
శాంటియాగో: గ్రహాల పాలిట ప్రాణాంతకమైనదిగా భావిస్తున్న గ్రహశకలం ఒకటి మన సౌరవ్యవస్థలో చక్కర్లు కొడుతోంది. దాదాపు మైలు వెడల్పున్న దీన్ని 2022 ఏపీ7గా పిలుస్తున్నారు. ఈ గ్రహశకలం ఏదో ఒక రోజు భూమిని ఢీకొట్టొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాని కక్ష్య ఏదో దాన్ని ఒకనాడు భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయట. ఇది దీర్ఘవృత్తాకారంగా భ్రమిస్తున్నందువల్ల భూమికి ఏకంగా 30 లక్షల కిలోమీటర్ల సమీపానికి కూడా రాగలదట! అంతరిక్షంలో పెద్దగా లెక్కలోకే రాని దూరమిది.
గత మార్చిలో 2022 ఏపీ7 భూమికి 1.3 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. మరో ఐదేళ్లపాటు ఇంతకంటే సమీపానికి వచ్చే అవకాశమైతే లేదంటున్నారు. గత ఎనిమిదేళ్లలో మన కంటబడ్డ ప్రమాదకర శకలాల్లో ఇదే అతి పెద్దది. అంతేకాదు, చిలీలోని అబ్జర్వేటరీ నుంచి సౌరవ్యవస్థలో తాజాగా కనిపెట్టిన మూడు గ్రహశకలాల్లో ఇదే పెద్దది. మిగతా రెండు అర మైలు, పావు మైలు వెడల్పున్నాయి. వీటి గురించి ఆస్ట్రనామికల్ జర్నల్లో వ్యాసం ప్రచురితమైంది. భూమికి 1.3 ఆస్ట్రనామికల్ యూనిట్స్, అంటే 12.1 కోట్ల మైళ్ల కంటే సమీపానికి వస్తే వాటిని నియర్ ఎర్త్ ఆస్టిరాయిడ్స్ అంటాం.