Astronomical research
-
అక్కడ ఏడాదికి 21 గంటలే
అనగనగా అదో గ్రహం. నెఫ్ట్యూన్ సైజులో ఉంటుంది. దానిపై ఒక ఏడాదిలో కేవలం 21 గంటలే ఉంటాయి! అది మాతృ నక్షత్రానికి అతి సమీపంగా ఉండటమే ఇందుకు కారణమట. దాంతో నక్షత్రం చుట్టూ ఆ గ్రహం పరిభ్రమణం కేవలం 21 గంటల్లో పూర్తయిపోతోందని సైంటిస్టులు కనిపెట్టారు. టీఓఐ–3261గా పిలిచే ఈ గ్రహం, దాని తాలూకు నక్షత్రమండలం వయసు 650 కోట్ల ఏళ్లని అంచనా. తొలుత బృహస్పతి పరిమాణంలో ఉన్న ఈ గ్రహం నిరంతరం ద్రవ్యరాశిని కోల్పోతూ చిన్నదవుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. దాని మాతృనక్షత్రపు ఆకర్షణ శక్తే ఇందుకు ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పరిమాణంలో నెఫ్ట్యూన్‌కు సమానంగా ఉన్నా ద్రవ్యరాశి మాత్రం దానితో పోలిస్తే రెట్టింపుగా ఉందట! టీఓఐ–3261 ఉనికి గ్రహాల ఆవిర్భావానికి సంబంధించిన ప్రస్తుత సిద్ధాంతాలన్నింటినీ సవాలు చేస్తుండటం విశేషం. ఎందుకంటే మాతృ నక్షత్రానికి అంత దగ్గరగా ఉండే గ్రహాలపై దట్టమైన వాయువులతో కూడిన వాతావరణం నిలిచి ఉండటం దాదాపుగా అసాధ్యమన్నది శాస్త్ర ప్రపంచంలో ఇప్పటిదాకా ఉన్న భావన. దాంతో గ్రహాల పుట్టుకకు సంబంధించి మనకు తెలియని కొత్త కోణాలకు టీఓఐ–3261 దారి చూపుతుందని భావిస్తున్నారు. అందుకే దానిపై వాతావరణాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాలూకు పరారుణ కాంతి టెక్నాలజీ సాయంతో లోతుగా పరిశోధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త ఎమ్మా నబ్బీ ఆధ్వర్యంలోని సైంటిస్టుల బృందం అధ్యయనంలో వెల్లడైన ఈ విశేషాలను ఆస్ట్రానామికల్ జర్నల్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల గుట్టు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖగోళ రహస్యాలను తేల్చే పరిశోధనలో భాగంగా.. పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల ఆధారాలను కనుగొన్న బృందంలో హైదరాబాద్ ఐఐటీ పరిశోదకులూ భాగస్వాములయ్యారు. ‘ఇండియన్ పల్సర్ టైమింగ్ అర్రే (ఐఎన్పీటీఏ)’తోపాటు జపాన్, యూరప్ దేశాల అంతరిక్ష శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారని ఐఐటీ హైదరాబాద్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచంలోని ఆరు అత్యాధునిక రేడియో టెలిస్కోప్‌లను ఉపయోగించి ఖగోళాన్ని పరిశీలించామని.. పాలపుంతలో అతి తక్కువ పౌనఃపున్యం ఉన్న గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నామని తెలిపింది. ఈ వివరాలు ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయని పేర్కొంది. ఐఐటీ హైదరాబాద్ భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్ శంతన్దేశాయ్, అమన్ శ్రీవాత్సవ, ఫిజిక్స్ పీహెచ్డీ విద్యార్థి దివ్యనాశ్ కర్బందా, బీటెక్ విద్యార్థులు శ్వేత అర్ముగం, ప్రజ్ఞ మాండిపాక తదితరులు పరిశోధన బృందంలో ఉన్నారని వివరించింది. -
హంతక శకలం
శాంటియాగో: గ్రహాల పాలిట ప్రాణాంతకమైనదిగా భావిస్తున్న గ్రహశకలం ఒకటి మన సౌరవ్యవస్థలో చక్కర్లు కొడుతోంది. దాదాపు మైలు వెడల్పున్న దీన్ని 2022 ఏపీ7గా పిలుస్తున్నారు. ఈ గ్రహశకలం ఏదో ఒక రోజు భూమిని ఢీకొట్టొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాని కక్ష్య ఏదో దాన్ని ఒకనాడు భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయట. ఇది దీర్ఘవృత్తాకారంగా భ్రమిస్తున్నందువల్ల భూమికి ఏకంగా 30 లక్షల కిలోమీటర్ల సమీపానికి కూడా రాగలదట! అంతరిక్షంలో పెద్దగా లెక్కలోకే రాని దూరమిది. గత మార్చిలో 2022 ఏపీ7 భూమికి 1.3 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. మరో ఐదేళ్లపాటు ఇంతకంటే సమీపానికి వచ్చే అవకాశమైతే లేదంటున్నారు. గత ఎనిమిదేళ్లలో మన కంటబడ్డ ప్రమాదకర శకలాల్లో ఇదే అతి పెద్దది. అంతేకాదు, చిలీలోని అబ్జర్వేటరీ నుంచి సౌరవ్యవస్థలో తాజాగా కనిపెట్టిన మూడు గ్రహశకలాల్లో ఇదే పెద్దది. మిగతా రెండు అర మైలు, పావు మైలు వెడల్పున్నాయి. వీటి గురించి ఆస్ట్రనామికల్ జర్నల్‌లో వ్యాసం ప్రచురితమైంది. భూమికి 1.3 ఆస్ట్రనామికల్ యూనిట్స్, అంటే 12.1 కోట్ల మైళ్ల కంటే సమీపానికి వస్తే వాటిని నియర్ ఎర్త్ ఆస్టిరాయిడ్స్ అంటాం. -
క్యాసినీ ‘ఆత్మహత్య’ ప్రయాణం షురూ!
ఖగోళ పరిశోధనల్లో రికార్డు సృష్టించిన వ్యోమనౌక క్యాసినీ ఆత్మహత్య (శాశ్వత విశ్రాంతి)కు రంగం సిద్ధమైంది. నాసా 1997 అక్టోబర్‌లో ప్రయోగించిన క్యాసినీ కోట్ల మైళ్ల దూరాన్ని అధిగమించి వెళ్లి.. పదేళ్లుగా శనిగ్రహం చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో శనిగ్రహం తాలూకు ఎన్నో విశేషాలను మనకు అందించింది. దానికున్న ఉపగ్రహాల్లో ఏడింటిని గుర్తించింది కూడా. ఇకముందు ఆ గ్రహం చుట్టూ ఉండే వలయాల ద్వారా ప్రయాణిస్తూ.. వాటి విశేషాలను మనకు అందించనుంది. ఆ తరువాత కూలిపోనుంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను నాసా పూర్తి చేసింది. మొత్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా క్యాసినీ తన సుదీర్ఘ ప్రయాణాన్ని చాలించనుంది. క్యాసినీ రికార్డులు, అందించిన సమాచారం 24 లక్షలు:ఇప్పటివరకూ క్యాసినీ ఉపయోగించిన కంప్యూటర్ ఆదేశాలు 3,616: క్యాసినీ అందించిన వివరాల ఆధారంగా ప్రచురితమైన పరిశోధన వ్యాసాలు 220 కోట్ల మైళ్లు: శనిగ్రహం చుట్టూ క్యాసినీ తిరిగిన దూరం 599 గిగాబైట్లు: సేకరించిన సమాచారం 10: గుర్తించిన ఉపగ్రహాల సంఖ్య 27: నాసాతోపాటు ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన దేశాలు 243: శనిగ్రహం చుట్టూ జరిపిన భ్రమణాలు 3,79,300:తీసిన ఫొటోల సంఖ్య 349:ఇంజిన్‌ను ఆన్/ఆఫ్ చేసిన సంఖ్య – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అది ఖగోళ పరిశోధన కేంద్రమే
- ముడిమాల గండ శిలలపై తేల్చిన దక్షిణ కొరియా నిపుణులు - సప్తర్షి నక్షత్ర మండలం కేంద్రంగా ఏర్పాటు - ప్రపంచంలోనే అరుదైనదిగా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: మూడు వేల ఏళ్ల క్రితం నాటి మహబూబ్‌నగర్ జిల్లా ముడిమాల బృహత్ శిలాయుగపు గండ శిలల నిర్మాణం ఖగోళ పరిశోధన కేంద్రమేనని విదేశీ నిపుణులు నిర్ధారించారు. రుతు పవనాల రాక సహా వివిధ వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు రూపొందించిన ఈ నిర్మాణాలు యునెస్కో గుర్తింపు పొందగల అర్హత ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేపీరావు అధ్యయనాన్ని ఉటంకిస్తూ ముడిమాల ప్రాంత ప్రత్యేకతను ఇటీవల ‘సాక్షి’వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ భారీ గండ శిలలను ఓ పద్ధతి ప్రకారం నిలిపిన తీరు స్థానికులకు సుపరిచితమే అయినా.. దాని విశిష్టత ఇటీవలే వెలుగుచూసింది. సమాధి రాళ్లే పరిశోధనశాలగా.. ప్రపంచంలో ఈ తరహా నిర్మాణాలు కొన్ని చోట్ల ఉన్నప్పటికీ... అవి సమాధులకు గుర్తుగా ఏర్పాటు చేసినవిగానే పరిమితమయ్యాయి. కానీ ఆ నిలువు రాళ్లనే ఆసరాగా చేసుకుని ఖగోళ పరిశోధనాలయంగా వాడిన దాఖలాలు మాత్రం ముడిమాల నిర్మాణాల సొంతం. ఈ విశిష్టతను తెలుసుకున్న దక్షిణ కొరియాకు చెందిన ఉల్సాన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రీహవూ ఆధ్వర్యంలో ఎనిమిది మందితో కూడిన బృందం.. ఈ ప్రాంతానికి వచ్చి అధ్యయనం చేసింది. గ్యోంగీ డో మ్యూజియం క్యూరేటర్ లీ హోయిన్జో, జోన్జూ వర్సిటీ ప్రొఫెసర్లు సోంగ్ హ్వాసోబ్, పార్క్ క్వాంగ్ సిక్, కొరియన్ పెట్రోగ్లిఫిక్ సొసైటీ ప్రొఫెసర్ చౌ యోంగ్జిన్, పెట్రోగ్లిఫిక్ రీసెర్చర్ చై డోంగ్షిన్, రీసెర్చ్ స్కాలర్స్ హర్సుంగ్జంగ్, చో యున్కియోంగ్లు ఆ బృందంలో ఉన్నారు. కొరియాలో ఇలాంటి ఒక నిర్మాణం ఉందని.. దాన్ని కూడా ఖగోళ పరిశోధన శాలగా వాడుకున్నట్టు భావిస్తున్నామని వారు తెలిపారు. అయితే ముడిమాలలో గండ శిలలకు కేంద్ర భాగంగా ఉన్న సప్తర్షి మండలం (ఉర్సా మెజర్) చిత్రాలు ముడిమాలకు ప్రత్యేకమని.. అంతరిక్షంలో ఉన్న క్రమంలోనే సప్తర్షి మండలాన్ని చిత్రించారని తేల్చారు. దీనిని బట్టి ఖగోళ పరిణామాలను గుర్తించడంలో నాటి మానవులు ఈ నిర్మాణాలను వినియోగించుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇక్కడి ప్రత్యేకతలను ఇతర దేశాల్లోని ఈ తరహా నిర్మాణాల వద్ద గుర్తించిన అంశాలతో సరిపోల్చి.. పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తామన్నారు. నిజంగా ఇది అద్భుతం ‘‘ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత కచ్చితంగా నక్షత్ర మండలం చిత్రాలతో ఉన్న బృహత్ శిలాయుగపు ఖగోళ పరిశోధనశాలను ఎక్కడా గుర్తించిన దాఖలాలు లేవు. నిలువుగా ఉన్న గండ శిలల నీడల ఆధారంగా వాతావరణ మార్పులను వారు కచ్చితంగా తెలుసుకుని ఉంటారు. వాటి నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం అద్భుతం. ఈ నిర్మాణాన్ని కాపాడితే శిలాయుగపు మానవులకు సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకునే వీలు చిక్కుతుంది. త్వరలో మరోసారి వచ్చి దీన్ని డాక్యుమెంటేషన్ చేయాలని ఉంది..’’ – రీ హవూ ఉల్సాన్ వర్సిటీ ప్రొఫెసర్ (దక్షిణ కొరియా) -
విశ్వ మూలాల పరిశోధనలకే
ఇస్రో ఇవాళ విజయవంతంగా ప్రయోగించిన ఆస్ట్రోశాట్ విశ్వం మూలాల పరిశోధనలు చేస్తందని శాటిలైట్ ప్రాజెక్ట్ డైరైక్టర్ కే సూర్యనారాయణశర్మ తెలిపారు. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఇదే కావడం విశేషం. దీని కోసం శాస్త్ర వేత్తలు 11ఏళ్లు కష్టపడ్డారు. 1996లో అప్పటి ఇస్రో చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ గ్రహాలు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలు, నక్షత్రాల పుట్టుక వంటి అంశాలపై పరిశోధనల కోసం ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించాలని ప్రతిపాద కేంద్రానికి పంపారు. అయితే.. కేంద్రం దీనికి అనుమతి ఇవ్వలేదు. అయితే 2004లో ఈ ప్రయోగాలకు అనుమతి లభించింది. 2006లో ఉపగ్రహానికి రూపకల్పన జరిగింది. ఇందులో అమర్చిన ఐదు రకాల పేలోడ్స్‌ను ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రీసెర్చి (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ), ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐయూసీఏఏ), రామన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఆర్ఆర్ఐ) వారి భాగస్వామ్యంతో తయారుచేశారు. మరో రెండు పేలోడ్స్ తయారీలో కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (సీఎస్ఏ) అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెసైస్టర్ (యూఓఎల్) భాగస్వామ్యాన్ని కూడా తీసుకున్నారు. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన 40 సెంటీమీటర్లు ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలీస్కోప్ (యూవీఐటీ), లార్ట్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్ (ఎల్ఏఎక్స్పీసీ), సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్ (ఎస్ఎక్స్టీ), కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్ (సీజడ్టీఐ), స్కానింగ్ స్కై మానిటర్ (ఎస్ఎస్టీ) అనే ఐదు రకాల ఉపకరణాలను ఖగోళ పరిశోధనకు మాత్రమే తయారు చేశారు. ఉపగ్రహంలో అమర్చిన నాలుగు టెలీస్కోప్‌లు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగినవని చెప్పారు. ఈ ఉపగ్రహం విశ్వంలో పరిభ్రమిస్తూ ఖగోళంలోని స్థితిగతులపై ప్రతి రోజూ.. బెంగళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రానికి 10 నుంచి 15 నిమిషాల పాటు సమాచారాన్ని అందజేస్తుందని అయన తెలిపారు. ఈ ఉపగ్రహం తయారీకి రూ.178 కోట్లు వ్యయం చేశారని తెలుస్తోంది. ఈ ఉపగ్రహం కక్ష్యలో ఐదేళ్లుపాటు సేవలు అందిస్తుంది. ఇదే తరహాలోనే ఆదిత్య అనే ఉపగ్రహాన్ని తయారు చేయడానికి కూడా సన్నద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. విశ్వం గురించి పరిశోధన చేసే విద్యార్థులకు, పరిశోధకులకు పుణేలో నవంబర్‌లో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఆస్ట్రోశాట్ ఉపయోగాలు గురించి వివరించనున్నామని ఆయన తెలిపారు. -
ఆస్ట్రోశాట్ ప్రయోగానికి రెడీ
-
ఆస్ట్రోశాట్ ప్రయోగానికి రెడీ
నేడు పీఎస్ఎల్వీ సీ-30 ద్వారా ప్రయోగం.. ఖగోళ పరిశోధనల కోసం తొలి ప్రయత్నం భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మొట్టమొదటి సారిగా ఖగోళ పరిశోధన కోసం సోమవారం ఉదయం 10 గంటలకు పీఎస్ఎల్వీ సీ30 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శనివారం, ఆదివారం వివిధ దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. ఆదివారం రాత్రి రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేశారు. - శ్రీహరికోట/హైదరాబాద్ పదేళ్ల శ్రమ ఫలితమే ఆస్ట్రోశాట్.. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం ఇది. విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి దీన్ని ప్రయోగిస్తున్నారు. నక్షత్రాల ఆవిర్భావం గురించి, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం, మన గెలాక్సీ ఆవల పరిస్థితుల గురించి అధ్యయనం కోసం ఆస్ట్రోశాట్‌ను ప్రయోగిస్తున్నారు. ఆస్ట్రోశాట్ వెనుక ఇస్రో శాస్త్రవేత్తల పదేళ్ల కష్టం ఉంది. ఈ ఉపగ్రహంలో ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలిస్కోప్, లార్జ్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్, సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్, కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్, స్కానింగ్ స్కై మానిటర్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన ఐదు పేలోడ్స్ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు నాలుగు యూనివర్సిటీల, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఉంది. ఈ శాటిలైట్ జీవితకాలాన్ని ఐదేళ్లుగా అంచనా వేస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే... ఆస్ట్రోశాట్ ఉపగ్రహ ప్రయోగం అంతరిక్ష పరిశోధకులకు మంచి అవకాశం అని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఇలాంటి శాస్త్రీయ ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది ప్రారంభం మాత్రమే అని ఆయన అన్నారు. కిరణ్‌కుమార్ ఆదివారం షార్కు చేరుకుని పీఎస్ఎల్వీ సీ30 కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. మొదటి ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌ను పరిశీలించారు. అనంతరం సహచర శాస్త్రవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమై ప్రయోగ పనులను సమీక్షించారు. విదేశీ శాటిలైట్స్ ప్రయోగంలో హాఫ్ సెంచరీ! ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ సీ-30 ఆరు విదేశీ శాటిలైట్స్‌ను కూడా తీసుకెళుతోంది. ఇండోనేసియాకు చెందిన 76 కిలోల లపాన్-ఏ2, కెనడాకు చెందిన 14 కిలోల ఎన్ఎల్ఎస్14, అమెరికాకు చెందిన 28 కిలోల లీమూర్ అనే నాలుగు చిన్నతరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ఈ ఆరు విదేశీ ఉపగ్రహాలతో ఇస్రో ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 50 ని దాటుతుంది. ఇప్పటి వరకూ ఇస్రో 45 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫీజు తీసుకుని ఇస్రో ఇలా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వస్తోంది. ఒకేసారి ఏడు ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇది మూడో సారి.