విశ్వం సమగ్ర వర్ణచిత్రం
రోదసిలో గెలాక్సీల నుంచి వచ్చే అతినీలలోహిత కాంతిని పరిశీలిస్తూ హబుల్ అంతరిక్ష టెలిస్కోపు సేకరించిన సమాచారం ఆధారంగా నాసా ఖగోళ శాస్త్రవేత్తలు రూపొందించిన విశ్వం సరికొత్త వర్ణచిత్రమిది. ఇంతవరకూ అత్యంత స్పష్టంగా రంగులతో, సమగ్రంగా రూపొందించిన విశ్వం చిత్రాల్లో ఇదే ఉత్తమమైనదట. ఈ చిత్రంలో సుమారు 10 వేల గెలాక్సీలు ఉన్నాయట. సమీప గెలాక్సీలతోపాటు సుదూర గెలాక్సీల్లో సైతం నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి? మన పాలపుంత వంటి గెలాక్సీల్లో ప్రస్తుతం తారలు ఎలా పుడుతున్నాయి?
అన్నది అవగాహన చేసుకునేందుకు హబుల్ సమాచారం తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 1370 కోట్ల ఏళ్ల క్రితం బిగ్‌బ్యాంగ్ జరిగి విశ్వం ఆవిర్భవించగా.. 500-1000 కోట్ల ఏళ్ల మధ్యకాలంలోనే అత్యధిక నక్షత్రాలు పుట్టాయని అంచనా. ఇప్పటిదాకా ఈ కాలంలో పుట్టిన నక్షత్రాలకు సంబంధించిన సమాచారం పెద్దగా లేదని, తాజాగా హబుల్ ఆ సమాచారాన్ని కూడా సేకరించిందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.