University of Illinois
-
నక్షత్రాలు పేలితే భూమికి ముప్పు!
భూగోళంపై కోట్లాది జీవులు ఉన్నాయి. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో జీవజాలం పుట్టుకొచ్చింది. ఇందుకు ఎన్నో సంఘటనలు దోహదం చేశాయి. భూమిపై జీవుల ఆవిర్భావం, మనుగడకు ఇక్కడి అనుకూల వాతావరణమే కారణం. ధరణిపై వాతావరణం విషతుల్యంగా మారితే జీవులకు ముప్పు తప్పదు. పూర్తిగా అంతరించిపోయినా ఆశ్చర్యం లేదు. అలాంటి ప్రమాదమే తలెత్తే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుదూరంలోని అంతరిక్షంలో ఉన్న సూపర్నోవాల పేలుడు నుంచి గ్రహాలకు కొత్త ముప్పు పొంచి ఉందని, ఈ విపత్తు నుంచి తప్పించుకోవడం మన చేతుల్లో లేదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏమిటీ ముప్పు? అంతరిక్షంలో అనంతమైన నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని సూపర్నోవాగా మారి పేలిపోతుంటాయి. బ్లాస్ట్ వేవ్ సంభవిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదకరమైన ఎక్స్–కిరణాలు అధిక మోతాదులో వెలువడుతాయి. ఇవి సమీపంలోని గ్రహాలను చేరుతాయి. ఇందుకు నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పట్టొచ్చు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి దాని పరిధిలోని భూగ్రహాన్ని రక్షించడానికి ఓజోన్ పొర ఆవరించి ఉంది. సూపర్నోవా పేలుడుతో ఉద్గారమయ్యే ఎక్స్–కిరణాలు భూమిని చుట్టూ ఉన్న ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తాయి. ఓజోన్ పొర చాలావరకు తుడిచిపెట్టుకుపోతోంది. దాంతో యూవీ రేడియేషన్ నేరుగా భూగ్రహం ఉపరితలాన్ని ఢీకొడుతుంది. ఫలితంగా నైట్రోజన్ డయాక్సైడ్ అనే విషవాయువు భూమిపై ఉత్పత్తి అవుతుంది. అది విషపూరితమైన గోధుమ రంగు పొరను భూమి చుట్టూ ఏర్పరుస్తుంది. అప్పుడు వాతావరణం లుప్తమైపోతుంది. జీవులు అంతరించిపోతాయి. ఎలా గుర్తించారు? యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్తలు చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీతోపాటు ఇతర అత్యాధునిక టెలిస్కోప్‌లతో సూపర్‌నోవాలపై అధ్యయనం చేశారు. పేలిపోయే తారల నుంచి ఎక్స్–కిరణాలు వెలువడి, భూమి, ఇతర గ్రహాలను ప్రభావితం చేసే దశ రాబోతుందని, ఈ పరిణామం 100 కాంతి సంవత్సల దూరంలో చోటుచేసుకుంటుందని కనిపెట్టారు. పేలిపోయే నక్షత్రాల నుంచి వాటిల్లే ముప్పు గతంలో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగినట్లు గుర్తించారు. 160 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూపర్నోవాలు పేలిపోతే భూమిలాంటి గ్రహాలకు రేడియేషన్ ముప్పు ఉంటుందని తేల్చారు. 1979సీ, ఎస్ఎన్ 1987ఏ, ఎస్ఎన్ 2010జేఎల్, ఎస్ఎన్ 1994ఐ అనే సూపర్నోవాలను నిశితంగా పరిశీలించారు. అవి ఇప్పట్లో పేలే అవకాశం ఉందా? దానిపై ఓ అంచనాకొచ్చారు. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేనట్లే భూమికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదని శాస్త్రవేత్త కానర్ ఓమహోనీ వెల్లడించారు. ఎక్స్–రే డేంజర్ జోన్లో బలమైన సూపర్నోవా ఏదీ లేదని తెలిపారు. భూమికి సమీపంలో గతంలో తారలు పేలిపోయిన దాఖలాలు ఉన్నాయని వెల్లడించారు. 20 లక్షల నుంచి 80 లక్షల సంవత్సరాల క్రితం భూమి నుంచి 65 నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్నోవా ఒకటి పేలిపోయింది. దానికి సంబంధించిన రేడియేషన్ ఇప్పటికీ భూమి వైపునకు దూసుకొస్తోందని పరిశోధకులు గుర్తించారు. సూపర్నోవా నుంచి వెలువడే ఎక్స్–కిరణాలపై మరిన్ని పరిశోధనలు చేయడం నక్షత్రాల జీవితకాలం గురించి అర్థం చేసుకోవడానికే కాదు, ఆస్ట్రోబయాలజీ, పాలియోంటాలజీ, ప్లానెటరీ సైన్సెస్ తదితర రంగాల్లో చిక్కుముడులు విప్ప డానికి ఉపయోగపడ తాయని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్త బ్రియాన్ ఫీల్డ్స్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైదరాబాద్ విద్యార్థినిపై అమెరికాలో దారుణం
వాషింగ్టన్ : 19 సంవత్సరాల ఇండో-అమెరికన్ విద్యార్ధినిని దుండగుడు లైంగికంగా వేధించి హత్య చేసిన ఘటన అమెరికాలోని తెలుగు రాష్ట్రాల వారిని కలవరపాటుకు గురిచేసింది. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో హానర్స్ స్టూడెంట్ అయిన హైదరాబాద్‌కు చెందిన యువతి శనివారం క్యాంపస్ గ్యారేజ్‌లోని కారు వెనక సీటులో విగతజీవిగా కనిపించారు. బాధిత విద్యార్థిని కుటుంబం అమెరికాలో స్థిరపడినట్టు సమాచారం. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగుడు డొనాల్డ్ తుర్మన్ (26)ను చికాగో మెట్రో స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడికి యూనివర్సిటీతో ఎలాంటి సంబంధం లేదని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. నిందితుడిపై హత్య, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం నుంచి తమ కుమార్తె కనిపించడం లేదని యూనివర్సిటీ పోలీసులకు శనివారం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని వర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. బాధితురాలికి ఫోన్ చేయగా స్పందించకపోవడంతో హల్స్టెడ్ స్ట్రీట్ పార్కింగ్ గ్యారేజ్‌లోని తన కారు బ్యాక్ సీటులో విగతజీవిగా పడిఉన్నట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు డొనాల్డ్ దుశ్చర్యను పసిగట్టి చికాగో మెట్రో స్టేషన్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. హెల్త్ ప్రొఫెఫషనల్‌గా మారి ఎందరికో సాయం చేయాలని కలలు కన్న యువతి విషాదాంతం తమను దిగ్ర్భాంతికి గురిచేసిందని, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని వర్సిటీ చాన్స్‌లర్ మైఖేల్ డీ అమిరిడిస్ పేర్కొన్నారు. ఇక ఆమె స్మృతి చిహ్నంగా యువతికి ఇష్టమైన పసుపు రంగు రిబ్బన్లను క్యాంపస్ అంతటా ఎగురవేసినట్టు సహచర విద్యార్ధి చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే స్వీట్ గర్ల్‌ను మిస్ అయ్యామని ఆమె జిమ్నాస్టిక్స్ మాజీ కోచ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘స్మార్ట్’గా వ్యాధి నిర్ధారణ!
వాషింగ్టన్: వ్యాధుల నిర్ధారణకు చేసే రక్త, మూత్ర పరీక్షలు కొంతమేర ఖరీదైనవే. ఈ పరీక్షలు చేసేందుకు బోలెడంత డబ్బు పోసి యంత్రాలు కొనాల్సి రావడం దీనికి కారణం. అమెరికాలోని ఇల్లినాయీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ అడ్డంకిని దాటేశామని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించేందుకు ఓ పరికరాన్ని తయారు చేశామని వారు ప్రకటించారు. దాదాపు రూ.40 వేల ఖరీదు చేసే ఈ యంత్రం.. లక్షల విలువైన యంత్రాలకు తీసిపోని ఫలితాలిస్తుందని శాస్త్రవేత్త కన్నింగ్‌హామ్ చెప్పారు. ‘ట్రై అనలైజర్’అని పిలుస్తున్న ఈ యంత్రం స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాను స్పెక్ట్రోమీటర్గా మార్చడం ద్వారా పనిచేస్తుంది. విశ్లేషించాల్సిన ద్రవ నమూనాను ఒక పరికరంలో ఉంచినప్పుడు దీనిపై ఫోన్లోని ఎల్ఈడీ లైట్ కాంతిని ప్రసరింపజేస్తారు. ఇంకోవైపు నుంచి ఆ కాంతిని ఒక ఆప్టిక్ ఫైబర్ తీగలో సేకరించి ఫోన్లోని కెమెరా ఉన్న వైపునకు పంపించి తేడాలు గుర్తించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ పరికరం ద్వారా ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ నమూనాలను పరీక్షించవచ్చు. వైద్య పరీక్షలతో పాటు ఈ పరికరాన్ని జంతువుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు, మత్తు పదార్థాలు మందులను గుర్తించేందుకు వాడొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే స్పెక్ట్రోమీటర్ అవసరమున్న ప్రతి రంగంలోనూ దీన్ని వాడొచ్చని కన్నింగ్‌హామ్ అంటున్నారు. -
బ్రకోలీతో లివర్ క్షేమం
పరిపరి శోధన తరచుగా బ్రకోలీ తీసుకుంటే లివర్ పదికాలాల పాటు క్షేమంగా ఉంటుందని అమెరికాలోని ఇల్లినాయీ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వారానికి మూడు నుంచి ఐదుసార్లు బ్రకోలీ తీసుకునేట్లయితే లివర్ కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని వారు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి జబ్బులను నివారించడంలోనూ బ్రకోలీ బాగా ఉపయోగపడుతుందని ఇల్లినాయీ వర్సిటీ పరిశోధకురాలు ప్రొఫెసర్ ఎలిజబెత్ జెఫరీ చెబుతున్నారు. బ్రకోలీకి దగ్గరగా ఉండే కాలిఫ్లవర్ వల్ల కూడా దాదాపు ఇలాంటి ఉపయోగాలే ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.