సాక్షి, వెబ్ డెస్క్ : 2018 ఈ ఏడాదిలో ఇప్పటికే చాలా రకాల వింతలు జరిగాయి. మరీ ముఖ్యంగా వంటల విషయంలో. ఎలాంటి పానీయం తీసుకోకుండా టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తినడం నుంచి లిక్విడ్ డిటర్జెంట్‌ను గడగడా తాగేయడం లాంటి వీడియోలు నెట్టింట్లో సంచలన సృష్టించాయి. తాజాగా 17 వేల మందికి కలిగిన సరికొత్త కోరిక గురించి తెలిస్తే షాక్‌కు గురవుతారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం కింద భూమి లోపల 16 అడుగుల లోతులో నల్లరాతి శవకోష్టిక లభ్యమైన సంగతి తెలిసిందే. దాదాపు 2000 ఏళ్ల క్రితం శవకోష్టికను భూస్థాపితం చేశారు.
శాపానికి గురవుతామా? అనే భయాల మధ్య ఈజిప్టు పురాతత్వ కౌన్సిల్ చీఫ్ ఆదేశాల మేరకు ఇటీవల ఆ శవకోష్టికను తెరిచారు. అందులో ముగ్గురు వ్యక్తుల మమ్మీలు బయల్పడ్డాయి. అయితే, ఆ మూడు మమ్మీలు ఎరుపు రంగులో ఉన్న ఓ ప్రత్యేక ద్రావంలో మునిగి ఉన్నాయి. మమ్మీలను బయటకు తీసిన పరిశోధకులు అవి రోమన్ రాజ కుటుంబానికి చెందినవి కావని తేల్చారు. ఈ సంఘటనను కళ్లప్పగించుకుని చూసిన కొందరు ఇప్పుడు ఆ ఎరుపు రంగు ద్రావాన్ని తాగేందుకు తమను అనుమతించాలని కోరుతున్నారు.
ఈ మేరకు ఛేంజ్.ఆర్గ్ అనే ఓ వెబ్‌సైట్ పిటిషన్‌ను సైతం దాఖలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 వేల మందికి పైగా శవ కోష్టికలో ఉన్న ద్రావాన్ని తాగడానికి ఇష్టపడుతున్నారని, వారికి అవకాశం ఇవ్వాలనేది సదరు పిటిషన్ సారాంశం. శాపగ్రస్తమైన నల్లరాతి శవకోష్టికలోని ఆ ద్రావాన్ని తాగితే అతీత శక్తులు సంక్రమిస్తాయని, ఆ తర్వాత చనిపోతామని వారందరూ విశ్వసిస్తున్నారని పిటిషనర్ మెక్‌కెన్‌డ్రిక్ పేర్కొన్నారు. మరణించే హక్కును గురించి ప్రస్తావిస్తూ సదరు ద్రావాన్ని తాగేందుకు వారికి అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోరారు.
అయితే, ఈజిప్టు పురాతత్వ శాఖ మాత్రం వేల మంది ప్రజలు శవకోష్టికలోని ద్రావాన్ని తాగేందుకు ఆసక్తి కనబరచడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సదరు ద్రావం ఒట్టి మురికి నీరు మాత్రమేనని పేర్కొంది. ఎముకలు, ఇతర శరీర భాగాల నుంచి ఆ ద్రవం తయారైందని తెలిపింది. దానికి ఎలాంటి అతీత శక్తులు లేవని కొట్టిపారేసింది. దీనిపై అరిజోనా స్టేట్ యూనివర్శిటీలోని బయోడిజైన్ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రోల్ఫ్ హాల్డెన్ మాట్లాడుతూ.. కుళ్లిపోతున్న శరీరాలను నుంచి ఆ ద్రవం తయారైవుంటుందని చెప్పారు.
వేల సంవత్సరాలుగా అలానే ఉన్న ఆ ద్రవంలో అతి భయంకరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయని హెచ్చరించారు. పొరబాటున ఆ ద్రవాన్ని తాగితే విపత్కర పరిస్థితిని ఎదుర్కొక తప్పదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment