భూగోళంపై కోట్లాది జీవులు ఉన్నాయి. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో జీవజాలం పుట్టుకొచ్చింది. ఇందుకు ఎన్నో సంఘటనలు దోహదం చేశాయి. భూమిపై జీవుల ఆవిర్భావం, మనుగడకు ఇక్కడి అనుకూల వాతావరణమే కారణం. ధరణిపై వాతావరణం విషతుల్యంగా మారితే జీవులకు ముప్పు తప్పదు. పూర్తిగా అంతరించిపోయినా ఆశ్చర్యం లేదు.
అలాంటి ప్రమాదమే తలెత్తే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుదూరంలోని అంతరిక్షంలో ఉన్న సూపర్‌నోవాల పేలుడు నుంచి గ్రహాలకు కొత్త ముప్పు పొంచి ఉందని, ఈ విపత్తు నుంచి తప్పించుకోవడం మన చేతుల్లో లేదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఏమిటీ ముప్పు?
అంతరిక్షంలో అనంతమైన నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని సూపర్‌నోవాగా మారి పేలిపోతుంటాయి. బ్లాస్ట్ వేవ్ సంభవిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదకరమైన ఎక్స్–కిరణాలు అధిక మోతాదులో వెలువడుతాయి. ఇవి సమీపంలోని గ్రహాలను చేరుతాయి. ఇందుకు నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పట్టొచ్చు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి దాని పరిధిలోని భూగ్రహాన్ని రక్షించడానికి ఓజోన్ పొర ఆవరించి ఉంది.
సూపర్‌నోవా పేలుడుతో ఉద్గారమయ్యే ఎక్స్–కిరణాలు భూమిని చుట్టూ ఉన్న ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తాయి. ఓజోన్ పొర చాలావరకు తుడిచిపెట్టుకుపోతోంది. దాంతో యూవీ రేడియేషన్ నేరుగా భూగ్రహం ఉపరితలాన్ని ఢీకొడుతుంది. ఫలితంగా నైట్రోజన్ డయాక్సైడ్ అనే విషవాయువు భూమిపై ఉత్పత్తి అవుతుంది. అది విషపూరితమైన గోధుమ రంగు పొరను భూమి చుట్టూ ఏర్పరుస్తుంది. అప్పుడు వాతావరణం లుప్తమైపోతుంది. జీవులు అంతరించిపోతాయి.
ఎలా గుర్తించారు?
యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్తలు చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీతోపాటు ఇతర అత్యాధునిక టెలిస్కోప్‌లతో సూపర్‌నోవాలపై అధ్యయనం చేశారు. పేలిపోయే తారల నుంచి ఎక్స్–కిరణాలు వెలువడి, భూమి, ఇతర గ్రహాలను ప్రభావితం చేసే దశ రాబోతుందని, ఈ పరిణామం 100 కాంతి సంవత్సల దూరంలో చోటుచేసుకుంటుందని కనిపెట్టారు. పేలిపోయే నక్షత్రాల నుంచి వాటిల్లే ముప్పు గతంలో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగినట్లు గుర్తించారు. 160 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూపర్‌నోవాలు పేలిపోతే భూమిలాంటి గ్రహాలకు రేడియేషన్ ముప్పు ఉంటుందని తేల్చారు. 1979సీ, ఎస్‌ఎన్ 1987ఏ, ఎస్‌ఎన్ 2010జేఎల్, ఎస్‌ఎన్ 1994ఐ అనే సూపర్‌నోవాలను నిశితంగా పరిశీలించారు. అవి ఇప్పట్లో పేలే అవకాశం ఉందా? దానిపై ఓ అంచనాకొచ్చారు.
ఇప్పటికిప్పుడు ప్రమాదం లేనట్లే
భూమికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదని శాస్త్రవేత్త కానర్ ఓమహోనీ వెల్లడించారు. ఎక్స్–రే డేంజర్ జోన్‌లో బలమైన సూపర్‌నోవా ఏదీ లేదని తెలిపారు. భూమికి సమీపంలో గతంలో తారలు పేలిపోయిన దాఖలాలు ఉన్నాయని వెల్లడించారు. 20 లక్షల నుంచి 80 లక్షల సంవత్సరాల క్రితం భూమి నుంచి 65 నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్‌నోవా ఒకటి పేలిపోయింది.
దానికి సంబంధించిన రేడియేషన్ ఇప్పటికీ భూమి వైపునకు దూసుకొస్తోందని పరిశోధకులు గుర్తించారు. సూపర్‌నోవా నుంచి వెలువడే ఎక్స్–కిరణాలపై మరిన్ని పరిశోధనలు చేయడం నక్షత్రాల జీవితకాలం గురించి అర్థం చేసుకోవడానికే కాదు, ఆస్ట్రోబయాలజీ, పాలియోంటాలజీ, ప్లానెటరీ సైన్సెస్ తదితర రంగాల్లో చిక్కుముడులు విప్ప డానికి ఉపయోగపడ తాయని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్త బ్రియాన్ ఫీల్డ్స్ తెలిపారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment