ఒక తార జన్మించాలంటే ఒక నిహారిక మరణించాలని ఇంగ్లిష్ సూక్తి. ఒక గ్రహం జన్మించాలంటే అంతకన్నా ఎక్కువ ఉత్పాతం జరగాలంటున్నారు సైంటిస్టులు. శిశువుకు జన్మనిచ్చేందుకు తల్లి పడేంత కష్టం గ్రహాల పుట్టుక వెనుక ఉందంటున్నారు. తాజాగా ఇందుకు బలమైన సాక్ష్యాలు లభించాయి.
గ్రహాల పుట్టుక ఒక తీవ్రమైన, విధ్వంసకర ప్రక్రియని ఖగోళ శాస్త్రజ్ఞులు విశదీకరిస్తున్నారు. హబుల్ టెలిస్కోపు తాజాగా పంపిన చిత్రాలను శోధించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు. గురుగ్రహ పరిమాణంలో ఉన్న ఒక ప్రొటో ప్లానెట్ పుట్టుకను హబుల్ చిత్రీకరించింది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే వాయువులు, ధూళితో కూడిన వాయురూప ద్రవ్యరాశిని(గ్యాసియస్ మాస్) ప్రొటో ప్లానెట్‌గా పేర్కొంటారు. ఈ గ్యాసియస్ మాస్‌పైన ధూళి, వాయువుల ఉష్ణోగ్రతలు తగ్గి అవి చల్లారే కొద్దీ ఘన, ద్రవ రూపాలుగా మారతాయి.
అనంతరం ప్రొటోప్లానెట్ సంపూర్ణ గ్రహంగా మారుతుంది. సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహాలను(శని, గురుడు, యురేనస్, నెప్ట్యూన్) జోవియన్ గ్రహాలంటారు. మిగిలిన ఐదు గ్రహాలతో పోలిస్తే వీటిలో వాయువులు, ధూళి శాతం ఎక్కువ. ఈ జోవియన్ ప్లానెట్లు కోర్ అక్రేషన్ ప్రక్రియలో ఏర్పడ్డాయని ఇప్పటివరకు ఒక అంచనా ఉండేది. భారీ ఆకారంలోని ఘన సమూహాలు ఢీకొనడం వల్ల ప్రొటో ప్లానెట్లు ఏర్పడతాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఇది డిస్క్ ఇన్‌స్టెబిలిటీ (బింబ అస్థిరత్వ) సిద్ధాంతానికి వ్యతిరేకం. డిస్క్ ఇన్‌స్టెబిలిటీ ప్రక్రియ ద్వారా జూపిటర్ లాంటి గ్రహాలు ఏర్పడ్డాయనే సిద్ధాంతాన్ని ఎక్కువమంది సమర్థిస్తారు. తాజా పరిశోధనతో కోర్ అక్రేషన్ సిద్ధాంతానికి బలం తగ్గినట్లయింది.
వేదనాభరిత యత్నం
ఒక నక్షత్ర గురుత్వాకర్షణకు లోబడి అనేక స్టెల్లార్ డిస్కులు దాని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. కొన్ని లక్షల సంవత్సరాలకు ఈ స్టెల్లార్ డిస్క్‌లు చాలా కష్టంమీద సదరు నక్షత్ర గురుత్వాకర్షణ శక్తికి అందులో పడి పతనం కాకుండా పోరాడి బయటపడతాయని, అయితే నక్షత్ర ఆకర్షణ నుంచి పూర్తిగా బయటకుపోలేక ఒక నిర్ధిష్ఠ కక్ష్యలో పరిభ్రమిస్తూ క్రమంగా ప్రొటోప్లానెట్లుగా మారతాయని డిస్క్ ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతం చెబుతోంది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే దుమ్ము, ధూళి, వాయువులు (డస్ట్ అండ్ గ్యాస్ మాసెస్), అస్టరాయిడ్లవంటి అసంపూర్ణ ఆకారాలను స్టెల్లార్ డిస్క్‌లంటారు. తాజా చిత్రాలు ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతానికి బలం చేకూరుస్తున్నాయి.
ఈ పరిశోధన వివరాలు జర్నల్ నేచుర్ ఆస్ట్రానమీలో ప్రచురించారు. తాజాగా కనుగొన్న ప్రొటోప్లానెట్ (ఆరిగే బీ– ఏబీ అని పేరుపెట్టారు) 20 లక్షల సంవత్సరాల వయసున్న కుర్ర నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని నాసా పేర్కొంది. మన సౌర వ్యవస్థ కూడా సూర్యుడికి దాదాపు ఇంతే వయసున్నప్పుడు ఏర్పడింది. ఒక గ్రహం ఏ పదార్ధంతో ఏర్పడబోతోందనే విషయం అది ఏర్పడే స్టెల్లార్ డిస్కును బట్టి ఉంటుందని సైంటిస్టులు వివరించారు. కొత్తగా కనుగొన్న ఏబీ గ్రహం మన గురు గ్రహం కన్నా 9 రెట్లు బరువుగా ఉందని, మాతృనక్షత్రానికి 860 కోట్ల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోందని పరిశోధన వెల్లడించింది. హబుల్ టెలిస్కోప్ 13 సంవత్సరాల పాటు పంపిన చిత్రాలను, జపాన్‌కు చెందిన సుబరు టెలిస్కోప్ పంపిన చిత్రాలను పరిశీలించి ఈ గ్రహ పుట్టుకను అధ్యయనం చేశారు. దీనివల్ల మన సౌర కుటుంబానికి సంబంధించిన మరిన్ని రహస్యాలు బయటపడతాయని ఆశిస్తున్నారు.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment