ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనబడని విశ్వపు సుదూరాల్లోని నిషిద్ధ కాంతి ఎట్టకేలకు చిక్కింది. దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది. భూమికి ఏకంగా 27.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఎంసీజీ–01–24–014 స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను ఒడిసిపట్టింది. వాటికి సంబంధించి అబ్బురపరిచే ఫొటోలను భూమికి పంపింది.
టెలిస్కోప్ తాలూకు అడ్వాన్స్‌డ్ కెమెరా ఫర్ సర్వేస్ (ఏసీఎస్) ఈ ఘనత సాధించింది. అత్యంత స్పష్టతతో ఉన్న ఫొటోలు చూసి నాసా సైంటిస్టులతో పాటు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ కిరణాల వెలుగులో కనువిందు చేస్తున్న ఎంసీజీ గెలాక్సీ అందాలకు ఫిదా అవుతున్నారు. కాస్మిక్ ఫొటోగ్రఫీ చరిత్రలోనే దీన్ని అత్యంత అరుదైన ఫీట్‌గా అభివరి్ణస్తున్నారు.
హబుల్ ఫొటోల్లో కన్పిస్తున్న ఎంసీజీ గెలాక్సీ పూర్తిస్థాయిలో వికసించిన నిర్మాణం, అత్యంత శక్తిమంతమైన కేంద్రకంతో కనువిందు చేస్తోంది. ఇది అత్యంత చురుకైన కేంద్రకాలున్న టైప్–2 సీఫెర్ట్ గెలాక్సీల జాబితాలోకి వస్తుందని నాసా పేర్కొంది. సీఫెర్ట్ గెలాక్సీలు అంతరిక్షంలో మనకు అత్యంత దూరంలో ఉండే అతి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలైన క్వాసార్‌ల సమీపంలో ఉంటాయి. అయితే క్వాసార్లు తామున్న గెలాక్సీలను బయటికి ఏమాత్రమూ కని్పంచనీయనంతటి ప్రకాశంతో వెలిగిపోతుంటాయి.
సీఫెర్ట్ గెలాక్సీలు మాత్రం వీక్షణకు అనువుగానే ఉంటాయి. కానీ అత్యంత సుదూరంలో ఉన్న కారణంగా వీటి వెలుతురు ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కలేదు. ఆ కారణంగానే సైంటిస్టుల పరిభాషలో దాన్ని ‘నిషిద్ధ కాంతి’గా ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు. పైగా ఈ కాంతి పుంజాలు భూమ్మీద మనకు ఇప్పటిదాకా తెలిసిన పరిమాణ భౌతిక శాస్త్ర నియమాలకు పూర్తిగా అతీతమన్నది సైంటిస్టుల నమ్మకం. అనంత విశ్వంలో అంతటి సుదూర అంతరిక్ష క్షేత్రంలో మన భౌతిక శాస్త్ర నియమాలన్నీ తల్లకిందులవుతాయని వారు చెబుతుంటారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment