Planetary exploration
-
SOFIA telescope: గ్రహశకలాలపై నీటి జాడలు
గ్రహశకలాలు పూర్తిగా పొడి శిలలతో కూడుకుని ఉంటాయని ఇప్పటిదాకా సైంటిస్టులు భావించేవారు. కానీ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా వాటిపై నీటి అణువుల జాడలను గుర్తించారు! సోఫియా (స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రా రెడ్ ఆ్రస్టానమీ ఎయిర్‌బోర్న్ టెలిస్కోప్) టెలిస్కోప్ అందించిన డేటాను అధ్యయనం చేసిన మీదట వారు ఈ మేరకు ధ్రువీకరణకు వచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో సోమవారం ప్రచురితమయ్యాయి. ఇలా చేశారు... గ్రహశకలాలపై నీటిజాడను కనిపెట్టేందుకు సైంటిస్టులు పెద్ద ప్రయాసే పడాల్సి వచి్చంది... ► ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలను దాదాపుగా పూర్తిగా అడ్డుకునే భూ వాతావరణానికి ఎగువన ఉండే స్ట్రాటోస్పియర్ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ► అవసరమైన మార్పుచేర్పులు చేసిన బోయింట్ 747ఎస్పీ విమానంలో స్ట్రాటోస్పియర్ గుండా సోఫియా టెలిస్కోప్‌ను సుదీర్ఘకాలం ప్రాటు పయణింపజేశారు. ► ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. ఐరిస్, మస్సాలియా అనే గ్రహశకలాలపై నీటి అణువుల జాడను సోఫియా తాలూకు ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా (ఫోర్కాస్ట్) స్పష్టంగా పట్టిచ్చింది! ► సోఫియా కెమెరా కంటికి చిక్కిన నీటి పరిమాణం కనీసం 350 మిల్లీలీటర్ల దాకా ఉంటుందని అధ్యయన బృందం నిర్ధారించింది. ► ఈ గ్రహశకలాలు సూర్యుడి నుంచి ఏకంగా 22.3 కోట్ల మైళ్ల దూరంలో గురు, బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్‌లో ఉన్నాయి. ► ఈ ఉత్సాహంతో సోఫియా కంటే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మరో 30 గ్రహశకలాలపై నీటి జాడలను మరింత స్పష్టంగా కనిపెట్టే పనిలో నాసా సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. జాబిలిపై నీటి జాడలే స్ఫూర్తి... గతంలో చంద్రునిపై నీటి జాడలను కనిపెట్టింది కూడా సోఫియానే! ఆ స్ఫూర్తితోనే అదే టెలిస్కోప్ సాయంతో గ్రహశకలాలపైనా నీటి జాడల అన్వేషణకు పూనుకున్నారు. నిజానికి ఈ అధ్యయనానికి సహ సారథ్యం వహించిన నాసా సైంటిస్టు డాక్టర్ మాగీ మెక్ ఆడమ్ ఈ గ్రహశకలాలపై గతంలోనే ఆర్ర్దీకరణ(హైడ్రేషన్) జాడలను కనిపెట్టారు. కానీ దానికి కారణం నీరేనా, లేక హైడ్రోక్సిల్ వంటి ఇతర అణువులా అన్నదానిపై మాత్రం స్పష్టతకు రాలేకపోయారు. ఆ అనుమానాలకు తాజా అధ్యయనం తెర దించిందని దానికి సారథిగా వ్యవహరించిన రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ అనీసియా అరెడొండో తెలిపారు. ‘‘నిజానికి డాక్టర్ మెక్ ఆడమ్ తన పరిశోధనకు ఎంచుకున్న ఈ రెండు గ్రహశకలాలు పూర్తిగా సిలికేట్మయం. కనుక అవి పూర్తిగా పొడిబారినవే అయ్యుంటాయని తొలుత అనుకున్నాం. కానీ వాటిపై కనిపించింది నీరేనని మా పరిశోధనల్లో స్పష్టంగా తేలింది’’ అని వివరించారు. 2020లో చంద్రుని దక్షిణార్ధ గోళంలో నీటి జాడలను సోఫియా నిర్ధారించింది. ఏమిటీ గ్రహశకలాలు... ఒక్కమాటలో చెప్పాలంటే మన సౌర వ్యవస్థ రూపొందే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలు. ఒకరకంగా సూర్యుడు, తన నుంచి నిర్ధారిత దూరాల్లో గ్రహాలు ఒక్కొక్కటిగా రూపొందే క్రమంలో మిగిలి విడిపోయిన వ్యర్థాల బాపతువన్నమాట. సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో సూర్యుడికి కాస్త దూరంలో ఉన్న భూమి వంటి గ్రహాలు రాళ్లు తదితరాలకు ఆలవాలంగా మారితే సుదూరంలో ఉన్న యురేనస్, నెప్ట్యూన్ వంటివి నింపాదిగా చల్లబడి మంచు, వాయుమయ గ్రహాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చాయట. గ్రహశకలాలు కోట్లాది ఏళ్ల క్రితం భూమిని విపరీతమైన వేగంతో ఢీకొన్న ఫలితంగానే మన గ్రహంపై నీరు ఇతర కీలక మూలకాలు పుట్టుకొచ్చాయని సైంటిస్టులు చాలాకాలం క్రితమే సిద్ధాంతీకరించారు. గ్రహశకలాలపై నీటి అణువుల ఉనికి దానికి బలం చేకూర్చేదేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రహశకలాల పరమాణు కూర్పును మరింత లోతుగా పరిశోధిస్తే అంతరిక్షంలో వీటి జన్మస్థానంపై ఇంకాస్త కచి్చతమైన నిర్ధారణకు రావచ్చన్నది సైంటిస్టుల భావన. అది అంతరిక్షంలో ఇతర చోట్ల నీరు తదితర కీలక మూలకాలతో పాటు జీవం ఉనికి కోసం చిరకాలంగా చేస్తున్న పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడగలదని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్పాతం నుంచి ఉత్పత్తి
ఒక తార జన్మించాలంటే ఒక నిహారిక మరణించాలని ఇంగ్లిష్ సూక్తి. ఒక గ్రహం జన్మించాలంటే అంతకన్నా ఎక్కువ ఉత్పాతం జరగాలంటున్నారు సైంటిస్టులు. శిశువుకు జన్మనిచ్చేందుకు తల్లి పడేంత కష్టం గ్రహాల పుట్టుక వెనుక ఉందంటున్నారు. తాజాగా ఇందుకు బలమైన సాక్ష్యాలు లభించాయి. గ్రహాల పుట్టుక ఒక తీవ్రమైన, విధ్వంసకర ప్రక్రియని ఖగోళ శాస్త్రజ్ఞులు విశదీకరిస్తున్నారు. హబుల్ టెలిస్కోపు తాజాగా పంపిన చిత్రాలను శోధించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు. గురుగ్రహ పరిమాణంలో ఉన్న ఒక ప్రొటో ప్లానెట్ పుట్టుకను హబుల్ చిత్రీకరించింది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే వాయువులు, ధూళితో కూడిన వాయురూప ద్రవ్యరాశిని(గ్యాసియస్ మాస్) ప్రొటో ప్లానెట్‌గా పేర్కొంటారు. ఈ గ్యాసియస్ మాస్పైన ధూళి, వాయువుల ఉష్ణోగ్రతలు తగ్గి అవి చల్లారే కొద్దీ ఘన, ద్రవ రూపాలుగా మారతాయి. అనంతరం ప్రొటోప్లానెట్ సంపూర్ణ గ్రహంగా మారుతుంది. సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహాలను(శని, గురుడు, యురేనస్, నెప్ట్యూన్) జోవియన్ గ్రహాలంటారు. మిగిలిన ఐదు గ్రహాలతో పోలిస్తే వీటిలో వాయువులు, ధూళి శాతం ఎక్కువ. ఈ జోవియన్ ప్లానెట్లు కోర్ అక్రేషన్ ప్రక్రియలో ఏర్పడ్డాయని ఇప్పటివరకు ఒక అంచనా ఉండేది. భారీ ఆకారంలోని ఘన సమూహాలు ఢీకొనడం వల్ల ప్రొటో ప్లానెట్లు ఏర్పడతాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఇది డిస్క్ ఇన్‌స్టెబిలిటీ (బింబ అస్థిరత్వ) సిద్ధాంతానికి వ్యతిరేకం. డిస్క్ ఇన్‌స్టెబిలిటీ ప్రక్రియ ద్వారా జూపిటర్ లాంటి గ్రహాలు ఏర్పడ్డాయనే సిద్ధాంతాన్ని ఎక్కువమంది సమర్థిస్తారు. తాజా పరిశోధనతో కోర్ అక్రేషన్ సిద్ధాంతానికి బలం తగ్గినట్లయింది. వేదనాభరిత యత్నం ఒక నక్షత్ర గురుత్వాకర్షణకు లోబడి అనేక స్టెల్లార్ డిస్కులు దాని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. కొన్ని లక్షల సంవత్సరాలకు ఈ స్టెల్లార్ డిస్క్‌లు చాలా కష్టంమీద సదరు నక్షత్ర గురుత్వాకర్షణ శక్తికి అందులో పడి పతనం కాకుండా పోరాడి బయటపడతాయని, అయితే నక్షత్ర ఆకర్షణ నుంచి పూర్తిగా బయటకుపోలేక ఒక నిర్ధిష్ఠ కక్ష్యలో పరిభ్రమిస్తూ క్రమంగా ప్రొటోప్లానెట్లుగా మారతాయని డిస్క్ ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతం చెబుతోంది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే దుమ్ము, ధూళి, వాయువులు (డస్ట్ అండ్ గ్యాస్ మాసెస్), అస్టరాయిడ్లవంటి అసంపూర్ణ ఆకారాలను స్టెల్లార్ డిస్క్లంటారు. తాజా చిత్రాలు ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ పరిశోధన వివరాలు జర్నల్ నేచుర్ ఆస్ట్రానమీలో ప్రచురించారు. తాజాగా కనుగొన్న ప్రొటోప్లానెట్ (ఆరిగే బీ– ఏబీ అని పేరుపెట్టారు) 20 లక్షల సంవత్సరాల వయసున్న కుర్ర నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని నాసా పేర్కొంది. మన సౌర వ్యవస్థ కూడా సూర్యుడికి దాదాపు ఇంతే వయసున్నప్పుడు ఏర్పడింది. ఒక గ్రహం ఏ పదార్ధంతో ఏర్పడబోతోందనే విషయం అది ఏర్పడే స్టెల్లార్ డిస్కును బట్టి ఉంటుందని సైంటిస్టులు వివరించారు. కొత్తగా కనుగొన్న ఏబీ గ్రహం మన గురు గ్రహం కన్నా 9 రెట్లు బరువుగా ఉందని, మాతృనక్షత్రానికి 860 కోట్ల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోందని పరిశోధన వెల్లడించింది. హబుల్ టెలిస్కోప్ 13 సంవత్సరాల పాటు పంపిన చిత్రాలను, జపాన్‌కు చెందిన సుబరు టెలిస్కోప్ పంపిన చిత్రాలను పరిశీలించి ఈ గ్రహ పుట్టుకను అధ్యయనం చేశారు. దీనివల్ల మన సౌర కుటుంబానికి సంబంధించిన మరిన్ని రహస్యాలు బయటపడతాయని ఆశిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
10 బిలియన్ ఏళ్ల రాతి గ్రహం.. మండుతున్న గోళంలా..
భూమిని పోలిసి ఓ రాతి గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి కంటే 50 శాతం, మూడు రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉన్న అత్యంత వేడి, రాతి గ్రహంగా నాసా టెస్ మిషన్(ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్) కనుగొంది. అయితే ఇది భూమికి సమాన సాంద్రతలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి TOI-561b అని పేరు పెట్టారు. మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్నందున దీనిని ఎక్స్ప్లానెట్గా నాసా సైంటిస్టులు పేర్కొన్నారు. సూపర్ ఎర్త్‌గా పలిచే ఈ గ్రహం సూర్యునిలా ఎర్రగా, మండిపోతున్న గోళంలా కనిపిస్తోంది. మన పాలపుంతలో ఈ కొత్త గ్రహం ఈ నాటిది కాదని, ఎన్నో బిలియన్ల సంవత్సరాల క్రితం గ్రహంగా నాసా పేర్కొంది. అంటే.. ఈ గ్రహం వయస్సు దాదాపు 1000 కోట్ల సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. మన భూమికి 280 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పురాతన గ్రహం (TOI-561b) రాతి ప్రపంచంలో ఉంటుందని, ఇది భూమికి మూడంతలు పెద్దదిగా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 24 గంటలకు కంటే ఎక్కువ సమయంలో ఈ గ్రహం స్టార్ కక్ష్యలో తిరుగుతుందట. అందువల్లే దీనిని సూపర్ ఎర్త్‌గా పేర్కొంటున్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. నాసా ప్రకారం.. విశ్వంలో చాలా వరకు రాతి గ్రహాలు ఏర్పడి ఉండవచ్చని, ఈ TOI-561b అనేది పురాతన రాతి గ్రహాలలో ఒకటై ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 14 బిలియన్ ఏళ్ల క్రితం విశ్వం ప్రారంభమైనప్పటి నుండి రాతి గ్రహాలు ఉన్నాయని ఈ గ్రహం ఆధారంగా అంచనా వేస్తున్నారు. పాలపుంతలోని ప్రధాన నక్షత్రాలకు మొదటి నుంచే 10 బిలియన్ల ఏళ్ల వయస్సు ఉన్న ఈ గ్రహం ప్రకాశిస్తోందని, సౌర వ్యవస్థ కంటే రెండు రెట్లు పాతదని భావిస్తున్నారు. ఈ పాలపుంత సుమారు 12 బిలియన్ ఏళ్ల నాటి పురాతనమైనదిగా నాసా వివరించింది. -
భూగ్రహాల అన్వేషణకు ధూళి మేఘాల అవరోధం!
మన సమీపంలోని ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భూమిలాంటి గ్రహంపై వాతావరణం, అతిప్రకాశమంతమైన నక్షత్రకాంతి, ఆకాశంలో ధూళిమేఘాలను చూపుతూ రూపొందించిన ఈ ఊహాచిత్రాన్ని సోమవారం యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ పరిశోధకులు విడుదలచేశారు. మన భూమి మాదిరిగా జీవుల మనుగడకు అనుకూలమైన గ్రహాల అన్వేషణ కోసం.. వెరీ లార్జ్ టెలిస్కోపుతో అనేక నక్షత్రాలపై అధ్యయనం చేసిన వీరు తొమ్మిది నక్షత్రాల చుట్టూ భారీ ధూళిమేఘాలను కనుగొన్నారు. నక్షత్రాలకు మరీ దూరంగా, దగ్గరగా లేకుండా అనుకూలమైన దూరంలో ఉన్న గ్రహాల ప్రాంతంలోనే ఈ ధూళిమేఘాలు ఏర్పడటం వల్ల భూమిలాంటి గ్రహాల అన్వేషణకు తీవ్ర అవరోధం కలుగుతోందట. గ్రహశకలాలు ఢీకొట్టుకోవడం, తోకచుక్కలు క్షయం అవడం వల్ల అంతరిక్షంలోకి పెద్ద ఎత్తున ధూళికణాలు విడుదలై ఇలా మేఘాలుగా ఏర్పడి నక్షత్రకాంతితో ప్రతిఫలిస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.