విశ్వ గవాక్షానికి పాతికేళ్లు! | Hubble telescope | Sakshi
Sakshi News home page

విశ్వ గవాక్షానికి పాతికేళ్లు!

Published Tue, Apr 21 2015 10:59 PM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

విశ్వ గవాక్షానికి  పాతికేళ్లు!

విశ్వ గవాక్షానికి పాతికేళ్లు!

ఖగోళ వింతలపై మనిషి ఆసక్తి యుగాలుగా ఉన్నదే... మిణుకు మిణుకు తారల్లో  రకరకాల ఆకారాలను ఊహిస్తూ...   వాటితోనే.. తమ రేపును అంచనా వేస్తూ వేల ఏళ్లు గడిపేశాడు. టెలిస్కోపు ఆవిష్కరణతో  ఆకాశ వింతల్ని నేరుగా చూడటం సాధ్యమైనా... ఇటీవలి కాలం వరకూ వాటిని అర్థం చేసుకున్నది కొంతే. కానీ... పాతికేళ్ల క్రితం జరిగిన  ఓ అద్భుతం... విశ్వ రహస్యాలను మన కళ్లముందు ఉంచుతోంది. కొత్త కొత్త లోకాలను చూపుతోంది.  ఆ అద్భుతం పేరు.. హబుల్ టెలిస్కోపు!
 
విశ్వం మొత్తాన్ని చూడగల హబుల్ మన సూర్యుడిని,  బుధ గ్రహాన్ని మాత్రం చూడలేదు. మరీ దగ్గరగా ఉండటం దీనికి కారణం.
 
విశ్వ వ్యాపన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్   హబుల్ పేరిట  ఈ టెలిస్కోపును   నిర్మించారు.
 
1990 ఏప్రిల్ 24... విశ్వం ఆనుపానులు తెలుసుకునే ప్రయత్నంలో మనిషి కీలక విజయం సాధించిన రోజిది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) డిస్కవరి అంతరిక్ష నౌక సాయంతో హబుల్ టెలిస్కోపును విజయవంతంగా ప్రయోగించింది ఈ రోజే. అయితే ఈ టెలిస్కోపు ద్వారా సువిశాల విశ్వం గురించి మనిషి అవగాహన పెరుగుతుందని, అప్పటివరకూ కనీవినీ ఎరుగని కొత్త లోకాలను చూడగలమని చాలా తక్కువ మంది ఊహించి ఉంటారు. ప్రయోగించిన కొన్ని రోజులకే టెలిస్కోపులోని ముఖ్య దర్పణంలో లోపాలు బయటపడటం. దీనికి ఒక కారణమైతే... ఆ తరువాత ఈ లోపాలన్నింటినీ సరిచేసేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి నాలుగు సర్వీస్ మిషన్లు నడపాల్సి రావడం రెండో కారణం. అదష్టవశాత్తూ ఈ శ్రమంతా వృథా కాలేదు. ఈ విశ్వం పరిమాణమెంతో అంచనా కట్టేందుకు మొదలుకొని... నక్షత్రాలు, గ్రహాల పుట్టుక. చావు... కొరకరాని కొయ్యల్లా ఉండిపోయిన కృష్ణశక్తి, కృష్ణబిలం వంటి భౌతిక శాస్త్ర దృగ్విషయాలను అర్థం చేసుకోవడం వరకూ అనేక అంశాల్లో హబుల్ టెలిస్కోపు పరిశోధనలు కీలకపాత్ర వహించాయి. సౌరకుటుంబం అవతల ఉన్న గ్రహాల రూపురేఖలు, వాటిల్లో ఉండే రసాయనాల వివరాలు తెలిసింది కూడా హబుల్ తీసిన ఫొటోల ఆధారంగానే. మరో రెండు రోజుల్లో  పాతికేళ్లు నిండబోతున్న తరుణంలో హబుల్ టెలిస్కోపు సాధించిన ఘన విజయాలు కొన్నింటిని చూద్దామా...?
 
విశ్వం వయసు తెలిసింది...


కొన్ని కోటానుకోట్ల ఏళ్ల క్రితం ఈ విశ్వం మొత్తం అతిసూక్ష్మమైన బిందువు పరిమాణంలో ఉండేదని, అకస్మాత్తుగా ఓ భారీ పేలుడు సంభవించి... విశ్వం ఏర్పడటం మొదలైందని మనం పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. అయితే ఈ మహా విస్ఫోటం కచ్చితంగా ఎప్పుడన్నది మాత్రం తెలియదు. అయితే కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం వరకూ చూడగల సామర్థ్యమున్న హబుల్ టెలిస్కోపు... కన్యారాశిలోని కొన్ని నక్షత్రాలు ఎంత వేగంగా కదులుతున్నాయో ఫొటోలు తీసి పంపింది. వీటి ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విశ్వం వయసు 1300 నుంచి 1400 కోట్ల సంవత్సరాల వరకూ ఉంటుందని అంచనా కట్టగలిగారు.

కొత్త లోకాలు...

భూమ్మీద ఉన్న టెలిస్కోపుల సాయంతో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు మన సౌర కుటుంబానికి అవతల కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయని ఎప్పుడో గుర్తించారు. అయితే ఈ  ఎక్సోప్లానెట్లు ఎలా ఉంటాయి? వాటిల్లో ఉండే రసాయనాలు ఏమిటి? అన్నది మాత్రం తెలియలేదు. హబుల్ టెలిస్కోపు తన కెమెరా సాయంతో ఈ చిక్కుముళ్లన్నింటినీ విప్పేసింది. రకరకాల తరంగదైర్ఘ్యాల్లో తీసిన ఫొటోలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ ఎక్సోప్లానెట్ల వాతావరణంలో సోడియం, హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్ వంటి వాయువులు ఉన్నాయని తొలిసారి నిర్ధారించగలిగారు. అంతేకాదు... ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని తొలిసారి నేరుగా ఫొటో తీయగలిగింది కూడా ఈ దుర్భిణి ద్వారానే!

కృష్ణబిలాలను గుర్తించింది...

కాంతిని కూడా తనలోకి లాగేసుకోగల శక్తిమంతమైన ప్రాంతం కష్ణబిలం. విశ్వంలో అనేక చోట్ల ఉండే ఈ కష్ణబిలాలు కంటికి కనిపించవు. ప్రభావం మాత్రం తెలుస్తూంటుంది అంతే. నక్షత్రాలైనా, గ్రహాలైనా, ఏ ఇతర పదార్థమైనా సరే... కృష్ణబిలంలోకి వెళ్లగలవుగానీ... ఆ ప్రాంతం నుంచి ఏదీ బయటకు రాదు... రాలేదు కూడా. ఈ కృష్ణబిలాల గురించి ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనాలు వేశారు.. సిద్ధాంతాలను ప్రతిపాదించారుగానీ.. హబుల్ టెలిస్కోపుతో తొలిసారి అటువంటివాటిని నేరుగా చూడగలిగారు. పాలపుంతల మధ్యభాగంలో భారీసైజున్న కృష్ణబిలాలు ఉంటాయని గుర్తించడమే కాకుండా... వాటి సైజును బట్టి ... పాలపుంత పరిమాణం ఉంటుందని కూడా హబుల్ టెలిస్కోపు తీసిన ఫొటోల ఆధారంగానే తెలిసింది.

అదృశ్య శక్తి లెక్కలు తేల్చింది...

వేల కోట్లనక్షత్రాలు, గ్రహాలున్న విశ్వం వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయం దాదాపు వందేళ్ల క్రితమే ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ద్వారా తెలిసింది. అయితే ఈ విస్తరణ వేగం కాలక్రమంలో తగ్గుతూ వస్తుందని ఆ తరువాత విశ్వం మొత్తం కుంచించుకుపోవడం మొదలవుతుందని అప్పట్లో అనుకునేవారు.. అయితే హబుల్ టెలిస్కోపు ఈ అంచనాలను తారుమారు చేసింది. 1998లో హబుల్ ఓ నక్షత్ర పేలుడు (సూపర్‌నోవా) తాలూకూ ఫొటోలను పంపింది. దాని వెలుగులను లెక్కకట్టడం ద్వారా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ విశ్వ విస్తరణ అంతకంతకూ వేగం పుంజుకుంటోందని, తగ్గడంగానీ.. కుంచించుకుపోవడం గానీ సాధ్యం కాదని స్పష్టమైంది. ఈ విస్తరణకు కారణం కృష్ణ శక్తి అని తెలిసింది కూడా ఈ టెలిస్కోపు ద్వారానే . అంతేకాదు... ఈ విశ్వం మొత్తం బరువుకు, మన కంటికి కనిపించే పదార్థం బరువుకు చాలా తేడా ఉంది. అంటే... కంటికి కనిపించని పదార్థం ఏదో ఉందన్నమాట. ఈ కృష్ణ పదార్థం విశ్వం బరువులో 22 శాతం వరకూ ఉంటుందని హబుల్ పరిశోధనల వల్ల స్పష్టమైంది.

నక్షత్రాలు, గ్రహాల చావు పుట్టుకలు...

నక్షత్రాలు, గ్రహాలు ఎలా పుడతాయన్న విషయంపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా కొన్ని అంచనాలు వేస్తున్నా... స్పష్టంగా చూడగలిగింది మాత్రం హబుల్ పంపిన ఫొటోల ద్వారానే. సుమారు 6500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈగల్ నెబ్యులే (నక్షత్ర మండలం) ఫొటోలను హబుల్ పంపింది. వాటిల్లో అతి ప్రకాశవంతంగా కనిపించే ప్రాంతాల్లో నక్షత్రాలు పురుడుపోసుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నక్షత్రాల చుట్టూ ఉన్న ఖగోళ ధూళి ఒకదగ్గరకు చేరి కాలక్రమంలో గ్రహాలుగా ఏర్పడతాయని కూడా శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. ఈగల్ నెబ్యూలేతోపాటు హబుల్ అనేకానేక నక్షత్ర, గ్రహ మండలాలను గుర్తించి వాటి తాలూకూ సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించింది.
 - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా
 
 
552 కిలోమీటర్లు హబుల్ టెలిస్కోపు పరిభ్రమించే ఎత్తు...
12 టన్నులు  హబుల్ బరువు
97 నిమిషాలు  భూమిని ఒకసారి చుట్టేసేందుకు పట్టే సమయం
28000  కిలోమీటర్ల వేగం
2.4 మీటర్లు  హబుల్‌లోని ప్రధాన దర్పణం వ్యాసం
2800 వాట్లు  రెండు సోలార్ ప్యానెళ్ల సాయంతో
హబుల్ ఉత్పత్తి చేసుకునే విద్యుచ్ఛక్తి.
ఒక్క వారం రోజుల్లో హబుల్ ఇచ్చే సమాచారం 120 గిగాబైట్లు
ఇది 60 హెచ్‌డీ క్వాలిటీ సినిమాలకు సమానం.
 
పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్: నక్షత్రాల పొత్తిళ్లు... 6500 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త కొత్త నక్షత్రాలు పుట్టే ప్రాంతం ఇది. ధూళి మేఘాలు స్తంభాలుగా కనిపించే ఈ చిత్రానికి పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ అని పేరు. ఒక్కో స్తంభం దాదాపు 4 కాంతి సంవత్సరాల పొడవు ఉంటుందంటే ఆశ్చర్యమే కదా!
 
 బ్లాక్ హోల్: భూమికి వంద కాంతి సంవత్సరాల దూరంలో కన్యరాశి దిక్కులో ఉన్న ఎన్‌జీసీ 4261 పాలపుంత మధ్యభాగమిది. 800 కాంతి సంవత్సరాల వెడల్పున్న ఈ పాలపుంతలో ధూళి మేఘాన్ని గమనించారా? దాని మధ్యలో ఓ భారీ కృష్ణ బిలం ఉన్నట్లు హబుల్ గుర్తించింది.
 
 క్రాబ్ నెబ్యూలే: సుమారు వెయ్యి ఏళ్ల క్రితం అంటే... 1054లో అంతరిక్షంలో జరిగిన అతిపెద్ద పేలుడు తాలూకూ అవశేషమిది. తనలోని ఇంధనమంతా ఖర్చయిపోగా... ఓ నక్షత్రం తనలో తాను కుంచించుకుపోయి... పేలిపోయి ఇలా మిగిలింది. చైనా, జపాన్‌లలోని చరిత్రకారులు ఈ అంతరిక్ష సంఘటనను నేరుగా చూడగలిగారంటే.. పేలుడు తీవ్రత ఎంతో? వెలుగు ఏ స్థాయిలో ఉండిందో అర్థం చేసుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement