అనగనగా అదో గ్రహం. నెఫ్ట్యూన్ సైజులో ఉంటుంది. దానిపై ఒక ఏడాదిలో కేవలం 21 గంటలే ఉంటాయి! అది మాతృ నక్షత్రానికి అతి సమీపంగా ఉండటమే ఇందుకు కారణమట. దాంతో నక్షత్రం చుట్టూ ఆ గ్రహం పరిభ్రమణం కేవలం 21 గంటల్లో పూర్తయిపోతోందని సైంటిస్టులు కనిపెట్టారు. టీఓఐ–3261గా పిలిచే ఈ గ్రహం, దాని తాలూకు నక్షత్రమండలం వయసు 650 కోట్ల ఏళ్లని అంచనా.
తొలుత బృహస్పతి పరిమాణంలో ఉన్న ఈ గ్రహం నిరంతరం ద్రవ్యరాశిని కోల్పోతూ చిన్నదవుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. దాని మాతృనక్షత్రపు ఆకర్షణ శక్తే ఇందుకు ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పరిమాణంలో నెఫ్ట్యూన్‌కు సమానంగా ఉన్నా ద్రవ్యరాశి మాత్రం దానితో పోలిస్తే రెట్టింపుగా ఉందట! టీఓఐ–3261 ఉనికి గ్రహాల ఆవిర్భావానికి సంబంధించిన ప్రస్తుత సిద్ధాంతాలన్నింటినీ సవాలు చేస్తుండటం విశేషం.
ఎందుకంటే మాతృ నక్షత్రానికి అంత దగ్గరగా ఉండే గ్రహాలపై దట్టమైన వాయువులతో కూడిన వాతావరణం నిలిచి ఉండటం దాదాపుగా అసాధ్యమన్నది శాస్త్ర ప్రపంచంలో ఇప్పటిదాకా ఉన్న భావన. దాంతో గ్రహాల పుట్టుకకు సంబంధించి మనకు తెలియని కొత్త కోణాలకు టీఓఐ–3261 దారి చూపుతుందని భావిస్తున్నారు. అందుకే దానిపై వాతావరణాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాలూకు పరారుణ కాంతి టెక్నాలజీ సాయంతో లోతుగా పరిశోధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త ఎమ్మా నబ్బీ ఆధ్వర్యంలోని సైంటిస్టుల బృందం అధ్యయనంలో వెల్లడైన ఈ విశేషాలను ఆస్ట్రానామికల్ జర్నల్‌లో ప్రచురించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment