అనంతమైన విశ్వంలో మనం జీవిస్తున్న ఈ భూగోళంపైనే కాకుండా ఇతర గ్రహాలు, నక్షత్రాలపైనా జీవజాలం ఉందా? ఇప్పుడు లేకపోయినా గతంలో ఎప్పుడైనా ఉండేదా? ఒకవేళ ఉంటే అవి ఎలాంటి జీవులు? ఈ ప్రశ్నలు ఎన్నో శతాబ్దాలుగా భూమిపై మానవాళిని వెంటాడుతూనే ఉన్నాయి. సువిశాలమైన విశ్వంలో భూమికి ఆవల జీవుల ఉనికిని కనిపెట్టేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు అలుపెరగకుండా అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు.
మన పాలపుంత(గెలాక్సీ)లో ఇప్పటిదాకా 5,000కుపైగా గ్రహాలను కనిపెట్టారు. వాటిపై జీవులు ఉన్నాయా? అనేది తెలుసుకొనేందుకు కృషి చేశారు. ఇందుకోసం ఎన్నెన్నో పద్ధతులు అనుసరించారు. ఇతర గ్రహాలపై జీవజాలం ఉన్నట్లు ఇప్పటివరకైతే బలమైన ఆధారాలేవీ లభించలేదు. పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిపై దృష్టి పెట్టారు. అదేమిటో తెలుసుకోవడం ఆసక్తికరమే.
► మన భూగోళానికి రక్షణ కవచం ఓజోన్ పొర అన్న సంగతి తెలిసిందే. అత్యంత హానికరమైన అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి ఓజోన్ పొర రక్షిస్తోంది. అందుకే భూమిపై కోట్లాది జీవులు నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి.
► ఏదైనా గ్రహాన్ని మందపాటి ఓజోన్ పొర ఆవరించి ఉంటే ఆ గ్రహంపై జీవుల ఉనికి సాధ్యమని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇదే అంశాన్ని సరికొత్త అస్త్రంగా మార్చుకుంటున్నారు.
► ఏదైనా నక్షత్రానికి లోహతత్వం(మెటాలిసిటీ) ఎక్కువగా ఉంటే దాని చుట్టూ ఉన్న గ్రహాలపై రక్షిత ఓజోన్ పొర ఆవరించి ఉంటుందని గుర్తించారు.
► ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్ కమ్యూనికేషన్’ పత్రికలో ప్రచురించారు.
► విశ్వ పరిణామ క్రమంలో కొత్తగా పుట్టుకొస్తున్న నక్షత్రాలకు లోహతత్వం అధికంగా ఉంటున్నట్లు తేల్చారు. ఇలాంటి నక్షత్ర మండల్లాలోని గ్రహాల చుట్టూ దట్టమై ఓజోన్ పొర ఏర్పడుతుందని, తద్వారా అక్కడ జీవులు ఉద్భవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
► అధిక లోహతత్వం ఉన్న నక్షత్రాల పరిధిలోని గ్రహాలే జీవుల అన్వేషణకు మెరుగైన లక్ష్యాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
► గ్రహాల చుట్టూ రక్షిత ఓజోన్ పొర ఏర్పడాలంటే దానికి సంబంధించిన నక్షత్రానికి ఏయే లక్షణాలు ఉండాలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు.
► విశ్వంలో గ్రహాలను కలిగిన చాలా నక్షత్రాల ఉష్ణోగ్రత 5,000 నుంచి 6,000 డిగ్రీల సెల్సియస్ ఉంది. మన నక్షత్రమైన సూర్యుడు ఇదే విభాగంలోకి వస్తాడు.
► సూర్యుడి నుంచి వెలువడుతున్న అల్ట్రావయొలెట్ కాంతి(రేడియేషన్) మన భూగ్రహ వాతావరణంపై చూపిస్తున్న సంక్లిష్టమైన ప్రభా వాన్నే ఇతర గ్రహాల వాతావరణంపైనా చూపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ అన్నా సపిరో ఒక ప్రకటనలో వెల్లడించారు.
► నక్షత్రాల్లోని లోహతత్వం వాటి నుంచి ఉద్గారమయ్యే అల్ట్రావయెలెట్ కాంతిని ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూవీ రేడియేషన్ నక్షత్రాల సమీపంలో కక్ష్యలో తిరిగే గ్రహాల వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్న దానిపై దృష్టి సారించారు.
► మన భూగోళంపై ఉన్న వాతావరణం ఇక్కడి జీవ పరిణామ క్రమాన్ని తెలుసుకొనేందుకు ఉపకరిస్తుందని, ఇదే సూత్రాన్ని ఇతర గ్రహాలకు సైతం వర్తింపజేయవచ్చని సైంటిస్టు జోస్ లెలీవెల్డ్ అన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment