Hubble telescope
-
నిషిద్ధ కాంతి చిక్కింది
ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనబడని విశ్వపు సుదూరాల్లోని నిషిద్ధ కాంతి ఎట్టకేలకు చిక్కింది. దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది. భూమికి ఏకంగా 27.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఎంసీజీ–01–24–014 స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను ఒడిసిపట్టింది. వాటికి సంబంధించి అబ్బురపరిచే ఫొటోలను భూమికి పంపింది. టెలిస్కోప్ తాలూకు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేస్ (ఏసీఎస్) ఈ ఘనత సాధించింది. అత్యంత స్పష్టతతో ఉన్న ఫొటోలు చూసి నాసా సైంటిస్టులతో పాటు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ కిరణాల వెలుగులో కనువిందు చేస్తున్న ఎంసీజీ గెలాక్సీ అందాలకు ఫిదా అవుతున్నారు. కాస్మిక్ ఫొటోగ్రఫీ చరిత్రలోనే దీన్ని అత్యంత అరుదైన ఫీట్‌గా అభివరి్ణస్తున్నారు. హబుల్ ఫొటోల్లో కన్పిస్తున్న ఎంసీజీ గెలాక్సీ పూర్తిస్థాయిలో వికసించిన నిర్మాణం, అత్యంత శక్తిమంతమైన కేంద్రకంతో కనువిందు చేస్తోంది. ఇది అత్యంత చురుకైన కేంద్రకాలున్న టైప్–2 సీఫెర్ట్ గెలాక్సీల జాబితాలోకి వస్తుందని నాసా పేర్కొంది. సీఫెర్ట్ గెలాక్సీలు అంతరిక్షంలో మనకు అత్యంత దూరంలో ఉండే అతి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలైన క్వాసార్ల సమీపంలో ఉంటాయి. అయితే క్వాసార్లు తామున్న గెలాక్సీలను బయటికి ఏమాత్రమూ కని్పంచనీయనంతటి ప్రకాశంతో వెలిగిపోతుంటాయి. సీఫెర్ట్ గెలాక్సీలు మాత్రం వీక్షణకు అనువుగానే ఉంటాయి. కానీ అత్యంత సుదూరంలో ఉన్న కారణంగా వీటి వెలుతురు ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కలేదు. ఆ కారణంగానే సైంటిస్టుల పరిభాషలో దాన్ని ‘నిషిద్ధ కాంతి’గా ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు. పైగా ఈ కాంతి పుంజాలు భూమ్మీద మనకు ఇప్పటిదాకా తెలిసిన పరిమాణ భౌతిక శాస్త్ర నియమాలకు పూర్తిగా అతీతమన్నది సైంటిస్టుల నమ్మకం. అనంత విశ్వంలో అంతటి సుదూర అంతరిక్ష క్షేత్రంలో మన భౌతిక శాస్త్ర నియమాలన్నీ తల్లకిందులవుతాయని వారు చెబుతుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మిస్టరీ గెలాక్సీ చిక్కింది
ఇంతకాలంగా అందీ అందనట్టుగా తప్పించుకుంటూ వస్తున్న ఓ మిస్టరీ గెలాక్సీ ఆనవాలు ఎట్టకేలకు చిక్కింది. భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల పై చిలుకు దూరంలో ఉన్న కార్ట్‌వీల్ గెలాక్సీని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరా కంటిలో బంధించింది. దాని కేంద్రకం వద్ద ఉన్న భారీ కృష్ణబిలం కూడా వెబ్ కెమెరాకు చిక్కింది. ఈ గెలాక్సీని నిత్యం నక్షత్ర ధూళి భారీ పరిమాణంలో ఆవరించి ఉంటుందట. దాంతో హబుల్ వంటి కాకలు తీరిన టెలిస్కోప్‌లు ఎంతగా ప్రయత్నించినా ఇప్పటిదాకా దీన్ని ఫొటోలు తీయలేకపోయాయి. అందుకే ఈ గెలాక్సీ కంటపడటాన్ని చాలా అరుదైన విషయంగా నాసా సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. కోట్లాది ఏళ్లలో కార్ట్‌వీల్ గెలాక్సీ ఎలాంటి మార్పుచేర్పులకు గురవుతూ వచ్చిందీ తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ తీసిన ఇన్ఫ్రా రెడ్ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. దాని కేంద్ర స్థానం వద్ద ఏర్పడ్డ కృష్ణబిలం గురించి కూడా విలువైన సమాచారం తెలిసే వీలుందట. అంతేగాక నక్షత్రాల పుట్టుకకు సంబంధించి ఇప్పటిదాకా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి రావచ్చన్నది సైంటిస్టుల మాట. అచ్చం బండి చక్రంలా... వయసు మీదపడుతున్న హబుల్ టెలిస్కోప్‌కు వారసునిగా జేమ్స్ వెబ్ ఇటీవలే అంతరిక్ష ప్రవేశం చేయడం తెలిసిందే. కాలంలో వెనక్కు చూడగల ఇన్ఫ్రా రెడ్ సామర్థ్యం దీని సొంతం. దాని సాయంతో మహావిస్ఫోటనం (బిగ్‌బ్యాంగ్) అనంతరం విశ్వం ఆవిర్భవించిన తొలి నాళ్లకు సంబంధించిన ఫొటోను ఇటీవలే జేమ్స్ వెబ్ మనకు అందించిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా కార్ట్‌వీల్ గెలాక్సీకి సంబంధించి కూడా దాని ఇప్పటి, సుదూర, సమీప గతాలకు సంబంధించిన ఫొటోలనూ జేమ్స్ వెబ్ స్పష్టంగా అందించగలిగింది. ఈ ఫొటోల్లో కార్ట్‌వీల్ గెలాక్సీ పేరుకు తగ్గట్టుగా అచ్చం బండి చక్రం మాదిరిగానే కన్పిస్తోంది. స్కల్ప్టర్ నక్షత్ర మండలంలోని ఈ గెలాక్సీతో పాటు మరెన్నో ఇతర పాలపుంతలు కూడా నేపథ్యంలో కనిపిస్తుండటం విశేషం. ఒక అతి పెద్ద, మరో బుల్లి గెలాక్సీ ఊహాతీతమైన వేగంతో ఢీకొనడం వల్ల కార్ట్‌వీల్ గెలాక్సీ పురుడు పోసుకుందని సైంటిస్టులు సిద్ధాంతీకరించారు. కానీ దీని ఉనికి చాలాకాలం పాటు మిస్టరీగానే ఉండిపోయింది. అంతరిక్ష ధూళి తదితరాల గుండా సులువుగా పయనించగల పరారుణ కాంతిని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పట్టుకోగలదు. దాని సాయంతోనే ఎట్టకేలకు అది కార్ట్‌వీల్ ఉనికిని నిర్ధారించి కెమెరాలో బంధించగలిగింది. ఫొటోలో కన్పిస్తున్న నీలి రంగు చుక్కలన్నీ నక్షత్రాలు. కోట్లాది ఏళ్ల కాలక్రమంలో చోటుచేసుకున్న భారీ విస్ఫోటాలు తదితరాల వల్ల కార్ట్‌వీల్ గెలాక్సీలో చోటుచేసుకుంటూ వచ్చిన కీలక మార్పులను ఈ ఫొటోల సాయంతో విశ్లేషించవచ్చట. ఈ గెలాక్సీ చుట్టూ రెండు వెలుతురు మండలాలున్నాయి. కేంద్ర స్థానంలో సంభవించిన మహా విస్ఫోటం ఫలితంగా చెరువులో అలల్లా ఇవి నానాటికీ విస్తరిస్తూ పోతున్నాయట. అందుకే అంతరిక్ష శాస్త్రవేత్తలు దీన్ని రింగ్ గెలాక్సీ అని కూడా పిలుస్తుంటారు. ఇలాంటి ఆకృతులుండే పాలపుంతలు అరుదు. దీనిలోని అంతరిక్ష ధూళికి సంబంధించి లోతైన విషయాలను జేమ్స్ వెబ్ తాలూకు మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్ (ఎంఐఆర్ఐ) సాయంతో విశ్లేషించే పనిలో పడింది నాసా. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఉత్పాతం నుంచి ఉత్పత్తి
ఒక తార జన్మించాలంటే ఒక నిహారిక మరణించాలని ఇంగ్లిష్ సూక్తి. ఒక గ్రహం జన్మించాలంటే అంతకన్నా ఎక్కువ ఉత్పాతం జరగాలంటున్నారు సైంటిస్టులు. శిశువుకు జన్మనిచ్చేందుకు తల్లి పడేంత కష్టం గ్రహాల పుట్టుక వెనుక ఉందంటున్నారు. తాజాగా ఇందుకు బలమైన సాక్ష్యాలు లభించాయి. గ్రహాల పుట్టుక ఒక తీవ్రమైన, విధ్వంసకర ప్రక్రియని ఖగోళ శాస్త్రజ్ఞులు విశదీకరిస్తున్నారు. హబుల్ టెలిస్కోపు తాజాగా పంపిన చిత్రాలను శోధించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు. గురుగ్రహ పరిమాణంలో ఉన్న ఒక ప్రొటో ప్లానెట్ పుట్టుకను హబుల్ చిత్రీకరించింది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే వాయువులు, ధూళితో కూడిన వాయురూప ద్రవ్యరాశిని(గ్యాసియస్ మాస్) ప్రొటో ప్లానెట్‌గా పేర్కొంటారు. ఈ గ్యాసియస్ మాస్పైన ధూళి, వాయువుల ఉష్ణోగ్రతలు తగ్గి అవి చల్లారే కొద్దీ ఘన, ద్రవ రూపాలుగా మారతాయి. అనంతరం ప్రొటోప్లానెట్ సంపూర్ణ గ్రహంగా మారుతుంది. సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహాలను(శని, గురుడు, యురేనస్, నెప్ట్యూన్) జోవియన్ గ్రహాలంటారు. మిగిలిన ఐదు గ్రహాలతో పోలిస్తే వీటిలో వాయువులు, ధూళి శాతం ఎక్కువ. ఈ జోవియన్ ప్లానెట్లు కోర్ అక్రేషన్ ప్రక్రియలో ఏర్పడ్డాయని ఇప్పటివరకు ఒక అంచనా ఉండేది. భారీ ఆకారంలోని ఘన సమూహాలు ఢీకొనడం వల్ల ప్రొటో ప్లానెట్లు ఏర్పడతాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఇది డిస్క్ ఇన్‌స్టెబిలిటీ (బింబ అస్థిరత్వ) సిద్ధాంతానికి వ్యతిరేకం. డిస్క్ ఇన్‌స్టెబిలిటీ ప్రక్రియ ద్వారా జూపిటర్ లాంటి గ్రహాలు ఏర్పడ్డాయనే సిద్ధాంతాన్ని ఎక్కువమంది సమర్థిస్తారు. తాజా పరిశోధనతో కోర్ అక్రేషన్ సిద్ధాంతానికి బలం తగ్గినట్లయింది. వేదనాభరిత యత్నం ఒక నక్షత్ర గురుత్వాకర్షణకు లోబడి అనేక స్టెల్లార్ డిస్కులు దాని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. కొన్ని లక్షల సంవత్సరాలకు ఈ స్టెల్లార్ డిస్క్‌లు చాలా కష్టంమీద సదరు నక్షత్ర గురుత్వాకర్షణ శక్తికి అందులో పడి పతనం కాకుండా పోరాడి బయటపడతాయని, అయితే నక్షత్ర ఆకర్షణ నుంచి పూర్తిగా బయటకుపోలేక ఒక నిర్ధిష్ఠ కక్ష్యలో పరిభ్రమిస్తూ క్రమంగా ప్రొటోప్లానెట్లుగా మారతాయని డిస్క్ ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతం చెబుతోంది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే దుమ్ము, ధూళి, వాయువులు (డస్ట్ అండ్ గ్యాస్ మాసెస్), అస్టరాయిడ్లవంటి అసంపూర్ణ ఆకారాలను స్టెల్లార్ డిస్క్లంటారు. తాజా చిత్రాలు ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ పరిశోధన వివరాలు జర్నల్ నేచుర్ ఆస్ట్రానమీలో ప్రచురించారు. తాజాగా కనుగొన్న ప్రొటోప్లానెట్ (ఆరిగే బీ– ఏబీ అని పేరుపెట్టారు) 20 లక్షల సంవత్సరాల వయసున్న కుర్ర నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని నాసా పేర్కొంది. మన సౌర వ్యవస్థ కూడా సూర్యుడికి దాదాపు ఇంతే వయసున్నప్పుడు ఏర్పడింది. ఒక గ్రహం ఏ పదార్ధంతో ఏర్పడబోతోందనే విషయం అది ఏర్పడే స్టెల్లార్ డిస్కును బట్టి ఉంటుందని సైంటిస్టులు వివరించారు. కొత్తగా కనుగొన్న ఏబీ గ్రహం మన గురు గ్రహం కన్నా 9 రెట్లు బరువుగా ఉందని, మాతృనక్షత్రానికి 860 కోట్ల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోందని పరిశోధన వెల్లడించింది. హబుల్ టెలిస్కోప్ 13 సంవత్సరాల పాటు పంపిన చిత్రాలను, జపాన్‌కు చెందిన సుబరు టెలిస్కోప్ పంపిన చిత్రాలను పరిశీలించి ఈ గ్రహ పుట్టుకను అధ్యయనం చేశారు. దీనివల్ల మన సౌర కుటుంబానికి సంబంధించిన మరిన్ని రహస్యాలు బయటపడతాయని ఆశిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
4 కోట్ల గంటలు.. 10 వేల మంది.. 76 వేల కోట్ల ఖర్చు
విశ్వ రహస్యాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆదిమ కాలం నుంచి మానవుడికి ఉండేది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ జిజ్ఞాసతో టెలిస్కోపుల నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో తాజాగా అతిపెద్ద టెలిస్కోపును నిర్మించడం జరిగింది. ఇంతవరకు విశ్వ రహస్యాలను అందిస్తూ వస్తున్న హబుల్ టెలిస్కోపుకు వారసురాలిగా, అంతకన్నా శక్తివంతమైనదిగా తీర్చిదిద్దిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు ప్రయోగం డిసెంబర్ 22న జరగనుంది. బిగ్‌బ్యాంగ్ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భవ అంశాలను లోతుగా పరిశీలించేందుకు ఈ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడనుంది. విశ్వ రహస్యాలను వివరంగా చూపించే ఈ టెలిస్కోపు నిర్మాణం నుంచి ప్రయోగం వరకు అనేక విశేషాలున్నాయి. అవేంటో చూద్దాం.. 10,000 మంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీల సహకారంతో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ది చేస్తోంది. దాదాపు 20కి పైగా దేశాలకు ఈ టెలిస్కోపు నిర్మాణంలో భాగస్వామ్యముంది. ఏరియన్ 5 స్పేస్ రాకెట్లో ఫ్రెంచ్ గినియాలోని గినియాస్పేస్ సెంటర్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. దీని నిర్మాణంలో దాదాపు 10వేల మంది సైంటిస్టులు 4 కోట్ల పనిగంటల పాటు కష్టపడ్డారు. 25 సంవత్సరాలు 1996లో ఎన్జీఎస్టీ పేరిట ఈ టెలిస్కోపు ప్రాజెక్టు ఆరంభమైంది. 2002లో దీనికి జేమ్స్ వెబ్ పేరును పెట్టారు. సుదీర్ఘకాలం పట్టిన ఈ టెలిస్కోపు నిర్మాణం సాఫీగా జరగలేదు. నిధుల కొరతతో ప్రాజెక్టు చాలా ఆలస్యం అయింది. 2011లో అమెరికా చట్టసభల కేటాయింపుల కమిటీ ఈ ప్రాజెక్టును ఏకంగా రద్దు చేయాలని పత్రిపాదించింది. ఆ సమయంలో దీన్ని నేచర్ పత్రిక ‘ఖగోళ నిధులు మింగేస్తున్న టెలిస్కోపు’గా అభివర్ణించింది. అయితే రద్దు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా కాంగ్రెస్ టెలిస్కోపు నిర్మాణాన్ని కొనసాగించే నిధులను కేటాయించింది. దీంతో సుమారు 25 సంవత్సరాల కృషి అనంతరం 2021కి టెలిస్కోపు సిద్ధమైంది. రూ.76 వేల కోట్లు సుదీర్ఘకాలం కొనసాగడంతో దీని నిర్మాణానికి చాలా నిధులు వెచ్చించారు. 1996లో ఈ టెలిస్కోపు నిర్మాణ అంచనా నిధులు 50 కోట్ల డాలర్లు కాగా, 2021లో పూర్తయ్యేనాటికి 1,000 కోట్ల డాలర్ల (సుమారు 76 వేల కోట్ల రూపాయలు) వ్యయమైంది. లక్షల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమణం డిసెంబర్ 22న ప్రయోగంతో దీన్ని భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ బిందువు వద్దకు చేరుస్తారు. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఇది భూమిలా సూర్యుని చూట్టూ పరిభ్రమిస్తుంటుంది. టెలిస్కోపులోని దర్పణాలను, పరికరాలను –220 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా ఉంచేందుకు దీనికి సిలికాన్, అల్యూమినియం పూత పూసిన సౌర కవచాన్ని తొడిగారు. హబుల్ భూమికి సుమారు 550 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోంది. 11 రోజులు ప్రయోగించిన 11 రోజులకు ఇది ఎల్2 పాయింటుకు చేరుకుంటుంది. అక్కడ కక్ష్యలో ప్రవేశించాక అంతవరకు ముడుచుకుని ఉన్న దర్పణం తెరుచుకొని పని ప్రారంభిస్తుంది. ఇందులో ప్రాథమిక దర్పణం కాకుండా మరో మూడు దర్పణాలు, లైట్ డిటెక్టర్, స్టార్ ట్రాకర్స్, సోలార్ ప్యానెల్స్, యాంటెన్నాలాంటి ఇతర భాగాలుంటాయి. 458 జీబీ కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు. 1350 కోట్ల సంవత్సరాల క్రితం కాంతి బిగ్ బ్యాంగ్ అనంతరం ఏర్పడ్డ తొలి నక్షత్రాలు, గాలక్సీల నుండి వెలువడ్డ కాంతి కోసం అన్వేషణ, గెలాక్సీల నిర్మాణం, పరిణామాలను, నక్షత్ర, గ్రహ వ్యవస్థల ఏర్పాటును అధ్యయనం చేయడం, జీవావిర్భావాన్ని పరిశోధించడం లక్ష్యంగా ఈ టెలిస్కోపు పనిచేయనుంది. జేమ్స్ వెబ్ పరారుణ సామర్థ్యంతో బిగ్ బ్యాంగ్ అనంతరం కొన్ని పదుల కోట్ల సంవత్సరాల తరువాత ఏర్పడిన తొలి గెలాక్సీల గురించి పరిశీలించవచ్చు. విశ్వం ఆవిర్భవించి ఇప్పటికి సుమారు 1380 కోట్ల సంవత్సరాలైందని అంచనా. ఈ టెలిస్కోపు సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టగలదు. ఆసక్తి ఉన్న సైంటిస్టులు డైరెక్టర్స్ డిస్క్రెషనరీ ఎర్లీ రిలీస్ సైన్స్(డిడి–ఇఆర్ఎస్) కార్యక్రమం, గ్యారెంటీడ్ టైమ్ అబ్జర్వేషన్స్(జిటిఓ) కార్యక్రమం, జనరల్ అబ్జర్వర్స్(జిఓ) కార్యక్రమాల ద్వారా ఈ టెలిస్కోపును వాడుకొని ఖగోళ పరిశోధన చేసేందుకు సమయాన్నిస్తారు. నేషనల్ డెస్క్, సాక్షి -
ఇంకా పనిచేయని హబుల్ స్పేస్ టెలిస్కోప్!
కంప్యూటర్ లో తలెత్తిన చిన్న లోపం కారణంగా హబుల్ స్పేస్ టెలిస్కోప్ నెల తర్వాత కూడా పనిచేయడం లేదు. నాసా ఇంజనీర్లు ఇంకా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేదు. భూ నిమ్న కక్ష్యలో తిరుగుతూ ఉన్న ఈ టెలిస్కోపును 1990లో నాసా ప్రయోగించింది. అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎడ్విన్ హబుల్ పేరును దీనికి పెట్టారు. అంతరిక్షంలోకి పంపిన టెలిస్కోపుల్లో ఇది మొదటిది కానప్పటికీ, మిగతా వాటికంటే ఇది శక్తివంతమైనది. ఈ అంతరిక్ష అబ్జర్వేటరీని తిరిగి ప్రారంభించే ప్రయత్నంలో ఈ వారం చివర్లో బ్యాకప్ హార్డ్ వేర్‌కు మారాలని నాసా బృందాలు ఆలోచిస్తున్నాయి. బ్యాకప్ హార్డ్ వేర్ కు మారేటప్పుడు సంభవించే ప్రమాదాలను తగ్గించడానికి నాసా ఒక సమీక్షను పూర్తి చేసినట్లు తెలిపింది. పేలోడ్ కంప్యూటర్ సమస్యకు గల కారణాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపింది. హబుల్ సిస్టమ్స్ అనోమలీ రెస్పాన్స్ మేనేజర్ న్జింగా తుల్, నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ తో మాట్లాడుతూ.. "హబుల్ స్పేస్ టెలిస్కోప్ కంప్యూటర్ తలెత్తిన చిన్న లోపం కారణంగా జూన్ 13న పనిచేయడం ఆగిపోయినప్పటి నుంచి ఆ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు కఠినంగా శ్రమిస్తున్నారు. "ప్రాథమిక పరిశోధనలు విజయవంతం కాకపోవడంతో, ఫార్మాట్ చేసిన బ్యాకప్ సైన్స్ డేటాకు మారడానికి సిద్ధమవుతున్నట్లు" తుల్ తెలిపారు. అయితే, బ్యాకప్ కంప్యూటర్ కు మారడం అంత సులభమైన పని కాదు, ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్ లో గ్లిచ్డ్ పేలోడ్ కంప్యూటర్ కు సంబంధం లేని భాగాలు ఉన్నాయి, వాటిని కూడా వాటి బ్యాకప్ ఎలిమెంట్లకు మార్చాల్సి ఉంటుంది. -
హబుల్‌కు చిక్కిన సుదూ..ర నక్షత్రం!
వాషింగ్టన్ : భూమికి 500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ నక్షత్రాన్ని హబుల్ టెలిస్కోప్ గుర్తించింది. ఈ నక్షత్రానికి ఇకారస్ అని నామకరణం చేశారు. ఈ బ్లూస్టార్ కిరణాలు భూమిని చేరడానికి 900 కోట్ల సంవత్సరాలు పడుతుందంటే అది ఎంత దూరంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని ఏ టెలిస్కోప్తోనూ ఇంత దూరంలో ఉన్న నక్షత్రాలను చూడటం సాధ్యం కాదు. అయితే గ్రావిటేషనల్ లెన్సింగ్ టెక్నిక్ ఉపయోగించి ఇంత దూరంలో ఉన్న నక్షత్రాన్ని గుర్తించిన ఆస్ట్రోనామర్స్ కొత్త రికార్డును సృష్టించారు. ఇంత పెద్ద, ఒంటరి నక్షత్రాన్ని చూడటం ఇదే తొలిసారి అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ పాట్రిక్ కెల్లీ చెప్పారు. అక్కడ మనం సాధారణంగా ఒంటరి గెలాక్సీలను చూడొచ్చు. కానీ ఈ నక్షత్రం మాత్రం మనం అధ్యయనం చేయగల ఒంటరి నక్షత్రం కంటే వంద రెట్ల దూరంలో ఉంది అని కెల్లీ తెలిపారు. గ్రావిటేషనల్ లెన్స్‌తోపాటు హబుల్ టెలిస్కోప్‌కు ఉన్న అత్యంత శక్తిమంతమైన రెజల్యూషన్ సాయంతో ఆస్ట్రోనాట్స్ ఇకారస్ను అధ్యయనం చేయగలరు. -
ఏలియన్స్ గుట్టువిప్పే టెలిస్కోప్
వాషింగ్టన్: మానవుడు సాంకేతికంగా ఎంత అభివృద్ధిని సాధిస్తున్నా ఇంకా విశ్వంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో సవాలు విసురుతూనే ఉన్నాయి. వాటిలో ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) గురించిన కథనాలు ఒకటి. అసలు గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా.. లేదా.. అన్న విషయం ఇప్పటికీ మిస్టరీనే. ఈ మిస్టరీని ఛేదించడానికి నాసా నడుంబిగించింది. దీని కోసం హబుల్ టెలిస్కోప్ కంటే 100 రెట్లు అధిక సామర్థ్యం ఉన్న ‘ ది వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్’ ను (డబ్ల్యూఎఫ్ఐఆర్ఎస్టీ) రూపొందిస్తోంది. విశ్వంలోని అంతుపట్టని రహస్యాలను కళ్లకు కట్టినట్టు చూపించగలిగే సామర్థ్యం ఈ టెలిస్కోప్‌కు ఉన్నట్టు నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ జాన్ గ్రన్స్ఫీల్డ్ తెలిపారు. ఇది 2018లో అందుబాటులోకి రానుంది. -
విశ్వ గవాక్షానికి పాతికేళ్లు!
ఖగోళ వింతలపై మనిషి ఆసక్తి యుగాలుగా ఉన్నదే... మిణుకు మిణుకు తారల్లో రకరకాల ఆకారాలను ఊహిస్తూ... వాటితోనే.. తమ రేపును అంచనా వేస్తూ వేల ఏళ్లు గడిపేశాడు. టెలిస్కోపు ఆవిష్కరణతో ఆకాశ వింతల్ని నేరుగా చూడటం సాధ్యమైనా... ఇటీవలి కాలం వరకూ వాటిని అర్థం చేసుకున్నది కొంతే. కానీ... పాతికేళ్ల క్రితం జరిగిన ఓ అద్భుతం... విశ్వ రహస్యాలను మన కళ్లముందు ఉంచుతోంది. కొత్త కొత్త లోకాలను చూపుతోంది. ఆ అద్భుతం పేరు.. హబుల్ టెలిస్కోపు! విశ్వం మొత్తాన్ని చూడగల హబుల్ మన సూర్యుడిని, బుధ గ్రహాన్ని మాత్రం చూడలేదు. మరీ దగ్గరగా ఉండటం దీనికి కారణం. విశ్వ వ్యాపన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ పేరిట ఈ టెలిస్కోపును నిర్మించారు. 1990 ఏప్రిల్ 24... విశ్వం ఆనుపానులు తెలుసుకునే ప్రయత్నంలో మనిషి కీలక విజయం సాధించిన రోజిది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) డిస్కవరి అంతరిక్ష నౌక సాయంతో హబుల్ టెలిస్కోపును విజయవంతంగా ప్రయోగించింది ఈ రోజే. అయితే ఈ టెలిస్కోపు ద్వారా సువిశాల విశ్వం గురించి మనిషి అవగాహన పెరుగుతుందని, అప్పటివరకూ కనీవినీ ఎరుగని కొత్త లోకాలను చూడగలమని చాలా తక్కువ మంది ఊహించి ఉంటారు. ప్రయోగించిన కొన్ని రోజులకే టెలిస్కోపులోని ముఖ్య దర్పణంలో లోపాలు బయటపడటం. దీనికి ఒక కారణమైతే... ఆ తరువాత ఈ లోపాలన్నింటినీ సరిచేసేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి నాలుగు సర్వీస్ మిషన్లు నడపాల్సి రావడం రెండో కారణం. అదష్టవశాత్తూ ఈ శ్రమంతా వృథా కాలేదు. ఈ విశ్వం పరిమాణమెంతో అంచనా కట్టేందుకు మొదలుకొని... నక్షత్రాలు, గ్రహాల పుట్టుక. చావు... కొరకరాని కొయ్యల్లా ఉండిపోయిన కృష్ణశక్తి, కృష్ణబిలం వంటి భౌతిక శాస్త్ర దృగ్విషయాలను అర్థం చేసుకోవడం వరకూ అనేక అంశాల్లో హబుల్ టెలిస్కోపు పరిశోధనలు కీలకపాత్ర వహించాయి. సౌరకుటుంబం అవతల ఉన్న గ్రహాల రూపురేఖలు, వాటిల్లో ఉండే రసాయనాల వివరాలు తెలిసింది కూడా హబుల్ తీసిన ఫొటోల ఆధారంగానే. మరో రెండు రోజుల్లో పాతికేళ్లు నిండబోతున్న తరుణంలో హబుల్ టెలిస్కోపు సాధించిన ఘన విజయాలు కొన్నింటిని చూద్దామా...? విశ్వం వయసు తెలిసింది... కొన్ని కోటానుకోట్ల ఏళ్ల క్రితం ఈ విశ్వం మొత్తం అతిసూక్ష్మమైన బిందువు పరిమాణంలో ఉండేదని, అకస్మాత్తుగా ఓ భారీ పేలుడు సంభవించి... విశ్వం ఏర్పడటం మొదలైందని మనం పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. అయితే ఈ మహా విస్ఫోటం కచ్చితంగా ఎప్పుడన్నది మాత్రం తెలియదు. అయితే కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం వరకూ చూడగల సామర్థ్యమున్న హబుల్ టెలిస్కోపు... కన్యారాశిలోని కొన్ని నక్షత్రాలు ఎంత వేగంగా కదులుతున్నాయో ఫొటోలు తీసి పంపింది. వీటి ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విశ్వం వయసు 1300 నుంచి 1400 కోట్ల సంవత్సరాల వరకూ ఉంటుందని అంచనా కట్టగలిగారు. కొత్త లోకాలు... భూమ్మీద ఉన్న టెలిస్కోపుల సాయంతో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు మన సౌర కుటుంబానికి అవతల కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయని ఎప్పుడో గుర్తించారు. అయితే ఈ ఎక్సోప్లానెట్లు ఎలా ఉంటాయి? వాటిల్లో ఉండే రసాయనాలు ఏమిటి? అన్నది మాత్రం తెలియలేదు. హబుల్ టెలిస్కోపు తన కెమెరా సాయంతో ఈ చిక్కుముళ్లన్నింటినీ విప్పేసింది. రకరకాల తరంగదైర్ఘ్యాల్లో తీసిన ఫొటోలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ ఎక్సోప్లానెట్ల వాతావరణంలో సోడియం, హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్ వంటి వాయువులు ఉన్నాయని తొలిసారి నిర్ధారించగలిగారు. అంతేకాదు... ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని తొలిసారి నేరుగా ఫొటో తీయగలిగింది కూడా ఈ దుర్భిణి ద్వారానే! కృష్ణబిలాలను గుర్తించింది... కాంతిని కూడా తనలోకి లాగేసుకోగల శక్తిమంతమైన ప్రాంతం కష్ణబిలం. విశ్వంలో అనేక చోట్ల ఉండే ఈ కష్ణబిలాలు కంటికి కనిపించవు. ప్రభావం మాత్రం తెలుస్తూంటుంది అంతే. నక్షత్రాలైనా, గ్రహాలైనా, ఏ ఇతర పదార్థమైనా సరే... కృష్ణబిలంలోకి వెళ్లగలవుగానీ... ఆ ప్రాంతం నుంచి ఏదీ బయటకు రాదు... రాలేదు కూడా. ఈ కృష్ణబిలాల గురించి ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనాలు వేశారు.. సిద్ధాంతాలను ప్రతిపాదించారుగానీ.. హబుల్ టెలిస్కోపుతో తొలిసారి అటువంటివాటిని నేరుగా చూడగలిగారు. పాలపుంతల మధ్యభాగంలో భారీసైజున్న కృష్ణబిలాలు ఉంటాయని గుర్తించడమే కాకుండా... వాటి సైజును బట్టి ... పాలపుంత పరిమాణం ఉంటుందని కూడా హబుల్ టెలిస్కోపు తీసిన ఫొటోల ఆధారంగానే తెలిసింది. అదృశ్య శక్తి లెక్కలు తేల్చింది... వేల కోట్లనక్షత్రాలు, గ్రహాలున్న విశ్వం వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయం దాదాపు వందేళ్ల క్రితమే ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ద్వారా తెలిసింది. అయితే ఈ విస్తరణ వేగం కాలక్రమంలో తగ్గుతూ వస్తుందని ఆ తరువాత విశ్వం మొత్తం కుంచించుకుపోవడం మొదలవుతుందని అప్పట్లో అనుకునేవారు.. అయితే హబుల్ టెలిస్కోపు ఈ అంచనాలను తారుమారు చేసింది. 1998లో హబుల్ ఓ నక్షత్ర పేలుడు (సూపర్నోవా) తాలూకూ ఫొటోలను పంపింది. దాని వెలుగులను లెక్కకట్టడం ద్వారా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ విశ్వ విస్తరణ అంతకంతకూ వేగం పుంజుకుంటోందని, తగ్గడంగానీ.. కుంచించుకుపోవడం గానీ సాధ్యం కాదని స్పష్టమైంది. ఈ విస్తరణకు కారణం కృష్ణ శక్తి అని తెలిసింది కూడా ఈ టెలిస్కోపు ద్వారానే . అంతేకాదు... ఈ విశ్వం మొత్తం బరువుకు, మన కంటికి కనిపించే పదార్థం బరువుకు చాలా తేడా ఉంది. అంటే... కంటికి కనిపించని పదార్థం ఏదో ఉందన్నమాట. ఈ కృష్ణ పదార్థం విశ్వం బరువులో 22 శాతం వరకూ ఉంటుందని హబుల్ పరిశోధనల వల్ల స్పష్టమైంది. నక్షత్రాలు, గ్రహాల చావు పుట్టుకలు... నక్షత్రాలు, గ్రహాలు ఎలా పుడతాయన్న విషయంపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా కొన్ని అంచనాలు వేస్తున్నా... స్పష్టంగా చూడగలిగింది మాత్రం హబుల్ పంపిన ఫొటోల ద్వారానే. సుమారు 6500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈగల్ నెబ్యులే (నక్షత్ర మండలం) ఫొటోలను హబుల్ పంపింది. వాటిల్లో అతి ప్రకాశవంతంగా కనిపించే ప్రాంతాల్లో నక్షత్రాలు పురుడుపోసుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నక్షత్రాల చుట్టూ ఉన్న ఖగోళ ధూళి ఒకదగ్గరకు చేరి కాలక్రమంలో గ్రహాలుగా ఏర్పడతాయని కూడా శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. ఈగల్ నెబ్యూలేతోపాటు హబుల్ అనేకానేక నక్షత్ర, గ్రహ మండలాలను గుర్తించి వాటి తాలూకూ సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించింది. - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా 552 కిలోమీటర్లు హబుల్ టెలిస్కోపు పరిభ్రమించే ఎత్తు... 12 టన్నులు హబుల్ బరువు 97 నిమిషాలు భూమిని ఒకసారి చుట్టేసేందుకు పట్టే సమయం 28000 కిలోమీటర్ల వేగం 2.4 మీటర్లు హబుల్లోని ప్రధాన దర్పణం వ్యాసం 2800 వాట్లు రెండు సోలార్ ప్యానెళ్ల సాయంతో హబుల్ ఉత్పత్తి చేసుకునే విద్యుచ్ఛక్తి. ఒక్క వారం రోజుల్లో హబుల్ ఇచ్చే సమాచారం 120 గిగాబైట్లు ఇది 60 హెచ్డీ క్వాలిటీ సినిమాలకు సమానం. పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్: నక్షత్రాల పొత్తిళ్లు... 6500 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త కొత్త నక్షత్రాలు పుట్టే ప్రాంతం ఇది. ధూళి మేఘాలు స్తంభాలుగా కనిపించే ఈ చిత్రానికి పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ అని పేరు. ఒక్కో స్తంభం దాదాపు 4 కాంతి సంవత్సరాల పొడవు ఉంటుందంటే ఆశ్చర్యమే కదా! బ్లాక్ హోల్: భూమికి వంద కాంతి సంవత్సరాల దూరంలో కన్యరాశి దిక్కులో ఉన్న ఎన్జీసీ 4261 పాలపుంత మధ్యభాగమిది. 800 కాంతి సంవత్సరాల వెడల్పున్న ఈ పాలపుంతలో ధూళి మేఘాన్ని గమనించారా? దాని మధ్యలో ఓ భారీ కృష్ణ బిలం ఉన్నట్లు హబుల్ గుర్తించింది. క్రాబ్ నెబ్యూలే: సుమారు వెయ్యి ఏళ్ల క్రితం అంటే... 1054లో అంతరిక్షంలో జరిగిన అతిపెద్ద పేలుడు తాలూకూ అవశేషమిది. తనలోని ఇంధనమంతా ఖర్చయిపోగా... ఓ నక్షత్రం తనలో తాను కుంచించుకుపోయి... పేలిపోయి ఇలా మిగిలింది. చైనా, జపాన్లలోని చరిత్రకారులు ఈ అంతరిక్ష సంఘటనను నేరుగా చూడగలిగారంటే.. పేలుడు తీవ్రత ఎంతో? వెలుగు ఏ స్థాయిలో ఉండిందో అర్థం చేసుకోవచ్చు.