సౌర కుటుంబంలో మరో గ్రహం?
సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయని పుస్తకాల్లో చదువుకున్నాం.. ఫ్లూటో గ్రహం కాదని ఖగోళ శాస్త్రవేత్తలు తేల్చడంతో ఇప్పుడు ఎనిమిదే ఉన్నాయి. అయితే నెప్ట్యూన్‌కు అవతల ఇంకో గ్రహం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ప్లానెట్ ఎక్స్, ప్లానెట్ 9గా పిలుస్తున్న ఈ గ్రహం వాస్తవంగానే ఉందని కార్నెగీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్, నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీలకు చెందిన స్కాట్ షెపర్డ్, ఛాడ్విక్ ట్రుజిల్లో లు ప్రకటించారు. సూర్యుడి చుట్టూ చాలా దూరంగా తిరుగుతున్న కొన్ని ఉప గ్రహాలను, వాటి కక్ష్యా కోణాలను పరిశీలించినప్పుడు అవి ఓ భారీ గ్రహం ప్రభావానికి లోనవుతున్నట్లు తెలిసిందని పేర్కొంటున్నారు. దీన్ని బట్టి సౌరకుటుంబం అంచుల్లో మరో గ్రహం ఉండే అవకాశాలు పెరిగాయంటున్నారు.
సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరానికి దాదాపు 200 రెట్లు దూరంలో ఉందని, పరిమాణంలో భూమి కన్నా 15 రెట్లు ఎక్కువ ఉందని పేర్కొంటున్నారు. చిలీ, హవాయిల్లో ఉన్న శక్తిమంతమైన టెలిస్కోపులు, కెమెరాలు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా అంచనాకు వచ్చామని చెబుతున్నారు. ప్లానెట్ ఎక్స్‌కు చాలా దూరంలో తిరుగుతున్న ఓ ఖగోళ వస్తువు ఇతర నక్షత్రాలు, గ్రహాల గురుత్వ శక్తి ప్రభావానికి లోనవుతోందని చెబుతుండటం శాస్త్రవేత్తలో ఆసక్తి రేకెత్తిస్తోంది.