![Sarcophagus Suspected To Be King Alexander Opened In Egypt - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/25/muffied.jpg.webp?itok=mQsl7OaB)
అలెగ్జాండ్రియా : చారిత్రక ఈజిప్టు పోర్టు నగరం అలెగ్జాండ్రియా కింద 16 అడుగుల లోతులో భద్రపర్చిన 2000 సంవత్సరాల నాటి నల్లరాతి శవకోష్టికను శాస్త్రవేత్తలు తెరిచారు. దాదాపు 10 అడుగుల పొడవు, 30 టన్నుల బరువున్న కోష్టిక నుంచి మూడు మమ్మీల పుర్రెలు బయటపడ్డాయి. పుర్రెలతో పాటు కోష్టికలోని ఎరుపు రంగు పదార్థం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పదార్థం వల్ల మృతదేహాలు అతి వేగంగా కుళ్లిపోయి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు.
శవ కోష్టికను తెరిస్తే శాపానికి గురవుతామనే నమ్మకం నరనరాల్లో జీర్ణించుకుని పోయిన వేళ ఈజిప్టు పురాతత్వ సుప్రీమ్ కౌన్సిల్ ముస్తఫా వాజిరీ దాన్ని తెరవాలని ఆదేశించి సంచలనం రేపారు. ఆయన ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితం కోష్టికను తెరవగా మూడు పుర్రెలు, ఎరుపు రంగు పదార్థం బయల్పడ్డాయి. దీనిపై మాట్లాడిన వాజిరీ కోష్టికను తెరిచామని, ఎలాంటి శాపానికి గురి కాలేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేకమైన నల్లరాతి కోష్టికలో మృతదేహాలను భద్రపర్చడంతో అవి రోమన్ రాజ కుటుంబానికి చెందినవని తొలుత భావించారు. పైగా కోష్టికపై కింగ్ అలెగ్జాండర్ పేరు ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తించింది.
అయితే, బయల్పడిన మూడు మమ్మీలు రోమన్ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తులవి కావని పరిశోధకులు తేల్చారు. రాజ కుటుంబీకుల సమాధులు ఇంకా భారీగా ఉంటాయని వారు పేర్కొన్నారు. అలెగ్జాండర్ సమాధి దీనికి ఎన్నో రెట్లు పెద్దగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment