గురుడే మన పెద్దన్న!
వాషింగ్టన్: మన సౌరవ్యవస్థలోని గ్రహాలన్నింటిలోకెల్ల గురుగ్రహం అత్యంత పురాతనమైనదిగా ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడు ఏర్పడిన 40 లక్షల సంవత్సరాలకు గురుగ్రహం ఆవిర్భవించిందని అమెరికాలోని లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లేబొరేటరీ పరిశోధకులు తేల్చారు.
గురుగ్రహం ఉపరితలంపై ఉన్న ఉల్క శకలాల్లోని ఐసోటోప్ సిగ్నేచర్ నమూనాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చినట్లు లేబొరేటరీకి చెందిన క్రూజెర్ తెలిపారు. ఇప్పటి వరకు సౌరవ్యవస్థలో ఏర్పడిన పరిణామ క్రమాలను అర్థం చేసుకునేందుకు ఈ తాజా అధ్యయనం తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఏర్పాటైన 10 లక్షల ఏళ్లలోపే భూమికి 20 రెట్లు అధికంగా గురుగ్రహం ద్రవ్యరాశి పెరిగిపోయిందని చెప్పారు. 30 నుంచి 40 లక్షల ఏళ్ల తర్వాత 50 రెట్లు అధికంగా ద్రవ్యరాశి పెరిగిందని చెప్పారు.