ఇది నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి మన లెక్కలో 165 ఏళ్లు పడుతుంది. ► అక్కడ ఒక్కో సీజన్ ఏకంగా 40 ఏళ్లుంటుంది. ► ఈ నేపథ్యంలో నెప్ట్యూన్ మీద ఇంతటి పరస్పరం విరుద్ధమైన వాతావరణ పరిస్థితులు చోటుచేసుకోవడం విచిత్రమేనని సైంటిస్టులు అంటున్నారు. -
అంతరిక్షంలో నేపథ్య గానం!
పారిస్: అంతరిక్షంలో ప్రతిధ్వనిస్తున్న శబ్దాలకు సంబంధించిన విశేషాలను ఖగోళ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. గురుత్వాకర్షణ తరంగాల నుంచి ఉద్భవిస్తున్న ధ్వనులపై ఒక ప్రకటన చేశారు. అంతరిక్షంలో వినిపిస్తున్న శబ్దాలకు సంబంధించిన నేపథ్య(బ్యాక్‌గ్రౌండ్) స్వరాలను గుర్తుపట్టినట్లు తెలియజేశారు. ఈ ప్రయోగంలో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు సైతం కీలక పాత్ర పోషించడం విశేషం. పుణెలో ఉన్న రేడియో టెలిస్కోప్‌కు ఆ ధ్వని తరంగాలు చిక్కాయి. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ డేటాను సేకరిస్తున్నారు. అంతరిక్షంలోని సుదూర ప్రాంతాల నుంచి ఆ లయబద్ధమైన శబ్దాలు(హమ్మింగ్) వస్తున్నట్లు తేల్చారు. నార్త్ అమెరికన్ నానోహెట్జ్ అబ్జర్వేటరీ ఫర్ గ్రావిటేషన్ వేవ్స్ బృందం ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇండియా, కెనడా, యూరప్, చైనా, ఆ్రస్టేలియా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. పల్సర్స్ అనే మండిన నక్షత్రాల నుంచి గురుత్వాకర్షణ తరంగాలు వస్తున్నట్లు గుర్తించారు. ఇవి శక్తివంతమైన గురుత్వాకర్షణ శబ్దాలను సృష్టిస్తున్నట్లు తేల్చారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ తరంగాల నుంచి శబ్దాలు వెలువడుతున్నట్లు శతాబ్దం క్రితమే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వెల్లడించారు. -
‘మూన్ కింగ్’గా మళ్లీ శని గ్రహం.. 83 నుంచి 145కు చంద్రుల సంఖ్య
బ్రిటిష్ కొలంబియా: సౌర కుటుంబంలో అత్యధికంగా చంద్రులు పరిభ్రమిస్తున్న శని గ్రహం ‘మూన్ కింగ్’ కిరీటాన్ని తిరిగి చేజిక్కించుకుంది. ఈ గ్రహం చుట్టూ మరో 62 చంద్రులు పరిభ్రమిస్తున్నట్లు తాజాగా ఖగోళ పరిశోధకులు గుర్తించారు. దీంతో, శని చుట్టూ తిరుగుతున్న చంద్రుల సంఖ్య 83 నుంచి 145కు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా గుర్తించిన 12 చంద్రులతో కలిపి అత్యధికంగా 95 చంద్రులతో అగ్రభాగాన నిలిచిన గురుగ్రహం మూన్కింగ్గా కొనసాగుతోంది. అయితే, అకాడెమియా సినికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఎడ్వర్డ్ ఏస్టన్ మరో 62 చంద్రులు శని గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. హవాయిలోని మౌనాకియాపై ఏర్పాటు చేసిన టెలీస్కోప్‌లో 2019–21 మధ్య నమోదైన డేటా ఆధారంగా సాగిస్తున్న పరిశోధనల్లో ఈ విషయం తేలిందన్నారు. సౌర కుటుంబంలో అత్యధిక చంద్రులతో ‘మూన్కింగ్’కిరీటాన్ని శని దక్కించుకున్నట్లయిందని ఆయన తెలిపారు. -
నక్షత్రాలు పేలితే భూమికి ముప్పు!
భూగోళంపై కోట్లాది జీవులు ఉన్నాయి. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో జీవజాలం పుట్టుకొచ్చింది. ఇందుకు ఎన్నో సంఘటనలు దోహదం చేశాయి. భూమిపై జీవుల ఆవిర్భావం, మనుగడకు ఇక్కడి అనుకూల వాతావరణమే కారణం. ధరణిపై వాతావరణం విషతుల్యంగా మారితే జీవులకు ముప్పు తప్పదు. పూర్తిగా అంతరించిపోయినా ఆశ్చర్యం లేదు. అలాంటి ప్రమాదమే తలెత్తే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుదూరంలోని అంతరిక్షంలో ఉన్న సూపర్నోవాల పేలుడు నుంచి గ్రహాలకు కొత్త ముప్పు పొంచి ఉందని, ఈ విపత్తు నుంచి తప్పించుకోవడం మన చేతుల్లో లేదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏమిటీ ముప్పు? అంతరిక్షంలో అనంతమైన నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని సూపర్నోవాగా మారి పేలిపోతుంటాయి. బ్లాస్ట్ వేవ్ సంభవిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదకరమైన ఎక్స్–కిరణాలు అధిక మోతాదులో వెలువడుతాయి. ఇవి సమీపంలోని గ్రహాలను చేరుతాయి. ఇందుకు నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పట్టొచ్చు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి దాని పరిధిలోని భూగ్రహాన్ని రక్షించడానికి ఓజోన్ పొర ఆవరించి ఉంది. సూపర్నోవా పేలుడుతో ఉద్గారమయ్యే ఎక్స్–కిరణాలు భూమిని చుట్టూ ఉన్న ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తాయి. ఓజోన్ పొర చాలావరకు తుడిచిపెట్టుకుపోతోంది. దాంతో యూవీ రేడియేషన్ నేరుగా భూగ్రహం ఉపరితలాన్ని ఢీకొడుతుంది. ఫలితంగా నైట్రోజన్ డయాక్సైడ్ అనే విషవాయువు భూమిపై ఉత్పత్తి అవుతుంది. అది విషపూరితమైన గోధుమ రంగు పొరను భూమి చుట్టూ ఏర్పరుస్తుంది. అప్పుడు వాతావరణం లుప్తమైపోతుంది. జీవులు అంతరించిపోతాయి. ఎలా గుర్తించారు? యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్తలు చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీతోపాటు ఇతర అత్యాధునిక టెలిస్కోప్‌లతో సూపర్‌నోవాలపై అధ్యయనం చేశారు. పేలిపోయే తారల నుంచి ఎక్స్–కిరణాలు వెలువడి, భూమి, ఇతర గ్రహాలను ప్రభావితం చేసే దశ రాబోతుందని, ఈ పరిణామం 100 కాంతి సంవత్సల దూరంలో చోటుచేసుకుంటుందని కనిపెట్టారు. పేలిపోయే నక్షత్రాల నుంచి వాటిల్లే ముప్పు గతంలో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగినట్లు గుర్తించారు. 160 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూపర్నోవాలు పేలిపోతే భూమిలాంటి గ్రహాలకు రేడియేషన్ ముప్పు ఉంటుందని తేల్చారు. 1979సీ, ఎస్ఎన్ 1987ఏ, ఎస్ఎన్ 2010జేఎల్, ఎస్ఎన్ 1994ఐ అనే సూపర్నోవాలను నిశితంగా పరిశీలించారు. అవి ఇప్పట్లో పేలే అవకాశం ఉందా? దానిపై ఓ అంచనాకొచ్చారు. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేనట్లే భూమికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదని శాస్త్రవేత్త కానర్ ఓమహోనీ వెల్లడించారు. ఎక్స్–రే డేంజర్ జోన్లో బలమైన సూపర్నోవా ఏదీ లేదని తెలిపారు. భూమికి సమీపంలో గతంలో తారలు పేలిపోయిన దాఖలాలు ఉన్నాయని వెల్లడించారు. 20 లక్షల నుంచి 80 లక్షల సంవత్సరాల క్రితం భూమి నుంచి 65 నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్నోవా ఒకటి పేలిపోయింది. దానికి సంబంధించిన రేడియేషన్ ఇప్పటికీ భూమి వైపునకు దూసుకొస్తోందని పరిశోధకులు గుర్తించారు. సూపర్నోవా నుంచి వెలువడే ఎక్స్–కిరణాలపై మరిన్ని పరిశోధనలు చేయడం నక్షత్రాల జీవితకాలం గురించి అర్థం చేసుకోవడానికే కాదు, ఆస్ట్రోబయాలజీ, పాలియోంటాలజీ, ప్లానెటరీ సైన్సెస్ తదితర రంగాల్లో చిక్కుముడులు విప్ప డానికి ఉపయోగపడ తాయని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్త బ్రియాన్ ఫీల్డ్స్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇతర గ్రహాలపై జీవజాలం.. ఓజోన్ పొర ఆధారం
అనంతమైన విశ్వంలో మనం జీవిస్తున్న ఈ భూగోళంపైనే కాకుండా ఇతర గ్రహాలు, నక్షత్రాలపైనా జీవజాలం ఉందా? ఇప్పుడు లేకపోయినా గతంలో ఎప్పుడైనా ఉండేదా? ఒకవేళ ఉంటే అవి ఎలాంటి జీవులు? ఈ ప్రశ్నలు ఎన్నో శతాబ్దాలుగా భూమిపై మానవాళిని వెంటాడుతూనే ఉన్నాయి. సువిశాలమైన విశ్వంలో భూమికి ఆవల జీవుల ఉనికిని కనిపెట్టేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు అలుపెరగకుండా అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. మన పాలపుంత(గెలాక్సీ)లో ఇప్పటిదాకా 5,000కుపైగా గ్రహాలను కనిపెట్టారు. వాటిపై జీవులు ఉన్నాయా? అనేది తెలుసుకొనేందుకు కృషి చేశారు. ఇందుకోసం ఎన్నెన్నో పద్ధతులు అనుసరించారు. ఇతర గ్రహాలపై జీవజాలం ఉన్నట్లు ఇప్పటివరకైతే బలమైన ఆధారాలేవీ లభించలేదు. పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిపై దృష్టి పెట్టారు. అదేమిటో తెలుసుకోవడం ఆసక్తికరమే. ► మన భూగోళానికి రక్షణ కవచం ఓజోన్ పొర అన్న సంగతి తెలిసిందే. అత్యంత హానికరమైన అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి ఓజోన్ పొర రక్షిస్తోంది. అందుకే భూమిపై కోట్లాది జీవులు నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. ► ఏదైనా గ్రహాన్ని మందపాటి ఓజోన్ పొర ఆవరించి ఉంటే ఆ గ్రహంపై జీవుల ఉనికి సాధ్యమని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇదే అంశాన్ని సరికొత్త అస్త్రంగా మార్చుకుంటున్నారు. ► ఏదైనా నక్షత్రానికి లోహతత్వం(మెటాలిసిటీ) ఎక్కువగా ఉంటే దాని చుట్టూ ఉన్న గ్రహాలపై రక్షిత ఓజోన్ పొర ఆవరించి ఉంటుందని గుర్తించారు. ► ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్ కమ్యూనికేషన్’ పత్రికలో ప్రచురించారు. ► విశ్వ పరిణామ క్రమంలో కొత్తగా పుట్టుకొస్తున్న నక్షత్రాలకు లోహతత్వం అధికంగా ఉంటున్నట్లు తేల్చారు. ఇలాంటి నక్షత్ర మండల్లాలోని గ్రహాల చుట్టూ దట్టమై ఓజోన్ పొర ఏర్పడుతుందని, తద్వారా అక్కడ జీవులు ఉద్భవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ► అధిక లోహతత్వం ఉన్న నక్షత్రాల పరిధిలోని గ్రహాలే జీవుల అన్వేషణకు మెరుగైన లక్ష్యాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ► గ్రహాల చుట్టూ రక్షిత ఓజోన్ పొర ఏర్పడాలంటే దానికి సంబంధించిన నక్షత్రానికి ఏయే లక్షణాలు ఉండాలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ► విశ్వంలో గ్రహాలను కలిగిన చాలా నక్షత్రాల ఉష్ణోగ్రత 5,000 నుంచి 6,000 డిగ్రీల సెల్సియస్ ఉంది. మన నక్షత్రమైన సూర్యుడు ఇదే విభాగంలోకి వస్తాడు. ► సూర్యుడి నుంచి వెలువడుతున్న అల్ట్రావయొలెట్ కాంతి(రేడియేషన్) మన భూగ్రహ వాతావరణంపై చూపిస్తున్న సంక్లిష్టమైన ప్రభా వాన్నే ఇతర గ్రహాల వాతావరణంపైనా చూపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ అన్నా సపిరో ఒక ప్రకటనలో వెల్లడించారు. ► నక్షత్రాల్లోని లోహతత్వం వాటి నుంచి ఉద్గారమయ్యే అల్ట్రావయెలెట్ కాంతిని ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూవీ రేడియేషన్ నక్షత్రాల సమీపంలో కక్ష్యలో తిరిగే గ్రహాల వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్న దానిపై దృష్టి సారించారు. ► మన భూగోళంపై ఉన్న వాతావరణం ఇక్కడి జీవ పరిణామ క్రమాన్ని తెలుసుకొనేందుకు ఉపకరిస్తుందని, ఇదే సూత్రాన్ని ఇతర గ్రహాలకు సైతం వర్తింపజేయవచ్చని సైంటిస్టు జోస్ లెలీవెల్డ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘జ్యూస్’ అన్వేషణకు అంకురార్పణ
ఈ విశాల విశ్వంలో మనం ఒంటరివాళ్లమా లేక మనలాగే మనుగడసాగించే బుద్ధిజీవులు వేరే గ్రహాలపై కూడా ఉన్నారా అన్న విచికిత్స ఈనాటిది కాదు. ఆ ప్రయత్నంలో గురువారం మరో అడుగు ముందుకుపడబోతోంది. యూరొపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) నేతృత్వంలో రూపొందిన ‘జ్యూస్’ (జూపిటర్ అయిసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్) అంతరిక్ష నౌక దక్షిణ అమెరికాలోని కౌరు దీవి నుంచి ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది. 2031లో అక్కడికి చేరుకున్నాక గురు గ్రహానికున్న లెక్కకు మిక్కిలి చందమామల్లో మూడింటిని ఎంచుకుని వాటిల్లో జీవుల ఉనికి సంగతిని తేల్చడం ఈ అంతరిక్ష నౌక లక్ష్యం. అంగారక గ్రహం ఆవల జీవం ఉండటానికి ఏమాత్రం అవకాశం లేదని ఒకప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. కానీ అంతటితో ఆగిపోతే మానవ జిజ్ఞాసకు అర్థం లేదు. ‘వేరెక్కడో ఒక మహాద్భుతం తనను తాను వ్యక్తపరుచుకోవటానికి వేచిచూస్తూ వుండొచ్చ’ని ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సెగాన్ ఒక సందర్భంలో అన్నారు. ఒక్క ఖగోళ శాస్త్రం అనేమిటి...సమస్త రంగాల్లోనూ మానవాళి సాధిస్తున్న విజయపరంపరకు ఈ భావనే మూలం. 1990లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గురుగ్రహంపైకి ప్రయోగించిన గెలీలియో ఉపగ్రహం, ఈమధ్యకాలంలో శనిగ్రహానికి పోయిన కేసినీ ఉపగ్రహం శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులు చేశాయి. గురుడు, శుక్రుడు, బుధుడు వంటి ఇతరేతర గ్రహాలపై జీవం ఉండక పోవచ్చుగానీ, గురుడు, అంగారకుడు మధ్య కనబడుతున్న చందమామలపై ఏదోమేర, ఏదో రూపంలో జీవం ఉండటానికి అవకాశం ఉన్నదని అవి పంపిన డేటా ఆధారంగా నిర్ధారణ కొచ్చారు. ఆ తర్వాతే ఈ మూడు చందమామలనూ అన్వేషించాలన్న నిర్ణయానికొచ్చారు. గ్రహాలన్నిటిలోనూ గురుగ్రహం చాలా పెద్దది. సంక్లిష్టమైనది కూడా. ఎందుకంటే దీనికి ఒకటీ రెండూ కాదు...ఏకంగా 92 చందమామలున్నాయి. వీటిలో కొన్ని వ్యతిరేక కక్ష్యలో కూడా తిరుగు తుంటాయి. అలాంటి చందమామల్లో పెద్దగా ఉండే యూరోపా, క్యాలిస్టో, గానిమీడ్ అనే మూడింటిని ఎంచుకుని వాటిచుట్టూ జ్యూస్ 35 ప్రదక్షిణలు చేస్తుంది. ఆ తర్వాత 2034లో గానిమీడ్ చుట్టూ నిర్దేశిత కక్ష్యలో కుదురుకుంటుంది. ఈ మూడు చందమామలూ మంచుతో నిండివున్నాయి. ఆ పొరల వెనక మహా సముద్రాలు నిక్షిప్తమైవున్నాయని శాస్త్రవేత్తల అంచనా. అదే నిజమైతే ఏదో రూపంలో అక్కడ జీవం ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గానిమీడ్పై లవణసముద్రం ఉన్నదని గుర్తించారు. నిజానికి సూర్యకాంతి పడే అవకాశం లేదు గనుక ఈ మూడు చందమామల్లో జీవం ఉనికికి అవకాశం లేదు. కానీ గురుగ్రహానికుండే గురుత్వాకర్షణ ఆ లోటు తీరుస్తోంది. ఈ చందమామల్లోని సముద్రాలు వేడెక్కడానికి దోహదపడుతోంది. గురుగ్రహానికి మన దగ్గర బృహస్పతి అనే నామాంతరం ఉంది. పురాణాల్లో బృహస్పతి దేవగురువు. యాదృచ్ఛికమే కావొచ్చు గానీ... బృహస్పతికి ప్రీతిపాత్రమైన గురువారం రోజునే గురుగ్రహానికి జ్యూస్ ప్రయాణం కడుతోంది. నిజానికి ఇంతవరకూ గురుగ్రహం గురించి మానవాళికి తెలిసింది గోరంతే. దాన్ని దట్టంగా చుట్టుముట్టివుండే వాయుమేఘాలే అందుకు కారణం. అందులో అత్యధికం, అంటే...90 శాతం హైడ్రోజన్ అయితే, మిగిలిన పదిశాతంలో హీలియం, మీథేన్, గంథకం, అమోనియా వంటివి ఉన్నాయి. అయితే ఈ మూలకాల్లో ఎన్ని వాయురూపంలో ఉన్నాయో, మరెన్ని ఘనరూపం దాల్చాయో శాస్త్రవేత్తలు ఇంకా తేల్చలేదు. అసలు గురుగ్రహం నెన్నొసట సిందూరంలా ఎర్రగా మెరిసే బింబం ఒకటుంటుంది. దాని పరిమాణమే మన భూమి కన్నా మూడింతలు కాగా, అది కుదురుగా ఒకచోట ఉండక తిరుగా డుతుంటుంది. గురుగ్రహంపై నిత్యం రేగే పెను అలజడే ఇలా కనబడుతోందని శాస్త్రవేత్తలంటారు. మనం భూమ్మీద క్షేమంగా ఉండగలుగుతున్నామంటే అది గురుగ్రహం చలవే. ఎందుకంటే భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాల్లో, ఉల్కల్లో చాలాభాగాన్ని గురుగ్రహం తనవైపు ఆకర్షించుకుని వాటివల్ల కలిగే కష్టనష్టాలను తానే భరిస్తుంటుంది. నిజానికి గురుగ్రహం చుట్టూ తిరుగాడుతున్న చందమామల్లో అనేకం అటువంటి గ్రహశకలాలే. ఇందులో ఒకటైన గానిమీడ్‌కు అయస్కాంత క్షేత్రం ఉన్నా, అది బుధుడి కన్నా చాలా పెద్దదైనా గురుడి ప్రభావానికి లోనై చందమామగానే మిగిలి పోయింది. గురుగ్రహం ఆనుపానులు రాబట్టేందుకు ఇంతవరకూ 4 అంతరిక్షనౌకలు వెళ్లాయి. 1972 మార్చిలో ప్రయోగించిన పయొనీర్–10 గురుగ్రహం చుట్టూ 2003 వరకూ చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ తర్వాత దాన్నుంచి సంకేతాలు లేవు. మన సౌర వ్యవస్థను దాటి ముందు కెళ్లడానికి 1977లో ప్రయోగించిన వాయేజర్ గురుగ్రహాన్ని దాటుకుంటూ వెళ్తూ దాని ఛాయా చిత్రాలు పంపింది. ఆ తర్వాత 1990లో వెళ్లిన గెలీలియో, 2000లో వెళ్లిన కేసినీ వ్యోమనౌకలు సైతం గురుగ్రహ ఛాయాచిత్రాలు పంపాయి. ఇక 2016లో నాసా ప్రయోగించిన జునో అంతరిక్ష నౌక నిరుడు యూరోపా ఛాయాచిత్రాలు పంపింది. ఇప్పుడు జ్యూస్ ప్రదక్షిణలు చేయబోయే 3 చందమామల్లో యూరోపా ఒకటి. అది 2031–34 మధ్య యూరోపాను రెండుసార్లు, క్యాలిస్టోను 21సార్లు, గాని మీడ్‌ను 12 సార్లు చుట్టివస్తుంది. అంతరిక్ష నౌకలు పంపే డేటాలో కేవలం రంగుల పొందికే ఉంటుంది. వీటి ఆధారంగా అక్కడ ఏమేం వాయువులున్నాయో, మూలకాలున్నాయో అంచనా కొస్తారు. విశ్వరహఃపేటిక తెరుచుకోవాలంటే నిత్యం ప్రయోగాలు కొనసాగుతూనే ఉండాలి. ఖగోళ శాస్త్ర ఆవిష్కరణలు విశ్వానికి సంబంధించిన మన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు విస్తృతపరుస్తుంటాయి. -
నక్షత్రాల సమూహం.. ఆర్ఆర్ లైర్.. ఆండ్రోమెడాకు ఏకంగా సగం దూరంలో
వాషింగ్టన్: మన పాలపుంతలో అత్యంత సుదూరంలో ఉన్న నక్షత్రాల సమూహాన్ని తాజాగా గుర్తించారు. ఆర్ఆర్ లైర్గా పిలుస్తున్న ఈ తారలు పాలపుంత చివరి అంచుల్లో, మనకు అతి సమీపంలో ఉన్న నక్షత్ర మండలమైన ఆండ్రోమెడాకు ఏకంగా సగం దూరంలో ఉండటం విశేషం! ఇప్పటిదాకా కనీసం ఇలాంటి 200 నక్షత్రాలను గుర్తించారు. వీటిల్లో అత్యంత దూరాన ఉన్న నక్షత్రమైతే భూమి నుంచి ఏకంగా 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది! ఆండ్రోమెడా నక్షత్ర మండలం భూమి నుంచి 25 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్న సంగతి తెలిసిందే. మిగతా విశ్వంలో మాదిరిగా పాలపుంత చివరి అంచుల్లో అత్యధిక భాగం డార్క్ మ్యాటర్‌తోనే నిండి ఉంటుంది. విశ్వపు మౌలిక నిర్మాణానికి ఆధారం ఇదేనని భావిస్తారు. దీని గురుత్వాకర్షణ శక్తి కారణంగానే అంతరిక్షంలోని దృగ్గోచర ద్రవ్యరాశి ఒక్కచోటికి చేరి తారలు, తారా మండలాలు పుట్టుకొస్తాయన్నది శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఈ పరిశోధన వల్ల పాలపుంత ఆవలి హద్దుల్లో ఏముందనే దానిపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని దీనిలో భాగం పంచుకున్న యూసీ శాంతాక్రుజ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్ ప్రొఫెసర్ రాజగుహ ఠాకూర్త చెబుతున్నారు. -
ఉత్పాతం నుంచి ఉత్పత్తి
ఒక తార జన్మించాలంటే ఒక నిహారిక మరణించాలని ఇంగ్లిష్ సూక్తి. ఒక గ్రహం జన్మించాలంటే అంతకన్నా ఎక్కువ ఉత్పాతం జరగాలంటున్నారు సైంటిస్టులు. శిశువుకు జన్మనిచ్చేందుకు తల్లి పడేంత కష్టం గ్రహాల పుట్టుక వెనుక ఉందంటున్నారు. తాజాగా ఇందుకు బలమైన సాక్ష్యాలు లభించాయి. గ్రహాల పుట్టుక ఒక తీవ్రమైన, విధ్వంసకర ప్రక్రియని ఖగోళ శాస్త్రజ్ఞులు విశదీకరిస్తున్నారు. హబుల్ టెలిస్కోపు తాజాగా పంపిన చిత్రాలను శోధించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు. గురుగ్రహ పరిమాణంలో ఉన్న ఒక ప్రొటో ప్లానెట్ పుట్టుకను హబుల్ చిత్రీకరించింది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే వాయువులు, ధూళితో కూడిన వాయురూప ద్రవ్యరాశిని(గ్యాసియస్ మాస్) ప్రొటో ప్లానెట్‌గా పేర్కొంటారు. ఈ గ్యాసియస్ మాస్పైన ధూళి, వాయువుల ఉష్ణోగ్రతలు తగ్గి అవి చల్లారే కొద్దీ ఘన, ద్రవ రూపాలుగా మారతాయి. అనంతరం ప్రొటోప్లానెట్ సంపూర్ణ గ్రహంగా మారుతుంది. సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహాలను(శని, గురుడు, యురేనస్, నెప్ట్యూన్) జోవియన్ గ్రహాలంటారు. మిగిలిన ఐదు గ్రహాలతో పోలిస్తే వీటిలో వాయువులు, ధూళి శాతం ఎక్కువ. ఈ జోవియన్ ప్లానెట్లు కోర్ అక్రేషన్ ప్రక్రియలో ఏర్పడ్డాయని ఇప్పటివరకు ఒక అంచనా ఉండేది. భారీ ఆకారంలోని ఘన సమూహాలు ఢీకొనడం వల్ల ప్రొటో ప్లానెట్లు ఏర్పడతాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఇది డిస్క్ ఇన్‌స్టెబిలిటీ (బింబ అస్థిరత్వ) సిద్ధాంతానికి వ్యతిరేకం. డిస్క్ ఇన్‌స్టెబిలిటీ ప్రక్రియ ద్వారా జూపిటర్ లాంటి గ్రహాలు ఏర్పడ్డాయనే సిద్ధాంతాన్ని ఎక్కువమంది సమర్థిస్తారు. తాజా పరిశోధనతో కోర్ అక్రేషన్ సిద్ధాంతానికి బలం తగ్గినట్లయింది. వేదనాభరిత యత్నం ఒక నక్షత్ర గురుత్వాకర్షణకు లోబడి అనేక స్టెల్లార్ డిస్కులు దాని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. కొన్ని లక్షల సంవత్సరాలకు ఈ స్టెల్లార్ డిస్క్‌లు చాలా కష్టంమీద సదరు నక్షత్ర గురుత్వాకర్షణ శక్తికి అందులో పడి పతనం కాకుండా పోరాడి బయటపడతాయని, అయితే నక్షత్ర ఆకర్షణ నుంచి పూర్తిగా బయటకుపోలేక ఒక నిర్ధిష్ఠ కక్ష్యలో పరిభ్రమిస్తూ క్రమంగా ప్రొటోప్లానెట్లుగా మారతాయని డిస్క్ ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతం చెబుతోంది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే దుమ్ము, ధూళి, వాయువులు (డస్ట్ అండ్ గ్యాస్ మాసెస్), అస్టరాయిడ్లవంటి అసంపూర్ణ ఆకారాలను స్టెల్లార్ డిస్క్లంటారు. తాజా చిత్రాలు ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ పరిశోధన వివరాలు జర్నల్ నేచుర్ ఆస్ట్రానమీలో ప్రచురించారు. తాజాగా కనుగొన్న ప్రొటోప్లానెట్ (ఆరిగే బీ– ఏబీ అని పేరుపెట్టారు) 20 లక్షల సంవత్సరాల వయసున్న కుర్ర నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని నాసా పేర్కొంది. మన సౌర వ్యవస్థ కూడా సూర్యుడికి దాదాపు ఇంతే వయసున్నప్పుడు ఏర్పడింది. ఒక గ్రహం ఏ పదార్ధంతో ఏర్పడబోతోందనే విషయం అది ఏర్పడే స్టెల్లార్ డిస్కును బట్టి ఉంటుందని సైంటిస్టులు వివరించారు. కొత్తగా కనుగొన్న ఏబీ గ్రహం మన గురు గ్రహం కన్నా 9 రెట్లు బరువుగా ఉందని, మాతృనక్షత్రానికి 860 కోట్ల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోందని పరిశోధన వెల్లడించింది. హబుల్ టెలిస్కోప్ 13 సంవత్సరాల పాటు పంపిన చిత్రాలను, జపాన్‌కు చెందిన సుబరు టెలిస్కోప్ పంపిన చిత్రాలను పరిశీలించి ఈ గ్రహ పుట్టుకను అధ్యయనం చేశారు. దీనివల్ల మన సౌర కుటుంబానికి సంబంధించిన మరిన్ని రహస్యాలు బయటపడతాయని ఆశిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
విశ్వంలోకెల్లా అతి పే...ద్ద గెలాక్సీ
ఆమ్స్టర్డామ్: విశ్వంలోకెల్లా అతి పెద్ద గెలాక్సీని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. ఇది ఏకంగా 1.63 కోట్ల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉందట! మన పాలపుంత కంటే 153 రెట్లు, సూర్యుని కంటే 24,000 కోట్ల రెట్లు పెద్దదట. ఈ భారీ రేడియో గెలాక్సీకి అల్సియోనెస్ అని పేరు పెట్టారు. ఇది భూమి నుంచి 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని దీన్ని కనిపెట్టిన నెదర్లాండ్స్‌లోని లైడెన్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని మధ్యలో కేంద్రకం వద్ద చురుకైన ఓ భారీ కృష్ణబిలం కూడా ఉందని వారంటున్నారు. దాని సమీపం నుంచి భారీ ద్రవ్యరాశితో కూడిన పలు ఖగోళ పదార్థాలు ఎగజిమ్ముతున్నాయట. ఇలాంటి అజ్ఞాత రేడియో గెలాక్సీల గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. కృష్ణబిలం తన చుట్టూ ఉన్న పదార్థాలన్నింటినీ తనలోకి లాగేసుకుంటూ ఉంటే అది చురుగ్గా ఉందని అర్థం. అలా దానిలోకి వెళ్లే వాటిలో అతి తక్కువ పదార్థాలు బిలం తాలూకు బయటి పొర గుండా దాని ధ్రువాల వైపు శరవేగంతో విసిరివేతకు గురవుతాయి. అక్కణ్నుంచి భారీ పేలుడుతో అంతరిక్షంలోకి దూసుకుపోయి అయనీకరణం చెందిన ప్లాస్మాగా రూపొందుతాయి. తర్వాత ఇవి కాంతివేగంతో సుదూరాలకు ప్రయాణిస్తూ చివరికి రేడియో ధారి్మకతను వెలువరించే భారీ అంతరిక్ష దృగి్వషయాలుగా మిగిలిపోతాయి. ఇలాంటి రేడియో ధారి్మక పదార్థాలు మన పాలపుంతలోనూ లేకపోలేదు. కానీ అల్సియోనెస్ వంటి భారీ గెలాక్సీల్లో అవి అంతంత సైజులకు ఎలా పెరుగుతాయన్నది ఇప్పటిదాకా మనకు అంతుపట్టని విషయం. ఈ విషయంలో ఇప్పటిదాకా ఉన్న పలు సందేహాలకు అల్సియోనెస్ రూపంలో సమాధానాలు దొరుకుతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇంత భారీ గెలాక్సీలు ఎలా పుట్టుకొస్తాయన్న ప్రశ్నలకు కూడా అల్సియోనెస్పై జరిగే పరిశోధనల్లో సమాధానాలు దొరకొచ్చని అబ్జర్వేటరీకి చెందిన మారి్టజిన్ ఒయ్ అన్నారు. యూరప్‌లో ఏర్పాటు చేసిన లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్) డేటాను విశ్లేషించే క్రమంలో ఓయ్, ఆయన బృందం యాదృచి్ఛకంగా ఈ భారీ గెలాక్సీని కనిపెట్టింది. -
మార్చి 4న చైనా రాకెట్ చంద్రుడిని ఢీకొట్టనుందా? డ్రాగన్ కంట్రీ ఏమంటోంది..
Rocket To Crash Into Moon: బీజింగ్ చంద్రుని పై జరిపిన పరోశోధనల్లో భాగంగా చంద్రుని పైకి చైనాకి సంబంధించిన ఒక అంతరిక్ష వ్యర్థం వచ్చిందని నిపుణులు తెలిపారు. ఈ మేరకు మార్చి 4న చంద్రుడిని ఒక రాకెట్ ఢీకొట్టనుందని నిపుణులు వెల్లడించారు. తొలుత ఖగోళ శాస్త్రవేత్తలు అది స్పేస్ ఎక్స్ రాకెట్‌లోని భాగంగా భావించారు. కానీ అది ఏడేళ్ల క్రితం పేలిపోయిందని దాని మిషన్ పూర్తైయిన తర్వాత అంతరిక్షంలోకి వదిలివేయబడిందని నిర్ధారించారు. కానీ ఇప్పుడూ చైనీస్ స్పేస్ ఏజెన్సీ చంద్ర అన్వేషణ కార్యక్రమంలో భాగంగా 2014లో Chang'e 5-T1 రాకెట్‌ని అంతరిక్షంలోకి పంపిందని కాబట్టి అది ఆ రాకెట్‌కి సంబంధించిన బూస్టర్ అని కొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఆ రాకెట్ మార్చి 4న చంద్రుని వైపు కూలిపోతుందని భావిస్తున్నారు. కానీ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఈ వాదనను ఖండించింది. అంతేకాదు మీరు అనుమానిస్తున్న ఆ బూస్టర్ భూ వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశించి కాలిపోయిందని పేర్కొంది. చైనా అంతరిక్ష సూపర్‌పవర్‌గా అవతరించడంపై దృష్టి సారించడమే కాక కొత్త అంతరిక్ష కేంద్రానికి సుదీర్ఘమైన సిబ్బందితో కూడిన మిషన్‌ను ప్రారంభించి ఒక ప్రభంజనం సృష్టించింది. అంతేగాక ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మిలిటరీ-రన్ స్పేస్ ప్రోగ్రామ్‌లో బిలియన్లను దున్నేసింది. చివరికి మానవులను చంద్రునిపైకి పంపాలని భావిస్తోంది కూడా. (చదవండి: పుతిన్- బైడెన్ల అత్యవసర భేటీ!) -
ఆశ్చర్యపోయే అంశం.. సూర్యుడు లేని గ్రహాలు!
గ్రహం.. అనగానే ఏదో ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమించడం పరిపాటి. కానీ, 2021 ముగింపులో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయే అంశం గోచరమైంది. పాలపుంత గెలాక్సీలో ఎటువంటి నక్షత్రం చుట్టూ భ్రమణం చేయకుండా స్వేచ్ఛగా తిరిగే 100కుపైగా భారీ గ్రహాలను కనుగొన్నారు. ఇవన్నీ సైజులో గురుగ్రహం కన్నా పెద్దవి. ఇలాంటివి మరిన్ని లక్షలుండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఫ్రీ ఫ్లోటింగ్ ప్లానెట్స్(మాతృ నక్షత్రం లేని గ్రహాలు) 70– 172 వరకు కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కనుగొన్న ఫ్రీఫ్లోటింగ్ ప్లానెట్స్ కన్నా తాజాగా కనుగొన్నవి రెట్టింపున్నాయి. నక్షత్ర ఉత్పత్తి సమయంలో ఇలాంటి గ్రహాలు ఏర్పడతాయని ఒక అంచనా. బరువులో జూపిటర్కు సుమారు 13 రెట్లున్న ఈ గ్రహాల ఉత్పత్తిపై భిన్న అంచనాలున్నాయి. నక్షత్రాల్లాగానే వాయు సమూహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి నశించడం వల్ల ఏర్పడి ఉండొవచ్చని, మాతృనక్షత్రం నుంచి భ్రమణం చేసే సమయంలో అనూహ్యంగా కక్ష్య నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని.. పలు ఊహాగానాలు చేస్తున్నా వీటి పుట్టుకకు మాత్రం సరైన కారణాలు ఇంకా తెలియలేదు. (చదవండి: వదల బొమ్మాలి.. వదల.. పెంపుడు కుక్కపై పిట్‌బుల్ దాడి) జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో వీటి వివరాలు ప్రచురించారు. వృశ్చిక రాశి నక్షత్ర సముదాయానికి దగ్గరలో వీటిని గుర్తించారు. పలు నక్షత్రాల మధ్య ఇవి స్వేచ్ఛగా పరిభ్రమించేందుకు కారణాలు అన్వేషించాల్సిఉందని పరిశోధనలో పాల్గొన్న రియా మిరెట్ రొయిగ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోపుతో వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టవచ్చని భావిస్తున్నారు. నక్షత్రంతో పనిలేకుండా తిరిగే వీటిలో వాతావరణం వృద్ది చెందడాన్ని పరిశీలిస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు బయటపడే అవకాశం ఉందని సైంటిస్టుల భావన. (చదవండి: అజ్ఞాతవాసులు.. ఏ తల్లి కన్న బిడ్డలో! ప్రాణాలు పోతున్నా జనాల్ని కాపాడుతున్నారు) -
భారీ ఖగోళ వింత: గుర్తించింది మనవాళ్లే!
విశ్వ పరిశోధనల్లో ఇప్పటిదాకా కనివిని ఎరుగని ఖగోళ వింతకు స్థానం దక్కింది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు(బ్లాక్‌హోల్స్) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. మరో విశేషం ఏంటంటే.. భారత్‌కు చెందిన ముగ్గురు ఖగోళ పరిశోధకులు ఈ వింతను ఆవిష్కరించడం. పాలపుంతలో తాజాగా ఈ మూడు బ్లాక్ హోల్స్‌ను గుర్తించారు. ముందుగా జంట బిలాల గమనాన్ని పరిశీలించిన పరిశోధకులు.. మూడో దానితో వాటి విలీనానికి సంబంధించిన పరిశోధనను ‘ఆస్రోనమీ’ జర్నల్‌లో పబ్లిష్ చేశారు. ‘‘మూడో పాలపుంత(గెలాక్సీ) ఉందనే విషయాన్ని మేం నిర్ధారించాం. ఎన్జీసీ7733ఎన్.. అనేది ఎన్జీసీ7734 గ్రూప్‌లో ఒక భాగం. ఉత్తర భాగం కిందుగా ఇవి ఒకదానిని ఒకటి ఆవరించి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. గెలాక్సీ జంట.. ఎన్జీసీ7733ఎన్-ఎన్జీసీ7734లోని పాలపుంతలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. సాధారణంగా కృష్ణబిలాల కలయిక తీవ్రమైన ఒత్తిడి.. శక్తిని కలగజేస్తుంది. అయితే వాటి విలీనం ఒకదానితో ఒకటి కాకుండా.. పక్కనే ఉన్న మూడో భారీ బ్లాక్‌హోల్‌లోకి విలీనం కావడం ద్వారా ఆ ఎనర్జీ అంతగా ప్రభావం చూపలేకపోయిందని తెలిపారు. Indian researchers have discovered three supermassive black holes from three galaxies merging together to form a triple active galactic nucleus, a compact region at the center of a newly discovered galaxy that has a much-higher-than-normal luminosity.https://t.co/y8BDohOTg5 pic.twitter.com/1dxjJudPX1 — PIB India (@PIB_India) August 27, 2021 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్రో్టఫిజిక్స్‌కు చెందిన జ్యోతి యాదవ్, మౌసుమి దాస్, సుధాన్షు బార్వే.. ఆస్రో్టసాట్ అబ్జర్వేటరీ ద్వారా అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సాయంతో వీటిని వీకక్షించగలిగారు. ఈ అధ్యయనం కోసం సౌతాఫ్రికా ఐఆర్ఎస్ఎఫ్, చిలీ వీఎల్టీ, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఎంయూఎస్‌ఈ టెక్నాలజీల సాయం తీసుకున్నారు. అంతేకాదు కృష్ణ బిలాల విలీనానికి సంబంధించిన ప్రకాశవంతమైన యూవీ-హెచ్ ఆల్ఫా ఇమేజ్‌లను సైతం రిలీజ్ చేశారు. -
ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు
Astronomers Detect Light Behind Black Hole: విశ్వంలో మనిషి మేధస్సుకు అంతుచిక్కని రహస్యాలెన్నో. వాటిలో బ్లాక్ హోల్ ఒక సంక్లిష్టమైన సబ్జెక్ట్. అదృశ్య ప్రాంతాలుగా కంటికి కనిపించకుండా.. ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకునే కేంద్రాలివి. అయితే కృష్ణ బిలాల వెనుక ఉన్న ఓ విషయాన్ని తొలిసారి ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించగా, ఐన్‌స్టీన్ అంచనా ఆయన మేధోసంపత్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. భూమికి 100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కృష్ణ బిలం(ఐ జ్విక్కీ 1) వెనకాల కాంతి ప్రతిధ్వనుల్ని(తేలికపాటి) గుర్తించారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ(అమెరికా) పరిశోధకులు. మెరుపుల్లా మొదలై అటుపై రంగు రంగుల్లోకి మారిపోయాయి ఆ ఎక్స్‌రే కాంతులు. సాధారణంగా బ్లాక్ హోల్లోకి వెళ్లిన కాంతి ఏదీ బయటకు పరావర్తనం చెందదు. దీంతో ఆ వెనకాల ఏముంటుందో అనేది ఇప్పటిదాకా ఖగోళ శాస్రజ్ఞులు నిర్ధారించుకోలేకపోయారు. అయితే ఈ బిలం చుట్టేసినట్లు ఉండడం, కాంతి వంగి ప్రయాణించడం, అయస్కాంత క్షేత్రాలు మెలిదిరిగి ఉండడం వల్లే ఈ కాంతి ప్రతిధ్వనులను రికార్డు చేయగలిగామని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రో ఫిజిస్ట్ డాన్ విల్కిన్స్ వెల్లడించారు. ఐన్‌స్టీన్ ఏనాడో చెప్పాడు జర్మన్ మేధావి, థియోరెటికల్ ఫిజిసిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ విషయాన్ని ఏనాడో గుర్తించాడు. కృష్ణ బిలం వెనకాల కాంతి కిరణాల పరావర్తనాలు సాధ్యమని, అంతరిక్షంలో భారీవేవైనా సరే వక్రీకరణ చెందక తప్పవని ‘జనరల్ రియాల్టివిటీ’ పేరుతో ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ టైంలో ఆ థియరీని ఎవరూ పట్టించుకోలేదు. అయితే తాజా పరిశోధనల గుర్తింపుతో ఆయన మేధస్సును నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా సాధారణ టెలిస్కోప్‌ల ద్వారా గుర్తించడం విశేషం. నేచర్ జర్నల్‌లో బుధవారం ఈ మేరకు ఈ ఖగోళ అద్భుతంపై కథనం పబ్లిష్ అయ్యింది. -
జీరో షాడో డే
భానుగుడి (కాకినాడ సిటీ): సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆవిష్కృతమయ్యే అరుదైన ఖగోళ దృగ్విషయం ‘జీరో షాడో డే’. సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఈ సన్నివేశం ఆవిష్కృతమవుతుంది. ఇది ఏర్పడే మే నెల మొదటి వారంలోని రెండురోజుల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.10 గంటల వరకు ఏ వస్తువు నీడ భూమిపై పడదని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతారు. శనివారం తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు దీనిని సాంకేతికంగా నిరూపించి, జూమ్ యాప్ ద్వారా విద్యార్థులందరికీ విశదీకరించారు. రాజమహేంద్రవరం సత్యసాయి గురుకులం ఖగోళ శాస్త్ర ఉపాధ్యాయుడు కూచిపూడి గుర్రయ్య విద్యార్థులతో ఈ ప్రయోగాన్ని చేయించారు. కాజులూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పంపన కృష్ణమూర్తి విద్యార్థులతో ఈ ప్రయోగం నిర్వహించి, ఇంటర్నెట్ ద్వారా మిగిలిన విద్యార్థులందరితో పంచుకున్నారు. ఎస్సీఈఆర్టీ సాంఘిక శాస్త్ర పుస్తక రచయిత, ప్రధానోపాధ్యాయుడు రాకుర్తి త్రిమూర్తులు పాఠశాల విద్యార్థులతో ప్రయోగాలు నిర్వహించి విషయాన్ని విశదీకరించారు. -
గ్రహాంతర అన్వేషణ సాధనం
ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ అపెర్చర్ రేడియో టెలిస్కోప్. చైనాలోని గుయిఝౌలో ఏర్పాటు చేశారు దీనిని. దీని వ్యాసం ఐదువందల మీటర్లు. అందుకే దీనిని ‘ఫైవ్హండ్రడ్ మీటర్ స్ఫెరికల్ టెలిస్కోప్’ (ఫాస్ట్) అని కూడా పిలుచుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది పనిచేయడం ప్రారంభించింది. అయితే, రేడియో తరంగాల అంతరాయాలు ఏర్పడటంతో, వాటిని తొలగించేందుకు దీని పనిని శాస్త్రవేత్తలు నిలిపివేశారు. (పాపం కుక్కతో అంట్లు తోమిస్తున్నారు) సాంకేతిక ఇబ్బందులు తొలగిన తర్వాత తిరిగి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పని చేయనుంది. గ్రహాంతర అన్వేషణలో ఇది మిగిలిన టెలిస్కోప్‌ల కంటే అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సుదూర ప్రాంతాల నుంచి నేరోబ్యాండ్ సిగ్నల్స్ అందుతున్నాయని, బహుశ అవి గ్రహాంతరవాసులకు చెందినవే కావచ్చని భావిస్తున్నామని ఈ టెలిస్కోప్ ప్రాజెక్టులో కీలక ప్రాత పోషించిన బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఝాంగ్ టోంగ్జీ చెబుతున్నారు. (బీజింగ్‌లో మళ్లీ కరోనా కాటు) -
పింక్ సూపర్ మూన్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనే ఆకాశవీధిలో ఓ అందాల దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ నెల 7న చంద్రుడిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 7 రాత్రి 8.30 గంటలకు చంద్రుడు భూమి కక్ష్యలోకి మరింత దగ్గరగా వచ్చి, భారీ సైజులో కాంతులీనుతూ కనువిందు చేయనున్నాడు. దీనినే పింక్ సూపర్ మూన్ అని పిలుస్తారు. 2020 సంవత్సరంలో చంద్రుడు అత్యంత పెద్దగా కనిపించే రోజు ఇదే. భారత్‌లో 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఈ దృశ్యాన్ని చూడవచ్చునని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ఇంటిపట్టునే ఉన్న ప్రజలు ఈ సూపర్ మూన్ అందాలను పూర్తిగా ఆస్వాదించే పరిస్థితి లేదు. ఎందుకంటే భారత్‌లో ఉదయం సమయం కాబట్టి సూపర్ మూన్ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏమిటీ పింక్ సూపర్ మూన్ పున్నమి రోజుల్లో కనిపించే చంద్రుడు కంటే అత్యంత ప్రకాశవంతంగా, ఇంకా పెద్దగా ఆకాశ వీధిలో అందాల జాబిలి కనువిందు చేయడాన్నే సూపర్ మూన్ అంటారు. భూ కక్ష్యలో చంద్రుడు దగ్గరగా ఉండే స్థానాన్ని పెరోజి అంటారు. ఈ పెరోజీలోకి వచ్చినప్పడు చంద్రుడు మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించి అందరినీ అలరిస్తాడు. సాధారణంగా భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కి.మీ. ఉంటుంది. కానీ ఏప్రిల్ 7, 8వ తేదీల్లో ఆ దూరం 3,56,000 కి.మీ. తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా సూపర్ పింక్ మూన్ దర్శనమిస్తాడు. 20 ఏళ్లలో ఇప్పటివరకు 79 సూపర్ మూన్‌లు వచ్చాయి. సగటున మూడు నెలలకో సూపర్ మూన్ కనిపిస్తుంది. ఈ ఏడాది నెలకో సూపర్ మూన్ వస్తూనే ఉంది. -
అక్కడ పగటిపూట ఐరన్ వర్షం..!
లండన్ : సౌర కుటుంబానికి వెలుపల.. 650 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ గ్రహానికి సంబంధించి ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాలను కనుగొన్నారు. అసాధారణ రీతిలో వేడిగా ఉండే ఆ గ్రహంపై ఐరన్ వర్షం కురుస్తోందని గుర్తించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా యూనివర్సిటీతో కలిసి నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందన్నారు. ‘డబ్ల్యూఏఎస్పీ-76బీ’గా గర్తించిన ఆ గ్రహంపై పగటిపూట ఉష్ణోగ్రత్తలు దాదాపు 2400 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో లోహాలు ఆవిరిగా మారిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. అక్కడ వీచే బలమైన గాలులు రాత్రి వేళను చల్లగా మారేలా చేస్తాయని, ఆ సమయంలో ఇనుము బిందువులుగా ఘనీభవిస్తుందని అంచనా వేశారు. ఆ గ్రహం మాతృ నక్షత్రం చుట్టూ ఎదురుగా తిరుగుతున్న సమయంలో(పగటిపూట) మాత్రమే ఇనుము వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. వాతావరణం చల్లబడ్డాక రాత్రిపూట పూర్తి చీకటి నెలకొంటుందని తెలిపారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు 5 గంటల సమయం తీసుకుంటుందని.. కానీ ఆ గ్రహం మాత్రం తన మాతృ నక్షత్రానికి దగ్గరగా ఉండటంతో పరిభ్రమణానికి కేవలం 48 గంటలు పడుతుందన్నారు. ఆ గ్రహం తన మాతృ నక్షత్రం నుంచి పగటిపూట భూమి సూర్యుని నుంచి గ్రహించే రేడియేషన్ కంటే వేల రేట్లు అధికంగా పొందుతుని ఆ పరిశోధనలో వెల్లడించారు. -
నేడు సూర్యుడికి సమీపంగా భూమి..
సాక్షి హైదరాబాద్: అంతరిక్షంలో మరో వింత చోటు చేసుకోబోతుంది. గురువారం సూర్యుడికి భూమి సమీపంగా చేరబోతుంది. ఖగోళ పరిభాషలో సూర్యుడికి భూమి సమీపంగా వెళ్లటాన్ని పెరిహిలియన్ అని, దూరంగా వెళ్లటాన్ని అపిలియన్ అని పిలుస్తుంటారు. గురువారం జరిగే ఈ వింతను పెరిహిలియన్‌గా పిలువనున్నారు. సూర్యుడికి భూమి దగ్గరగా, దూరంగా వెళ్లే ప్రక్రియ ఏటా రెండు మార్లు చోటు చేసుకుంటోంది. సూర్యుడి చుట్టూ భూమి దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది. ఈ గమనంలో ఒకసారి సూర్యుడికి సమీపంగా, మరోసారి సూర్యుడికి దూరంగా వెళుతుంది. జనవరి 3న భూమి సూర్యుడికి సమీపంగా వెళుతుంది. ప్రతి ఏటా ఈ వింత చోటు చేసుకుం టోంది. అయితే జీవుల కంటికి నేరుగా కనిపించని ఈ ఘటన ఖగోళపరంగా చాలా ముఖ్యమైంది. దీని వల్ల వాతావరణంపై ఎటువంటి ప్రభావం ఉండబోదని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు ముఖ్యమైన ఒక అంశాన్ని బోధించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు అపోహే.. సూర్యుడికి, భూమికి మధ్య దూరం తగ్గటం వలన వాతావరణ మార్పులు వస్తాయనేది అపోహ మాత్రమే అనే విషయాన్ని ఈ ఖగోళ ఘటన ద్వారా రూఢీ చేసుకోవచ్చని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ తెలిపారు. ‘ఈ ఘటనలో భూమి సూర్యుడికి దగ్గరగా వస్తున్నప్పటికీ మనతో సహా ఉత్తర ధృవంలోనూ చలికాలమే కొనసాగుతోంది. జూలైలో భూమి సూర్యుడికి దూరంగా వెళ్లే ఘటన చోటు చేసుకుంటుంది. ఆ సమయంలో మనకు వేసవికాలం. కాబట్టి సూర్యుడికి, భూమికి మధ్య దూరం తగ్గటం వల్ల రుతువులు ఏర్పడతాయని, లేదా వాతావరణ మార్పులు కలుగుతాయనేది అవాస్తవం. దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతున్నప్పుడు భూమి వాలే తీరును బట్టి కాలాలు, రుతువులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడానికి ఈ ఘటనను వారికి చూపించవచ్చు’అని రఘునందన్ పేర్కొన్నారు. పది రోజులు ఉల్కలు.. జనవరి 12 వరకు సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఉల్కలను చూసే అవకాశం ఉందని, ముఖ్యంగా 4వ తేదీ నాడు ఈ అవకాశం మరింత ఎక్కువగా ఉందని రఘునందన్ తెలిపారు. ఉదయం 3 గంటల నుంచి, తూర్పు, ఈశాన్య దిశల్లో రాలే చుక్కల (ఉల్క)ను చూడవచ్చని చెప్పారు. -
మరో సూర్ ఎర్త్!
లండన్: ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా సూర్యుడికి పొరుగునే మరో గ్రహాన్ని (సూపర్ ఎర్త్) కనుగొన్నారు. ఇది నివాసయోగ్యంగా ఉండే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. సూర్యుడికి 6 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బర్నార్డ్స్ నక్షత్రం చుట్టూ ఈ సూపర్ ఎర్త్ తిరుగుతున్నట్లు గుర్తించారు. బ్రిటన్‌లోని క్వీన్ మేరీ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. భూమికి కేవలం 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమికన్నా మూడు రెట్లు పెద్దగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై మైనస్ 170 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని, బర్నార్డ్స్ చుట్టూ పరిభ్రమించడానికి దీనికి 233 రోజులు పడుతుందని అంచనా వేశారు. రాళ్లు, మంచుతో కూడిన ఈ గ్రహంపై నీటి వనరులు పుష్కలమని, కానీ, కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నివాసానికి అనుకూలంగా ఉండేదని ఖగోళ శాస్త్రవేత్త గుల్లెమ్ అంగ్లడ ఎస్కుడే పేర్కొన్నారు. కనుగొనడానకి ముందు శాస్త్రవేత్తలు ఈ గ్రహానికి సంబంధించి 20 ఏళ్లుగా చేస్తున్న సర్వేలు, పరిశోధనల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తొలిసారి రేడియల్ వెలాసిటీ పద్ధతి సాయంతో ఈ గ్రహాన్ని గుర్తించారు. -
దారి తప్పిన గ్రహశకలం
లండన్: మన సౌర కుటుంబం మీదుగా ఎర్రటి, పొడవాటి ఓ వస్తువు గతనెలలో దూసుకు పోయింది. అన్ని గ్రహశకలాల మాదిరిగానే ఇది కూడా సాధారణమైందని ఖగోళ శాస్త్రవేత్తలు భావించారు. అయితే అది వేరే నక్షత్ర సమూహం నుంచి వచ్చిన తొలి గ్రహశకలం అని వారి పరిశీలనలో తెలిసింది. గత నెలలో ఆకాశంలో ఏదో వస్తువు వెలుగుతూ వెళ్లినట్లు హవాయిలోని పాన్–స్టార్స్1 అనే టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలుత చిన్న పరిమాణంలో ఉండే సాధారణ గ్రహశకలం అని భావించినా.. ఆ తర్వాత దాని కచ్చితమైన కక్ష్యను గుర్తించగలిగారు. ఈ వస్తువు వేరే నక్షత్ర మండలం నుంచే వచ్చినట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. తొలుత ఆ వస్తువును తోకచుక్కగా భావించారు. అయితే సెప్టెంబర్‌లో తోకచుక్క వంటివేవీ సూర్యుడికి దగ్గరగా వెళ్లినట్లుగా ఎలాంటి గుర్తులు కనిపెట్టలేకపోయారు. దీంతో ఆ తర్వాత ఆ వస్తువును వేరే నక్షత్ర మండలానికి చెందిన గ్రహశకలమని గుర్తించారు. దానికి ‘ఔమువామువా’అని పేరు పెట్టారు. ఈ గ్రహశకలం 400 మీటర్ల పొడవుతో.. వెడల్పుతో పోల్చుకుంటే 10 రెట్ల పొడవుతో ఉంది. ఔమువామువా ఇప్పటికే సూర్యుడికి అతి దగ్గరి నుంచి వెళ్లిందని, అక్కడి నుంచి మన సౌర కుటుంబం దాటి వేరే నక్షత్ర మండలానికి వెళ్లిపోతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. భూమిని ఢీకొననున్న అపోఫిస్! కాలిఫోర్నియా: ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల 2036లో భారీ విధ్వంసం జరగొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) అంచనా వేస్తోంది. ఈ గ్రహశకలం ఢీకొట్టడం వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చని హెచ్చరిస్తోంది. అపోఫిస్ అనే గ్రహశకలాన్ని 2004లో నాసా తొలిసారిగా గుర్తించింది. దీని పరిమాణం దాదాపుగా రెండున్నర ఫుట్‌బాల్ మైదానాలంత ఉంటుందని అంచనా. అప్పటి నుంచి దాని కదలికలను నిశితంగా గమనిస్తోంది. 2036లో అపోఫిస్ భూమిని ఢీకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు నాసా వర్గాలు పేర్కొన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే 2036 ఏప్రిల్ 13 మన భూ గ్రహానికి చివరిరోజు కావొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2029లో కూడా అపోఫిస్ గ్రహశకలం భూమికి సమీపంలో, 32 వేల కిలోమీటర్ల దూరంలోనే వెళ్లొచ్చనీ, అప్పుడు దాని మార్గంలో ఏ చిన్న తేడా వచ్చినా, భూమిపై పెను విధ్వంసం జరగొచ్చని రష్యా శాస్త్రవేత్తలు అంటున్నారు.