satellite control center
-
‘జీశాట్–6ఏ’లో సాంకేతిక లోపం
శ్రీహరికోట (సూళ్లూరుపేట) /బెంగళూరు: దేశ సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టిన జీశాట్–6ఏ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. జీశాట్–6ఏ ఉపగ్రహానికి బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం(మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ)తో సంబంధాలు తెగిపోయాయి. ఉపగ్రహ కక్ష్య దూరాన్ని పెంచే క్రమంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో మొదటి, రెండో విడత ఉపగ్రహ కక్ష్య దూరాన్ని ఉపగ్రహంలో ఇంధనాన్ని మండించి విజయవంతంగా పొడిగించారు. మూడో విడతగా ఆదివారం తెల్లవారుజామున ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉపగ్రహంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి సిగ్నల్స్ ఆగిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఉపగ్రహంతో సంబంధాలు కోల్పోవడం ఆందోళనకరమే అయినా, సంబంధాలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇస్రో తన వెబ్సైట్లో పేర్కొంది. విదేశీ అంతరిక్ష సంస్థలతో సంప్రదింపులు జీశాట్–6ఏ నుంచి సంబంధాలు తెగిపోవడంతో విదేశీ అంతరిక్ష సంస్థలతో ఇస్రో సంప్రదింపులు జరుపుతోంది. మన ఉపగ్రహ నియంత్రణ కేంద్రానికి సిగ్నల్స్ అందకపోయినప్పటికీ మరికొన్ని విదేశీ అంతరిక్ష సంస్థలకు సిగ్నల్స్ అందే అవకాశం ఉండటంతో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలను ఇస్రో సంప్రదిస్తోంది. ఎలాగైనా ఈ ఉపగ్రహాన్ని రికవరీ చేసి అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఇస్రో చైర్మన్‌గా డాక్టర్ కె.శివన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ప్రయోగంలోనే విషమ పరీక్ష ఎదురైంది. అనుసంధానమయ్యే అవకాశం: శివన్ ప్రస్తుతానికి తమకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఉపగ్రహంతో తిరిగి సంబంధాలను పునరుద్ధరించే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. అయితే ముందుగా శాటిలైట్‌తో లింక్ ఏర్పరుకోవడమే దీనిలో ప్రధానమైందని ఆయన పేర్కొన్నారు. ఉపగ్రహాల్లో సాంకేతిక లోపాలు ఒకప్పుడు రాకెట్లు సక్సెస్ కాక ఉపగ్రహాలను సముద్రం పాలు చేసేవారు. ఇటీవల కాలంలో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినా.. ఉపగ్రహాల విషయంలో సాంకేతిక లోపం ఏర్పడి పనికి రాకుండా పోతున్నాయి. గతంలో కూడా ఇన్శాట్ 4సీ ఆర్ ఉపగ్రహం కూడా కక్ష్యలోకి ప్రవేశించడంలో సాంకేతిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో ఆ ఉపగ్రహాన్ని అలాగే వదిలేశారు. గతేడాది ఆగస్టు 30న పీఎస్ఎల్వీ సీ39 ద్వారా పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ఉపగ్రహం హీట్‌షీల్డ్ విడిపోకపోవడంతో పనికి రాకుండా పోయింది. -
జీశాట్-18 ఉపగ్రహ కక్ష్య దూరం పెంపు..
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా ప్రయోగించిన 3,404 కిలోలు బరువు కలిగిన జీశాట్ -18 ఉపగ్రహానికి శుక్రవారం వేకువజామున 3.46 గంటలకు కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. ఈ సమాచార ఉపగ్రహాన్ని 251.7 కిలోమీటర్ల, పెరిజీ(భూమికి దగ్గరగా), అపోజి(భూమికి దూరంగా) 35,888 కిలోమీటర్లు ఎత్తులోని భూ బదిలీ కక్ష్య(జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లో దిగ్విజయంగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హాసన్ ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం(ఎంసీఎఫ్) వారు అధీనంలోకి తీసుకుని ఉపగ్రహంలో నింపిన 2004 కిలోల ఇంధనంలో కొంతభాగాన్ని శుక్రవారం వేకువజామున 6,040 సెకెండ్లపాటు మండించి కక్ష్య దూరాన్ని పెంచారు. ప్రస్తుతం 251.7 కిలోమీటర్ల దూరంలోని పెరీజీని 14,843 కిలోమీటర్లుకు పెంచుతూ... అపోజీని మాత్రం 35,888 కిలోమీటర్ల నుంచి 35,802 కిలోమీటర్లకు తగ్గించారు. మరో రెండు దశల్లో ఇంధనాన్ని మండించి పెరీజీని పెంచుకుంటూ జియో ట్రాన్స్ఫర్ కక్ష్య నుంచి దశల వారీగా భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్య (జియో సింక్రనస్ ఆర్బిట్)లోకి సమస్థితిలో స్థిరపరచే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. -
విశ్వ మూలాల పరిశోధనలకే
ఇస్రో ఇవాళ విజయవంతంగా ప్రయోగించిన ఆస్ట్రోశాట్ విశ్వం మూలాల పరిశోధనలు చేస్తందని శాటిలైట్ ప్రాజెక్ట్ డైరైక్టర్ కే సూర్యనారాయణశర్మ తెలిపారు. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఇదే కావడం విశేషం. దీని కోసం శాస్త్ర వేత్తలు 11ఏళ్లు కష్టపడ్డారు. 1996లో అప్పటి ఇస్రో చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ గ్రహాలు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలు, నక్షత్రాల పుట్టుక వంటి అంశాలపై పరిశోధనల కోసం ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించాలని ప్రతిపాద కేంద్రానికి పంపారు. అయితే.. కేంద్రం దీనికి అనుమతి ఇవ్వలేదు. అయితే 2004లో ఈ ప్రయోగాలకు అనుమతి లభించింది. 2006లో ఉపగ్రహానికి రూపకల్పన జరిగింది. ఇందులో అమర్చిన ఐదు రకాల పేలోడ్స్‌ను ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రీసెర్చి (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ), ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐయూసీఏఏ), రామన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఆర్ఆర్ఐ) వారి భాగస్వామ్యంతో తయారుచేశారు. మరో రెండు పేలోడ్స్ తయారీలో కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (సీఎస్ఏ) అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెసైస్టర్ (యూఓఎల్) భాగస్వామ్యాన్ని కూడా తీసుకున్నారు. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన 40 సెంటీమీటర్లు ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలీస్కోప్ (యూవీఐటీ), లార్ట్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్ (ఎల్ఏఎక్స్పీసీ), సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్ (ఎస్ఎక్స్టీ), కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్ (సీజడ్టీఐ), స్కానింగ్ స్కై మానిటర్ (ఎస్ఎస్టీ) అనే ఐదు రకాల ఉపకరణాలను ఖగోళ పరిశోధనకు మాత్రమే తయారు చేశారు. ఉపగ్రహంలో అమర్చిన నాలుగు టెలీస్కోప్‌లు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగినవని చెప్పారు. ఈ ఉపగ్రహం విశ్వంలో పరిభ్రమిస్తూ ఖగోళంలోని స్థితిగతులపై ప్రతి రోజూ.. బెంగళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రానికి 10 నుంచి 15 నిమిషాల పాటు సమాచారాన్ని అందజేస్తుందని అయన తెలిపారు. ఈ ఉపగ్రహం తయారీకి రూ.178 కోట్లు వ్యయం చేశారని తెలుస్తోంది. ఈ ఉపగ్రహం కక్ష్యలో ఐదేళ్లుపాటు సేవలు అందిస్తుంది. ఇదే తరహాలోనే ఆదిత్య అనే ఉపగ్రహాన్ని తయారు చేయడానికి కూడా సన్నద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. విశ్వం గురించి పరిశోధన చేసే విద్యార్థులకు, పరిశోధకులకు పుణేలో నవంబర్‌లో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఆస్ట్రోశాట్ ఉపయోగాలు గురించి వివరించనున్నామని ఆయన తెలిపారు.