భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మొట్టమొదటి సారిగా ఖగోళ పరిశోధన కోసం చేసిన పీఎస్‌ఎల్‌వీ సీ30 ప్రయోగం విజయవంతంమైంది.
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మొట్టమొదటి సారిగా ఖగోళ పరిశోధన కోసం చేసిన పీఎస్‌ఎల్‌వీ సీ30 ప్రయోగం విజయవంతంమైంది. ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్‌ను పంపించారు. దీనికి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగి సోమవారం ఉదయం 10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ30 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం ప్రారంభంకావడానికి కొద్దినిమిషాల ముందు లాంచ్ కోసం వెహికిల్ డైరెక్టర్ కు మిషన్ డైరెక్టర్ అనుమతి ఇచ్చారు. దాంతో ఆటో మెటిక్ లాంచ్ సీక్వేన్స్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది.
పదేళ్ల శ్రమ ఫలితమే ఆస్ట్రోశాట్..
ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేసిన తొలి ప్రయోగం ఇది. విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి దీన్ని ప్రయోగించారు. నక్షత్రాల ఆవిర్భావం గురించి, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం, మన గెలాక్సీ ఆవల పరిస్థితుల గురించి అధ్యయనం కోసం ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించారు. ఆస్ట్రోశాట్ వెనుక ఇస్రో శాస్త్రవేత్తల పదేళ్ల కష్టం ఉంది. ఈ ఉపగ్రహంలో ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలిస్కోప్, లార్జ్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్, సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్, కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్, స్కానింగ్ స్కై మానిటర్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన ఐదు పేలోడ్స్ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు నాలుగు యూనివర్సిటీల, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఉంది. ఈ శాటిలైట్ జీవితకాలాన్ని ఐదేళ్లుగా అంచనా వేస్తున్నారు.