ఇస్రో ఇవాళ విజయవంతంగా ప్రయోగించిన ఆస్ట్రోశాట్ విశ్వం మూలాల పరిశోధనలు చేస్తందని శాటిలైట్ ప్రాజెక్ట్ డైరైక్టర్ కే సూర్యనారాయణశర్మ తెలిపారు. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఇదే కావడం విశేషం. దీని కోసం శాస్త్ర వేత్తలు 11ఏళ్లు కష్టపడ్డారు.
1996లో అప్పటి ఇస్రో చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ గ్రహాలు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలు, నక్షత్రాల పుట్టుక వంటి అంశాలపై పరిశోధనల కోసం ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించాలని ప్రతిపాద కేంద్రానికి పంపారు. అయితే.. కేంద్రం దీనికి అనుమతి ఇవ్వలేదు. అయితే 2004లో ఈ ప్రయోగాలకు అనుమతి లభించింది. 2006లో ఉపగ్రహానికి రూపకల్పన జరిగింది.
ఇందులో అమర్చిన ఐదు రకాల పేలోడ్స్‌ను ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రీసెర్చి (టీఐఎఫ్‌ఆర్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ), ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐయూసీఏఏ), రామన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఆర్‌ఆర్‌ఐ) వారి భాగస్వామ్యంతో తయారుచేశారు.
మరో రెండు పేలోడ్స్ తయారీలో కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (సీఎస్‌ఏ) అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెసైస్టర్ (యూఓఎల్) భాగస్వామ్యాన్ని కూడా తీసుకున్నారు. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన 40 సెంటీమీటర్లు ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలీస్కోప్ (యూవీఐటీ), లార్ట్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్ (ఎల్‌ఏఎక్స్‌పీసీ), సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్ (ఎస్‌ఎక్స్‌టీ), కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్ (సీజడ్‌టీఐ), స్కానింగ్ స్కై మానిటర్ (ఎస్‌ఎస్‌టీ) అనే ఐదు రకాల ఉపకరణాలను ఖగోళ పరిశోధనకు మాత్రమే తయారు చేశారు.
ఉపగ్రహంలో అమర్చిన నాలుగు టెలీస్కోప్‌లు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగినవని చెప్పారు. ఈ ఉపగ్రహం విశ్వంలో పరిభ్రమిస్తూ ఖగోళంలోని స్థితిగతులపై ప్రతి రోజూ.. బెంగళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రానికి 10 నుంచి 15 నిమిషాల పాటు సమాచారాన్ని అందజేస్తుందని అయన తెలిపారు.
ఈ ఉపగ్రహం తయారీకి రూ.178 కోట్లు వ్యయం చేశారని తెలుస్తోంది. ఈ ఉపగ్రహం కక్ష్యలో ఐదేళ్లుపాటు సేవలు అందిస్తుంది. ఇదే తరహాలోనే ఆదిత్య అనే ఉపగ్రహాన్ని తయారు చేయడానికి కూడా సన్నద్ధమవుతున్నామని ఆయన తెలిపారు.
విశ్వం గురించి పరిశోధన చేసే విద్యార్థులకు, పరిశోధకులకు పుణేలో నవంబర్‌లో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఆస్ట్రోశాట్ ఉపయోగాలు గురించి వివరించనున్నామని ఆయన తెలిపారు.