అది ఖగోళ పరిశోధన కేంద్రమే
- ముడిమాల గండ శిలలపై తేల్చిన దక్షిణ కొరియా నిపుణులు
- సప్తర్షి నక్షత్ర మండలం కేంద్రంగా ఏర్పాటు
- ప్రపంచంలోనే అరుదైనదిగా గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: మూడు వేల ఏళ్ల క్రితం నాటి మహబూబ్‌నగర్ జిల్లా ముడిమాల బృహత్ శిలాయుగపు గండ శిలల నిర్మాణం ఖగోళ పరిశోధన కేంద్రమేనని విదేశీ నిపుణులు నిర్ధారించారు. రుతు పవనాల రాక సహా వివిధ వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు రూపొందించిన ఈ నిర్మాణాలు యునెస్కో గుర్తింపు పొందగల అర్హత ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేపీరావు అధ్యయనాన్ని ఉటంకిస్తూ ముడిమాల ప్రాంత ప్రత్యేకతను ఇటీవల ‘సాక్షి’వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ భారీ గండ శిలలను ఓ పద్ధతి ప్రకారం నిలిపిన తీరు స్థానికులకు సుపరిచితమే అయినా.. దాని విశిష్టత ఇటీవలే వెలుగుచూసింది.
సమాధి రాళ్లే పరిశోధనశాలగా..
ప్రపంచంలో ఈ తరహా నిర్మాణాలు కొన్ని చోట్ల ఉన్నప్పటికీ... అవి సమాధులకు గుర్తుగా ఏర్పాటు చేసినవిగానే పరిమితమయ్యాయి. కానీ ఆ నిలువు రాళ్లనే ఆసరాగా చేసుకుని ఖగోళ పరిశోధనాలయంగా వాడిన దాఖలాలు మాత్రం ముడిమాల నిర్మాణాల సొంతం. ఈ విశిష్టతను తెలుసుకున్న దక్షిణ కొరియాకు చెందిన ఉల్సాన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రీహవూ ఆధ్వర్యంలో ఎనిమిది మందితో కూడిన బృందం.. ఈ ప్రాంతానికి వచ్చి అధ్యయనం చేసింది. గ్యోంగీ డో మ్యూజియం క్యూరేటర్ లీ హోయిన్‌జో, జోన్‌జూ వర్సిటీ ప్రొఫెసర్లు సోంగ్ హ్వాసోబ్, పార్క్ క్వాంగ్ సిక్, కొరియన్ పెట్రోగ్లిఫిక్ సొసైటీ ప్రొఫెసర్ చౌ యోంగ్‌జిన్, పెట్రోగ్లిఫిక్ రీసెర్చర్ చై డోంగ్‌షిన్, రీసెర్చ్ స్కాలర్స్ హర్‌సుంగ్‌జంగ్, చో యున్‌కియోంగ్‌లు ఆ బృందంలో ఉన్నారు.
కొరియాలో ఇలాంటి ఒక నిర్మాణం ఉందని.. దాన్ని కూడా ఖగోళ పరిశోధన శాలగా వాడుకున్నట్టు భావిస్తున్నామని వారు తెలిపారు. అయితే ముడిమాలలో గండ శిలలకు కేంద్ర భాగంగా ఉన్న సప్తర్షి మండలం (ఉర్సా మెజర్) చిత్రాలు ముడిమాలకు ప్రత్యేకమని.. అంతరిక్షంలో ఉన్న క్రమంలోనే సప్తర్షి మండలాన్ని చిత్రించారని తేల్చారు. దీనిని బట్టి ఖగోళ పరిణామాలను గుర్తించడంలో నాటి మానవులు ఈ నిర్మాణాలను వినియోగించుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇక్కడి ప్రత్యేకతలను ఇతర దేశాల్లోని ఈ తరహా నిర్మాణాల వద్ద గుర్తించిన అంశాలతో సరిపోల్చి.. పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తామన్నారు.
నిజంగా ఇది అద్భుతం
‘‘ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత కచ్చితంగా నక్షత్ర మండలం చిత్రాలతో ఉన్న బృహత్ శిలాయుగపు ఖగోళ పరిశోధనశాలను ఎక్కడా గుర్తించిన దాఖలాలు లేవు. నిలువుగా ఉన్న గండ శిలల నీడల ఆధారంగా వాతావరణ మార్పులను వారు కచ్చితంగా తెలుసుకుని ఉంటారు. వాటి నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం అద్భుతం. ఈ నిర్మాణాన్ని కాపాడితే శిలాయుగపు మానవులకు సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకునే వీలు చిక్కుతుంది. త్వరలో మరోసారి వచ్చి దీన్ని డాక్యుమెంటేషన్ చేయాలని ఉంది..’’
– రీ హవూ ఉల్సాన్ వర్సిటీ ప్రొఫెసర్ (దక్షిణ కొరియా)