ఇంతకాలంగా అందీ అందనట్టుగా తప్పించుకుంటూ వస్తున్న ఓ మిస్టరీ గెలాక్సీ ఆనవాలు ఎట్టకేలకు చిక్కింది. భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల పై చిలుకు దూరంలో ఉన్న కార్ట్‌వీల్ గెలాక్సీని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరా కంటిలో బంధించింది. దాని కేంద్రకం వద్ద ఉన్న భారీ కృష్ణబిలం కూడా వెబ్ కెమెరాకు చిక్కింది. ఈ గెలాక్సీని నిత్యం నక్షత్ర ధూళి భారీ పరిమాణంలో ఆవరించి ఉంటుందట. దాంతో హబుల్ వంటి కాకలు తీరిన టెలిస్కోప్‌లు ఎంతగా ప్రయత్నించినా ఇప్పటిదాకా దీన్ని ఫొటోలు తీయలేకపోయాయి.
అందుకే ఈ గెలాక్సీ కంటపడటాన్ని చాలా అరుదైన విషయంగా నాసా సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. కోట్లాది ఏళ్లలో కార్ట్‌వీల్ గెలాక్సీ ఎలాంటి మార్పుచేర్పులకు గురవుతూ వచ్చిందీ తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ తీసిన ఇన్‌ఫ్రా రెడ్ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. దాని కేంద్ర స్థానం వద్ద ఏర్పడ్డ కృష్ణబిలం గురించి కూడా విలువైన సమాచారం తెలిసే వీలుందట. అంతేగాక నక్షత్రాల పుట్టుకకు సంబంధించి ఇప్పటిదాకా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి రావచ్చన్నది సైంటిస్టుల మాట.
అచ్చం బండి చక్రంలా...
వయసు మీదపడుతున్న హబుల్ టెలిస్కోప్‌కు వారసునిగా జేమ్స్ వెబ్ ఇటీవలే అంతరిక్ష ప్రవేశం చేయడం తెలిసిందే. కాలంలో వెనక్కు చూడగల ఇన్‌ఫ్రా రెడ్ సామర్థ్యం దీని సొంతం. దాని సాయంతో మహావిస్ఫోటనం (బిగ్‌బ్యాంగ్) అనంతరం విశ్వం ఆవిర్భవించిన తొలి నాళ్లకు సంబంధించిన ఫొటోను ఇటీవలే జేమ్స్ వెబ్ మనకు అందించిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా కార్ట్‌వీల్ గెలాక్సీకి సంబంధించి కూడా దాని ఇప్పటి, సుదూర, సమీప గతాలకు సంబంధించిన ఫొటోలనూ జేమ్స్ వెబ్ స్పష్టంగా అందించగలిగింది.
ఈ ఫొటోల్లో కార్ట్‌వీల్ గెలాక్సీ పేరుకు తగ్గట్టుగా అచ్చం బండి చక్రం మాదిరిగానే కన్పిస్తోంది. స్కల్ప్టర్ నక్షత్ర మండలంలోని ఈ గెలాక్సీతో పాటు మరెన్నో ఇతర పాలపుంతలు కూడా నేపథ్యంలో కనిపిస్తుండటం విశేషం. ఒక అతి పెద్ద, మరో బుల్లి గెలాక్సీ ఊహాతీతమైన వేగంతో ఢీకొనడం వల్ల కార్ట్‌వీల్ గెలాక్సీ పురుడు పోసుకుందని సైంటిస్టులు సిద్ధాంతీకరించారు. కానీ దీని ఉనికి చాలాకాలం పాటు మిస్టరీగానే ఉండిపోయింది. అంతరిక్ష ధూళి తదితరాల గుండా సులువుగా పయనించగల పరారుణ కాంతిని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పట్టుకోగలదు. దాని సాయంతోనే ఎట్టకేలకు అది కార్ట్‌వీల్ ఉనికిని నిర్ధారించి కెమెరాలో బంధించగలిగింది. ఫొటోలో కన్పిస్తున్న నీలి రంగు చుక్కలన్నీ నక్షత్రాలు.
కోట్లాది ఏళ్ల కాలక్రమంలో చోటుచేసుకున్న భారీ విస్ఫోటాలు తదితరాల వల్ల కార్ట్‌వీల్ గెలాక్సీలో చోటుచేసుకుంటూ వచ్చిన కీలక మార్పులను ఈ ఫొటోల సాయంతో విశ్లేషించవచ్చట. ఈ గెలాక్సీ చుట్టూ రెండు వెలుతురు మండలాలున్నాయి. కేంద్ర స్థానంలో సంభవించిన మహా విస్ఫోటం ఫలితంగా చెరువులో అలల్లా ఇవి నానాటికీ విస్తరిస్తూ పోతున్నాయట. అందుకే అంతరిక్ష శాస్త్రవేత్తలు దీన్ని రింగ్ గెలాక్సీ అని కూడా పిలుస్తుంటారు. ఇలాంటి ఆకృతులుండే పాలపుంతలు అరుదు. దీనిలోని అంతరిక్ష ధూళికి సంబంధించి లోతైన విషయాలను జేమ్స్ వెబ్ తాలూకు మిడ్ ఇన్‌ఫ్రారెడ్ ఇన్‌స్ట్రుమెంట్ (ఎంఐఆర్‌ఐ) సాయంతో విశ్లేషించే పనిలో పడింది నాసా.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment