నేను గనక కాలంలో వెనక్కి వెళ్లగలిగితే, అలెగ్జాండ్రియా లైబ్రరీని దర్శిస్తానంటాడు ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ . ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీకి ప్రపంచంలోనే అత్యంత గొప్ప గ్రంథాలయం అని పేరు. వేలాది గ్రీకు, హీబ్రూ, మెసొపొటేమియన్ సాహిత్య స్క్రోల్స్, ప్రాచీన ఈజిప్టుకు చెందిన కళోపకరణాలు ఇక్కడ ఉండేవి. ఎరాటోస్తనీస్, ఆర్కిమెడీస్, యూక్లిడ్ వంటి గ్రీకు శాస్త్రజ్ఞులు దీన్ని సందర్శించారు. రెండు వేల ఏళ్ల కిందట ఇది వైభవోపేతంగా వర్ధిల్లిందనీ, దీన్ని క్రీ.పూ. 48–47 ప్రాంతంలో సీజర్ తగలబెట్టేశాడనీ చెబుతుంటారు.
అయితే, తగలబడిందని నిర్ధారించడానికి చారిత్రక ఆధారాలు లేవనీ, మానవ జాతి పోగేసుకున్న సమస్త వివేకసారం మట్టి పాలైందని అనుకోవడంలో ఉన్న ఉద్వేగంలోంచి ఈ కథ పుట్టివుంటుందనీ చెబుతాడు బ్రిటిష్ లైబ్రేరియన్, రచయిత రిచర్డ్ ఓవెండెన్ . ఇప్పటి ‘పుస్తకం’ ఉనికిలో లేని ఆ కాలంలో నునుపు చేసిన చెట్ల బెరడుల రోల్స్ కాలక్రమంలో నశించడమే ఈ కథగా మారివుంటుందని మరో కథ.
ఏమైనా, సమస్త విజ్ఞానం ఒక చోట రాశిగా పోగయ్యే గ్రంథాలయం అనే భావనను ఊహించడమే మానవ నాగరికత సాధించిన విజయం. ఆ గ్రంథాలయాలనే నేలమట్టం చేయడం ద్వారా శత్రువు మీద పైచేయి సాధించే ప్రయత్నం చేయడం... అదే నాగరిక మానవుడి అనాగరికతకు తార్కాణం.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటినుంచీ జరుగుతున్న ప్రాణనష్టం గురించి మీడియా మాట్లాడుతూనే ఉంది. కానీ గాజాలో కనీసం పదమూడు గ్రంథాలయాలకు ఇజ్రాయెల్ వల్ల నష్టం వాటిల్లింది. ఇందులో కొన్ని పూర్తిగా నాశనం కాగా, కొన్ని దారుణంగా దెబ్బతినడమో, అందులో ఉన్నవి దోచుకెళ్లడమో జరిగింది.
నూటా యాభై ఏళ్ల గాజా చరిత్ర రికార్డులున్న సెంట్రల్ ఆర్కైవ్స్ ఆఫ్ గాజా, పాలస్తీనాలోని అరుదైన పుస్తకాల కలెక్షన్ కలిగివున్న గ్రేట్ ఒమారి మాస్క్, వేలాది పుస్తకాలకు నెలవైన డయానా తమారీ సబ్బాగ్ లైబ్రరీతో పాటు, గాజా యూనివర్సిటీ లైబ్రరీ, అల్–ఇస్రా యూనివర్సిటీ లైబ్రరీ కూడా దెబ్బతిన్నవాటిల్లో ఉన్నాయి. ‘‘ఆర్కైవ్ మీద ఆధిపత్యం లేకపోతే రాజకీయ అధికారం లేదు’’ అంటాడు ఫ్రెంచ్ విమర్శకుడు జాక్వెస్ డెరిడా. అందుకే గ్రంథాలయాలను దొంగదెబ్బ కొట్టడం అనేది చరిత్ర పొడవునా జరుగుతూనే ఉంది.
ప్రపంచానికే జ్ఞానకాంతిగా వెలుగొందింది భారత్‌లోని నలందా విశ్వవిద్యాలయం. 5వ శతాబ్దంలో గుప్తులకాలంలో ఇది నిర్మితమైంది. రత్నదధి, రత్నసాగర, రత్నరంజక పేరుతో మూడు తొమ్మిదంతస్థుల భవనాలుండేవి. ఖగోళం, జ్యోతిషం, గణితం, రాజకీయం, ఆయుర్వేదం, వైద్యం, కళలు, సాహిత్యం, వ్యాకరణం, తర్కం సంబంధిత అంశాలన్నింటికీ నెలవు ఇది. జైన తీర్థంకరుడు మహావీరుడు 14 వర్షాకాలాలు ఇక్కడ గడిపాడట! క్రీ.శ.1193లో భక్తియార్ ఖిల్జీ దీన్ని తగలబెట్టించాడు. దేశంలో బౌద్ధ ప్రాభవం క్షీణించడానికి ఇదీ ఓ కారణమని చెబుతారు.
‘‘గ్రంథాలయాల ద్వారా సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంది. కొన్నిసార్లు గ్రంథాలయాలను సాంస్కృతిక హనన పథకంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారు. ఎన్నో ప్రజా, ప్రైవేటు లైబ్రరీలు మూర్ఖ దురాక్రమణదారుల వల్ల నాశనం అయ్యాయి’’ అంటారు పాత్రికేయుడు జానీ డైమండ్.
బీజింగ్‌లో ఎనిమిదో శతాబ్దంలో నెలకొల్పిన హాన్లిన్ లైబ్రరీ ఒక విజ్ఞాన భాండాగారం. ఇందులో ఒక ముఖ్యమైన సోర్సు మింగ్ వంశపు చక్రవర్తి ఝూ డీ 1403లో ‘జాంగ్లే దాదియన్ ’ పేరుతో సిద్ధం చేయించిన ఎన్ సైక్లోపీడియా. వ్యవసాయం, నాటకం, భూగర్భశాస్త్రం, వైద్యం, కళ, చరిత్ర, సాహిత్యం లాంటి వాటితో కూడిన 22,000 విభాగాలు అందులో ఉన్నాయి. 1900వ సంవత్సరంలో మంటల్లో లైబ్రరీ తగలబడినప్పుడు ఆ ఎన్ సైక్లోపీడియా కూడా మసైపోయింది. వలసవాదులు, తిరుగుబాటుదారుల రూపంలో ఉన్న బ్రిటిష్ వాళ్లు, చైనీయులు దీనికి కారణం మీరంటే మీరేనని పరస్పరం నిందించుకున్నారు.
అమెరికా జాతీయ గ్రంథాలయాన్ని 1814లో బ్రిటిష్‌వాళ్లు నాశనం చేశారు. అప్పటికి దాన్ని నెలకొల్పి నాలుగేళ్లే అయింది. సెనేటర్ల ఉపయోగార్థం 3000 వాల్యూములు అందులో ఉన్నాయి. అయినప్పటికీ ఆ దెబ్బ తమ జాతి ఆత్మను గాయపరిచిందంటాడు అమెరికా చరిత్రకారుడు రాబర్ట్ డార్న్‌టన్ . అదే బ్రిటనీయులు 2003లో ఇరాక్ జాతీయ గ్రంథాలయాన్ని నాశనం చేశారు.
పనామ్ పెన్ ్హ నగరంలోని జాతీయ గ్రంథాలయాన్ని 1967లో సర్వనాశనం చేయడం ద్వారా కంబోడియా నాగరికత మొత్తాన్నీ ‘ఖ్మేర్ రూజ్’ తుడిచిపెట్టింది. దేశ చరిత్రను మళ్లీ ‘ఇయర్ జీరో’ నుంచి మొదలుపెట్టించాలన్న మూర్ఖత్వంలో భాగంగా కమ్యూనిస్టు నాయకుడు పోల్ పాట్ సైన్యం నరమేధానికీ, సాంస్కృతిక హననానికీ పాల్పడింది. సుమారు లక్ష పుస్తకాలున్న, అప్పటికి యాభై ఏళ్ల పాతదైన శ్రీలంకలోని జాఫ్నా పబ్లిక్ లైబ్రరీని 1981లో సింహళ మూక కూడా అలాగే తగలబెట్టింది.
ఒక గ్రంథాలయం ధ్వంసమైతే మనం ఏం కోల్పోయామో కూడా మనకు తెలియకపోవడం అతి పెద్ద విషాదం. ఒక గ్రంథాలయాన్ని నిర్మూలించడమంటే ఒక దేశ, ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం; గతపు ఘనతను పూర్తిగా నేలమట్టం గావించడం; అన్నీ కోల్పోయినా మళ్లీ మొదలెట్టగలిగే శక్తియుక్తులను నిర్వీర్యం చేయడం; చెప్పాలంటే ఇంకేమీ లేకుండా చేయడం, సున్నా దగ్గరికి తెచ్చి నిలబెట్టడం! అయినా గోడలు కూలితేనే, పుస్తకాలు కాలితేనే గ్రంథాలయం నాశనం కావడమా? వాటిపట్ల నిర్లక్ష్యం వహించడం మాత్రం నెమ్మదిగా నాశనం చేయడం కాదా?
పుస్తక హననం
Published Mon, Mar 4 2024 12:11 AM | Last Updated on Mon, Mar 4 2024 12:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment