Alexandria
-
పుస్తక హననం
నేను గనక కాలంలో వెనక్కి వెళ్లగలిగితే, అలెగ్జాండ్రియా లైబ్రరీని దర్శిస్తానంటాడు ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ . ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీకి ప్రపంచంలోనే అత్యంత గొప్ప గ్రంథాలయం అని పేరు. వేలాది గ్రీకు, హీబ్రూ, మెసొపొటేమియన్ సాహిత్య స్క్రోల్స్, ప్రాచీన ఈజిప్టుకు చెందిన కళోపకరణాలు ఇక్కడ ఉండేవి. ఎరాటోస్తనీస్, ఆర్కిమెడీస్, యూక్లిడ్ వంటి గ్రీకు శాస్త్రజ్ఞులు దీన్ని సందర్శించారు. రెండు వేల ఏళ్ల కిందట ఇది వైభవోపేతంగా వర్ధిల్లిందనీ, దీన్ని క్రీ.పూ. 48–47 ప్రాంతంలో సీజర్ తగలబెట్టేశాడనీ చెబుతుంటారు. అయితే, తగలబడిందని నిర్ధారించడానికి చారిత్రక ఆధారాలు లేవనీ, మానవ జాతి పోగేసుకున్న సమస్త వివేకసారం మట్టి పాలైందని అనుకోవడంలో ఉన్న ఉద్వేగంలోంచి ఈ కథ పుట్టివుంటుందనీ చెబుతాడు బ్రిటిష్ లైబ్రేరియన్, రచయిత రిచర్డ్ ఓవెండెన్ . ఇప్పటి ‘పుస్తకం’ ఉనికిలో లేని ఆ కాలంలో నునుపు చేసిన చెట్ల బెరడుల రోల్స్ కాలక్రమంలో నశించడమే ఈ కథగా మారివుంటుందని మరో కథ. ఏమైనా, సమస్త విజ్ఞానం ఒక చోట రాశిగా పోగయ్యే గ్రంథాలయం అనే భావనను ఊహించడమే మానవ నాగరికత సాధించిన విజయం. ఆ గ్రంథాలయాలనే నేలమట్టం చేయడం ద్వారా శత్రువు మీద పైచేయి సాధించే ప్రయత్నం చేయడం... అదే నాగరిక మానవుడి అనాగరికతకు తార్కాణం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటినుంచీ జరుగుతున్న ప్రాణనష్టం గురించి మీడియా మాట్లాడుతూనే ఉంది. కానీ గాజాలో కనీసం పదమూడు గ్రంథాలయాలకు ఇజ్రాయెల్ వల్ల నష్టం వాటిల్లింది. ఇందులో కొన్ని పూర్తిగా నాశనం కాగా, కొన్ని దారుణంగా దెబ్బతినడమో, అందులో ఉన్నవి దోచుకెళ్లడమో జరిగింది. నూటా యాభై ఏళ్ల గాజా చరిత్ర రికార్డులున్న సెంట్రల్ ఆర్కైవ్స్ ఆఫ్ గాజా, పాలస్తీనాలోని అరుదైన పుస్తకాల కలెక్షన్ కలిగివున్న గ్రేట్ ఒమారి మాస్క్, వేలాది పుస్తకాలకు నెలవైన డయానా తమారీ సబ్బాగ్ లైబ్రరీతో పాటు, గాజా యూనివర్సిటీ లైబ్రరీ, అల్–ఇస్రా యూనివర్సిటీ లైబ్రరీ కూడా దెబ్బతిన్నవాటిల్లో ఉన్నాయి. ‘‘ఆర్కైవ్ మీద ఆధిపత్యం లేకపోతే రాజకీయ అధికారం లేదు’’ అంటాడు ఫ్రెంచ్ విమర్శకుడు జాక్వెస్ డెరిడా. అందుకే గ్రంథాలయాలను దొంగదెబ్బ కొట్టడం అనేది చరిత్ర పొడవునా జరుగుతూనే ఉంది. ప్రపంచానికే జ్ఞానకాంతిగా వెలుగొందింది భారత్‌లోని నలందా విశ్వవిద్యాలయం. 5వ శతాబ్దంలో గుప్తులకాలంలో ఇది నిర్మితమైంది. రత్నదధి, రత్నసాగర, రత్నరంజక పేరుతో మూడు తొమ్మిదంతస్థుల భవనాలుండేవి. ఖగోళం, జ్యోతిషం, గణితం, రాజకీయం, ఆయుర్వేదం, వైద్యం, కళలు, సాహిత్యం, వ్యాకరణం, తర్కం సంబంధిత అంశాలన్నింటికీ నెలవు ఇది. జైన తీర్థంకరుడు మహావీరుడు 14 వర్షాకాలాలు ఇక్కడ గడిపాడట! క్రీ.శ.1193లో భక్తియార్ ఖిల్జీ దీన్ని తగలబెట్టించాడు. దేశంలో బౌద్ధ ప్రాభవం క్షీణించడానికి ఇదీ ఓ కారణమని చెబుతారు. ‘‘గ్రంథాలయాల ద్వారా సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంది. కొన్నిసార్లు గ్రంథాలయాలను సాంస్కృతిక హనన పథకంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారు. ఎన్నో ప్రజా, ప్రైవేటు లైబ్రరీలు మూర్ఖ దురాక్రమణదారుల వల్ల నాశనం అయ్యాయి’’ అంటారు పాత్రికేయుడు జానీ డైమండ్. బీజింగ్‌లో ఎనిమిదో శతాబ్దంలో నెలకొల్పిన హాన్లిన్ లైబ్రరీ ఒక విజ్ఞాన భాండాగారం. ఇందులో ఒక ముఖ్యమైన సోర్సు మింగ్ వంశపు చక్రవర్తి ఝూ డీ 1403లో ‘జాంగ్లే దాదియన్ ’ పేరుతో సిద్ధం చేయించిన ఎన్ సైక్లోపీడియా. వ్యవసాయం, నాటకం, భూగర్భశాస్త్రం, వైద్యం, కళ, చరిత్ర, సాహిత్యం లాంటి వాటితో కూడిన 22,000 విభాగాలు అందులో ఉన్నాయి. 1900వ సంవత్సరంలో మంటల్లో లైబ్రరీ తగలబడినప్పుడు ఆ ఎన్ సైక్లోపీడియా కూడా మసైపోయింది. వలసవాదులు, తిరుగుబాటుదారుల రూపంలో ఉన్న బ్రిటిష్ వాళ్లు, చైనీయులు దీనికి కారణం మీరంటే మీరేనని పరస్పరం నిందించుకున్నారు. అమెరికా జాతీయ గ్రంథాలయాన్ని 1814లో బ్రిటిష్‌వాళ్లు నాశనం చేశారు. అప్పటికి దాన్ని నెలకొల్పి నాలుగేళ్లే అయింది. సెనేటర్ల ఉపయోగార్థం 3000 వాల్యూములు అందులో ఉన్నాయి. అయినప్పటికీ ఆ దెబ్బ తమ జాతి ఆత్మను గాయపరిచిందంటాడు అమెరికా చరిత్రకారుడు రాబర్ట్ డార్న్‌టన్ . అదే బ్రిటనీయులు 2003లో ఇరాక్ జాతీయ గ్రంథాలయాన్ని నాశనం చేశారు. పనామ్ పెన్ ్హ నగరంలోని జాతీయ గ్రంథాలయాన్ని 1967లో సర్వనాశనం చేయడం ద్వారా కంబోడియా నాగరికత మొత్తాన్నీ ‘ఖ్మేర్ రూజ్’ తుడిచిపెట్టింది. దేశ చరిత్రను మళ్లీ ‘ఇయర్ జీరో’ నుంచి మొదలుపెట్టించాలన్న మూర్ఖత్వంలో భాగంగా కమ్యూనిస్టు నాయకుడు పోల్ పాట్ సైన్యం నరమేధానికీ, సాంస్కృతిక హననానికీ పాల్పడింది. సుమారు లక్ష పుస్తకాలున్న, అప్పటికి యాభై ఏళ్ల పాతదైన శ్రీలంకలోని జాఫ్నా పబ్లిక్ లైబ్రరీని 1981లో సింహళ మూక కూడా అలాగే తగలబెట్టింది. ఒక గ్రంథాలయం ధ్వంసమైతే మనం ఏం కోల్పోయామో కూడా మనకు తెలియకపోవడం అతి పెద్ద విషాదం. ఒక గ్రంథాలయాన్ని నిర్మూలించడమంటే ఒక దేశ, ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం; గతపు ఘనతను పూర్తిగా నేలమట్టం గావించడం; అన్నీ కోల్పోయినా మళ్లీ మొదలెట్టగలిగే శక్తియుక్తులను నిర్వీర్యం చేయడం; చెప్పాలంటే ఇంకేమీ లేకుండా చేయడం, సున్నా దగ్గరికి తెచ్చి నిలబెట్టడం! అయినా గోడలు కూలితేనే, పుస్తకాలు కాలితేనే గ్రంథాలయం నాశనం కావడమా? వాటిపట్ల నిర్లక్ష్యం వహించడం మాత్రం నెమ్మదిగా నాశనం చేయడం కాదా? -
ఈజిప్టులో పలు వాహనాలు ఢీకొని... 32 మంది మృతి
కైరో: ఈజిప్టులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 32 మంది మృత్యువాతపడ్డారు. కైరో–అలెగ్జిండ్రియా ప్రధాన రహదారిపై బెహీరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాన్ని ఢీకొట్టింది. ఆ వెనుకే వస్తున్న కార్లు ఒకదానినొకటి ఢీకొట్టి, మంటలు చెలరేగాయి. మొత్తం 29 వాహనాలు ప్రమాదంలో చిక్కుకోగా బస్సు సహా ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో 32 మంది వరకు చనిపోగా మరో 63 మంది గాయపడ్డారు. దట్టంగా కురుస్తున్న మంచు కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. -
టచ్ చేసి చూడకు
నిప్పును పట్టుకుంటే చుర్రుమంటుంది. ట్యాలెంట్‌ని టచ్ చేసినా అంతే! కాలుతుంది. ట్రంప్ టచ్ చేశాడు! ట్యాలెంట్ తన పనిలో తను ఉండగా.. ట్యాలెంట్ తన ప్లాన్లలో తనుండగా..‘షి ఈజ్ నాట్ ట్యాలెంటెడ్’ అన్నాడు. ఆ ట్యాలెంట్ పేరు అలెగ్జాండ్రియా. ఇంకోసారి టచ్ చేసేలా కాల్లేదు ట్రంప్‌కి. వైట్ హౌస్‌లోని గులాబీల తోట అమెరికా అధ్యక్షుడి ప్రెస్మీట్లకు అనువైన ప్రదేశం. ఇంటికి దగ్గరే ఆఫీస్ ఉన్నంత సౌకర్యంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మాట్లాడేవారికి, వినేవారికి శ్రమ తెలియదు. డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఆ గులాబీల తోటలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. చైనాపై విధించిన ఆంక్షల గురించి చెబుతున్నారు. ఎన్నికల ర్యాలీ కాదు కనుక సౌమ్యంగా ఉంది ఆయన మాటతీరు. అయితే గులాబీ పూల వెనుక ఉండే ముళ్లలా ఆయన ప్రసంగంలోని రెండు మాటలు వెళ్లి అలెగ్జాండ్రియా ఒకాసియా కార్టెజ్‌కు గుచ్చుకున్నాయి. యు.ఎస్. కాంగ్రెస్ ఉమన్ ఆమె. డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఆమెరికన్ల సంక్షేమం కోసం గట్టిగా మాట్లాడే ఒక గొంతు. 2018 మిడ్–టెర్మ్ ఎన్నికల్లో న్యూయార్క్ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. అప్పటికి ఆమె వయసు 28 ఏళ్లు. అమెరికన్ కాంగ్రెస్ చరిత్రలోనే సభలోకి వెళ్లిన అతిచిన్న వయసు మహిళ. ఆమెను.. తటాలున మాట అనేశారు ట్రంప్. నవంబర్ 3న జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి జో బైడన్‌తో కలిసి పనిచే స్తున్నారు అలెగ్జాండ్రియా. ప్రెస్ మీట్లో చైనా గురించి మాట్లాడుతున్న ట్రంప్ మెల్లిగా బైడన్ మీదకు మళ్లారు. బైడన్ హామీ ఇస్తున్న విధానాలను వేళాకోళం చేశారు. రెండు ట్రిలియన్ డాలర్ల ఖర్చయ్యే బైడన్ ‘గ్రీన్ న్యూ డీల్’ క్లయిమేట్ పాలసీని అర్థంలేనిదిగా తీసిపారేశారు. ఆ గ్రీన్ న్యూ డీల్‌ను తయారు చేసింది, ఆ డీల్‌కు ఇన్చార్జిగా ఉన్నదీ అలెగ్జాండ్రియా. ‘‘ఆయన్ని చూడండి, అలెంగ్జాండ్రియా అనే యంగ్ ఉమన్‌ని తెచ్చిపెట్టుకున్నాడు. జోక్‌లా అనిపిస్తోంది నాకు. అనేక విధాలుగా ఆమె.. నాట్ ట్యాలెంటెడ్..’’ అన్నారు ట్రంప్! ట్రంప్‌తో గానీ, వైట్ హౌస్ ప్రెస్ మీట్‌తో గానీ, చైనాతో గానీ ఆమెకు ఏ సంబంధమూ లేదు. ట్రంపే ఆమె జోలికి వెళ్లాడు. నిప్పునే కాదు, ట్యాలెంట్‌ను టచ్ చేసినా చుర్రుమని కాలుతుంది. కొన్ని గంటల్లోనే ట్రంప్‌కు అలెగ్జాండ్రియా నుంచి గట్టి సమాధానం వచ్చింది. మునుపు కూడా ట్రంప్.. మహిళల ప్రతిభా ప్రావీణ్యాలను తేలిగ్గా మాట్లాడిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పేరు పెట్టి నేరుగా తననే తక్కువ చేసి మాట్లాడారు! ఈసారి ఊరుకోలేదు అలెగ్జాండ్రియా. ‘‘జీవితమంతా తండ్రి డబ్బు మీద ఎదిగిన వ్యక్తి, ఆర్థిక మోసాలకు పాల్పడిన వ్యక్తి.. ముప్పై ఏళ్ల వయసుకే యు.ఎస్. కాంగ్రెస్‌లోకి వచ్చిన ఒక హౌస్ క్లీనర్ కూతుర్ని ‘నాట్ ట్యాలెంటెడ్’ అంటున్నారు. రోజ్ గార్డెన్లో ఆయన ప్రసంగం వింటే ఆయన కూడా ఈ సంగతి నమ్మలేకపోతున్నాడని అర్థమౌతోంది’’ అని ట్వీట్ చేశారు అలెగ్జాండ్రియా. ట్రంప్ ఆమెను నాట్ ట్యాలెంటెడ్ అని అకారణ దూషణ చేశారు కానీ, ట్రంప్‌కి ఆమె లేనిపోనివేమీ ఆపాదించి విమర్శించలేదు. గత ఏడాది ‘ప్రోపబ్లికా’ అనే పరిశోధనాత్మక వార్తా పత్రిక మన్హట్టన్లో ట్రంప్ నడిపిన వ్యాపారాల పన్ను చెల్లింపు డాక్యుమెంట్లలోని అవకతవకల్ని వెలికితీసింది. ఇక ఆయన.. కొత్తగా అధ్యక్షులైన వారు టాక్స్ రిటర్న్స్ వివరాలను వెల్లడించవలసిన సంప్రదాయాన్ని ఉల్లంఘించడం అందరికీ తెలిసిన విషయమే. అధ్యక్షుడు అవక ముందరి వరకు ఆయన చేసిన రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలన్నీ తండ్రి వారసత్వంగా భారీ మొత్తంలో తెచ్చుకున్న డబ్బుతో మొదలైనవే. ఈ మాటను ట్రంపే స్వయంగా చెప్పుకున్నారు. అధ్యక్ష ఎన్నికల పోటీలో ఉన్నప్పుడు 2015లో.. ‘‘నా కెరీరేమీ తిన్నగా సాగలేదు. నేను నా తండ్రికి తిరిగి చెల్లించవలసిన చిన్న బాకీ అయినా అది మిలియన్ డాలర్లు ఉంటుంది’’ అని అన్నారు. (ట్రంప్ తండ్రి ఫ్రెండ్ ట్రంప్ 93 ఏళ్ల వయసులో 1999లో చనిపోయారు). ఏమైనా.. రాజకీయ అనుభవం లేకుండానే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అలెగ్జాండ్రియా అలా కాదు. ప్రజాజీవితంలోంచి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌కు ఎన్నికైన నాటి నుంచీ యు.ఎస్.రాజకీయాలలో ముఖ్య నాయకురాలయ్యారు. బోస్టన్ యూనివర్సిటీలో బి.ఎ. చదివారు అలెగ్జాండ్రియా. కాలమిస్ట్.. లెజిస్లేటివ్ అసిస్టెంట్.. సామాజిక కార్యకర్త.. పాలిటిక్స్.. ఇదీ ఆమె కెరీర్ పరిణామక్రమం. డిగ్రీ అయ్యాక తను పుట్టిన న్యూయార్క్‌లోనే బార్టెండర్గా, వెయిట్రెస్‌గా చేశారు. తల్లికి కాస్తయినా ఆర్థికంగా చేదోడుగా ఉండటం కోసం ఆ పనులు చేశారు. తల్లి హౌస్ క్లీనర్‌గా, స్కూల్ బస్ డ్రైవరుగా రోజుకు రెండు ఉద్యోగాలు చేసేవారు. అలెగ్జాండ్రియాకు పందొమ్మిదేళ్ల వయసులోనే ఆమె తండ్రి చనిపోయాడు. తమ్ముడు, తను, తల్లి. తమ్ముడి చదువు కోసం కూడా అలెగ్జాండ్రియా ఎక్కువ పని చేయవలసి వచ్చింది. 2016లో ట్రంప్ ఎన్నికల్లో నిలబడే నాటికి ఆమె వయసు 26 ఏళ్లు. ఆ ఏడాది ప్రైమరీ ఎన్నికలకు డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థికి ప్రచార నిర్వాహకురాలిగా ఉన్నారు. తర్వాత రెండేళ్లకు జరిగిన మిడ్–టెర్మ్ ఎన్నికల్లో న్యూయార్క్ 14వ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు పోటీ చేసి గెలిచారు. అలెగ్జాండ్రియా ముఖంలో ఎప్పుడూ కనిపించే చిరునవ్వులా.. ఎవరికీ కనిపించని కష్టం ఆమె జీవితంలో చాలా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆమెపై తీసిన డాక్యుమెంటరీ ఉంది. ‘నాక్ డౌన్ ది హౌస్’ అనే పేరుతో ఉంటుంది. ‘నాక్ డౌన్ ది వైట్ హౌస్’ అనే డాక్యుమెంటరీ కూడా ఎప్పటికైనా రావచ్చేమో! -
ఆ ద్రావం తాగితే అతీత శక్తులు..!!
సాక్షి, వెబ్ డెస్క్ : 2018 ఈ ఏడాదిలో ఇప్పటికే చాలా రకాల వింతలు జరిగాయి. మరీ ముఖ్యంగా వంటల విషయంలో. ఎలాంటి పానీయం తీసుకోకుండా టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తినడం నుంచి లిక్విడ్ డిటర్జెంట్‌ను గడగడా తాగేయడం లాంటి వీడియోలు నెట్టింట్లో సంచలన సృష్టించాయి. తాజాగా 17 వేల మందికి కలిగిన సరికొత్త కోరిక గురించి తెలిస్తే షాక్‌కు గురవుతారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం కింద భూమి లోపల 16 అడుగుల లోతులో నల్లరాతి శవకోష్టిక లభ్యమైన సంగతి తెలిసిందే. దాదాపు 2000 ఏళ్ల క్రితం శవకోష్టికను భూస్థాపితం చేశారు. శాపానికి గురవుతామా? అనే భయాల మధ్య ఈజిప్టు పురాతత్వ కౌన్సిల్ చీఫ్ ఆదేశాల మేరకు ఇటీవల ఆ శవకోష్టికను తెరిచారు. అందులో ముగ్గురు వ్యక్తుల మమ్మీలు బయల్పడ్డాయి. అయితే, ఆ మూడు మమ్మీలు ఎరుపు రంగులో ఉన్న ఓ ప్రత్యేక ద్రావంలో మునిగి ఉన్నాయి. మమ్మీలను బయటకు తీసిన పరిశోధకులు అవి రోమన్ రాజ కుటుంబానికి చెందినవి కావని తేల్చారు. ఈ సంఘటనను కళ్లప్పగించుకుని చూసిన కొందరు ఇప్పుడు ఆ ఎరుపు రంగు ద్రావాన్ని తాగేందుకు తమను అనుమతించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఛేంజ్.ఆర్గ్ అనే ఓ వెబ్సైట్ పిటిషన్‌ను సైతం దాఖలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 వేల మందికి పైగా శవ కోష్టికలో ఉన్న ద్రావాన్ని తాగడానికి ఇష్టపడుతున్నారని, వారికి అవకాశం ఇవ్వాలనేది సదరు పిటిషన్ సారాంశం. శాపగ్రస్తమైన నల్లరాతి శవకోష్టికలోని ఆ ద్రావాన్ని తాగితే అతీత శక్తులు సంక్రమిస్తాయని, ఆ తర్వాత చనిపోతామని వారందరూ విశ్వసిస్తున్నారని పిటిషనర్ మెక్కెన్డ్రిక్ పేర్కొన్నారు. మరణించే హక్కును గురించి ప్రస్తావిస్తూ సదరు ద్రావాన్ని తాగేందుకు వారికి అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్లో కోరారు. అయితే, ఈజిప్టు పురాతత్వ శాఖ మాత్రం వేల మంది ప్రజలు శవకోష్టికలోని ద్రావాన్ని తాగేందుకు ఆసక్తి కనబరచడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సదరు ద్రావం ఒట్టి మురికి నీరు మాత్రమేనని పేర్కొంది. ఎముకలు, ఇతర శరీర భాగాల నుంచి ఆ ద్రవం తయారైందని తెలిపింది. దానికి ఎలాంటి అతీత శక్తులు లేవని కొట్టిపారేసింది. దీనిపై అరిజోనా స్టేట్ యూనివర్శిటీలోని బయోడిజైన్ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రోల్ఫ్ హాల్డెన్ మాట్లాడుతూ.. కుళ్లిపోతున్న శరీరాలను నుంచి ఆ ద్రవం తయారైవుంటుందని చెప్పారు. వేల సంవత్సరాలుగా అలానే ఉన్న ఆ ద్రవంలో అతి భయంకరమైన బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయని హెచ్చరించారు. పొరబాటున ఆ ద్రవాన్ని తాగితే విపత్కర పరిస్థితిని ఎదుర్కొక తప్పదని పేర్కొన్నారు. శవ కోష్టికను తెరిచారు.. శాపం తగిలిందా..? -
శవ కోష్టికను తెరిచారు.. శాపం తగిలిందా..?
అలెగ్జాండ్రియా : చారిత్రక ఈజిప్టు పోర్టు నగరం అలెగ్జాండ్రియా కింద 16 అడుగుల లోతులో భద్రపర్చిన 2000 సంవత్సరాల నాటి నల్లరాతి శవకోష్టికను శాస్త్రవేత్తలు తెరిచారు. దాదాపు 10 అడుగుల పొడవు, 30 టన్నుల బరువున్న కోష్టిక నుంచి మూడు మమ్మీల పుర్రెలు బయటపడ్డాయి. పుర్రెలతో పాటు కోష్టికలోని ఎరుపు రంగు పదార్థం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పదార్థం వల్ల మృతదేహాలు అతి వేగంగా కుళ్లిపోయి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. శవ కోష్టికను తెరిస్తే శాపానికి గురవుతామనే నమ్మకం నరనరాల్లో జీర్ణించుకుని పోయిన వేళ ఈజిప్టు పురాతత్వ సుప్రీమ్ కౌన్సిల్ ముస్తఫా వాజిరీ దాన్ని తెరవాలని ఆదేశించి సంచలనం రేపారు. ఆయన ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితం కోష్టికను తెరవగా మూడు పుర్రెలు, ఎరుపు రంగు పదార్థం బయల్పడ్డాయి. దీనిపై మాట్లాడిన వాజిరీ కోష్టికను తెరిచామని, ఎలాంటి శాపానికి గురి కాలేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేకమైన నల్లరాతి కోష్టికలో మృతదేహాలను భద్రపర్చడంతో అవి రోమన్ రాజ కుటుంబానికి చెందినవని తొలుత భావించారు. పైగా కోష్టికపై కింగ్ అలెగ్జాండర్ పేరు ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తించింది. అయితే, బయల్పడిన మూడు మమ్మీలు రోమన్ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తులవి కావని పరిశోధకులు తేల్చారు. రాజ కుటుంబీకుల సమాధులు ఇంకా భారీగా ఉంటాయని వారు పేర్కొన్నారు. అలెగ్జాండర్ సమాధి దీనికి ఎన్నో రెట్లు పెద్దగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. -
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం
కైరో: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లోకల్ రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 36 మంది ప్రాణాలు కోల్పోగా, 120 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈజిప్టు ఉత్తరతీరంలోని అలెగ్జాండ్రియాలో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఎదురెదురుగా వచ్చిన రెండు లోకల్ రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల రాజధాని కైరో నుంచి వస్తున్న రైలు ఆగి ఉండగా మరో రైలు వచ్చి ఢీకొట్టిందని రవాణాశాఖ పేర్కొంది. విచారణకు ఆదేశించినట్లు ఆశాఖ మంత్రి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగనుందని సమాచారం. మౌమెన్ యూసఫ్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ.. క్షణాల్లో రైళ్లు ఢీకొనడం జరిగిపోయింది. కళ్లు తెరచి చూసే సరికి కిందపడిపోయి ఉన్నాను. అంబులెన్స్‌లు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలిస్తున్నాయి. ఘటనా స్థలం భయానక వాతావరణాన్ని తలపించిందని వివరించాడు. -
క్రిస్మస్‌లోని క్రీస్తును మర్చిపోవద్దు!
భయంకరమైన ఎడారిలో ఎంతో ఆనందంగా, తృప్తిగా జీవించాడు ఈజిప్టు తత్వవేత్త ఐరేనియస్. ఒకసారాయన అలెగ్జాండ్రియా మహా నగరానికొచ్చాడు. అక్కడి హడావుడి, అంగళ్లు, సరుకులూ చూసి తెగ సంబరపడ్డాడు. ఈ ఆనందం ఎడారిలో నీకు కరువైందనే కదా దీనర్థం అని దెప్పి పొడిచారు గిట్టనివాళ్లు. ‘అదేం కాదు, నా ఆనందాన్ని, తృప్తిని అణుమాత్రం కూడా పెంచలేని అంశాలిన్ని ఉన్నాయని తెలిసి సంతోషిస్తున్నాను’ అన్నాడాయన. జనాభా లెక్కల్లో నమోదయ్యేందుకు నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చిన యోసేపు, మరియమ్మలకు అక్కడ నివాస స్థలం దొరకలేదు. దాంతో పశువుల పాకలో తల దాచుకున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు జననం అక్కడే జరిగింది. అక్కడ పశువుల తొట్టి, పొత్తి గుడ్డలే ఆయనకు పూలపాన్పు, పట్టు పరుపులయ్యాయి. అయితే దైవ కుమారుడైన కీ స్తుకు ఈ లోకపరంగా తాము తల్లిదండ్రులమయ్యామన్న దివ్య భావనతో వారిద్దరూ పులకరించిపోయారు. చుట్టూ ఉన్న చీకటి, ఆకలి, వణికించే చలి, దూర ప్రయాణ బడలిక, నిద్ర లేమి, ఒంటరితనం, అక్కడివారి నిరాదరణ... ఇవేవీ యోసేపు, మరియల ఆనందాన్ని అణుమాత్రం కూడా తగ్గించలేకపోయాయి (లూకా 2:8-14). సచిన్ టెండూల్కర్ సెంచరీ కొడితే, అది చూసి చప్పట్లు కొట్టేవారు ఒక్కరూ లేకపోతే అతనికదెంత బాధాకరం! కాని మరియ, యోసేపుల ప్రయాస, ప్రత్యేకత తెలిసివారు, పూల దండ వేసి అభినందించేవారు అక్కడ ఒక్కరూ లేరు. అయినా కూడా అంతటి అనామక పరిస్థితుల్లో, కటిక పేదరికంలో కూడా వారు దేవునిలో ఆనందించారు. అంతటి భాగ్యాన్నిచ్చిన దేవుని స్తుతించారు. అదే నిజమైన ఆనందమంటే! బాహ్య పరిస్థితుల ప్రభావం దానిపై ఉండదు. అది విశ్వాసి హృదయపు లోతుల్లో నుండి పెల్లుబుకుతుంది. విశ్వాసంలో అత్యున్నత స్థాయికి ఎదిగి, దైవ సంకల్పాల్లో భాగమైనవారి ప్రత్యేకత ఇది. వారి ఆనందానికి అవధులుండవు. బాహ్య పరిస్థితుల ప్రభావం దానిపైన పడదు. డబ్బుతో పరుపు దొరుకుతుంది కాని నిద్ర దొరకదన్నది అందరికీ తెలిసిన నిజమే! అయినా పరుపుల అమ్మకాల జోరు తగ్గలేదు. నిజమైన నిద్రకు కారణమైన ‘శాంతి’ సాధనకు మానవ ప్రయత్నాలు ముమ్మరం కాలేదు సరికదా అత్యధునాతనమైన పరుపులు సొంతం చేసుకోడానికి జనం నిద్ర మాని మరీ పాకులాడటం రోజూ మనం చూస్తున్నాం. కోటి రూపాయలుంటే కొందరికానందం. కడుపు నింపే రెండు ముద్దల అన్నం దొరికితే మరికొందరికానందం. కాని త్రాసులో కడుపు నిండిన ఆనందమే ఎక్కువ తూగుతుంది. అయినా శాంతికోసం కాదు. శాంతితో సంబంధం లేని డబ్బు, అధికారం, అందం తదితరాల కోసమే లోకం వెంపర్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే యేసుక్రీస్తు ద్వారా పరిమళించిన శాంతి సందేశాన్ని గుర్తు చేస్తోంది. శాంతి దూత, దాతయైన యేసు జనన సందేశం పామరులు, నిరుపేదలైన గొర్రెల కాపరులకు అర్థమయ్యింది. కాని పాలకులైన హేరోదు రాజుకు, పిలాతుకు, నాటి ప్రముఖులైన యూదు పెద్దలకు, యాజకులకు అర్థం కాలేదు. ఆ ఆనందం లభ్యం కాలేదు. రెండు ముద్దల అన్నం తీర్చగల ఆకలి కోసం రెండొందల మాత్రలు మింగడం, ఆద మరచి నిద్రపోలేక మద్యాన్ని, మాదక ద్రవ్యాలను ఆశ్రయించడమే మానవాళి సాధించిన ప్రగతి అయితే... క్రిస్మస్ శాంతి సందేశం, ఆనందం ముమ్మాటికీ వారికే. అందువల్ల క్రిస్మస్ వేడుకల్లో పడి క్రీస్తును విస్మరిస్తే... విందు భోజనం వదిలేసి విస్తరాకు నమిలినట్టే!! - రెవ. టి.ఎ.ప్రభుకిరణ్ దుర్భర పరిస్థితుల్లో, కటిక పేదరికంలోనూ వారు దేవునిలో ఆనందించారు. అంతటి భాగ్యాన్నిచ్చిన దేవుని స్తుతించారు. అదే నిజమైన ఆనందమంటే! అది విశ్వాసి హృదయపు లోతుల్లో నుండి పెల్లుబుకుతుంది.